రెండో అడుగు

0
4

[శ్రీమతి దాసరి శివకుమారి గారి ‘రెండో అడుగు’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]“అ[/dropcap]మ్మా! ప్రతిమా! లెగువమ్మా, నేను బజారు దాకా వెళ్ళొత్తాను. నేను వచ్చేటప్పటికి నువ్వు రెడీ అయితే స్కూలు కాడ నిన్నూ, చెల్లినీ దింపొస్తాను” అన్నాడు నాగరాజు.

“ఊ.. ఊ..” అంటూ మరో వైపుకు తిరిగి పడుకుంటూ ప్రతిమ చెల్లి మంచం వైపుకు చూస్తే, అదీ లెగవలేదు.

“నాగరాజూ! నువ్వు నీ పని చూసుకుని తొందరగా రా. నేను పిల్లలకు తిండి సద్దుతాను” అన్నది సీతమ్మ.

“నా కారేజ్ నేనొచ్చి సద్దుకుంటాలే అమ్మా. నువ్వు ఆళ్ల సంగతి చూడు” అంటూ నాగరాజు ఇంట్లో నుండి బయటి వరండాలో కొచ్చాడు. వరండాకున్న కొట్టు గదిలో నుంచి మాటలు వినపడుతున్నాయి, తన కొడుకుతో నాన్న ముచ్చట్లు పెట్టినట్టున్నాడు. ఇప్పుడు పిల్లోడు నన్ను చూస్తే ఎంటబడతాడనుకుని చప్పుడు చేయకుండా బండి నడిపించుకుంట రోడ్డు మీద దాకా వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్లిపోయాడు,

‘ఈ నోట్లో నాలుక లేని పెద్దదీ లేవదు. ఏ పనీ అందుకోదు. దాని పని కూడా నేనే చెయ్యాలి. దాన్ని చూసి అవిటి కాలుదైన రెండోదీ లేవదు. ఒళ్ళు వంచదు. ఈళ్లిద్దరూ ఇట్టా ఏడిశారని పిల్లాడ్ని కన్నారు. ఏం లాభం, పిల్లలకి అమ్మే లేకుండా దేముడి దగ్గరకెళ్లి పోయింది. ఎక్కడ లేని కట్టాలు ఈ కొంప లోనే పెట్టావు భగమంతుడా’ అనుకుంటూ పొయ్యి మీద నుండి ఇడ్లీ పాత్ర దించింది. పాత్ర మూత తీసి గుడ్డల్లో వేసి ఉడికించిన మూడు ఇడ్లీలను తీసి ఒక గిన్నెలు వేసి గంట తీసుకుని మెత్తగా చిదుపుతూ, దాంట్లో మరి కాసిని వేడి నీళ్లు పోసి, దాంట్లనే కాస్త అల్లప్పచ్చడి వేసి జారుగా కలిపింది. ‘ఏంటో ఈ ఖర్మ’ అనుకుంటుంటే సీతమ్మ కళ్లకు నీటి పొర అడ్డం పడింది.

ఈలోగా ప్రతిమా, దాని చెల్లెలు రమా మంచాలు దిగి కప్పుకున్న దుప్పట్లు గిరాటు పెట్టి బయటకు నడిచారు.

అది చూసిన సీతమ్మ “ఇదుగో పిల్లలూ! ఆ దుప్పట్లయినా కాత్త మడతలు పెట్టండి” అని కేక పెట్టింది.

“ఏ.. ఏ..” అని ప్రతిమా, “పోవే ముసలీ” అంటూ రమా వెళ్ళిపోయారు.

‘ఆ అర్ధాయుష్యుది పోతూ పోతూ ఈ గుదిబండల్ని నా మెడకు కట్టిపోయింది’ అనుకుంటూ మనవరాళ్లకు గబగబా అన్నం కారియర్లు సర్దింది. ప్రతిమకు మెత్తటి అన్నంలో పులుసు పోసి మెదిపి జావలాగా చేసి కారియర్ గిన్నె నింపింది.

ప్రతిమ తన పనులు కానిచ్చుకొచ్చి ఇడ్లీ జావను నెమ్మదిగా మింగే ప్రయత్నం చేస్తున్నది.

స్కూల్లో కూడా తండ్రి నాగరాజు హెడ్మాస్టర్ గారికి ప్రతిమ సంగతి చెప్పి బతిమాలుకున్నాడు – “దానికి నాలుక సరిగా వుండదండీ. రుచే తెలుసుకోలేదు. ఆకలి తీర్చుకోవటం కోసం అన్నాన్ని కూడా జావగా చేసి ఇస్తాం. దాన్ని మింగటానికి ఎక్కువ టైమ్ పడుతుంది. సమయం ఇవ్వండి సార్” అని. స్కూల్ వాళ్ళు అర్థం చేసుకున్నారు.

ప్రతిమ తొమ్మిదో తరగతి, రమ ఎనిమిదో తరగతి కావూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో, చదువుకుంటున్నారు. ప్రతిమని ఆలస్యంగా బడిలో వేయడం, ఏడో క్లాసు తప్పడం వల్ల, వయసు పెద్దదయినా, ఇంకా తొమ్మిది లోనే ఉండిపోయింది.

నాగరాజు వాళ్ళనిద్దర్నీ రోజూ బండి మీద తమ రాంభొట్లపాలెం నుంచి తీసుకెళ్లి సాయంకాలం ఇంటికి తీసుకొస్తాడు. కొడుకు ఉన్న ఊళ్లనే రెండో తరగతి చదువుతున్నాడు. చెఱుకుపల్లి సెంటర్లో మిషన్లు పెట్టి టైలరింగ్ షాప్ పెట్టుకున్నాడు నాగరాజు. చుట్టు పక్కల ఊళ్లల్లో, బట్టలు బాగా కుడతాడన్న పేరు తెచ్చుకున్నాడు. రెండేళ్ల కిందట భార్య చనిపోయింది. తల్లి సీతమ్మ వీళ్లందరి కోసం నానా చాకిరీ చేస్తున్నది. వీలైనంతవరకు అన్ని సదుపాయాలూ నాగరాజు ఇంట్లో అమరుస్తున్నాడు. వద్దన్నా వినకుండా కాలవకెళ్లి తమ అందరి బట్టలూ జాడించి తెచ్చి ఆరేస్తుంది. వెంటనే 8 గంటల కల్లా మిరప చేలల్లో కాయల కోతకు పనికి వెళ్తుంది. 11 గంటల కల్లా ఇంటికొచ్చి ఊళ్ళోని ఎలిమెంటరీ స్కూలు పిల్లల మధ్యాహ్న భోజన తయారీ పని కోసం తోటికోడలు ఇంటికి వెడుతుది. ఒక పక్క సోమరి భర్త పెంకెతనం, అవిటితనం వున్న మనవరాళ్లు, గారాలు పోయే మనవడు, ఈ వయసుకో ఒంటరివాడైన కొడుకు. ఇవేం తిప్పలని సీతమ్మ ఏడవని రోజుండదు.

***

నాలుగు నెలల క్రితం ప్రతిమ తండ్రిని, నానమ్మని సతాయించి ఓ స్మార్ట్‌ఫోన్ కొనిపిచ్చుకుంది. అసలు ఫోనే వద్దంటే వినిపించుకోలా. అప్పట్నించి ఫోన్‍లోనే ఎక్కువ సమయం గడుపుతోంది. బడికి వెళ్ళేముందు దాన్ని దాచేస్తుంది.

***

“నాగరాజూ! నేనొక విషయం నీ మేలు కోరి చెప్తాను. జాగ్రత్తగా విను. నీ పెద్ద కూతురుని ఖాజీపాలెం కుర్రాడిలో కావూరు స్కూలు దగ్గర రెండు సార్లు చూశాను. వరినారు కోసం అటుపోయాను. నీ పిల్లల సంగతి నాకు తెలుసు. పెద్దదాని సంగతి మరీ దారుణం కదా! నమల్లేదు. గబగబా మింగలేదు. అదేం మాట్లాడుతుందో మనకర్థం గాదు. ఆ కుర్రాడు మాత్రం ఒట్టి పోరంబోకు, జులాయి. వాడి పని ఇదే. నీ కూతురేమో పోతబోసిన బొమ్మ. ఉండబట్టలేక మీ ఊళ్ళోని  మా బామ్మర్దితో కూడా ఈ మాట అన్నా. మీ పిల్ల మీ డాబా మీద, ఆ కుర్రాడు డాబా కింద రోడ్డు మీద వుండి సైగలు చేసుకుంటున్నారని చెప్పాడు. ఈ ముక్క నీ చెవిన వేస్తే పిల్లను జాగ్రత్త చేసుకుంటావని చెస్తున్నా” అన్నాడు రంగయ్య.

ఆ మాటలతో నివ్వెరపోయిన నాగరాజు తేరుకుంటూ “నాకు చెప్పి మంచి పని చేశావన్నా. మా పెద్దది పుట్టుకతోనే అలా నాలుక అవకరంతో పుట్టింది. చిన్నప్పుడే ఆపరేషన్ చేయించాం. ఉపయోగం కనపడలా, ఏవో కొన్ని అక్షరాలు పలుకుద్ది. అదీ నంగి నంగిలా వుండి అర్థం కావు, ఈమధ్య ఎవరో చెప్తే, ‘స్పీచ్ థెరపిస్ట్’ దగ్గరకు తీసుకెళ్ళి మాట్లాడటం కొన్నాళ్ళు ప్రాక్టీసు చేయించాం. అవన్నీ సరే. నా పిల్లను నేను జాగ్రత్త చేసుకుంటాను” అని చెప్పి అతణ్ణి పంపేశాడు.

తర్వాత కొట్టును కుర్రాళ్లకప్పగించి రోజూలాగానే కావూరు వెళ్లి కూతుళ్లను ఇంట్లో దిగబెట్టి, తాను రోడ్డు మీద దూరంగా కూర్చున్నాడు. తన కూతురు ఫోన్ పట్టుకుని తమ డాబా పిట్టగోడ దగ్గరగా, ఆ కుర్రాడు డాబా కింద కరెంటు స్తంభం చాటున వుండి వాళ్ల ధ్యాసలో వాళ్ళున్నారు. నాగరాజు నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికొచ్చి డాబా మీదకు వెళ్లాడు. ఒక చేత్తో కూతుర్నీ, మరొక చేత్తో కూతురి ఫోన్‌నూ పట్టుకుని కిందకు వచ్చాడు.

ప్రతిమ నిశ్చేష్టురాలై పోయింది. ఆ కుర్రాడు నాగరాజును గమనించి వెనుక్కు తిరక్కుండా బండి మీద వెళ్లిపోయాడు. నాగరాజు ప్రతిమ ఫోన్ లోని వాట్సప్ మెసేజ్‌లు అన్నీ చూడసాగాడు. చాలానే వున్నాయి. అన్నీ అతని నుంచి వచ్చినవే.

“బంగరు బొమ్మా! నీకు నోట్లో నాలుక లేకపోతేనేం? సరిగ్గా నమల్లేక మింగలేకపోతేనేం? నేనే నమిలి నీ నోట్లో పెడతాను. నీకు సరిగ్గా మాటలు రాకపోయినా సరే, నేను చెప్పేది వింటూ వుండు చాలు. నీకు నా గుండెల్లో గుడి కట్టి, కళ్లలో వత్తులు వేసుకుని కాపాడుకుంటాను. నువ్వు నా ఇంటి లక్ష్మిందేవివి. నీ పరీక్షలు కాగానే వెళ్ళిపోయి గుళ్ళో పెళ్ళి చేసుకుందాం. మా వాళ్లను అతి కష్టం మీద ఒప్పించాను. మీ ఇంట్లో ఎటూ ఒప్పుకోరు. ఫర్వాలేదు. నిదానంగా వాళ్ళే రాజీకొస్తారు” అని అతను; “ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో నుంచి బయిటపడి నీ దగ్గర కొచ్చేద్దామా, అని నాకూ చాలా తొందరగా వున్నది” అని తన కూతురు సమాధానం. సగం తెలుగు, సగం ఇంగ్లీషులో బోలెడు తప్పులతో ఉన్నాయి వారి మెసేజ్‌లు.

ఇలాంటివన్నీ చదివి నాగరాజు గుండె చెరువైంది. ఆడదిక్కు లేని సంసారం. తాను తెల్లారి లేస్తే కొట్టు దగ్గరకు పోవాలి. కొంత తెప్పరిల్లి కూతురికి పరిస్థితి వివరించి చెప్పాడు. “ముందు బాగా చదువుకో. ఇవన్నీ తర్వాత” అంటూ గడ్డం పట్టుకుని బతిమాలాడు. నేనేం వినను అన్నట్లుగా తల అడ్డంగా ఊపేసింది. తనకు విషయం తెలిపిన ఖాజీపాలెం మిత్రుడు రంగయ్యనీ, అతని బావమరిదినీ తీసుకొచ్చి కూడా చెప్పించాడు. “కుర్రాడు సరైనవాడు కాదు. భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, నువ్వు మా బిడ్డ లాంటి దానివి గనక చెప్తున్నాం” అన్నారు వాళ్ళు,

ప్రతిమకు ఆ కుర్రాడి మైకం ఏం దిగటం లేదు. రేపో మాపో చెప్పకూడా పారిపోయేటట్లున్నదన్న అనుమానం ఇంట్లో వాళ్లకు కలిగింది. ఆ కుర్రవాడు తరపు వారంతా రౌడీలు. తామే జాగ్రత్తపడాలి.

నాగరాజు, తల్లి సీతమ్మతో కలిసి ఆలోచించాడు. సీతమ్మ కూతురు, నాగరాజు అక్క బాపట్లలో వుంటుంది. ఆమెకో కొడుకున్నాడు. తల్లీ కొడుకులు వెంటనే బాపట్ల వెళ్లారు. మేనకోడల్ని తన కోడలిగా చేసుకోమన్నారని లోపల్లోపల సంతోషపడ్డా పైకి మాత్రం తెగ బెట్టు చేసింది సీతమ్మ కూతురు.

“చూడు, నాగరాజు. నీ కూతురు నోట్లో నాలుక లేనిది. తిండీ తినలేదు. మాటలూ రానిది. అది ఏ పని చేయటానికే పనికిరాదు. మేనకోడలని జాలితో నా ఇంటికి తెచ్చుకోవాలి.”

“నా పరిస్థితి నీకు తెలుసుగా అక్కా. అమ్మా, నేనూ కలసి పోగుచేసిన 10 లక్షలూ, వాళ్లమ్మ బంగారం అంతా ముట్టజెప్తాను” అని అక్కను బతిమాలి ఒప్పించుకొచ్చాడు.

ఈలోగా ఖాజీపాలెం కుర్రాడు ప్రతిమకు మెసేజ్‍ల మీద మెసేజ్‍లు పెట్టాడు. ఫోన్ నాగరాజు దగ్గరే వుంచుకుని విషయం తెలుసుకుంటూన్నాడు.

ప్రతిమ బంధువుల ఇంటికి వెళ్లి రహస్యంగా వాళ్ల ఫోన్ నుంచి విషయం వివరిస్తూ, మెసేజ్‍లు పంపించి, ఆ తర్వాత డిలీట్ చేసి ఇంటికొచ్చింది. కాని తన ప్రయత్నాలు తను చేస్తూనే వున్నది.

నాగరాజు అప్పటికప్పుడు ముహూర్తం పెట్టించాడు. ముందు లగ్న పత్రిక రాయించాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే పెళ్ళి. నాగరాజు పెళ్లి పనుల్లో వున్నాడు. అయితే రాంభొట్లు పాలెంలో గ్రామదేవతకు కొలుపులు కొలవాలని కులపెద్దలు తీర్మానించారు. ఆ కొలుపుల ఉత్సవం 9, కాని 11 రోజులు కాని వుంటాయన్నారు. ఈ రోజుల్లో పెళ్ళికూతురు గాని, పెళ్ళికొడుకు గాని గుడి చుట్టూ కట్టిన తోరణం దాటకూడదు. పొలిమేరలు దాటి అడుగు కూడా బయటకు పెట్టగూడదు, కాబట్టి పెళ్ళి కోసమని పెళ్ళికొడుకు గానీ, పెళ్ళికూతురు గానీ బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవటానికి వీలు పడదు. పెళ్లి ముహూర్తం వాయిదా వేయాల్సిందే అన్నారు.

నాగరాజు తలపట్టుకు కూర్చున్నాడు. ఇది దేముడిచ్చిన అవకాశం, పారిపోవచ్చని ప్రతిమ సంబరపడింది.

నాగరాజు బాగా ఆలోచించి కులపెద్దల దగ్గరకు వెళ్లి బతిమాలుకున్నాడు. కొలుపుల్ని వాయిదా వేయించుకున్నాడు. శెలవులు కాబట్టి ప్రతిమ స్కూలు వంకతో కూడా బయటకు వెళ్ళటానికి వీలు కాక గిలగిలా కొట్టుకుంటున్నది.

ఆ రోజు పేపరు తీసుకొచ్చి నాగరాజు ప్రతిమకు చూపించాడు. భాజీపాలెం కుర్రాడైన ప్రతిమ స్నేహితుడు, చెఱుకుపల్లి లోని ఎ.టి.యమ్.లో దొంగతనానికి వస్తే రూట్ పోలీసులు గమనించి వెంటబడ్డారు. తీసుకొచ్చిన బండినక్కడే వదివేసి పారిపోయాడు. పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అది చదివిన ప్రతిమ హతాశురాలైంది. ఇది నిజం కాదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.

“ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రతిమా. నీకు ఇంకా వైద్యం చేయించాలి, బాగా చదివించాలి అని ఎన్నో ఊహించుకున్నాను. చివరకు నీ ప్రవర్తన వలన ఇలా పెళ్ళి చేయటానికి ఒప్పుకున్నాము. ఇప్పుడు అనుకున్నా, ఈ పెళ్ళిని నేను ఆపలేను” చెప్పాడు కూతురికి.

ఇరుపక్షాల ఖర్చును తానే భరించి, అక్క గొంతెమ్మ కోరికలన్నీ తీర్చి పెళ్ళి జరిపించాడు నాగరాజు.

ప్రతిమను వెంటనే కాపురానికి కూడా పంపేశారు. నాగరాజు మేనల్లుడిని బతిమాలి, “ఎవరేం చాడీలు చెప్పినా వినకు. ప్రతిమ బాగా తెలివిగలది. నువ్వు బాపట్ల తీసుకెళ్ళి పదో క్లాసుకు బాపట్ల స్కూల్లో చేర్చు. తర్వాత కూడా చదివించటానికే ప్రయత్నం చెయ్యి. అది చాకిరి చెయ్యలేదు. ఏ చిన్న ఉద్యోగమైనా చేసుకుని తనకూ తన కుటంబానికీ తోడుగా వుంటుంది” అని చెప్పాడు.

“సరే మామయ్యా” అన్నాడు మేనల్లుడు. కాని బాపట్లలో తల్లి అడ్డం తిరిగింది.

“ఈ అవిటిదానికి వండిపెడుతూ చదివించాలా? నా వల్ల కాదు. ఇంట్లోనే ఒక పక్క వేరు కాపురముండి వండుకు తిని, తాపీ పనికి పోయే మొగుడికి కూడా వండి పెట్టి సర్దిచ్చి తర్వాత పోయి చదువుకోమను. ఇంక నేను చెప్పేదేమీ లేదు” అని కరాఖండీ చెప్పేసింది.

నాగరాజు హతాశుడయ్యాడు, అక్కకి ఎన్ని విధాల నచ్చచెప్పబోయినా, ఆమె వినిపించుకోలేదు.

“తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంటారు. నీకొకటి గుర్తు చేస్తాను. ఇప్పుడు ఆడపిల్లలకి కూడా తండ్రి ఆస్తిలో హక్కు వున్నాది. నీ డాబా ఇంటిలో ప్రతిమకు ఏ భాగం ఇస్తావో తేల్చి చెప్పు” అంటూ మరో బాంబు పేల్చింది.

నాగరాజే కాదు ప్రతిమ కూడా వేటగాడి దెబ్బ తిన్న పక్షిలా విలవిలలాడారు. ఆ పూటకి నాగరాజు వెళ్ళిపోయాడు.

***

తమ్ముడూ, చెల్లెలు, నాయనమ్మా, తాతయ్యా అందరూ కళ్ళ ముందు మెదిలారు ప్రతిమకు. తన వైద్యం కోసం, చదువు కోసం నాన్న పడ్డ తాపత్రయం, నాయినమ్మ ఇంట్లో, బయటా చేసే చాకిరీ అంతా కళ్ల ముందు కదలాడాయి. ‘అంగవైకల్యంతో పుట్టినదానిని, ఆ ఖాజీపాలెం కుర్రాడు నన్ను ఉద్ధరిస్తున్నాడు. అతనిది ఎంతో పెద్ద మనసు అని ఆలోచించి బురదలో కూరుకుపోబోయాను. మైకంతో కళ్ళు మూసుకుపోయాయి నాకు’ అనుకుంది ప్రతిమ.

ప్రతిమ భర్తకు కొద్దిగా చదువు వచ్చు. వెంటనే కాగితం మీద వ్రాసి చూపించింది.

“మనకి ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దు, నన్ను ఈ ఊళ్లో, పదో తరగతిలో చేర్పించు, పూర్తి చేస్తాను. ఆ తర్వాత కూడా చదువుకుంటాను. నా నాలుక లోపంతో నేను పోరాడుతూనే, ముందుకెళ్తాను.”

గట్టిగా పట్టు బట్టి స్కూల్లో చేరింది.

కూతురు కాపురానికి కావలసిన సామానుతో బాటూ గ్యాస్ పొయ్యి, కుక్కర్‌లతో సహా కొని అమర్చి వెళ్లాడు నాగరాజు. ఇప్పుడు ప్రతిమ చీకటి ఉండగానే లేస్తున్నది. ఇంటి పనీ, వంటపనీ చేస్తున్నది. తనకు జావలూ, భర్తకు అన్నం కారియర్‌లూ అన్నీ సిద్ధం చేసుకుంటున్నది. ఇంట్లో వున్నంత సేపూ భర్త కూడా పనులు అందుకుంటున్నాడు.

‘నాలుక మీద వుండాల్సిన సహజమైన గరుకు నిచ్చే ‘పాపిల్లే’ లేకపోవటం, మిగతా అందరి నాలుకల వలె నా నాలుక పనిచేయకపోవటం నా తప్పు కాదు, కాని తొమ్మిదవ తరగతిలోనే నేను పెడ దారి పట్టబోవటం నా తప్పే. నాకున్న తెలివితేటలతో, కష్టపడి చదివి, పైకి రావటం నా చేతుల్లోనే వున్నా; నేను మొదట తప్పటడుగు వేశాను. కాని ఈసారి వేసే అడుగులు అలాంటివి కాకూడదు’ అని దృఢంగా నిశ్చయంగా అనుకున్నది ప్రతిమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here