వడపళని – తిరువళ్ళూరు – తిరుత్తణి ఆలయ దర్శనం

0
3

[ఇటీవల వడపళని, తిరువళ్ళూరు, తిరుత్తణి క్షేత్రాలను సందర్శించి ఆ అనుభవాలను పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]29[/dropcap] ఆగస్టు 2024 న చెన్నై నగరంలో రెండు సాహిత్య సభలకు నా మిత్రుడు డా. జెట్టి యల్లమందతో కలిసి హాజరైనాను. ఒకటి, దాదాపు 75 సంవత్సరాల చరిత్ర గల హిందూ కళాశాలలో, మాతృభాషా దినోత్సవ సందర్భంగా. నేను ముఖ్య అతిథిని, మా మిత్రుడు వక్త. నేను కీలకోపన్యాసం చేశాను. అక్కడ నుంచి మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా ఆవరణలోని రజతోత్సవ ఆడిటోరియంలో, తెలుగుశాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌లో ఇద్దరం, నేను ఆంగ్లంలో, మిత్రుడు తెలుగులో పత్రసమర్పణ చేశాము.

ఎక్కడికి వెళ్లినా, దగ్గర లోని పుణ్యక్షేత్రాలను వీలున్నన్ని దర్శించుకోవడం నా అలవాటు. నేను చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో సికిందరాబాద్ నుండి, యల్లమంద సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ నుంచి బయలుదేరి, 29 ఉదయం ఎగ్మూర్ స్టేషన్‌లో దిగాం. నా కంటే అరగంట ముందే చేరుకున్న నా మిత్రుడు, నా కంపార్ట్‌మెంట్ దగ్గరికే వచ్చి, నన్ను రిసీవ్ చేసుకున్నాడు.

స్టేషన్ బయట ‘టూరిస్ట్ హోమ్’ అన్న హోటల్‌లో మాకు బస ఏర్పాటయి ఉంది. స్నానాలు చేసి, తయారై, MGR చెన్నై సెంట్రల్ స్టేషనుకు వెళ్లాము. అక్కడి నుంచి అరక్కోణం వెళ్లే సబర్బన్ రైలులో హిందూ కాలేజీ చేరుకున్నాం. ఆ కాలేజీ పేరే స్టేషనుకు పెట్టారు. స్టేషన్ ఎదుటే కాలేజీ.

మదరాసు విశ్వవిద్యాలయంలో సెమినార్ 4 గంటలకు ముగిసింది. రూం చేరుకొని రిఫ్రెష్ అయి, కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ రోజు మా కార్యక్రమం, వడపళనిలోని మురుగన్ టెంపుల్ దర్శనం. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామిని మురుగన్ అంటారు. 7 గంటలకు క్రిందికి దిగి, పక్కనే ఉన్న ‘సంగీత’ రెస్టారెంట్‌లో చక్కని ఫిల్టర్ కాఫీ తాగి, గుడికి ఉబర్ బుక్ చేసుకొన్నాము.

ఎగ్మూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉందా దేవాలయం. గాలిగోపురం మీద స్వామివారి ఆయుధమైన శూలాన్ని తాపడం చేశారు. దానిని విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రింద తమిళంలో పెద్ద పెద్ద అక్షరాలు, నియాన్ లైట్ల వెలుగులో మెరిసిపోతున్నాయి.

లోపలికి ప్రవేశించే ముందు అక్కడ కొందరు గుమిగూడి ఉండటం చూశాము. టి.వి ఛానళ్ళ వారు మైకులు, కెమెరాలు పట్టుకొని ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవరో ఒక యువకుడు తమిళంలో ఏదో చెబుతున్నాడు. అతనెవరని అడిగాము ఒకతన్ని. అతడు సినిమా నటుడు విశాల్ అని చెప్పారు.

తమిళనాడు అని గుళ్ళు అన్నీ చాలా పెద్దవి. విశాలమైన ఆవరణలు. కళాత్మకమైన స్తంభాలు, శిల్పకళా శోభితమైన పైకప్పులతో అలరారుతుంటాయి. భక్తులు చాలామంది ఉన్నారు. ప్రత్యేక దర్శనం టికెట్టు 50 రూపాయలది కొని, ఆ క్యూలో వెళ్లాము. అదే అర కిలీమీటరు ఉంది.

మూలవిరాట్టు ఉన్న గర్భాలయానికి అటు ఇటు వల్లీదేవి, దేవసేనా దేవి, ఉపాలయాల్లో కొలువై ఉన్నారు. స్వామి వారు మందస్మిత వదనులై. శిఖివాహనులై, శూలధారులై, సాలంకృతులై దర్శనమిచ్చారు. గర్భాలయం ముందున్న ముఖమంటపం చాలా పురాతనమైనది. అక్కడ ఎ.సి. పెట్టారు.

ప్రక్కన ఏనుగులు లాగుతున్నట్లుగా ఉన్న ఒక రాతి రథం ఉంది. దాని మీద స్వామివారి ఉత్సవమూర్తి. దాని ముందు ఒక విశాలమైన మంటపం ఉంది. దానిపై కప్పు పై అందమైన రంగవల్లులు పెయింట్ చేశారు. ధ్వజస్తంభం ఇత్తడి తొడుగుతో మెరుస్తూంది. ఒకచోట వేడి వేడి కేసరి చిన్న విస్తరాకు దొన్నెలలో ప్రసాదం పెడుతున్నారు. దాన్ని భక్తితో స్వీకరించి, అక్కడున్న ఒక అరుగు మీద విశ్రాంతిగా కాసేపు కూర్చున్నాము.

దేవాలయాన్ని ‘వడపళని ఆండవర్ కోవిల్’ అని కూడా అంటారు. ‘వడపళని’ చెన్నైలోని ఒక ప్రాంతం పేరు. 1920లో దేవాలయాన్ని పునరుద్ధరించి, రాజగోపురాన్ని పునర్నిర్మించారు. తమిళ సినీ నటులకు ఇష్టదైవం ఈ స్వామి. మొదట్లో అన్న స్వామి నాయకర్ అన్న భక్తుడు అక్కడ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి పూజించేవాడట. 1890లో అక్కడ ఒక పూరిపాకలోనే స్వామి వెలిశాడు. భవిష్యత్తును నాయకర్ వారు చెప్పేవారట. దానిని ‘అరుళ్ వాక్కు’ అనేవారు.

రాజగోపురం మీద స్కందపురాణం లోని వివిధ సంఘటలను శిల్పాలుగా చెక్కారు. మూలవిరాట్టు, పళనిలోని విగ్రహన్ని పోలి ఉంటాడు. ఆలయంలో చొక్కనాధర్, మీనాక్షి – అమ్మన్, కాళీమాత, భైరవీ మాత, దక్షిణామూర్తి, చండికేశ్వర, అంగారక విగ్రహాలున్నాయి.

తూర్పుగోపురం కూడా పెద్దదే. అది దాదాపు 40 మీటర్ల ఎత్తుంది. దాని మీద 108 భరతనాట్య భంగిమలను ప్రదర్శిస్తున్న శిల్పాలున్నాయి. గుడి ముందు పుష్కరిణి ఉంది. మూలవిరాట్టు తన ఎడమ కాలిని కొంచెం ముందుకు పెట్టి, పాదరక్షలు ధరించి ఉంటారు.

అప్పటికి ఎనిమిదన్నర అయింది. రెండు కార్యక్రమాల వ్యవధి మాకు లోకల్ ట్రయిన్ ప్రయాణానికే సరిపోయింది. భోజనం చేసే అవకాశం దొరకలేదు. నిర్వాహకులు పెట్టిన సమోసా, టీలతోనే సరిపుచ్చుకున్నాం.

బయట ఒక ఆటో వాటిని “ఇక్కడకు దగ్గరలో మంచి శాకాహార భోజన హోటల్ ఉందా?” అని అడిగాం. “మెయిన్ రోడ్‌కు వెళ్లి ఎడం పక్కకు తిరిగితే ‘శరవణ భవన్’ ఉంది” అని చెప్పాడతడు. “ఎంత తీసుకుంటావు?” అంటే నవ్వి, “రెండు వందల మీటర్లు ఉండదు. నడిచిపొండి” అని చెప్పాడు. అతని నిజాయితీకి ముచ్చటేసింది మాకు.

‘శరవణ భవన్’ కిటకిటలాడుతోంది. రాత్రి పుట మీల్స్ ఉండదట. సరేలెమ్మని, మెనూ చూసి పుల్కాలు విత్ బట్టర్, ఆలూ గోబీ కర్రీ ఆర్డర్ చేశాము. దాని తర్వాత జీరా రైస్ విత్ రైతా! మొత్తం ఐదువందలైంది. మధ్యతరగతి మందహాసాలు చేసి బిల్లు చెల్లించాము.

రూంకి వెళ్లేముందు, రిసెప్షన్‌లో ఉన్న అతన్ని “రేపు మేము తిరువళ్లూరు, తిరుత్తణి వెళ్లి రావాలనుకుంటున్నాము. ఎవరైనా ప్రయివేట్ క్యాబ్ సర్వీస్ వారికి చెప్పి ఒక కారు ఏర్పాటు చేయగలరా?” అని అడిగాము. అతను ఎవరితో ఫోన్ చేసి మాట్లాడి రాను పోను ₹ 5200/- అవుతుందంటున్నారని చెప్పాడు. ఇదంతా వింటున్న ఒక లుంగీ ఆసామీ “మీరు తెలుంగా?” అని అడిగి, “కారు ఎందుకు వ్యర్థము, ఆయిగా లోకల్ రైలులో దా పోవచ్చును. జాస్తి అంటే 80 కిలోమీటర్లు లేదు. పొద్దున ఐతే ‘సప్తగిరి’ ఉండాది. అది తిరువళ్లూరుకు నలభై నిమిషాలు దా పోవును. మీ దగ్గర దుడ్డు అధికముగా ఉండాదా ఏమి?” అని సలహ యిచ్చాడు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపాము.

***

మర్నాడు ఉదయం ఐదున్నరకే లేచి, ఆటలో సెంట్రల్‍కు వెళ్లాం. ‘కుంభకోణం ఫిల్టర్ కాఫీ’ తాగాము. ‘సప్తగిరి’ 7వ నంబర్‍ ప్లాట్‌ఫాంపై ఉందని display చేస్తున్నారు. నాకు MGR చెన్నై సెంట్రల్ స్టేషన్ అంటే చాలా యిష్టం. ఎందుకంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టుల బెడద ఉండదు. అన్ని రైళ్ళూ అక్కడ ఆగి, వెనక్కి వెళతాయి. అది టెర్మినల్. తర్వాత సముద్రమే కదా! ఏ ప్లాట్‌ఫారానికి కావాలంటే దానికి హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు.

‘సప్తగిరి’ కిటకిట. తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ అది. జనరల్ టికెట్ తిరువళ్లూరుకు కేవలం ₹ 30/-. లోకల్ ట్రెయిన్‌కి అయితే పది రూపాయలే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎంత చవకైనదో మాకర్థమయింది. మాకు చెరో చోట సీట్లు దొరికాయి. 6.20కి బండి బయలుదేరి, 7.05కు తిరువళ్ళూరులో దింపింది. మధ్యలో అంబత్తూరులో మాత్రం అగింది.

స్టేషన్ బయట షేర్ ఆటోలున్నాయి. గుడికి వెళ్లడానికి మనిషికి ₹ 20/- అట.

తిరువళ్ళూరులో వీరరాఘవస్వామివారు వెలసి ఉన్నారు. గుడి ముందు పెద్ద పెద్ద స్తంభాలతో కూడిన ఆవరణ, దానిలో రెండు కళాత్మకమైన మంటపాలు. అవి దాటి లోపలకి ప్రవేశిస్తే కళ్ళు చెదిరి శిల్పసంపద! భక్తల రద్దీ లేదు. వీరరాఘవస్వామివారు రంగనాథ స్వామి వలె చేయి తలకింద పెట్టుకొని పవళించి ఉన్నారు సుందరమైన నల్లరాతి విగ్రహం.. అర్ధనిమీలిత నేత్రుడై యోగనిద్రలో ఉన్నాడు పరమాత్మ. వెనకవైపు చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం, ముందు ఉత్సవ మూర్తి. స్వామిని ఎంత సేపు చూసినా తనివి తీరలేదు.

బయట విశాలమైన మంటపాలు, గుర్రాలు పూన్చిన రాతి రథం దర్శనమిచ్చాయి. ప్రధాన మందిరం పక్కన జ్ఞానసరస్వతి అమ్మవారు. కానీ ఆ గుడి మూసి ఉంది.

ప్రధాన ద్వారం మూడువైపులా అందమైన నల్లరాతి నడవాలున్నాయి. చాలా పెద్ద గుడి. అంతా తిరిగి చూడడానికి అరగంట పట్టింది. అక్కడి నుంచి తిరుత్తణి 32 కిలోమీటర్లు.

ఒకాయన మాకు సలహా యిచ్చాడు. ఆయనకు హిందీ వచ్చు. “మీరు మళ్లీ స్టేషన్‍కు వెళ్లి రైలు పట్టుకోవలసిన పనిలేదు. పెట్రోలు బంకు దగ్గరకు వెళ్లండి. కోయంబేడు నుంచి తిరుపతి వెళ్ళే 291 నం సిటి బస్సులు అక్కడ ఆపుతారు. తిరుత్తణి బైపాస్‌లో దిగండి. అక్కడి నుంచి ఆటోవాడికి వంద రూయాలలిస్తే కొండ మీదకి తీసుకొని వెళతాడు. గట్టిగా ముప్పావు గంట ప్రయాణం” అని చెప్పాడు.

‘ఇదేదో బాగుందే’ అనుకున్నాం. గుడి బయట ఒక టిఫిన్ సెంటరుంది. ఇడ్లీ, వడ, పూరీ ఉన్నాయి. కాని చట్నీ. కూర లేవు! సాంబారుంది. ఇడ్లీ వడ సాంబారుతో తిన్నాం. ఆ సాంబారు రుచి అమోఘమంటే నమ్మండి. “పూరీ ఇమ్మంటారా?” అన్నాడా తమిళుడు. పూరీ కూడా సాంబారుతో తినమని ఆయన ఉద్దేశం. “వేండ” అని చెప్పాను. చూశారా? తమిళం కూడా వచ్చు నాకు!

పెట్రోలు బంకు దగ్గరే. నడుచుకుంటూ వెళ్లాం. 291 వచ్చింది. సీట్లు లేవు! డ్రైవర్ దగ్గర ఇంజన్ మీద బ్యానెట్ మీద సర్దుకొని కూర్చున్నాం. పావుగంట తర్వాత సీట్లు దొరికాయి. టికెట్ 35 రూపాయలు. గంటలోపే తిరుత్తణి బైపాస్‌‍లో దింపాడు. తమిళనాడులో టీ బాగుండదు కాఫీయే సూపర్. మళ్లీ కాఫీ తాగాము. ఒక ఆటో మాట్లాడుకున్నాము. కొండమీద వెయిట్ చేసి, దర్శనం అయింతర్వాత మళ్లీ బైపాస్‌లో దింపటానికి 400/- రూపాయలు అడిగాడు. రూ. 350/-కి ఒప్పుకున్నాడు.

తిరుత్తణి కొండ పచ్చగా చెట్లతో మెరిసిపోతూ ఉంది. ఘాట్ రోడ్ 3 కిలోమీటర్లు లోపే ఉంది. పెద్దగా మలుపులు కూడా లేవు. గుడి కొండ మీద. మళ్లీ ఎత్తయిన గుట్ట మీద ఉంది.

భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శీఘ్ర దర్శనం టికెట్ వంద రూపాయలు! ఆ క్యూలో కూడా జనం బాగానే ఉన్నారు. సుబ్రహ్మణ్యుని దర్శనానికి మాకు అరగంట పట్టింది. స్వామివారు రకరకాల పుష్పమాలలతో అలంకృతులై ఉన్నారు. దివ్యమైన అనుభూతి కలిగింది.

“హే స్వామినాథ కరుణాకర! దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణపూజితపాదపద్మ!
వల్లీసనాథ మమ దేహి! కరావలంబమ్”

అని స్కందుని ప్రార్థించాను.

పక్కన స్వామి వారి కల్యాణ మంటపంలో ఎవరిదో పెళ్లి జరుగుతూ ఉంది. కొండ వైపు నుంచి చూస్తే తిరుత్తణి పట్టణం, చుట్టూ పచ్చని పొలాలు, కొండలు కనువిందు చేశాయి. గాలిగోపురం సమున్నతంగా అంబరచుంబితంగా ఉంది. స్వామివారి ప్రసాదం కారప్పొంగలి తిన్నాము. ఆరు మురుగని మందిరాలు – ‘అరుపడైవీడు’ లో తిరుత్తణి ఒకటి. ఇది చెన్నై మెట్రోపాలిటన్ పరిధిలో ఉంది. దీనికి ‘తనిగైమలై’ అన్న పేరు కూడా ఉంది. మొదట్లో ఇది మన చిత్తూరు జిల్లాలోనే ఉండేది (1953). సర్వేపల్లి వారు పుట్టిన ఊరు ఇది.

దేవాలయ నిర్మాణం ద్రావిడ శైలి. ఈ గుడి సముద్ర మట్టానికి 700 అడుగుల పైన ఉంటుంది. మెట్ల దారి కూడ ఉంది. 365 మెట్లున్నాయి. శూరపద్మన్ అనే రాక్షసుని సంహరించిన తర్వాత కుమారస్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట. ఇంద్రుని కుమార్తె దేవయానిని స్వామి ఇక్కడే వివాహమాడారట. ఈ గుడిని పల్లవులు 9వ శతాబ్దంలో (CE) కట్టగా, తర్వాత చోళులు దీనిని పునరుద్ధరించారు.

మాకు చెన్నైకి 291 నం సిటి బస్సు (A.C.) దొరికింది. 2 గంటలకు కోయంబేడుతో దిగి, ‘సంగీత’ లో భోజనం చేసి. విశ్రాంతి తీసుకున్నాం. నేను మళ్లీ చార్మినార్‍లో, నా మిత్రుడు హౌరా మెయిల్‍లో ఎవరి ఊరికి వారు చేరుకున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here