అవతార పరిసమాప్తి!

1
3

[శ్రీ సముద్రాల హరికృష్ణ గారి ‘అవతార పరిసమాప్తి!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కౌ[/dropcap]రవ పాండవ యుద్ధం ద్వారా, భూభారం తగ్గించిన కృష్ణుడు ఇంకా తన అవతార కర్తవ్య సంపూర్తికి ఒక కార్యక్రమం మిగిలి ఉందని అనుకున్నాడు.

అది తన స్వకులమైన యాదవ కుల నిర్మూలనం.

అవును, స్వకులమే, తనవాళ్ళే!

అయినా ఆయనకు – స్వ, పర ఏముందీ, ధర్మజయమే ధ్యేయంగా వచ్చినవాడికి!

కానీ ఈ యాదవాన్వయం, తన అండ వల్ల మహాదుర్నిరీక్ష్య శక్తిగా ఎదిగింది.

‘తన అనంతరం దానిని ఎవరూ, దేవతలతో సహా ఎవ్వరూ, అరికట్టనూ లేరు, అంతమొందించనూ లేరు. కనుక వారిలో వారికే, కీచక వనంలో చెట్లు ఒకదాని కొకటి తగిలి, ఆ రాపిడితో పుట్టిన అగ్ని వల్ల, అన్నీ కాలిపోతాయో, అదే విధంగా వారిలో వారికే అంతఃకలహాలు వచ్చే పరిస్థితి సృష్టించి,వీరినీ మూలక్షయం కావిస్తాను’ అని అనుకున్నాడు.

దానికి బీజావాపన ఆ మునుల శాపవాక్యాలతో జరిగిపోయింది.

జాంబవతి కొడుకైన సాంబుడికి శాపం వలన ముసలం పుట్టటం, దాన్ని అరగదీసి సముద్రంలో వేయటం, దాని వల్ల తీరంలో తరువాతి కాలంలో ప్రాణాంతక ఆయుధంగా మారే తుంగ మొలవటం!

చిట్టచివరి ముసలం ముక్క,ఒక వేటగాడి అమ్ము మొనగా స్థిరపడటం!

ఇదంతా వారికి అప్పుడు తెలియకుండా, నేపథ్యంలో జరిగిపోయిన విషయమే, స్వామి వారి ఆ ప్రణాళిక లోని భాగమే!

సుధర్మ అనే యాదవుల అద్భుతమైన సభాభవనంలో అందరినీ సమావేశ పరచి, వారిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు, “ఏవో కనీవినీ ఎరుగని, దుష్ట శకునాలు తోస్తున్నాయి ఇక్కడ. కనుక మన స్త్రీలను, బాల వృధ్ధులతో పాటు సమీపంలోని పవిత్ర స్థలం ‘శంఖోధ్ధార’ కు పంపించి, మనమంతా ప్రభాస నదీ తీరానికి వెళ్ళిపోదాము” అని చెప్పాడు.

అట్లాగే వారంతా ఆ ప్రభాస తీరానికి వెళ్ళి దేవతాపూజలు చేసి, బ్రాహ్మణులకు భూ ధన కనక గోదానాదులు గావించారు.

వారి ఆశీస్సుల శుభ ఫలాలు పొందుదామని, నమ్మకంతో.

కానీ దుష్కాల ప్రభావమో ఏమో, విచక్షణ కోల్పోయి, పరమ మాదకమైన ‘మైరేయం’ అనే మదిరను త్రాగి, వారిలో వారు దుర్భాషలాడుకొని, మనసులు వశం తప్పి, కలతలు పెంచుకుని, పరస్పరం యుధ్ధాల లోకి దిగారు.

భుజాలమీద చేతులు వేసుకుని నడిచిన ఆప్తులు, భుజాలను నరికేసుకునే శత్రువుల్లాగా తలపడ్డారు ఒకరి కొకరితో!

అతి స్వల్ప సమయంలో అది భీకర అంతర్యుధ్ధంగా మారి ఆ యదుకుల నాశనానికే దారి తీసింది.

ఉన్న అన్ని ఆయుధాలు అయిపోతే, ముని శాపప్రభావం వలన, మదిరాపానమత్తులై, తామసం రెచ్చిపోయి, సాంబుడికి ‘పుట్టిన’ ముసలం ద్వారా తీరంలో మొలిచిన తుంగనే ఆయుధాలుగా చేసి కొట్టుకొని నాశనం వైపు పరుగులెత్తారు యాదవులు.

అది వారి కళ్ళ ముందే జరుగుతున్నా, ఆ యాదవకుల నాశనాన్ని ఆపకూడదనీ, అది అనివార్యమని తెలిసిన బలరామకృష్ణులు బయటకు వచ్చేశారు.

బలరాముడు ప్రాణాయామ యోగమార్గం ద్వారా శరీరం విడిచి, తన నిజ స్థానమైన అనంతుడిలో కలిసిపోయాడు.

ఒక్కడే మిగిలిన కృష్ణుడు వెళ్ళి వెళ్ళి ఒక నిర్జన వనం ప్రవేశించాడు.

ఒక అశ్వత్థ వృక్షం కింద విశ్రమించాడు.

తన తలను ఆ చెట్టు మానుకు ఆన్చి ఉంచి, ఎడమ కాలు మీద కుడి కాలు వేసి సవిలాసంగా ఊపుతూ విశ్రమించిన ఆ వేళలో చతుర్బాహుడై, గొప్ప దివ్య తేజస్సుతో ఆ ప్రాంతం అంతా నింపి వేశాడు.

శ్రీవత్సాంకుడై, నీలనీరద జగదేక శ్యామమోహనుడై, పీతకౌశేయవస్త్రధారియై, మంగళకరంగా కనిపించాడు.

మకరాంక కర్ణభూషణాలతో, పద్మాయత లోచనాలతో, నవస్మేరసుందరుడై కనిపించాడు, ఆ క్షణంలో ఆ శ్రీకృష్ణమూర్తి.

హారకుండలకిరీటకేయూరవిభూషితుడై విరాజిల్లాడు.

వైజయంతీమాలాధరుడుగా, కౌస్తుభధారిగా నయనపర్వ మొనరించే రీతిలో భాసిల్లాడు.

కృష్ణుడి సమీపంలో సరూపంగా అలౌకిక ప్రభలతో పంచాయుధాలూ దర్శనమిచ్చాయి.

ఎడమకాలి మీద కుడికాలు వేసుకుని విశ్రమిస్తున్న కృష్ణుడి కదలుతున్న పాదం, ఒక హరిణపు కదులుతున్న చెవి లాగా కనబడింది, దూరాన నుంచి చూసిన ‘జర’ అనే వేటగాడికి.

అతని దగ్గరే, యాదవకుల నాశకారియైన ముసలపు చివరి ముక్క మొనగా పెట్టబడిన బాణం ఉన్నది.

అది ఎక్కుపెట్టి గురిచూసి వదిలాడు.

నేరుగా వచ్చి కృష్ణపాదాన్ని తగిలి, ప్రాణాంతకమైన తీవ్రగాయం చేసింది కృష్ణుడికి.

ఆ వ్యాథుడు పరుగున వచ్చాడు, మంచి మెకం దొరికింది ఇవాళ అనుకుంటూ.

వచ్చి చూసి విస్తుపోయాడు.

అది గోకులమణి శ్రీకృష్ణుడని గుర్తు పట్టాడు. గుర్తుపట్టి, “మహానుభావా, శ్రీకృష్ణా, నన్ను మన్నించు తెలియక చేసిన అపరాధం ఇది. మృగమనుకుని అమ్ము వేశాను, ఇంత అనర్థం జరిగి పోయింది, క్షమాభిక్ష పెట్టు ప్రభో, నేను భరించలేను ఈ దోషభారాన్నీ, ఈ విషాదాన్ని” అని తల్లడిల్లాడు.

కృష్ణుడు నవ్వి, “నీ దోషం ఏమీ లేదు జరా ఇందులో. ఇది ఈ రకంగా జరగవలసి ఉన్నది,అదే విధంగా అయింది, నీవు ఒక సాధనం మాత్రమే ఇందులో” అని ఊరడించాడు.

కానీ, అతను “ఇంతటి పాపం చేసినవాడు భూమి మీద ఉండటానికి అర్హుడు కాడు” అని విచారిస్తుంటే, అతని నిర్మలాంతరంగానికీ, నిశ్చల భక్తికీ కృష్ణుడు ప్రసన్నుడై, అనుకంపా సముద్రుడై, అతని కోసం ఒక దివ్య విమానం రప్పించి అందులో అతను వైకుంఠధామాన్ని చేరుకునే మహద్భాగ్యం కల్గించాడు.

***

వెతుకుతూ వచ్చిన కృష్ణ సారథియైన దారుకుడు, తులసీగంధభరితమైన ఒక ప్రదేశంలో తన యజమానిని ఒంటరిగా ఉన్న స్థితిలో అక్కడ చూశాడు.

అమిత దుఃఖంతో, “మీరు కనబడని నా కళ్ళకు మొత్తం అంధకారంగా అనిపిస్తోంది స్వామీ” అని వాపోయాడు. “మనవారందరూ చెల్లాచెదరైపోయారు, ఆ ఉన్నవాళ్ళకు నేను వెళ్ళి ఏమి చెప్పను స్వామీ” అని అడిగాడు.

అదే సమయంలో అతన్ని పరమాశ్చర్యానికి గురి చేస్తూ, కృష్ణుడికి సంబంధించిన దివ్యాయుధాలు, రథమూ, గుర్రాలు అంతర్ధానమై పోయాయి.

అపుడు కృష్ణుడు “నువ్వు నగరానికి వెళ్ళి, బలరాముని నిష్క్రమణ గూర్చి, నా గురించీ, అక్రూరుడికి, విదురుడుకీ చెప్పు” అని ఆదేశించాడు.

“రాణులనూ, స్త్రీ బాలవృధ్ధులను, అర్జునుడు తనతో హస్తినాపురానికి తీసుకు వెళ్ళాలని కూడా నేను చెప్పానని యథాతథంగా చెప్పు. నా అనంతరం, వారెవరికీ ఇక వాసయోగ్యం కాదు ఆ ద్వారకానగరమనీ, అది సముద్రగర్భంలో కలిసి పోబోతోంది అతి త్వరలో- అని కూడా చెప్పు, అక్కడ మిగిలి ఉన్న వారికి. త్వరపడు దారుకా, త్వరపడు” అన్నాడు.

దారుకుడు శ్రీకృష్ణస్వామికి, ముమ్మారు ప్రదక్షిణ చేసి, ఆయన పాదాలు తన తల మీద ఒకసారి ఆనించుకుని, ధన్యత భావించి, అతి భారమైన చిత్తంతో సెలవు తీసుకుని, ద్వారకకు బయలుదేరాడు.

ద్వారక వెళ్ళి కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం అన్ని విషయాలు చెప్పాడు, అక్రూరాదులకు.

కృష్ణుడి ఆదేశాలు పాటించే ఆ ప్రయత్నాలు అవుతూండగానే ద్వారకా నగరం మొత్తం, శ్రీకృష్ణుడు నివసించిన మందిరం తప్ప, తృటిలో సముద్రగర్భంలో కలిసి పోయింది.

***

శ్రీకృష్ణ స్వామి — కోటిసూర్యతేజుడై, శివపార్వతులు, బ్రహ్మేంద్రాదులూ, నారదాది సంయమివరులు, సమస్త దేవగణాలూ, జయజయధ్వానాలు పలుకుతుండగా తన నిజావాసమైన శ్రీవైకుంఠాన్ని చేరుకున్నాడు!

ఆ సమయంలో, నారాయణ గుణ గానాలు వినిపించినై ఆనంద పూర్ణ స్వరాలతో!

దేవదుందుభులు మొరశాయి,

పుష్ప వర్షాలు కురిశాయి, ఆ శ్రీహరి వైకుంఠాగమన మహోత్సవ సందర్భంగా!

సత్యము, దయ, పవిత్రత, ఉదారత, ధర్మనిష్ఠ లాంటి ఉదాత్త గుణాలు కూడా ఆయనతో పాటు భూ పరిధిని విడిచి వెళ్ళిపోయాయి.

చూడదగ్గ వారికి ఆయన తన నిజావాసానికి వెళ్ళటం కనిపించింది, అన్యులకు ఆ అదృష్టం దక్కలేదు.

అంతా అఖండ యోగశక్తిచేత చేసిన ఆ శ్రీకృష్ణుని గమనం అతి గుహ్యమైనది.

దానిని ప్రశంసిస్తూ, అబ్బుర పడుతూ, సర్వదేవతా ప్రముఖులూ, తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు.

***

అర్జునుడు అందరికీ అంత్యక్రియాదులు పూర్తి చేయించి, వారసుడిగా మిగిలి ఉన్న అనిరుద్ధుడి పుత్రుడైన వజ్రుడిని యాదవ రాజ్యానికి ప్రభువుగా అభిషేకించి, స్త్రీ బాలవృధ్ధుల నందరినీ తీసుకుని హస్తినాపురం చేరాడు, దారుకుని ద్వారా అందిన శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానుసారం.

హస్తినలో అర్జునుని ద్వారా శ్రీకృష్ణ నిర్యాణ వార్త విన్న ధర్మరాజాది అన్య పాండవులు కూడా అత్యంత ఖిన్నులైపోయారు.

ఆ వెంటనే వారు కూడా అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తుకు రాజ్యం అప్పగించి, తమ తుది యాత్రకై హిమాలయ పర్వతశ్రేణుల దిశగా పయనించి వెళ్ళిపోయారు, ద్రౌపది దేవి సహితంగా!

***

పదేపదే ఆ సంక్లిష్ట తరుణంలో, అర్జునుడు మనస్సులో మననం చేసికొన్నవి, తనకు సఖుడు బంధువు గురువు అయిన శ్రీకృష్ణుని నిత్యసత్యాలైన గీతావాక్యాలే అనీ, అవే ఆ మహావీరుడికి వలసిన మానసిక స్థైర్యాన్ని ఇచ్చిఉంటాయి అని అనుకోవడం, సహజమైనదీ, సమంజసమైనదీ అని చెప్పవచ్చేమో బహుశా!

గీతా శ్రవణ ఫలం అర్జునుడికి చివరి ఘడియల్లో కూడా సహాయకారిగా నిల్చింది.

చదివి నమ్మి ఆచరించిన ఎవరికైనా అంతే, ఎందుకంటే అవి సాక్షాత్తూ శ్రీకృష్ణ ప్రోక్త జీవన సూత్రాలు.

ఇహపరసాధక సమర్థాలు.

మానవాళి జీవనయానానికి అఖండజ్ఞాన ప్రభల చిమ్మే కరదీపికలు కాబట్టి.

***

శ్రీకృష్ణ శ్శరణమ్మమ!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here