[డా. గండ్ర లక్ష్మణ రావు రచించిన ‘అదే ఉదయం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]దే ఉదయం
కిరణాల తీవ్రతలో తేడా
తెలుపు నలుపుల కలహంలో భేదం
గాలిలో శీతోష్ణాల సిగపట్లు
అదే ఉదయం
మొగ్గలు విచ్చుకోవడంలో బెదురు
పరిమళంలో కాటు వాసన
అదే ఉదయం
ఎగిరే పక్షుల గుంపులో లెక్క తప్పింది
ఎత్తులో దిశలో గతి మారింది
అదే ఉదయం
గుడి గంట మ్రోగింది
ధ్వనిలో వణుకు
సుప్రభాతంలో తడబాటు
అల్లాహ్ అక్బర్..
ఆవాజ్ కంజోర్
అదే ఉదయం
ముంగిట ముగ్గులు ఉండీ లేనట్లు
పొయ్యిమీద పాలు పొంగు లేనట్లు
అదే ఉదయం
పసిపాప నవ్వు మొగ్గ విచ్చినట్టు
ఈ రోజంతటికీ భరోసా యిచ్చినట్టు
అనుకుంటాం గానీ
అదే ఉదయం అగుపించని భిన్నత్వం
నిన్నటి ఉదయం – నేటి ఉదయం
ఎప్పుడూ ఒకటి కాదు.