మరుగునపడ్డ మాణిక్యాలు – 98: మాన్‌స్టర్స్ బాల్

0
4

[సంచిక పాఠకుల కోసం ‘మాన్‌స్టర్స్ బాల్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]జీ[/dropcap]వితంలో అందరికీ ఒడిదుడుకులు వస్తాయి. కొన్ని స్వయంకృత అపరాధాలు, కొన్ని విధి వేసిన శిక్షలు. స్వయంకృతమైతే తప్పు తెలుసుకుని మారటానికి అవకాశం ఉంటుంది. తెలుసుకోగలిగిన వారు అదృష్టవంతులు, తెలుసుకోలేని వారు మూర్ఖులు. మరి విధివంచితులకి ఏమిటి మార్గం? ‘నేనేం తప్పు చేశానని నాకీ శిక్ష’ అనే ప్రశ్నకి సమాధానం ఏమిటి? ఏదో దారి వెతుక్కుని సాగిపోవాలి అంతే. ఇలాంటి కొన్ని జీవితాల కథే ‘మాన్‌స్టర్స్ బాల్’ (2001). ‘బాల్’ అంటే బంతి అనే అర్థంతో పాటు పార్టీ లేదా వేడుక అనే అర్థం కూడా ఉంది. బాల్ రూమ్ డ్యాన్సింగ్ అంటే వేడుకలో నృత్యం చేయటం. ‘మాన్‌స్టర్స్ బాల్’ అంటే మరణదండనకి సంబంధించి ఒక వింత ఆచారం. ఈ ఆచారం అమెరికాలో లేదు కానీ ఇంగ్లండ్‌లో ఉంది. మరణదండన విధించే ముందు రాత్రి నేరస్థుడికి జైలు సిబ్బంది పార్టీ ఇస్తారు. నేరస్థుడిని మాన్‌స్టర్ (రాక్షసుడు) అని సంబోధిస్తారన్నమాట. ఈ చిత్రంలో ఒక నేరస్థుడు, అతని భార్య, వారి కొడుకు, ఒక జైలు ఉద్యోగి, అతని కొడుకు, తండ్రి ముఖ్యపాత్రలు. చట్టం దృష్టిలో రాక్షసులు కొందరైతే జీవితంలో రాక్షసులు కొందరు. కథ అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో జరుగుతుంది. ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే లో లభ్యం. పెద్దలకు మాత్రమే.

హ్యాంక్, సన్నీ తండ్రీకొడుకులు. ఇద్దరూ జైలు ఉద్యోగులే. నేరస్థులకి కాపలాయే కాకుండా మరణదండన అమలు చేసే ఉద్యోగం. మరణదండనకి ముందు నేరస్థుడి దగ్గర ఉండి అతని భోజనం, చివరి కోరిక లాంటివి అమరుస్తారు. సన్నీకి ఈ ఉద్యోగం కొత్త. అతని తాత బక్. తాత, తండ్రి, మనవడు కలిసి ఉంటారు. సన్నీలో అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఒంటరితనం పీడిస్తూ ఉంటుంది. లాడ్జికి వెళ్ళి వేశ్యలతో సెక్స్ చేస్తాడు. ఒక వేశ్యని “ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందామా?” అని అడుగుతాడు. అసలు విషయం ఏమిటంటే అతనికి మనసు విప్పి మాట్లాడేవారు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి తండ్రి అతన్ని కొట్టేవాడు. తాత కూడా తండ్రినే సమర్థించేవాడు. మగవాడంటే కఠినంగా ఉండాలని వారి నమ్మకం. భావోద్వేగాలు ప్రదర్శించకూడదు. సన్నీకి ఉద్యోగం హ్యాంకే ఇప్పించాడని వేరే చెప్పక్కరలేదు. అందుకని హ్యాంక్‌కి సన్నీ అంటే ఇంకా చులకన. ఇక్కడ వేరే కోణం కూడా ఉంది. బక్‌కి నల్లజాతి వారంటే పడదు. నల్లజాతి వారే నేరాలు ఎక్కువ చేస్తారని, వారికి తన కొడుకు హ్యాంక్ శిక్ష విధిస్తున్నాడని బక్‌కి గర్వంగా ఉంటుంది. ముసలితనం వచ్చి ఒంట్లో సత్తువ లేకపోయినా పేపర్లో మరణశిక్ష వార్తలు కత్తిరించి ఒక ఆల్బమ్‌లో అతికించి పెట్టుకుంటాడు. బక్ పెంపకంలో పెరిగిన హ్యాంక్‌కి కూడా జాతివివక్ష అలవాటయింది. అయితే కాలం మారింది. సమాజంలో మార్పు వచ్చింది. తమ ఇంట్లో కనిపిస్తున్న వివక్ష సన్నీకి అర్థం కాదు. మనిషిని మనిషిగా చూస్తాడు కానీ శరీరం రంగుకి ప్రాధాన్యం ఇవ్వడు. అతను పెరిగిన వాతావరణం అతన్ని మానసికంగా కుంగదీసింది. అతని తల్లికి కూడా కుంగుబాటు ఉండేదని సూచనప్రాయంగా తెలుస్తుంది. ఆమె అత్మహత్య చేసుకుందని నాకనిపించింది. సన్నీ నాయనమ్మ అయితే ఆత్మహత్య చేసుకుందని తర్వాత కథలో తెలుస్తుంది. వారిద్దరికీ ఇంటి వెనకాలే సమాధులు ఉంటాయి.

లారెన్స్ మరణశిక్ష పడిన ఒక నేరస్థుడు. నల్లజాతి వాడు. అతని భార్య లెటీషియా, కొడుకు టైరెల్. అతను చేసిన నేరం ఏమిటనేది చిత్రంలో చెప్పలేదు. కానీ తాను చెడ్డవాడినని లారెన్స్ స్వయంగా టైరెల్‌కి చెబుతాడు. టైరెల్ 12-13 ఏళ్ళ వాడు. లావుగా ఉంటాడు. తిండి దగ్గర ఆగలేడు. తల్లి నుంచి దాచుకుని చాక్లెట్లు తింటూ ఉంటాడు. లెటీషియా ఒక రెస్టారెంట్లో పని చేస్తుంటుంది. ఆమె ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఇంటి అద్దె కట్టటం లేదని ఆమెకి యజమాని ఇల్లు ఖాళీ చేయమని నోటీసు ఇచ్చాడు. ఆమెకి లారెన్స్ మీద కోపం. కష్టాలు మర్చిపోవటానికి తాగుతుంది. కొడుకంటే ప్రేమ ఉంది కానీ అతను అతిగా తింటుంటే కొడుతుంది. బాధ మర్చిపోవటానికి తాను తాగినట్టే తండ్రి లేని లోటు పూడ్చుకోవటానికి కొడుకు తింటున్నాడని అనుకోదు. లారెన్స్‌కి మరణశిక్ష అమలు చేసే ముందు లెటీషియా, టైరెల్ అతన్ని కలుసుకోవటానికి వస్తారు. లెటీషియా “నీ కొడుక్కి వీడ్కోలు చెప్పుకుంటావని మాత్రమే నేను వచ్చాను” అంటుంది. అతను “నీ మనసు ఎన్నోసార్లు గాయపరిచాను. సారీ” అంటాడు. మరణం దగ్గర పడేసరికి అతనిలో పరివర్తన వచ్చిందనిపిస్తుంది. అతనికి బొమ్మలు గీయటం అలవాటు. టైరెల్‌కి కూడా ఆ విద్య అబ్బింది.

లారెన్స్ మరణశిక్ష అమలుకి కొన్ని గంటల వ్యవధి ఉన్నప్పుడు అతనికి కాపలాగా ఉండే బాధ్యత హ్యాంక్, సన్నీలకి అప్పగిస్తారు. హ్యాంక్ సన్నీతో “పొరపాట్లు చేయవద్దు. అంతా సవ్యంగా జరగాలి. నీకు కొత్త అని వెసులుబాటు ఏమీ ఉండదు. అతను ఏం చేశాడు, ఏం చేయలేదనేది మనకనవసరం. మన పని మనం చేయాలంతే” అంటాడు. సన్నీ అతని వైపు చూడకుండా అతని మాటలు వింటాడు. తర్వాత లారెన్స్‌కి భోజనం ఇస్తారు. అయితే అతను తినడు. ఎదురుగా కూర్చున్న సన్నీ బొమ్మ వేస్తాడు. బొమ్మలు వేసుకోవాలన్నదే అతని చివరి కోరిక. బొమ్మ పూర్తి చేసి సంతకం చేసి సన్నీకి ఇస్తాడు. ఆ బొమ్మ చూసి సన్నీ “నేను ఇంత అందంగా ఉండను” అని థ్యాంక్స్ చెబుతాడు. ఇక్కడ అతని సున్నితత్వం బయటపడుతుంది. అతని మంచితనం చూసి లారెన్స్‌కి ఒక్కసారిగా భావోద్వేగం కలుగుతుంది. దౌర్జన్యం కన్నా సౌజన్యమే మనసుని ఎక్కువ కదిలిస్తుంది. అతన్ని సన్నీ సముదాయిస్తాడు. ఇదంతా హ్యాంక్‌కి నచ్చదు. నేరస్థుడికి దూరంగా ఉండాలని అతని భావన. సన్నీని దూరంగా కూర్చోబెట్టి హ్యాంక్ లారెన్స్ ఎదురుగా కూర్చుంటాడు. లారెన్స్ హ్యాంక్ బొమ్మ వేస్తాడు. “ఫొటో కన్నా బొమ్మే ఒక మనిషి స్వభావాన్ని బాగా చూపిస్తుంది” అంటాడు లారెన్స్. ఇంత సూక్ష్మదృష్టి కలవాడిని మృత్యువు ఒడిలోకి పంపిస్తున్నామనే బాధ సన్నీ మనసుని మెలిపెడుతుంది. లారెన్స్‌ని చెరో చెయ్యి పట్టుకుని సన్నీ, హ్యాంక్ ఎలెక్ట్రిక్ చెయిర్ (అందులో కూర్చోబెట్టి విద్యుత్తు పంపించి ప్రాణం తీస్తారు) ఉన్న గదిలోకి తీసుకెళుతుంటే సన్నీకి కడుపులో దేవినట్టు అయి పక్కకి తిరిగి వాంతి చేసుకుంటాడు. మిగతావారు తోడు రాగా హ్యాంక్ లారెన్స్‌ని గదిలోకి తీసుకెళతాడు. మరణశిక్ష అమలు జరుగుతుంది.

తర్వాత హ్యాంక్ కోపంతో సన్నీని కొడతాడు. “నీ వల్ల అతని ఆఖరి ప్రయాణం పాడయింది. నువ్వు మీ అమ్మ లాంటి వాడివే” అంటాడు. సన్నీ సున్నితంగా ఉండటం హ్యాంక్‌కి ఇష్టం లేదు. మగవాడంటే మొరటుగా ఉండాలనుకుంటాడు. అతని తండ్రి అతనికి అదే నేర్పించాడు. హ్యాంక్ కొడుతుంటే సన్నీకి కోపం వస్తుంది కానీ హ్యాంక్ సన్నీ కంటే బలవంతుడు. తోటి వారు హ్యాంక్‌ని పక్కకి లాగుతారు. తర్వాత హ్యాంక్ సన్నీని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మంటాడు. దీనికి వేరే కారణం కూడా ఉంది. సన్నీకి నల్లజాతి పిల్లలతో స్నేహం ఉంది. అది హ్యాంక్‌కి నచ్చదు. ఇదంతా బక్ ప్రభావం. ఆ ప్రభావం నుంచి హ్యాంక్ ఇంకా బయటపడలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటే సన్నీ ఎదురుతిరుగుతాడు. తన వద్ద ఉన్న రివాల్వర్ హ్యాంక్ మీద గురిపెడతాడు. బక్ నిశ్చేష్టుడై చూస్తూ ఉంటాడు. సన్నీ రివాల్వర్ దించకుండా హ్యాంక్‌ని “నేనంటే నీకు ద్వేషం కదా” అని అడుగుతాడు. “అవును. మొదటి నుంచి” అంటాడు హ్యాంక్. ఆ మాట విని సన్నీ రివాల్వర్ తన గుండె మీద గురి పెట్టుకుని కాల్చుకుని చనిపోతాడు!

సన్నీ మరణం హ్యాంక్ స్వయంకృత అపరాధం. అందులో బక్ పాత్ర కూడా ఉంది. మగవాడు సున్నితంగా ఉండకూడదు అనే తప్పుడు అభిప్రాయం సన్నీ ప్రాణం తీసింది. కొడుకు ప్రాణంతో ఉండాలా, మొరటుగా ఉండాలా అంటే ఏ తండ్రైనా ప్రాణంతో ఉంటే చాలు అంటాడు. హ్యాంక్‌కి ఆ అవకాశం రాలేదు. కొడుకు ఆత్మహత్య చేసుకునేంత కుంగిపోయాడని అతని బుర్రకి అర్థం కాలేదు. ఇప్పుడు కొడుకు తిరిగి రాడుగా! అయినా అతను గంభీరంగా ఉంటాడు. కొడుకుని ఇంటి వెనకాల ఖననం చేయిస్తాడు. మతపరమైన కార్యక్రమం జరిపించకుండా ఖననం పూర్తి చేస్తాడు. బక్ ఇంకా రెండాకులు ఎక్కువే చదివాడు. “వాడు బలహీనుడు” అంటాడు. మనవడు చనిపోయాడనే బాధ ఉండదు. ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించవచ్చు. గత శతాబ్దంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో జాతివివక్ష దారుణంగా ఉండేది. తెల్లజాతి వారు కొందరు ఒక సంఘంగా ఏర్పడి నల్లజాతి వారిని హత్యలు చేసేవారు. బక్ అలాంటివాడే. వారికి ప్రేమ కన్నా ద్వేషం ఎక్కువ. కానీ ప్రేమే జయిస్తుంది. ద్వేషం ఎప్పుడూ జయించదు. జీవితమనే పార్టీలో లారెన్స్, హ్యాంక్, బక్ మాన్‌స్టర్స్ (రాక్షసులు). ఒకరికి చట్టం శిక్ష వేసింది. మిగతావారు ఏ తీరం చేరతారనేది మిగతా కథ.

మైలో ఆడికా, విల్ రోకోస్ కలిసి రాసిన స్క్రీన్ ప్లే ఆధారంగా మార్క్ ఫోస్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే కి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. బిలీ బాన్ థార్న్టన్, హ్యాలీ బెరీ, హీత్ లెడ్జర్, పీటర్ బాయల్ ముఖ్యపాత్రలు పోషించారు. హ్యాలీ బెరీకి ఉత్తమ నటిగా ఆస్కార్ వచ్చింది. ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు ఉత్తమ నటి ఆస్కార్ అందుకున్న ఏకైక నల్లజాతి నటి ఆమె. చివరి సన్నివేశంలో ఆమె నటన చిరకాలం గుర్తుండిపోతుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

లెటీషియాది పాత కారు. ఒకరోజు పూర్తిగా పాడయిపోతుంది. ఆలస్యంగా రావటంతో రెస్టారెంట్లో ఉద్యోగం పోతుంది. ఆమె వేరే రెస్టారెంట్లో ఉద్యోగంలో చేరుతుంది. అది హ్యాంక్ రోజూ వెళ్ళే రెస్టారెంట్. అయితే వారు ఒకరికొకరు తెలియదు. మొదటిసారి లెటీషియా హ్యాంక్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఆమె కాఫీ ఒలకబోస్తుంది. డబ్బు కట్టించుకునేటపుడు క్యాష్ యంత్రం సరిగా పనిచేయక ఇబ్బంది పడుతుంది. హ్యాంక్ పైకి విసుగు చూపించడు కానీ టిప్పు చాలా తక్కువ ఇస్తాడు. అమెరికాలో టిప్పు ఎక్కువ ఇవ్వటం రివాజు. తక్కువ టిప్పు చూసి ఆమె నిరాశపడుతుంది. ఆమె కొంచెం డబ్బు కూడబెట్టి ఇంటి అద్దె కట్టాలని ప్రయత్నిస్తుంటుంది. అతను ‘నీకిదే ఎక్కువ’ అన్నట్టు వెళ్ళిపోతాడు. ఆమె నల్లజాతి స్త్రీ అనే చులకన భావం కూడా ఉంటుంది. తర్వాత అతను తన ఉద్యోగం వదిలేస్తాడు. అతనిలో కొడుకుని కోల్పోయిన బాధ ఉంది. ఉద్యోగం అతనికి కొడుకుని గుర్తు చేస్తుంది. అందుకే వదిలేశాడు. బక్‌కి చెబితే “తప్పు చేశావు. నువ్వూ మీ అమ్మ లాంటి వాడివే. ఆమె నన్ను నిరాశపరిచింది. నువ్వూ అదే పని చేశావు” అంటాడు. బక్‌కి ఆదాయం పోయిందని బాధ లేదు. నల్లజాతి వారిని శిక్షించే అవకాశం పోయిందని అతని బాధ. హ్యాంక్ సన్నీని ‘నువ్వు మీ అమ్మ లాంటి వాడివే’ అన్నట్టే బక్ కూడా హ్యాంక్‌ని అంటాడు. సన్నీ మరణాన్ని ఆశ్రయించి ఈ విషపరంపర నుంచి బయటపడ్డాడు. ఆత్మహత్య ఎప్పటికీ సమాధానం కాదు. హ్యాంక్ ఉద్యోగం వదిలేసి కొత్త జీవితం కోసం ప్రయత్నిస్తున్నాడు.

ఒకరోజు రాత్రి లెటీషియా పని ముగించుకుని టైరెల్‌తో పాటు ఇంటికి వెళుతుంటుంది. కారు లేదు కాబట్టి నడిచే వెళ్ళాలి. వర్షం పడుతూ ఉంటుంది. ఒక కారు టైరెల్‌ని గుద్దేసి వెళ్ళిపోతుంది. అతను మూర్ఛపోతాడు. ఆమె గట్టిగా ఏడుస్తూ ఆ దారిన వెళ్ళే కార్లని ఆగమని వేడుకుంటుంది. హ్యాంక్ అటుగా కారులో వెళుతుంటాడు. ముందుకి వెళ్ళిపోయినవాడు ఆమె ఆర్తనాదాలకి వెనక్కి వస్తాడు. తన కారులో ఇద్దరినీ హాస్పిటల్‌కి తీసుకువెళతాడు. టైరెల్ చనిపోతాడు. లెటీషియాకి దెబ్బ మీద దెబ్బ. విధి ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఆమెకి ఎవరూ లేరు. హాస్పిటల్ వారు తమ పని తాము చేస్తారు కానీ దగ్గరుండి సముదాయించరు. అది వారి నుంచి ఆశించకూడదు కూడా. లెటీషియా హ్యాంక్‌కి వాటేసుకుని ఏడుస్తుంది. పోలీసులు టైరెల్‌ని గుద్ది వెళ్ళినవాళ్ళని పట్టుకుంటారని అతను ఆమెని అనునయిస్తాడు. “వాడు నల్లజాతి పిల్లవాడు. వాళ్ళని పట్టుకుంటారని మీరు నమ్ముతున్నారా?” అంటుందామె. నల్లజాతి వాళ్ళకి న్యాయం జరగదని ఆమె అభిప్రాయం. వీలైనంత వరకు తల వంచుకుని బతికేయాలి అనుకుంటుంది. కానీ ఆమె భర్త నేరం చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఆమె కొడుకు ప్రమాదంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆమె తప్పు లేదు. కానీ శిక్ష మాత్రం ఆమెకే పడింది.

హ్యాంక్ ఒక పెట్రోల్ స్టేషన్ కొంటాడు. ఉద్యోగం వదిలేశాడు కాబట్టి వ్యాపకం ఉండాలని అతని ఉద్దేశం. సంతోషంగా తండ్రికి చెబుతాడు. “ఆ పెట్రోల్ స్టేషన్ మనదే” అంటాడు. “మనది అనకు. నీది. నేనైతే జైలు ఉద్యోగం వదిలేవాడిని కాదు” అంటాడు. హ్యాంక్ ముఖ్యంలో నవ్వు మాయమవుతుంది. కానీ దృఢంగా “నేనిప్పుడు పెట్రోల్ స్టేషన్ యజమానిని మాత్రమే. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు” అంటాడు. మరో పక్క హ్యాంక్, లెటీషియాల మధ్య స్నేహం పెరుగుతుంది. హ్యాంక్‌లో మెల్లగా మార్పు వస్తుంది. అతను రెస్టారెంట్‌కి వెళ్ళినపుడు ఎప్పుడూ ఒకే చోట కూర్చుంటాడు. ఒకరోజు ఆ చోటులో వేరే వారు ఉంటారు. మామూలుగా అయితే తిరిగి వెళ్ళిపోయేవాడేమో కానీ లెటీషియా కోసం కౌంటర్ దగ్గరే కూర్చుంటాడు. ఇది మార్పుకి సంకేతం. అయితే అతనెప్పుడూ చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటాడు. ప్లాస్టిక్ స్పూన్ తోనే తింటాడు. స్టీల్ స్పూన్‌తో తినవచ్చు కానీ తినడు. ఇది అతనిలో ఉన్న పట్టుదలకి సంకేతం. ఒకరకంగా మూర్ఖపు పట్టుదల.

ఒకరోజు ఆమె అతన్ని “మా అబ్బాయికి ప్రమాదం జరిగినపుడు ఎందుకు సాయం చేశారు?” అని అడుగుతుంది. “మా అబ్బాయి చనిపోయాడు. మంచివాడు. నేను మంచి తండ్రిని కాలేకపోయాను. నిన్ను ఆ రోజు చూసి నాలో ఏదో చలనం కలిగింది. ఒక్కోసారి గుండె పిండేసినట్టుండేది. నా నుంచి నేనే పారిపోవాలనిపించేది” అంటాడు. అందరు తండ్రులలాగే అతను కొడుకు బతికి ఉంటే చాలనుకునే తండ్రే (బక్ ఇందుకు మినహాయింపేమో). కానీ ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాడు. పైగా కొడుకు మరణానికి తానే కారణమనే అవగాహన కలిగింది. అతని స్థానంలో బక్ ఉంటే అలా అనుకునేవాడు కాదేమో. దురదృష్టం ఏమిటంటే బక్ లాంటి వాళ్ళు ఏ పశ్చాత్తాపమూ లేకుండా జీవితం గడిపేస్తారు. పశ్చాత్తాపం గలవారికి ఒక్కోసారి జీవితం నరకమైపోతుంది. ముఖ్యంగా క్షమించమని అడగాల్సిన మనిషి ఇక లేనప్పుడు. లారెన్స్‌కి నేరం చేసినందుకు చట్టం శిక్ష వేసింది. అయితే ఆ నేరమేమిటో రచయిత చెప్పలేదు. హ్యాంక్ సన్నీ మీద చూపించిన క్రౌర్యం వల్ల సన్నీ చనిపోయాడు. అది నేరం కాదా? మరి హ్యాంక్‌కి శిక్ష వేయలేదే! లారెన్స్ చేసిన నేరం కన్నా హ్యాంక్ చేసిన నేరమే పెద్దది అని చెప్పటానికి రచయిత ఎంచుకున్న పద్ధతి లారెన్స్ నేరాన్ని ప్రస్తావించకపోవటం. కొన్ని నేరాలకి జీవితమే శిక్ష.

లెటీషియా హ్యాంక్‌ని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. తన భర్త వేసిన బొమ్మలు చూపిస్తుంది. అప్పుడు హ్యాంక్‌కి ఆమె ఎవరో అర్థమవుతుంది. తాను మరణశిక్ష అమలు చేసిన లారెన్స్ భార్య ఆమె. అయితే అతను ఆ విషయం చెప్పడు. తర్వాత లెటీషియా తన కొడుకుని తలచుకుని బాధపడుతుంది. తన బాధని మర్చిపోవటానికి హ్యాంక్‌తో శృంగారం కోరుకుంటుంది. అతను సన్నీ మరణించాక ఒక వేశ్య దగ్గరకి వెళ్ళాడు కానీ ఆమె “సన్నీ ఎలా ఉన్నాడు?” అని అడిగింది. ఆ ప్రశ్నకి అతని మనసు వికలం అయ్యింది. తండ్రీకొడుకులు ఒకే వేశ్య దగ్గరకి వెళ్ళారనేది ఇక్కడ అంత పెద్ద విషయం కాదు. సన్నీ మరణాన్ని మరచిపోదామనుకున్న అతనికి ఆమె మళ్ళీ గుర్తు చేసింది. శృంగారానికి అతని శరీరం సహకరించలేదు. ఇప్పుడు లెటీషియాతో శృంగారంలో పాల్గొంటాడు. ఒకరి వేదనకి ఒకరు మందు వేస్తున్నట్టు వారి శృంగారం ఉంటుంది. దర్శకుడు కొంచెం ఘాటుగానే చూపించాడు. అయితే ‘ఈ వేదనలో నాకు ఒక తోడు ఉంది’ అనే ఆశ్వాసన కోసమే వారు శృంగారం కోరుకుంటారు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

హ్యాంక్ సన్నీ తోలిన కారుని లెటీషియాకి ఇస్తాడు. ఆమె మొదట వద్దంటుంది కానీ హ్యాంక్ పట్టుబట్టటంతో తీసుకుంటుంది. బదులుగా తన పెళ్ళి ఉంగరం తాకట్టు పెట్టి ఒక పెద్ద కౌబాయ్ టోపీని హ్యాంక్‌కి బహుమతిగా కొంటుంది. ఆ బహుమతి ఇవ్వటానికి అతని ఇంటికి వెళుతుంది. తలుపు తీసి ఉంటుంది. పిలిచినా ఎవరూ పలకకపోవటంతో లోపలికి వెళుతుంది. బక్ ఉంటాడు. ఆమె బహుమతి తెచ్చానంటే “నాకివ్వు. నేను హ్యాంక్‌కి ఇస్తాను” అంటుంది. ఆమె ఇస్తుంది. అతను పెట్టె తెరిచి టోపీ తీసి తలపై పెట్టుకుంటాడు. ఈ చర్యతోనే అతని స్వభావం తెలిసిపోతుంది. “ఇంత మంచి కానుక తెచ్చావంటే వాడేదో మంచిపనే చేశాడు. నేను కూడా ఒకప్పుడు నల్ల అమ్మాయిలని అనుభవించాను. హ్యాంక్ నాలాంటి వాడే. నల్ల అమ్మాయితో పడుకోకపోతే వాడు మగాడే కాదు” అంటాడు. అతను ఎంత నీచుడో ఈ మాటతో తెలుస్తుంది. లెటీషియా అసహ్యంతో బయటికి వస్తుంది. మళ్ళీ అప్పుడే హ్యాంక్ వస్తాడు. లెటీషియా కోపంగా కారులో వెళుతుంటే ఆపబోతాడు. ఏం జరిగిందని అడుగుతాడు. “మీ నాన్నని కలిశాను” అంటుందామె. అతనికి ఏం జరిగిందో అర్థమవుతుంది. అతను బతిమాలినా ఆమె ఆగకుండా వెళ్ళిపోతుంది. హ్యాంక్ ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు. బక్‌ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడి ఉద్యోగినితో “ఆయనని జాగ్రత్తగా చూసుకోండి” అంటాడు. “మీ నాన్నంటే మీకు చాలా ప్రేమలా ఉందే” అంటుందామె. “లేదు. కానీ నా తండ్రి కదా” అంటాడతను. బక్ “నాకిలా పోవాలని లేదు” అంటాడు. “నాకూ అంతే” అంటాడు హ్యాంక్. అందులో అర్థం ‘నాకు నీలా జీవించాలని లేదు’ అని. చివరికి స్వయంకృత అపరాధాలని తెలుసుకోలేని బక్‌కి అతనికి తగ్గ శిక్షే పడింది.

హ్యాంక్ లెటీషియా దగ్గరకి వెళతాడు. ఆమె కారు తిరిగి ఇచ్చేస్తానంటే వద్దంటాడు. తన తండ్రిని పంపించేశానని చెబుతాడు. ఆమె పట్టించుకోదు. కొన్నాళ్ళకి ఆమె ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. పోలీసులు వచ్చి ఇల్లు ఖాళీ చేయిస్తారు. ఆమె సామానుతో రోడ్డు పక్కన ఉంటుంది. హ్యాంక్ ఆమెని తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమె మౌనంగా అతని వెంట వస్తుంది. ఆ రాత్రి అతను వేరుగా పడుకుంటానంటాడు. ఆమె వారిస్తుంది. ఇద్దరూ కలిసి పడుకుంటారు. అతను “నిన్ను బాగా చూసుకోవాలని నా ఆశ” అంటాడు. ఆమె “నేనందుకు సిద్ధం” అంటుంది. ఆమె జీవితపు డక్కాముక్కీలు తిని అలసిపోయింది. అతని నీడలో నిశ్చింతగా ఉండాలని ఆశపడుతుంది. ఇది ఆమె స్వార్థమా? కాదు. ఇదొక్కటే ఆమెకి గౌరవంగా బతకటానికి మిగిలిన మార్గం. ఈ మార్గంలో వెళితే తప్పేమిటి? అతను ఆమెకి ఓరల్ సెక్స్ చేసి తృప్తి కలిగిస్తాడు. బదులుగా ఏమీ కోరుకోడు. ఆమె సుఖమే అతనికి ముఖ్యమనే దానికి సంకేతమిది. తర్వాత అతను ఐస్ క్రీమ్ తెస్తానని వెళతాడు. ఆమెకి ఏ రకం ఐస్ క్రీమ్ కావాలో అడుగుతాడు. ఆమె “చాక్లెట్” అంటుంది. అదే అతనికి ఇష్టమని ఆమెకి తెలుసు. అతను ఇంతకు ముందు ఆ ఐస్ క్రీమ్ బయట తినేవాడు. ఇంటికి తెచ్చుకోవాలని అనుకోలేదు. దీనికి కారణం ఆమె ఇంటికి రావటం కన్నా తండ్రి ఇంట్లో లేకపోవటమేనేమో! తండ్రి నీడ నుంచి బయటకి వచ్చి అతను కొత్త జీవితం ప్రారంభించాడు.

హ్యాంక్ వెళ్ళాక ఆమె సన్నీ గదిలోకి వెళుతుంది. ఆ గదిలో ఇప్పుడు టైరెల్ సామాన్లు పెట్టుకోమని హ్యాంక్ ఆమెకి చెప్పాడు. అక్కడ ఆమెకి లారెన్స్ గీసిన బొమ్మలు కనపడతాయి. ఒకటి సన్నీ బొమ్మ, ఒకటి హ్యాంక్ బొమ్మ. లారెన్స్ సంతకం కూడా ఉంటుంది. ఆమెకి హ్యాంకే లారెన్స్ కి మరణశిక్ష అమలు చేశాడని అర్థమవుతుంది. విధి మళ్ళీ వింతనాటకం ఆడింది. ఆమెలో నిస్పృహ కలుగుతుంది. అది అసహనంగా మారుతుంది. హ్యాంక్ ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు. ఆమె అయోమయం నిండిన ముఖంతో అతన్ని చూస్తుంది. అతను ఆమెని పెరట్లోకి తీసుకువెళ్ళి మెట్ల మీద కూర్చోమని పక్కన కూర్చుంటాడు. ఆమె స్తబ్ధుగా కూర్చుంటుంది. ఆమె పెరట్లో ఉన్న మూడు సమాధులని చూస్తుంది. అతను ఆమెకి ఐస్ క్రీమ్ తినిపిస్తాడు. ఇంతకు ముందు ఒక్కడే తినేవాడు. ఇప్పుడు పంచుకుంటున్నాడు. అతను తాను కొన్న పెట్రోల్ స్టేషన్ గురించి చెబుతాడు. “మనకి మంచిరోజులొచ్చాయి” అంటాడు. ఆమెలో సంఘర్షణ తగ్గుతుంది. మౌనంగా ఉండిపోతుంది.

ఆమె మనసులో ఏముంది? గతాన్ని మరచిపోవాలనా? వేరే దారి లేదనా? నిజానికి మరణశిక్ష పడినవారికి శిక్ష ఎవరో ఒకరు అమలు చేస్తారు. వారు నిమిత్తమాత్రులే. అందుకే ఆమె మౌనంగా ఉందా? హ్యాంక్ పెరట్లో ఉన్న సమాధులు అతని జీవితంలోని గాయాలకి చిహ్నాలు. ఆమె ఆ సమాధులని చూసి అతని మీద జాలి పడిందా? ఇలా ప్రేక్షకులని ఆలోచనలో పడేస్తుంది ఈ ముగింపు. వారి జీవితం ఈ అడ్డంకిని దాటి సాగిపోతుంది. తర్వాత హ్యాంక్ తానే లారెన్స్‌కి శిక్ష అమలు చేశానని చెప్పవచ్చు. లేదా ఏదైనా గొడవ వచ్చినపుడు లెటీషియా ఎందుకు చెప్పలేదని నిందించవచ్చు. కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే ఈ అడ్డంకులు కూడా దాటుకుని వారు సాగిపోతారు. వారి బంధం అంత గట్టిపడుతుందని ఆశించటమే మన పని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here