[సెప్టెంబర్ 21 గురజాడ జయంతి సందర్భంగా డా. చెంగల్వ రామలక్ష్మి గారి – ఆత్మగౌరవ ప్రతీకలు గురజాడ ‘పూర్ణమ్మ, కన్యక’లు- అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]హాకవి గురజాడ రచనల లోని స్త్రీలు ఆనాడు తమకున్న పరిమిత పరిధులలో కూడా నిస్సహాయ పరిస్థితులకు తలవంచకుండా, రాజీ పడకుండా ప్రతిఘటించి ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నవారు. స్త్రీలలో అంతటి ధీ శక్తిని, గుండె ధైర్యాన్ని దర్శించిన, తన కాలంకంటే ఎంతో ముందున్న కవి గురజాడ. అందుకే, ఆయన ‘ఆధునిక మహిళ మానవ చరిత్ర ను తిరిగి రచిస్తుంది’ అని గట్టిగా చెప్పగలిగారు. స్త్రీలలో అంతటి అభ్యుదయకరమైన మార్పు గురజాడ కోరుకున్నారు.
గురజాడ కవితా ఖండికలు పూర్ణమ్మ, కన్యక రెండూ తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోయే అద్భుతమైన కవితలు. ఈ రెండూ చదువుతుంటే కళ్ళు అశ్రుపూరితాలవుతాయి. హృదయం ద్రవిస్తుంది. అదే సమయంలో తమను తాము కాపాడుకోవటం కోసం, తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవటం కోసం ఆ స్త్రీమూర్తులు తీసుకున్న నిర్ణయం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతం అనిపిస్తుంది.
పూర్ణమ్మ మారుమూల కుగ్రామంలో పూజారింట్లో పుట్టిన పుత్తడి బొమ్మ. అందమైన ఊరు. కొండల నడుమ ఒక కోన. కోనకి నడుమ ఒక కొలను. కొలను గట్టున వెలసిన దుర్గమ్మ. ఈ కవిత చదువుతుంటే ఆ ప్రకృతి సౌందర్యం, రోజూ దుర్గ గుడికి వెళ్లి పూజించే పూర్ణమ్మ, ఆమె కుటుంబం, ఆమె బాల్య వివాహం అంతా కళ్ల ముందు మెదిలి ఒక నాటకం చూస్తున్న అనుభూతి కలుగుతుంది. గురజాడ కవిత్వంలో కవిత్వ లక్షణాలతో పాటు నాటకీయత కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
పూర్ణమ్మ దుర్గ భక్తురాలు. దుర్గ అంటే ధైర్యప్రదాత. అన్యాయంపై తిరుగుబాటుకు ప్రతీక.
ఏ ఏ ఋతువులలో పండే పళ్ళను, పూసే పువ్వులను ఆయా వేళలలో తీసుకుని వెళ్లి దుర్గను భక్తితో పూజిస్తుంది పూర్ణమ్మ.
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ను తండ్రి డబ్బుకాశపడి ముసలివాని కిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ భర్తను చూస్తూనే ఆమె ముఖంలో ఎప్పుడూ మెరిసే అందమైన నవ్వు మాయమైపోయింది. ముఖ కమలంలో కన్నుల నీరు కమ్ముకుంది. ఆటపాటలన్నీ పూర్ణమ్మ బాల్యం నుంచి తప్పుకున్నాయి. తోటి పిల్లలు ముసలి మొగుడు అని ఏడిపిస్తుంటే ఆటలు మాని దుర్గను చేరి దుఃఖించేది. ముసలి భర్త చీరలు, సొమ్ములు చాలా తెచ్చి పూర్ణమ్మను తనతో తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు అవన్నీ చూసి మురిసిపోయింది తండ్రి ఒక్కడే!
అత్తవారింటికి పంపేముందు పూర్ణమ్మను పెద్దలందరు దీవించారు. దీవెన వింటూ ఫక్కున నవ్వింది పూర్ణమ్మ. ఆ దీవెనకు అర్థం లేదు. ముక్కుపచ్చలారని చిన్నపిల్లకు, ముసలివానితో పెళ్లి చేసి సుమంగళిగా ఉండమని దీవిస్తే నవ్వకేం చేస్తుంది?
తన వారితో, పూర్ణమ్మ నలుగురు కూర్చుని నవ్వే వేళలో తనను తలచుకొమ్మంటుంది. వారి కన్నబిడ్డల్లో ఒకరికి తన పేరు పెట్టమంటుంది.
అప్పగింతలన్నీ పెట్టేస్తుంది. అంటే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది.
ఎప్పటిలాగానే పూర్ణమ్మ సాయంత్రం పువ్వులను గుచ్చి దుర్గను పూజించటానికి ఒంటరిగా వెళ్ళింది. ఇంటికి తిరిగి వెళ్లదలచుకోలేదు. ఆమె నిష్క్రమణ ఎంత భావానాత్మకంగా ఉందో! ఆవులు పెయ్యలు ఇంటికి చేరుతున్నాయి. పిట్టలు చెట్ల మీద గుమికూడుతున్నాయి. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. కొండ కోనల్లో చీకటి కమ్ముకుంటోంది. దుర్గకు మెడలో దండలు అమిరాయి. పూర్ణమ్మ మాత్రం ఇంటికి రాలేదు. ఆమె లేదు, ఇంక రాదు దుర్గలో ఐక్యమైపోయింది అన్న విషయాన్ని ఆమె కన్నుల కాంతులు కలువలను చేరాయి. ఆమె నడకల అందం హంసలను చేరింది, అంటారు గురజాడ. కలువలను చూస్తే పూర్ణమ్మ కళ్ళు గుర్తుకు రావాలి. హంసలను చూస్తే పూర్ణమ్మ అందమైన నడకలు కనిపించాలి.
తనకు ఇష్టం లేని పెళ్లిని ఇంట్లో చెప్పటానికి, ప్రతిఘటించటానికి ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో పూర్ణమ్మ పరిస్థితులకు తలవంచలేదు.
రాజీ పడలేదు. ఆత్మాహతినే ఆత్మగౌరవ మార్గంగా ఎంచుకుంది.
~
వాసవి కన్యకాపరమేశ్వరి కథ ఆధారంగా గురజాడ 1912లో కన్యక అనే ఖండికను రచించారు. కన్యకా పరమేశ్వరి కథ మౌఖిక సాహిత్యంలో ఉంది. లిఖితరూపంలో కూడా అనేకుల చేతుల మీదుగా అవతరించింది. ఈ కథలో కన్యక పురుషాహంకారానికి తలవంచకుండా ఆత్మగౌరవాన్ని నిలుపుకోవటమనే అంశం గురజాడను ఆకర్షించి ఉంటుంది.
కన్యక చెలికత్తె లతో గుడికి వెళుతుంటే రాజు ఎదురవుతాడు. దుష్ట మంత్రులతో కూడి ఆమెను చుట్టుముడతాడు. అప్పటికి తప్పించుకోవటానికి కన్యక గుడికి వెళ్లి వచ్చేవరకు తనను ముట్టవద్దని చెపుతుంది నువ్వు పట్నమేలే రాజువు. నేను శెట్టి కూతుర్ని. నిన్ను నేనెలా తప్పించుకుపోతాను? అంటుంది.
రాచరిక వ్యవస్థలో ఆడపిల్లల తండ్రులకు తమ పిల్లలను రక్షించుకునే అవకాశం లేదు. కన్యక తండ్రి పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా వివాహం చేసుకొమ్మని ప్రాధేయ పడతాడు. రాజు ఒప్పుకోడు. తక్షణం గాంధర్వ వివాహం జరగాలని కన్యకను తనకిమ్మని దౌర్జన్యం చేస్తాడు. తన దృష్టిలో పడిన ఏ స్త్రీ తప్పించుకోలేదని అంటాడు. డేగ పిట్టను పట్టుకున్న తర్వాత అది ఎంత ఏడ్చినా వదలదు. అలాగే కన్యక ఎంత మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదంటాడు. రాజు తన లోని పురుషాహంకారాన్ని అలా వ్యక్తం చేస్తాడు.
కన్నతండ్రి గాని కులం పెద్దలు గాని తనను దుష్ట రాజు బారి నుంచి రక్షించలేరని కన్యక గ్రహిస్తుంది. తనకు ఆత్మాహుతి తప్ప మార్గం లేదని గ్రహిస్తుంది. గుడిలో అగ్నిగుండంలో దూకే ముందు బుద్ధి బలం, బాహు బలం పెంచుకొమ్మని తన వారికి ప్రభోదిస్తుంది.
పెద్దలందరి సమక్షంలో రాజు ఎదురుగా ‘పట్నమేలే రాజు వైతే పట్టు నన్నిపు’దంటూ సవాలు విసిరి అగ్నిలో దూకుతుంది. ఇది రాజుకి ఊహించని ఘటన. అతని గర్వం మట్టిలో కలిసిపోయింది.
పూర్ణమ్మ, కన్యక వీరిద్దరూ తమ జీవితం మీద తమకే హక్కు అని చాటటానికే ఆత్మాహుతి మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇది పిరికితనం, నిస్సహాయత్వం కానే కాదు.. వీరు తమ ఆత్మాహుతి ద్వారా ఒక నిర్ణయాత్మక ప్రకటన చేసారు. వీరు నాటి నిస్సహాయ స్త్రీలకు ప్రతినిధులు కారు. గురజాడ ఆలోచనలలో నుంచి ప్రాణం పోసుకున్న ఆత్మగౌరవ ప్రతీకలు.