దేశభక్తి కథలు – పుస్తక పరిచయం

0
4

[dropcap]సం[/dropcap]చిక – సాహితి సంయుక్త ప్రచురణగా స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆవిష్కృతమైంది “దేశభక్తి కథలు” పుస్తకం. ఇందులో ప్రాచీన భారతం, మధ్య భారతం, స్వతంత్ర పోరాట భారతం, సైనిక భారతం, సాంఘిక భారతం, ఆధునిక భారతం అనే విభాగాలలో మొత్తం 35 కథలున్నాయి.

***

“తెలుగు కథా ప్రపంచంలో పలు విభిన్నమైన సంకలనాలున్నాయి. ప్రాంతీయ సంకలనాలున్నాయి. వృత్తిపరమైన సంకలనాలున్నాయి. మైనారిటీ కథల సంకలనాలున్నాయి. దళిత కథల సంకలనాలున్నాయి. కానీ దేశభక్తి కథల సంకలనాలు లేవు. బాలల కోసం దేశభక్తుల గురించిన వివరాల సంకలనాలు, త్యాగధనుల కథల సంకలనాలు ఉన్నాయి కానీ ‘దేశభక్తి’ కథల సంకలనాలు లేవు.

ఏది దేశహితం, ఏది దేశానికి ప్రమాదకరం అన్న విషయంలో స్పష్టమైన అవగాహన లేక దేశద్రోహం, దేశభక్తి అన్నపదాల అర్థాలు మసకబారిపోవడం కనిపిస్తోంది. అలాగే, భారత జాతీయ జెండాను గౌరవించమని నేర్పించాల్సి రావడం, గౌరవించడం ఒక వివాదాస్పదమైన అంశం అవటం కూడా ‘దేశభక్తి అంటే ఏమిటో అన్న సందేహాన్ని లేవనెత్తుతోంది. ‘జాతీయగీతాన్ని’ గౌరవించడమూ వాద ప్రతివాదాలమయం కావటం ‘దేశభక్తి’ అన్న పదం అర్ధాన్ని నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందన్న భావనకు బలం ఇచ్చింది.

దీనికితోడు, అటు సాహిత్య ప్రపంచంలోనే కాక విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులతో కలసి ముచ్చటించిన సందర్భాలలో దేశం, దేశభక్తి అన్నపదాల గురించి కనిపించిన అజ్ఞానం, సందేహాలు దేశభక్తి అన్నపదం అర్థాన్ని నిర్ణయించి, నిర్వచించి, చర్చించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేసింది. ఫలితంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో కథా రచయితలు ‘దేశభక్తి’ అన్నదాన్ని ఏ రకంగా అర్థం చేసుకున్నారు? ఏ రీతిలో తమ కథలలో ప్రదర్శించారు? అన్న విషయం పరిశీలిస్తే, అలాంటి కథలను ఒక సంకలనంగా ప్రచురిస్తే, ఈ కథల ఆధారంగా జరిగే చర్చల వల్ల దేశభక్తి విషయంలో నెలకొని ఉన్న సందేహాలకు సమాధానం అందే దిశ లభిస్తుందనిపించింది. ఈ విషయంలో ఉన్న సందిగ్ధం తొలగుతుందేమోననిపించింది. ఫలితంగా దేశభక్తి కథల సంకలనం ప్రచురించాలన్న ఆలోచన రూపు దిద్దుకుంది.

ఈ సంకలనంలోని కథలన్నీ దేశభక్తి భావనను అంతర్లీనంగా పలు విభిన్నమైన కోణాలలో ప్రదర్శిస్తాయి. ఈ కథలు దేశభక్తి భావన పరిణామ క్రమాన్ని ఆయా సమయాలలో దేశభక్తి భావన ఆధారంగా సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితుల ఆధారంగా మారుతున్న దేశభక్తి భావనను ప్రదర్శిస్తాయి.

దేశభక్తి భావన అంటే ఇతర దేశాలలో లేని సందిగ్ధం భారతదేశంలో నెలకొని ఉంది. ఆ సందిగ్గాన్ని తొలగించి సమన్వయం సాధించేందుకు సాహిత్యం ద్వారా సమాధానాలు అన్వేషించేందుకు ఇదొక ప్రయత్నం, మేము ఇచ్చుకున్న నిర్వచనమే సరైనదనీ ఇవే దేశభక్తి కథలనీ మాకు ఎలాంటి అపోహాలు లేవు. మేము నిర్ణయించుకున్న పరిధిలో, మాకు ఉన్న సమయంలో, మా దృష్టికి వచ్చిన కథలలో దేశభక్తి భావన గురించిన ఉత్సాహాన్ని రేకెత్తించి, చర్చకు ప్రేరణనిచ్చే కథలుగా భావించిన వాటిని ఈ సంకలనంలో చేర్చాము” అని ముందుమాటలో సంపాదకులు పేర్కొన్నారు.

***

 

దేశభక్తి కథలు

సంచిక – సాహితి ప్రచురణ

పేజీలు: 264

వెల: 150/-

ప్రతులకు:

సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643

ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here