జేజేలు భవ్యాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

0
5

[శ్రీరుద్ర గారు రచించిన ‘జేజేలు భవ్యాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర’ అనే గీతాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]జే[/dropcap]జేలు భవ్యాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర
శతాబ్దాల ఆంధ్ర ఘన చరిత్ర కీర్తించు
ఖండాంతరాల, తెనుగు ఖ్యాతి వ్యాపించు
శాతవాహనాది అపూర్వ జాతి గుర్తించు
హద్దులెన్నక నిత్య ప్రగతిన శ్రమించు
జేజేలు ప్రకాశాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

కనువిందు మన ఆంధ్ర భూమి సిరులు
నల్లమల కొండ కోన, అద్భుత బిలలు
పెన్న,కృష్ణ, గోదావరుల తీపి ఝరులు
మహా సాగర తీర బారు ఓడ రేవులు
జేజేలు సుందరాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

అపార ఖనిజ, రత్న, ఇంధన నిధులు
విశిష్ట పాడి పశువులు, జింక, శుకలు
బొండు మల్లెలు, తీపి ఫల మామిళ్లు
పైడి పంటల మెట్ట సార మాగాణులు
జేజేలు కర్షకాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

పలు యాసల తేనె తెనుగు పరవళ్లు
అవధాన, జానపద, హరి, బుర్ర కధలు
కవిత్రయ, పోతన, శ్రీనాధ, మొల్ల కావ్యాలు
అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య కీర్తనలు
జేజేలు కవనాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

పులస చేప, నాటుకోడి, మునగ మాంస
ఆవకాయ, గోంగూర, మిరప, ఉల్లి కారాలు
దిబ్బరొట్టి, పుణుగులు, ఆవడ, పులిహోరలు
పూతరేకు, బొబ్బట్లు, గారె బూరె, అరిసెలు
జేజేలు పూర్ణమిదాంధ్ర , వర్ధిల్లు వనితాంధ్ర

సంక్రాంతి ముగ్గులు, బసవన్న, బొమ్మ కొలువులు
థింసా, తప్పెటగుళ్లు, కూచిపూడి, కోలాటాలు
తోలుబొమ్మలు, కలంకారీ, బుడితి హస్తకళలు
ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ పట్టు చేనేతలు
జేజేలు మంగళ కళాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

కోటి దేవుళ్ళ అపూర్వ శిల్ప కోవెల సనాతనాంధ్ర
జైన, బౌద్ద, వన్య, మాన్య, సర్వధర్మ సమున్నతాంధ్ర
చిత్రలేఖన,శిల్ప, నాట్య, క్రీడా, నట చలన చిత్రాంధ్ర
గణిత మల్లన్నాది విద్యాధిక, వైద్య, వైజ్ఞానికాంధ్ర
జేజేలు ప్రతిభాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

తెలుగునాట పాలించిరెందరో రాజులు, నాయకులు
ఉద్ధరించిరెందరో గురువులు, ధర్మ సంఘ సంస్కర్తలు
శ్రమించిరెందరో కర్షక, సైనిక, వర్తక, పారిశ్రామికులు
మార్గదర్శకులు వీరెల్లరు ఆంధ్ర ప్రదేశ ధ్రువతారలు
జేజేలు దేశప్రవాసాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

జేజేలు భవ్యాంధ్ర, వర్ధిల్లు నవ్యాంధ్ర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here