శ్రీవర తృతీయ రాజతరంగిణి-25

0
5

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

అన్యోన్య మిళితాః కాంస్య ఘనవత్ కఠినా ఘనాః।
అన్యోన్యా ఘాత్ సహనా వదన్తాః సుభటా బభుః॥
(శ్రీవర రాజతరంగిణి, 149)

భటా న్యన్తి మాం యుద్ధే మాం మా తాడయత్ ధృతమ్।
ఇతీవ తారం దధ్వాన్ ఖానస్సాన కదన్దుభిః॥
(శ్రీవర రాజతరంగిణి, 150)

పూర్వం మయా ప్రతీహార ముఖ్యా గురులఘూర్జితాః।
రణే ఫలతయా దృష్టా రతేర్ర్వుత్తే ఘనా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, 151)

తతో భూపబలాత్ కృద్ధౌ ధాత్రేయౌ భూపతేర్హితౌ।
ఠక్కురౌ నిరగతాం తౌ వీరౌ హస్సన హోస్సనౌ॥
(శ్రీవర రాజతరంగిణి, 152)

ఇరు పక్షాల సైనికులు ఒకరినొకరు తాకారు. ముందుగా వారి కత్తులు ఒకదానినొకటి తాకి ఖణేల్ ఖణేల్ మన్నాయి. వారు పెద్ద శబ్దాలు చేస్తూ ఒకరినొకరు గాయపరుచుకున్నారు. హాజీఖాన్ సైన్యం మ్రోగించిన దుందుభులు ‘నన్ను సైనికులు బలవంతంగా యుద్ధం చేయిస్తున్నారు. నన్ను కొట్టవద్దు’ అని అంటున్నట్టు మ్రోగుతున్నాయి. ఎలాగయితే మేఘాలు, సూర్యుడిని అడ్డుకోలేవో అలాగ శత్రు సైనికుల వీరులు ప్రతాపం ప్రదర్శించినా లాభం లేకుండా పోయింది. శత్రు సైనికులు యుద్ధంలో ముందంజ  వేయటం చూసిన ఠక్కురా వీరులు హస్సన్, హుస్సేన్‍లు క్రుద్ధులయ్యారు. వారు రాజు శత్రు సైనికులపై విరుచుకు పడ్డారు.

సైనికుల యుద్ధాన్ని శ్రీవరుడు వర్ణించిన విధానం యుద్ధాన్ని కళ్ళ ముందు నిలుపుతుంది. సైనికులు పెద్ద శబ్దాలతో ఒకరినొకరు తాకటం, కత్తులు ఖణేల్‍మనటం, అరుస్తూ శత్రు సైనికుడికి గాయం చేయటం, గాయమైన వారు ఆర్తనాదాలు చేయడం, ఒక రకమైన అరాచకమైన హింసాత్మక దృశ్యాన్ని కళాత్మక రూపంగా కళ్ళ ముందు నిలుపుతున్నాడు శ్రీవరుడు, నేపథ్య శబ్దాలతో సహా!

‘Creative live reporting’ అన్నమాట. హాజీఖాన్ మ్రోగించే దుందుభులు క్షమార్పణలు వేడుతున్నట్టు ధ్వనించటం వంటి వర్ణనలు,  అక్షరాలు సృష్టించే నిశ్చల సజీవ చిత్రాలు. శబ్దసహిత  సజీవ చలన చిత్రాలన్న భ్రమను కలిగిస్తాయి. అత్యద్భుతమైన రచనా సంవిధానం ఇది! ఇంతకీ, ఈ యుద్ధానికి శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి అన్న విషయం కూడా ఈ శ్లోకాల ద్వారా మనకు తెలుస్తుంది.

సువర్ణ సీహనం గాద్యా రాజపుత్రా రణాధ్వరే।
శస్త్ర్రజ్వాలావలీలీఢే జుహువుః శ్రీఫలం వపుః॥
(శ్రీవర రాజతరంగిణి, 153)

ఎలాగయితే యజ్ఞంలో  శ్రీఫలాన్ని  ఆహుతిగా  ఇస్తారో, అలా శస్త్ర జ్వాలలతో కూడిన ఈ యజ్ఞంలో సువర్ణ సింగ్, గంగా వంటి రాజపుత్రులు తమ ప్రాణాలను ఆహుతి చేశారు.

కొబ్బరిని శ్రీఫలం అంటారు. కొబ్బరిని లక్ష్మీదేవికి ఇష్టమైన పండుగా భావిస్తారు. అందుకని శ్రీఫల్ అంటారు. ఇది మామూలు కొబ్బరి కన్నా చిన్నగా ఉంటుంది. ప్రార్థనలు, పూజల సమయంలో కొబ్బరిని నైవేద్యంగా ఇవ్వటం మనకు తెలుసు. కశ్మీరులో కొబ్బరిని శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించి బిల్వ పత్రంతో కొబ్బరిని కూడా సమర్పిస్తారు.

రాజపుత్రులు సువర్ణ సింగ్, గంగా వంటి వారిని శ్రీవరుడు శ్రీఫలంతో పోల్చటం ఔచితీమంతంగా ఉంటుంది. శ్రీఫలం పవిత్ర ఫలం. దాన్ని నైవేద్యంగా ఇవ్వటం పవిత్ర కార్యం. ఇక్కడ సువర్ణ సింగ్ కానీ గంగా కానీ తమ ప్రాణాలను రాజ్య రక్షణలో భాగంగా తమ రాజు కోసం త్యాగం చేస్తున్నారు. అది పవిత్ర కార్యం. ఎందుకంటికి, జైనులాబిదీన్ ఓటమి, అతడి మీద ఆధారపడి కశ్మీరులో స్థిరపడుతున్న పండితులకు ప్రమాదకరం. పైగా రాజు కోసం ప్రాణత్యాగం చేయటం ఎంతో పవిత్రమైన కార్యం. కాబట్టి వారిద్దరి త్యాగాన్ని శ్రీఫల నైవేద్యంతో పోల్చాడు శ్రీవరుడు .

తేవీర భ్రమరాస్తత్ర రణోద్యానే తదాభ్రమన్।
స్వామి మాధవ సాన్నిధ్యాద్ యశః కుసుమలంపటాః॥
(శ్రీవర రాజతరంగిణి, 154)

వసంత ఋతువులో పూలను వెతుకుతూ తెమ్మెదలు తిరిగినట్టు, శాశ్వత ఖ్యాతి సంపాదించేందుకు యుద్ధ రంగంలో వీరులు, తమ ప్రభువు ముందు యుద్ధం చేస్తున్నారు. ‘రణోద్యానం’ చక్కటి పద ప్రయోగం! కీర్తి కోసం వీరత్వం ప్రదర్శిస్తున్న వీరులను పూల కోసం వెతికే తుమ్మెదలతో పోల్చాడు శ్రీవరుడు. రణస్థలిని ఉద్యానవనంతో పోల్చాడు.

తే వీరమస్తకాశ్చిన్నా రణభూభాజనే స్ఫుటమ్।
క్షుత్తప్తస్య కృతాన్తస్య కవలా ఇమ రేజిరే॥
(శ్రీవర రాజతరంగిణి, 155)

ఆకలిగొన్న యముడికి ఆహారంగా ఉన్నట్ట్లు, తెగిన వీరుల తలలు  భూమి అనే పాత్రలో ఉన్నాయి. యుద్ధ రంగంలో తెగి పడిన వీరుల తలలు ఆకలిగొన్న యముడి ఆహారంగా ఉన్నాయట.

శ్రీవరుడి వర్ణనౌచిత్యానికి ఆశ్చర్యపోకుండా ఉండలేము. సాధారణంగా మరణాన్ని ఎవరూ సంబరంలా జరుపుకోరు. కానీ వీరుల మరణానికి ఎవరూ దుఃఖించరు. వీరులు వీరస్వర్గానికి వెళ్లారని సంతోషిస్తారు. రాజు కోసం వారు చేసిన ప్రాణత్యాగాన్ని తలచుకుని గర్విస్తారు. అందుకే శ్రీవరుడు ఇక్కడ యముడికి ఆహారంలా ఉన్నాయి వారి తలలు అంటున్నాడు. యముడు మరణ దేవత. జరుగుతున్నది రణయజ్ఞం. ఇందులో హవిస్సులు ప్రాణాలు. అందుకే యముడికి ఆహారం తెగిపడిన వారి తలలు.

రణతూర్యస్వనై స్తై స్తౌ ర్జన కోలాహలై స్తథా।
వీరాణం సింహనాధైశ్చ శబ్దాద్ధై తమజాయత్॥
(శ్రీవర రాజతరంగిణి, 156)

తూర్యారావాలతో,  సైనికుల కోలాహలంతో, వీరుల సింహనాదాలతో, గతంలో ఎన్నడూ విననటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. యుద్ధ రంగ శబ్దాలను వినిపిస్తున్నాడు శ్రీవరుడు.

తచ్ఛుద్దయే ఋణమివైశ్య నృపప్రసాదం
ప్రాప్తే క్షణే జహతి యే నిజజీవితాశామ్।
తత్తద్దిహస్త పరిరక్షధర్మలుబ్ధా
ధన్యస్త ఏవ కతి చిన్నుపసేవకేభ్యః॥
(శ్రీవర రాజతరంగిణి, 157)

గతంలో రాజు ద్వారా పొందిన అనేక లాభాలు, బహుమానాలు దృష్టిలో ఉంచుకుని, తమ ప్రాణత్యాగం ద్వారా, సామాన్య జన పరిరక్షణ అనే ధర్మం కోసం పోరాడటం ద్వారా తమ రాజు ఋణం తీర్చుకుని వారు శాశ్వత కీర్తి పొందుతారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here