మహతి-69

11
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[కారు విజయవాడ చేరుతుంది. గౌతమ్ బెంజ్ సర్కిల్ దగ్గర దిగిపోతాడు. వెళ్ళేముందు వెళ్ళొస్తానని ఇందిరకి చెప్పి వెళ్తాడు. దగ్గరలో ఉన్న ఓ హోటల్‍లో టిఫిన్ తిని, కాఫీ తాగుతారు. కారు బయల్దేరుతుంది. మహతి తమ పరిస్థితిని అంచనా వేసుకుంటుంది. అమ్మ, తాతయ్యలు ఎలా స్పందిస్తారో అనుకుంటుంది. ప్రయాణం కొనసాగుతుంది. గౌతమ్ ఇంటికి వెళ్ళి – ఇందిరని మహి కర్రావూరి ఉప్పలపాడు తీసుకువెళ్ళింది – అని భార్యతో చెప్పి బాత్‌రూమ్‍కి వెళ్తాడు. భర్త కోసం, పిల్లల కోసం పూరీ కూర, ఉప్మా చేస్తుంది అహల్య. భర్త ప్రవర్తనని గమనిస్తూ ఉంటుంది. గౌతమ్ టిఫిన్ తినేసి వెళ్ళి నిద్రపోతాడు. నాన్న ఏదోలా ఉన్నారు కదమ్మా అంటుంది చిన్న కూతురు కల్యాణి. అదేం లేదు, అలసిపోయారంతే అని చెప్తుంది అహల్య. అహల్యలో ఎడతెగని ఆలోచనలు! మహతి రాసిన కవితలను గుర్తు చేసుకుంటుంది అహల్య. ఊరు చేరిన మహతి, ఇందిరని తాతయ్యకి పరిచయం చేస్తుంది. ఆయన, డా. శ్రీధర్, డా. శారదా – ఇందిరని ఆహ్వానిస్తారు. స్నానం చేసొస్తే టిఫిన్లు రెడీ చేస్తాను అని త్రిపుర చెప్తే, ఆవిడ దగ్గరకు వెళ్ళి హత్తుకుని దారిలో తినివచ్చాం అని చెప్తుంది మహతి. మరో గది ఏర్పాటు చేసే వరకూ తన గదిలో విశ్రాంతి తీసుకోమని ఇందిరని మంచం మీద పడుకోబెట్టి, రిపోర్టులన్నీ తీసుకుని శ్రీధర్ వద్దకు వస్తుంది. తనూ, శారదా రిపోర్టులను స్టడీ చేస్తామనీ, ప్రస్తుతానికే మందులు వద్దనీ, తర్వాత నిర్ణయిద్దాం ఏవి వాడాలో అని అంటాడాయన. తాతయ్య దగ్గరకి వెళ్తుంది మహి. ఏదో చెప్పబోతుంటే, తనకి తెలుసనీ, గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడనీ అంటాడు తాతయ్య. డ్రైవర్‍కి స్నానానికి, నిద్రకీ ఏర్పాటు చేస్తుంది మహి. తన గదికి వెళ్ళి చేస్తూ, ఇందిర మేలుకునే ఉంటుంది. ఆమెకు భరోసా ఇస్తుంది మహి. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-16

అల:

శరవేగంతో షూటింగ్ నడుస్తోంది. నా ఇంగ్లీషు ప్రాక్టీసూ, డాన్సు ప్రాక్టీసు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. హిందీ పాటలని చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాను. తద్వారా తెలుగు పాటల మాధుర్యాన్ని కూడా రుచి చూడగలుగుతున్నాను. కవితలు రాస్తున్నాను. గంట సేవు ఉపన్యాసం చెప్పాల్సిన విషయాన్ని ఒక చిన్న కవితలో చెప్పొచ్చు.

నా కవితల్ని విని బాగున్నాయో లేవో చెప్పడానికి ‘సరోజ్’ (డాన్సర్) ఉంది గదా. ఓ చిన్న ఇన్సిడెంటు జరిగింది. ఓ చెప్పుల జత కంటబడింది. అర్జంటుగా కవిత రాశాను. ఈ వ్రాయడం అనేది కళా, కాదా తెలీదు గానీ- ఖచ్చితంగా ఇది మాత్రం ఓ విడువలేని వ్యసనం. బుర్రలోకి వచ్చిన ఆలోచన అక్షర మయ్యేంత వరకూ మనసుని హింస పెడుతూనే ఉంటుంది.

ఇంతకీ ఆ కవిత ఏమంటే –

‘నీ చెప్పులు ఎక్కడంటే నాకెందుకు?
నీ పాదాలు నా మనసులో ఉండగా!
నీ తనువు ఎక్కడుంటే నాకెందుకు?
నీ రూపం నా హృదయంలో నిండివుండగా!
నీ కళ్ళు ఎటు వైపు ఉన్నా, చూపు నా మీదే ఉందిగా!
నీ చెవులు ఏమి వింటున్నా, అవి వినేది నా మౌనాన్నేగా!
నింగి పురుషుడు – నేల ప్రకృతి అంటారు
నాకు మాత్రం నింగీ నేలా రెండూ నువ్వే!
దారి గానని చీకట్లో నాకు
దారి చూపించేది నీ చిరునవ్వే!’

కవిత వినగానే సరోజ్, “భలే.. పూర్తిగా ప్రేమలో పడిపోయారు అలాజీ” అనింది.

“షటప్.. నేను అడిగింది ప్రేమ గురించి కాదు కవిత గురించి” అన్నాను.

“నేను చెబుతున్నదీ అదే మహరాణీ! మీది కేవలం ప్రేమ మాత్రమే కాదు.. నిజం చెబితే ఆత్మార్పణ. ప్రేమకి చాలా స్టేజీలు ఉన్నై. ఇది చివరి స్టేజి. దీనికి రావాలంటే అనంతమైన విరహాన్నీ, బాధనీ, దుఃఖాన్ని భరించాలి. అవేవీ లేకుండా యీ స్టేజ్‌కి చేరారంటే, మీరు జన్మతః సిద్ధులై ఉండాలి” అన్నది సరోజ్.

“నీ మొహం” అన్నాను నవ్వి.

“లేదు మేడమ్. ప్రేమ రుచి పదమూడేళ్ళప్పుడే చూశాను. ఆ తరువాత అర్థమైంది, అది ప్రేమ కాదనీ, యవ్వనం తెచ్చిన బులపాటమనీ. బొంబాయి కొచ్చాక కనీసం అయిదారుగురితో సిన్సియర్‌గా ప్రేమలో పడ్డాను. ఒకేసారి కాదనుకోండి. ఒకరికంటే ఒకరు సిన్సియర్ అని భ్రమపడ్డాను. అయితే అందరూ ఒకటేనని అనుభవం తేల్చి చెప్పింది. అలమ్మా – నిజం చెబితే అసలు ప్రేమంటే ఏమిటో నాకు తెలీదని ఇప్పుడు తెలుస్తోంది. ఆశించేది ఏనాడూ ప్రేమ కాదు. ప్రేమించడం అనేది ఓ సహజ ప్రక్రియ. దానికి కారణాలు ఉండవు. అవి ప్రతిఫలాన్ని కోరుకోవు” ఓ క్షణం ఆగింది సరోజ్. ఆమె మొహంలో ఓ దిగులు కనబడింది.

“చెట్టు నీడని ఇస్తుంది.. తాను ఎండలో ఉంటూ. ప్రతిఫలం కోరుతుందా? మేఘం అంతెత్తునుంచి తనని తాను ముక్కులుగా పగలగొట్టుకుని నేల మీదకి కురిసి ప్రకృతి దాహాన్ని తీరుస్తుంది. అదేనాడైనా ప్రతిఫలాన్ని కోరిందా? ఈ విశ్వంలో ప్రతి క్షణమూ కోటానుకోట్ల జీవులు మరణ భయాన్ని లెక్కచెయ్యకుండా బిడ్డలకి జన్మ నిస్తునాయి. అవేనాడైనా ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకుని కంటున్నాయా? అలాగే, ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదు. ఆశిస్తే అది ప్రేమ కానే కాదు!” అన్నది సరోజ్.

“నువ్వేం చదివావు సరోజ్?” తన చెయ్యి పట్టుకుని అడిగాను,

“హార్డ్ వరల్డ్ యానివర్సిటీలో పి.హెచ్.డి.” నవ్వుతూ అన్నది (కఠినమైన లోకమనే విశ్వవిద్యాలయంలో PHD).

నేనూ పకపకా నవ్వేసి అన్నాను “సరోజ్ నువ్వు చాలా మంచిదానివి” అని.

ఈ చిత్ర లోకంలో అందరూ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ల ప్రాపు కోసం పాకులాడుతారు. సరోజ్‌లో ఆ గుణం లేశమంతైనా లేదు.

“మంచిదాన్నో కాదో నాకు తెలీదు కానీ, ఒకటి మాత్రం చెప్పగలను. మీరు ప్రేమిస్తున్నది ‘వ్యక్తి’ని కాదు, ‘వ్యక్తిత్వాన్ని’. ఆ విషయం ఆ వ్యక్తికి తెలియాలంటే, మీలాగా సిద్ధి పొందిన వాడై ఉండాలి” అంది. నేను నవ్వి ఊరుకున్నాను.

ఎందుకంటే నా ప్రేమ ఇప్పటి వరకూ నా దగ్గరే భద్రంగా ఉంది. ఎవరికి తెలియజెయ్యలో వారికి తెలిపే ప్రయత్నం నేను చేస్తే గదా వాళ్ళకి తెలిసేది!

“మీది గుంటూరు దగ్గర ఊరు అన్నావు గదా.. ఏ ఊరు?” అనడిగాను.. సబ్జెక్టు మారుస్తూ.

“అదో ఊరు. అంతే. అలాజీ, నేను గొప్పదాన్నై ఊరికి పేరు తెస్తే, ఊరు పేరు చెప్పుకోవచ్చు. పదమూడవ ఏటనే లేచిపోయి ఊరికీ కుటుంబానికీ తలవంపులు తెచ్చినదాన్ని, ఊరు పేరు ఏ నోటితో చెప్పమంటారు?” దిగులుగా అన్నది.

“పేరెందుకు తేలేవూ? రేపు గొప్ప డాన్స్ డైరక్టర్‌వి అవుతావు.. అది గొప్ప కాదా?” అన్నాను.

“అవ్వాలిగా?” అన్నది విరక్తిగా నవ్వి.

“నీ పేరే ఉన్న సరాజ్ ఖాన్ అనే డాన్స్ డైరక్టర్ గురించి నీకు తెలియదా? మాధురీ దీక్షిత్, శ్రీదేవీ, వీరందరి  కన్నా ముందు సాధన వంటి వారికి డాన్సు నేర్పి హిమాలయాల కెక్కించిందిగా. ఆ పట్టుదల నీలోనూ ఉందిగా!” అన్నాను.

“అప్పట్లో సాధన ఆవిడకి పుల్ సపోర్టుగా నిలబడింది” అంటుండగానే నేను కల్పించుకుని, “నేను నీకు ఫుల్ సపోర్టుగా నిలబడతాను. ఇది నా మొదటి సినిమా హిందీలో. అందుకే కొంచెం టైమ్ పట్టవచ్చు. కానీ సరోజ్ నీకు తోడుగా నేనుంటాను” అన్నాను.

‘To be emotional is to be foolish’ అంటారు పెద్దలు. ఆ క్షణం ఆ మాట నా నోట్లోంచి ఎందుకు వచ్చిందో నాకే తెలీదు. సరోజ్ కూడా ఎమోషనల్ అయి నా రెండూ చేతులూ పట్టుకుంది. సరోజ్ కళ్ళల్లోకి చెమ్మ. ఏమైతేనేం ఒక మాట ఇవ్వబడింది.

గురు దత్, దేవ్ ఆనంద్‌ల మధ్య కూడా ఇలాంటి మాటే నడిచింది. “దేవ్. నేను డైరెక్టర్ని అయితే నువ్వే నా హీరోవి” అన్నాడు గురు దత్. “నేను ప్రొడ్యూసర్‍ని అయితే నువ్వే నా డైరెక్టర్‍వి” అన్నాడు దేవ్ ఆనంద్. ఆ మాట నిజమైంది. అద్భుతమైన సినిమాలు వారి కాంబినేషన్‌లో వచ్చాయి. ‘నవకేతన్’ సంస్థకి మొదటి డైరక్టర్ చేతన్ ఆనంద్ (దేవ్ ఆనంద్ పెద్దన్న) అయితే 1951లో వచ్చిన ‘బాజీ’ సినిమాని గురు దత్ డైరక్ట్ చేశాడు. అలాగే గురు దత్ నిర్మించిన C.I.D సినిమాలో దేవ్ ఆనంద్ నటించాడు. ఆ పిక్చరూ అద్భుతంగా ఆడింది. డైరక్టర్ రాజ్ ఖోస్లా.

ఆ పాటలు ఇవ్వటికీ అజరామరాలు. ఒక మాట, ఒక కల సాకారమైంది అలా. మరి నేనిచ్చిన మాట? కాలం చెప్పాలి.

“ఏమిటి సీరియస్‍గా ఉంది వాతావరణం?” నవ్వుతూ వచ్చి అడిగింది నైనా మెహతా. ఆవిడే నాకు ఇంగ్లీషు నేర్పుతోంది. సెకెండ్ హీరోయిన్. నాకంటే వయసులో ఆరేడేళ్ళు పెద్దది. అయినా శరీరాన్ని చక్కగా మెయిన్‌టెయిన్ చేస్తుంది.

సరోజ్ నవ్వి, “నైనాజీ.. అలాజీ మంచి కవయిత్రి. గొప్ప కవిత వ్రాశారు” అన్నది.

“ఓహ్. భాష తెలీదు కదా” అన్నది నైనా.

“ట్రాన్స్‌లేట్ నేను చేస్తాగా?” అని line by line చెప్పించుకుంటూ, అక్కడికక్కడే హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేసి వినిపించింది సరోజ్.

“వావ్. అద్భుతం అలా.. సరోజ్, అల ఎంత బాగా వ్రాసింది, ఇప్పటికిప్పుడు చేసిన నీ ట్రాన్స్‌లేషన్ అంతే బాగుంది. నువ్వు శ్రద్ధ పెడితే చాలా గొప్ప అనువాదకురాలివి అవుతావు. నిజం చెబుతున్నా.. మీ కాంబినేషన్ ఫెంటాస్టిక్” అన్నది నైనా.

“యస్.. నేనూ విన్నాను. కవయిత్రిగా అల రాణిస్తే, ట్రాన్స్‌లేటర్‍గా సరోజ్ అద్భుతంగా రాణిస్తుంది. సరోజ్, నువ్వు ఇప్పటిదాకా నార్త్ ఇండియన్‌వో, మహారాష్ట్రయిన్‌వో అనుకుంటున్నా. తెలుగు భాష నీకు ఇంత ఫ్లూయెంట్‌గా వస్తుందనీ, ఇంత బాగా హిందీలోకి మార్చి చెబుతావనీ కల్లో కూడా ఊహించలా” సరోజ్‍కి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నది తరుణీ కిద్వాయ్.

“మేడం.. నా ప్రజ్ఞ ఏమీ లేదు. మూల కవితలో వున్న భావాల్ని మాత్రమే నేను చెప్పింది. ఆ క్రెడిట్ అల మేడమ్‌దే. ఇక తెలుగంటారా, అది నా మాతృభాష. అన్నం పెట్టి ఆదరించిన పితృభాష మరాఠీ. అయితే చేయి పట్టుకొని నన్ను నిలబెట్టిన భగవంతుడి భాష నాట్యం. మిగతా భాషలు నా భాతృ భాషలు” అన్నది సరోజ్ కొంచెం సిగ్గుపడుతూ.

“నేనో పని చేస్తాను సరోజ్, అమిత్ గారితో చెప్పి..” అంటుండగానే,

“ప్లీజ్ మేడమ్, ఆ పని చెయ్యొద్దు. ఈ చిత్ర పరిశ్రమ చాలా చిత్రమైనది. నేనేది చేసినా ఎంత పైకొచ్చినా డాన్స్ లోనే రావాలి. ఒక్కసారి వృత్తి మారితే మళ్ళీ ఏ డాన్సు మాస్టరూ నన్ను చేరనివ్వడు. అంతెందుకూ, ఓ సింగర్ సరదాకి మ్యూజిక్ చేసినా మిగతా వాళ్ళు అతనికి పాడే ఛాన్సులు ఇవ్వరు. అందువల్ల దయచేసి నన్ను డైరెక్షన్ డిపార్డ్‌మెంట్‌లో చేర్చవద్దు” అన్నది సరోగ్ గబగబా.

“పోనీ మరో పాట మిగిలి ఉందిగా. దానికి డాన్స్ డైరక్టర్‍గా నియమిస్తే?” అన్నది నైనా.

“పొరపాటున కూడా వద్దు మేడమ్. నేను మీ దగ్గర ప్రాపకం సంపాదించి డాన్స్ డైరెక్టర్‍ని అయ్యానంటారు. ఒక్కసారి డాన్స్ డైరెక్టర్‌గా తెర మీదకి పేరొచ్చాకా ఇంకెవరూ నన్ను డాన్సర్‌గా పిలవరు!!” నిట్టూర్చి అన్నది సరోజ్.

“Yes.. I can understand” అన్నది తరుణి.

మెల్లగా తల పంకించింది నైనా.

సాయంత్రానికల్లా నా కవిత్వం యూనిట్‌కంతా చేరింది. కవయిత్రిగా నా పేరూ, అనువాదకురాలిగా సరోజ్ పేరూ అరచేతి మందాన పేరుకుపోయాయి. కొంతమందయితే నా పాత కవితల్ని కూడా వినిపించమన్నారు. మళ్ళీ ఓసారి క్షుణ్ణంగా విని “ఈ భావం, భావంలోని ఉద్విగ్నతా నాకు అద్భుతంగా నచ్చాయి అలా.. ఓహ్! ఆ చెప్పులు నావైతే ఎంత అదృష్టం” అన్నాడు వినోద్. అమిత్ పకపకా నవ్వాడు.

“వినోద్.. చాలా తెలివిగా వ్రాసిన కవిత ఇది. ఓ భగవంతుడా, నువ్వెక్కడుంటే నాకెందుకూ, నీ పాదాలు నా మనసులో నిరంతరంగా ఉండాలి. నీ విగ్రహం ఎక్కడుంటే నాకెందుకు – నీ రూపం నా హృదయంలో ఉండాలి. నీ కళ్ళు ఎటు చూస్తే నాకెందుకూ? చూపు మాత్రం నా వైపు ఉండాలి. నీ చెవులు ఏమి వింటే నాకెందుకూ, నా మౌన భాషని నిరంతరం నువ్వు వినాలి. అంటే నా ప్రార్థనని నిరంతరం వినాలి. నింగి ఆకాశం, నేల ప్రకృతి అంటారు. కానీ  ఆ నింగీ నేలా సర్వస్వాన్నీ ఆక్రమించింది నువ్వేగా.. అందువలన నువ్వే నా సర్వస్వం. చీకటిలో నేనున్నప్పుడు చిరునవ్వుతో దారి చూపించేదీ నీవే – అనే అర్థం ఇందులో ప్రస్ఫుటంగా ఉంది. అయ్యా, అవి అలగారు మనసులో తలచుకున్న వేంకటేశ్వరుని పాదాలో, శ్రీరాముని పాదాలో, కనకదుర్గ పాదాలో తప్ప నీవో నావో మరొకరివో కాదు” అన్నాడు.

“ఓష్ ఆ కోణం కూడా ఉందా! నేనసలు ఆలోచించనే లేదే” అన్నారు ఆశ్చర్యంగా నైనా, తరుణీ, సరోజ్ కూడా.

“కవితలోని మర్మమే అది. ఎవరు ఎలా అన్వయించుకుంటే అలా మనకి సాక్షాత్కరిస్తుంది.”

“ఉదాహరణకి మన్నా డే పాడిన ‘లాగా చున్‌రీ మే దాగ్’ పాట ఉంది. సంగీతం రోషన్. సాహిర్ లుధియాన్వీ వ్రాసిన పాట అది. సినిమాల హీరో మారువేషం వేసుకొని పాడే పాట. కానీ అటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక, వేదాంతపరమైన పాట మరోకటి లేదు. చిత్రం ఏమంటే, ప్రేమ పాటలన్నీ కూడా భక్తి దృష్టితో చూస్తే భక్తితత్త్వంతో నిండి ఉంటాయి. అందుకేనేమో, ప్రేమ-భక్తి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి” అన్నాడు అమిత్ సక్సేనా.

“‘తూ గంగా కీ మౌజ్, మై జమునా కీ ధారా’ పాట కూడా అంతేగా. ప్రేయసీ ప్రియుల మధ్య పాటే కానీ నాకు అందులో ప్రేయసి భక్తురాలిగా, ప్రియుడు భగవంతుడిగా కనిపిస్తారు” అన్నారు కమల్‌జీత్.

మొత్తానికి ఆ పాట ఆ రోజు అన్ని నోట్లోనూ ఆడింది. ప్లేయర్ తెప్పించి మరీ ఆ రెండు పాటలూ చూశా. ఓ చిన్న కవిత రెండు గొప్ప పాటల్ని చూసే అదృష్టాన్ని ప్రసాదించింది.

ప్రతి భాషకీ తనదనే ఓ మాధుర్యం ఉంటుంది. ఆ మాధుర్యం చవి చూశాక గానీ ఆ భాష మీద మక్కువ పెరగడు. హిందీ భాష మాధుర్యాన్ని చూశాక అనిపించింది, దీన్ని మరింత సాధించాలని.

“నా స్నేహితుడు పాదచారి ఓ చిన్న కవిత వ్రాశాడు. వినిపిస్తా” అని ఆ కవితని వినిపించాను నేను. నిజానికి అది రాసింది పాదచారే.

‘అతడు
వచ్చాడు
వెళ్ళాడు
నేలా నింగీ
మౌనంగానే ఉన్నాయి.’

అని వినిపించాను.

“ఓహ్.. ఇది కవితా?” నవ్వింది నైనా మెహతా, సెకండ్ హీరోయిన్.

“ప్రతిదాని వెనకా ఓ అర్థం ఉంటుంది. తెలుసుకోవాలి అంతే!” అన్నది నందినీ సొల్గాంకర్ (ఈ సినిమాలో ఆమెది నా తల్లి పాత్ర).

“ఉంది.. చిలికితే చాలా అర్థం ఉంది. ‘అతను వచ్చాడు’ అనగానే బోలెడు ప్రశ్నలు – ఎలా వచ్చాడు? ఎక్కడ నించి వచ్చాడు? ఏ కులం వాడు? ఏ మతం వాడు? సోషల్ స్టేటస్ ఏమిటీ? బీదా గొప్పా? చదువుకున్నవాడా లేదా? అతనికి కుటుంబం అనేది ఉన్నదా, లేదా? ఎట్సెట్రా ఎట్సెట్రా లక్షా తొంభై ప్రశ్నలున్నై. అలాగే ‘అతను వెళ్ళాడు’ అనగానే – ఎవరితో వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? కూడా ఏం తీసుకువెళ్ళాడు? ఎట్సెట్రా ఎట్సెట్రా! రాకకీ, పోకకీ మధ్యలో ఏం చేశాడు? ఆ మధ్య నుండే వ్యవహారం తేల్చాలంటే లక్షా తొంభై ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. అవి అతని సాంఘిక, సామాజిక, సాంకేతిక, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల మీద ఆధరపడతాయి. ఇంక మొత్తం సంఘ నిర్మాణమంతా పరిశీలించాలి. సరేనయ్య వచ్చాడు, వెళ్ళాడు, మరి నింగీ నేలా మౌనంగా ఎందుకున్నాయీ? ఎవరు లోకానికి వచ్చినా, వచ్చి చచ్చిపోయి వెళ్ళినా నింగీ నేలా ఎప్పుడైనా మాట్లాడాయా? ఎవరి పుట్టుకనైనా అవి స్వాగతించాయా? ఎవరి మరణానికైనా చింతించి గగ్గోలు పెట్టాయా? అంటే, ఒక మానవుడు అది మీరైనా నేనైనా ఏమీ తెలియకుండా ఏమి లేకుండా ఈ లోకానికి వస్తాము. ఏమీ తీసుకోకుండా అన్నీ ఇక్కడే వదిలేసి ఆఖరికి శరీరాన్ని, పేరుని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మన రాకతో, పోకతో లోకానికి సంబంధం లేదు. ఎందుకంటే మన పుట్టుకకీ, మృత్యువుకీ కారణం లోకం కాదు. కనుక నాయనా, అదేదో తెలుసుకో అని నర్మగర్భంగా చెప్పడమే ఆ చిన్న కవిత సారాంశం” అన్నాడు అమిత్ సక్సేనా.

“వావ్.. శభాష్. రాసిననాడు దేనికి రాసినా, మీ ఇంటర్‌ప్రిటేషన్ చాలా బాగుంది” చప్పట్లు చరిచి అన్నది నైనా.

“100%” అన్నాడు వినోద్.

“వెరీ వెరీ సెన్సిబుల్” అన్నది నందినీ సొల్గాంకర్. తరుణి ఆలోచిస్తూ ఉండిపోయింది.

“మనసులోని భావాన్ని వ్యక్తీకరించడమే కదా భాష లక్ష్యం! భాష లేనిది సాహిత్యం లేదు. అందుకే మనసుకి సన్నిహితంగా ఉండేదే సాహిత్యం. ప్రక్రియలు ఎన్ని వున్నా- లక్ష్యం మాత్రం హృదయాన్ని తాకడం” అన్నారు కమల్‌జీత్ సింగ్.

“అందుకే సాహిత్యకారులను దేశ కాల పరిస్థితులు బంధించవు. వారు నివసించేది ప్రజల హృదయాల్లో” అన్నది నైనా.

“యస్. కళాకారుడికీ, సాహితీవేత్తకీ ఉండే సారూప్యం అద్భుతం. ప్రతి కళ లోనూ సాహిత్యమే ఉంది అంతర్లీనంగా!” అన్నది నందిని.

మాంఛి వేడి వేడి టీలూ, వేడి వేడి సమోసాలూ, వాటి వెంట చెలికత్తెల్లా టమాటా చెట్నీ, కెచప్ వగైరాలు వచ్చాయి. అందరం బ్రహ్మాండంగా వాటికి ‘గౌరవం’ ఇచ్చాం.

“ఏమైనా నువ్వు రాస్తూనే ఉండు అలా. నేను నీకు  ఫేన్ అయిపోయా” అన్నాడు వినోద్.

“నేను కూడా” అన్నాడు అమిత్.

“దానికేం.. మీరు నా నుంచి వద్దురా బాబోయ్ అని పారిపోయే దాకా రాస్తూనే ఉంటాను. ఏక్ నహీఁ దోనో హాత్ సే” అన్నాను.

“అమ్మాయ్. ఉప్పు తగినంతే వాడాలి” నవ్వుతూ అన్నాడు అమిత్.

అందరూ నవ్వారు.

ఆ తరువాత సీరియస్‌గా రెండు గంటలపాటు షూటింగ్ జరిగింది. కానీ, అందరం మహోత్సాహంగా పాల్గొన్నాం. సాహిత్యం అనేది మనసుకి అంత సన్నిహితంగా వస్తుందని ఆనాడు తెలిసింది.

జరిగినది మొత్తం మహికి ఉత్తరంలో వ్రాయాలని అనిపించింది. అది గనక ఇక్కడే ఉంటే మా సంభాషణకి చాలా సంతోషించేది. అంతే కాదు, పాలు పంచుకునేది.

“అలా జీ.. మీరంటే వినోద్ గారికి చాలా ప్రేమ, ఆరాధన అనుకుంటున్నాను. మీవైపు చూసినప్పుడల్లా అతని కళ్ళల్లో ఓ మెరుపు కనిపించింది” షాట్ గాప్‌లో గుసగుసగా నాతో అన్నది సరోజ్.

“Is it?” అన్నాను అంతే. కావాలనే ఇంట్రస్ట్ చూపలేదు. కావాలనే సంభాషణ పొడిగించే ప్రయత్నం చెయ్యలేదు.

సరోజ్ చిన్నగా నవ్వి, “మొన్న ఇక్కడ చెప్పులు మర్చిపోయి షూస్‌తో వెళ్ళిపోయారు వినోద్. అవి ఇంకా అక్కడే ఉన్నాయి” అని కూడా అన్నది.

“ఓహ్.. చెప్పులు మర్చిపోయాడా!” ఆశ్చర్యంగా అన్నాను.

“మీకు తెలీదా? చూడలేదా?” ఆశ్చర్యపడటం ఇప్పుడు సరోజ్ వంతైంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here