[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
టెనెంట్‌ని కరిచిన ఓనర్:
[dropcap]కొ[/dropcap]న్ని సంఘటనలు ఆశ్చర్యంగానే ఉంటాయి. అలాంటి వాటిలో ‘టెనెంట్‌ని కరచిన ఓనరుడు’ – సంఘటన ఒకటి. మేము పదకొండు అద్దె ఇళ్లు ఇప్పటి వరకు మారాము. ఒక్కో ఓనర్‌ది ఒక్కో స్టైల్. ఓనర్లు, ఓనరమ్మల్లో మంచి వాళ్లు ఉన్నట్లే అప్పుడప్పుడు పరమ గయ్యాళి వాళ్లూ తారసపడుతుంటారు. అంతే కాదు కొన్ని అద్దె ఇళ్లు మనల్ని నానా అవస్థలు పెడుతుంటాయి. ‘ఏదో దెయ్యాల కొంపలో ఉన్నామా’ అనిపిస్తుంటుంది. ఇలాంటి ముచ్చట్లు ఈ భాగంలో మీతో పంచుకుంటున్నాను.
ఆంధ్రప్రభ విజయవాడ ఆఫీస్‌లో పనిచేస్తున్న రోజులవి. రాత్రి ఏడుగంటలవుతోంది. మరో గంటలో డ్యూటీ అయిపోతుంది. నాకు అప్పగించిన పేజీ పెట్టించే పనిలో బిజీగా ఉన్నాను. ఇంతలో అటెండర్ రామారావు నా దగ్గరకు వచ్చి, ‘మీకు ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి’ – అని చెప్పాడు. పేజినేటర్‌కి తర్వాత ఐటెమ్ ఏది తీసుకోవాలో, దాన్ని పేజీలో ఏ ప్లేస్‌లో పెట్టాలో గడగడా చెప్పేసి పరుగులాంటి నడకతో న్యూస్ డెస్క్‌లో ఉన్న ఫోన్ దగ్గరకు చేరాను.
‘హలో..’
‘నేనండి, శ్రీదేవిని’
మా ఆవిడి కాల్ అది.
‘ఏంటి చెప్పు..’ నా గొంతులో ఆదుర్దా.
నా కంగారు అర్థం చేసుకున్నట్లుంది.
‘అంతా బాగానే ఉన్నాము. కాకపోతే మన ఇంటి ఓనర్ గారు టెనెంట్‌ని కొరికాడట. ఇక్కడంతా గొడవగా ఉంది. మీరు తొందరగా వచ్చేయండి.’
నాకు ఓ క్షణం అర్థం కాలేదు. ఓనర్ ఏమిటీ, టెనెంట్‌ని కొరకడమేమిటి!!
వెంటనే మా డెస్క్ ఇన్‌ఛార్జ్‌తో చెబితే,
‘ఇందులో చాలా న్యూస్ ఉందోయ్. టెనెంట్‌ని కొరికిన ఓనర్.. అబ్బో, హెడ్‌లైన్ అదిరిపోయింది. సరే, పని తొందరగా కానిచ్చుకుని వెళ్ళు. ఏమైనా సాయం కావాలంటే ఫోన్ చేయి.’ అంటూ తనలోని న్యూస్ మైండెడ్ డ్యూటీనీ, స్నేహ ధర్మాన్ని మిక్స్ చేస్తూ చెప్పుకుపోతున్నాడాయన.
నేనప్పుడు స్పోర్ట్స్ డెస్క్‌లో పనిచేస్తున్నాను. రిలీవర్ వస్తేనే కానీ డ్యూటీ మధ్యలో వెళ్ళలేని పరిస్థితి. అదృష్టం.. ఇంతలో నైట్ ఇంఛార్జ్ డ్యూటీ ఎక్కాడు. వెంటనే అతనికి నా మిగిలిన పని అప్పగించి హడావుడిగా నా టివీఎస్ మోపెడ్ స్టార్ట్ చేశాను.
నో మొబైల్ ఫోన్:
ఇంటి నుంచి ఆఫీస్‌కి పదేపదే ఫోన్‌లు చేయడం కుదరదు. ఇంకా అప్పటికి (90వ దశకం ప్రారంభం) మా ఆఫీస్ వాళ్లు నాకు ల్యాండ్‌లైన్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఆ రోజుల్లో టెలికామ్ శాఖ వారు బిగించే ల్యాండ్‌లైన్ తప్ప ఇతరత్రా ఫోన్లు లేవు. ఫ్యూచర్‌లో మొబైల్ ఫోన్లు వస్తాయన్న ఆలోచన కూడా లేదు. ఫోన్ అంటే అది ఉన్న చోటుకు మనం వెళ్ళాల్సిందే. మన వెంట తిప్పుకోవడం కుదరదు. అయితే, ల్యాండ్‌లైన్ ఫోన్‌నే కదిలే ఫోన్‌గా కొంతమంది వాడేవారు. ఆ పద్ధతి తమాషాగా ఉండేది.
పాత సినిమాల్లో జమీందార్ ఇళ్లలో ‘తీగ ఉన్న మొబైల్ ఫోన్’ వాడకం చూసి తెగ ఆశ్చర్యపోయేవాడ్ని. ఒక బంట్రోతు పెద్ద పళ్లెం లాంటి ట్రేలో ఫోన్ సెట్ పెట్టుకుని ఉంటాడు. ఆ పళ్లెంలో టెలిఫోన్ తీగ చుట్ట ఉంటుంది. యజమాని ఫోన్ రిసీవర్ తీసుకుని మాట్లాడుతూ నడుస్తుంటే బంట్రోత్ తన చేతి పళ్ళెంలోని వైర్ కట్టను లూజ్ చేస్తూ వైర్‌ని నెమ్మది నెమ్మదిగా వదిలిపెడుతుంటాడు. యజమాని అలా మాట్లాడుతూ మొదటి అంతస్తు నుంచి క్రిందకు దిగుతుంటాడు. అదే మొబైల్ ఫోన్. వైర్‌లెస్ ఫోన్లు వస్తాయని అనుకోలేదు. ఆంధ్రప్రభలో ప్రమోషన్ వచ్చినప్పుడు ఆఫీస్ వాళ్లు ఫోన్ బిల్లు కడతామన్నారు. కనెక్షన్ చార్జెస్ కూడా వాళ్లవే. అలా ఆ తర్వాత ఇంట్లోకి ల్యాండ్‌లైన్ వచ్చింది. టెలిఫోన్ శాఖ నుంచి ఓ అమ్మాయి వారానికోసారి వచ్చి ఫోన్‌సెట్‌ని శుభ్రం చేసి అందులో కాస్తంత సెంట్ వ్రాసి వెళుతుండేది. అదేదో చాలా గొప్పగా ఫీలవుతుండేవాళ్లం. ఇంట్లో ఫోన్ నాకు కొత్తేమో కానీ మా ఆవిడకు కాదు. వాళ్ల నాన్నగారు మన్నవ గిరిధర రావు గారు ఎమ్మెల్సీగా చేసిన రోజుల్లోనే వారింట్లో ల్యాండ్‌లైన్ ఉండేది. కాకపోతే ఇప్పుడు తన ఇంట్లో ఫోన్ రావడం ఆమెకూ బోలెడు ఆనందం కలిగించింది. పైగా మధ్యతరగతి ఇళ్లలో ఫోన్ సౌకర్యం ఎక్కువగా ఉండేది కాదు. అందుకే మన ఇంట్లోకి ఫోన్ వస్తుందని తెలియగానే అంతకు ముందు పరిచయం లేని వాళ్లు కూడా ఇంటికి వచ్చి పరిచయం పెంచుకునే వాళ్లు. చివర్లో – ‘ఎప్పుడన్నా మీ ఫోన్ వాడుకుంటాము, ఏమీ అనుకోకండి’ – అనో, ‘ హైదరాబాద్‌లో మా అన్నయ్య వాళ్లు ఉంటారు, ఎప్పుడైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తారు, మీ నెంబర్ ఓ మారు ఇస్తారా’ అనో మమ్మల్ని ‘వాడుకోవడం’ మొదలుపెట్టారు. మొహమాటానికి మా ఆవిడ కాదనలేకపోయేది. మొదట్లో అలా ఇవ్వడం గర్వంగా ఉన్నా, ఆ తర్వాత ఫోన్ కాల్స్ తెచ్చే కష్టాలతో విసుగుపుట్టేది. నాకు నైట్ డ్యూటీలు ఎక్కువ. రాత్రి పూట మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ రింగయ్యేది. ఇంట్లో వాళ్లకు నిద్రా భంగం. కాకపోతే, నైట్ డ్యూటీలో ఉన్న నేనేమన్నా ఆఫీస్ నుంచి ఫోన్ చేశానేమో అని మా ఆవిడ నిద్రకళ్ళతో లేచి వచ్చి రిసీవర్ ఎత్తితే, ‘పక్కింటి అనసూయమ్మ గారిని ఓ సారి పిలుస్తారా’ – అవతలి గొంతు.
చేసేది ఏమీ లేక పిలిస్తే, చివరకు అనసూయమ్మ గారు ఓ గంట ఫోన్‌లో మాట్లాడి వెళుతూ ‘థాంక్స్ అమ్మా..’ అంటూ జారుకునేది. పోనీ అర్జెంట్ కాల్ అనుకుందామా అంటే, అదీ కాదు. సుత్తీ సోది. దీంతో రాత్రి పూట ఫోన్ రింగైతే మా ఆవిడ విసుక్కునేది. ఒక దశలో ఫోన్ అంటే భయం పట్టుకుంది. సరే, ఓనర్ తెచ్చిన తంట గురించి కదా చెబుతుంటా.. అక్కడికే వెళదాము పదండి..
అసలేం జరిగింది? ఇంటి ఓనర్ ఏమిటీ, టెనెంట్‌ని కొరకడమేమిటీ?? ఓనర్ కోపిష్ఠి వాడని తెలుసు, కానీ మరీ కొరికేటంత కోపమా! పైగా కొరకడం జంతు లక్షణం. వాడేమన్నా కుక్కా, పందా? ఇలా ఆలోచిస్తూ నా టివీఎస్ మోపెడ్ వేగం పెంచాను.
మోపెడ్ యాత్ర:
నిజానికి మోపెడ్ వేగం ఎంత పెంచినా అది 40 కిలోమీటర్ల స్పీడ్ దాటితే కంట్రోల్ తప్పుతుంది. పాపం, ‘రక్షించండర్రా’ అంటూ గజగజా వణికిపోతుంది. 30-35 కిలోమీటర్ల వేగం అయితేనే బాగా స్పీడ్‌గా వెళుతున్నట్లు లెక్క. ఆ రోజుల్లో మా ఆఫీస్‌లో స్కూటరో లేకుంటే సైకిలో ఎక్కువ మంది వాడేవారు. టివీఎస్ బండ్లు ఒకటో రెండు ఉన్నప్పటికీ అవన్నీ ఓల్డ్ మోడల్ అన్న మాట. దీంతో నా కొత్త మోడల్ టివీఎస్ మోపెడ్ ఆపీస్‌కు రాగానే ఆఫీస్ ఆవరణకే అదో ప్రత్యేక ఆకర్షణ అయింది. మా న్యూస్ ఎడిటర్ గారైతే ప్రేమగా వచ్చి విషెస్ చెప్పి ఆఫీస్ ఆవరణ చుట్టూ ట్రైల్ రన్ చేశారు. ‘బాగుందోయ్ నీ బండి. చూడ ముచ్చటగా ఉంది’ అంటూ కితాబు ఇచ్చారు. ఆ రోజుల్లో పదవుల భేషజాలు ఆట్టే కనిపించేవి కావు. అంతా సరదాగా కలసిమెలసి పనిచేస్తుండేవాళ్లం. నా సీనియర్ మిత్రులు లంకా వెంకట రమణ గారికి – ఇలా నేను మోపెడ్ కొనుక్కోవాలనుకుంటున్నాననని చెబితే, షో రూమ్‌కి తీసుకువెళ్ళి బండి ఇప్పించారు. నాలుగైదు రంగుల్లో ఉన్నా నాకెందుకో పోస్టల్ రెడ్ కలర్ నచ్చింది. కానీ తర్వాత మా ఇంట్లో వాళ్లు – ‘ఏమిటీ రంగు, కదిలే పోస్టల్ డబ్బాలా ఉంది’ అంటూ సెటైర్లు వేశారు. అయినా నేను పట్టించుకోలేదు. పార్కింగ్ షెడ్‌లో నాలుగు బండ్లు పెడితే నా బండి కొట్టొచ్చినట్లు కనిపించేది. లంకా వెంకట రమణ గారు బందర్ రోడ్డులో ఉన్న షో రూమ్‌కి తీసుకువెళ్ళి బండి ఇప్పించి- ‘ఇక ఇంటికి వెళ్ళు..’ అంటూ తన దారి చూసుకున్నారు. ‘ప్రక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో ఓ లీటర్ పెట్రోల్ కొట్టించుకో’ అని ఓ ఉచిత సలహా ఒకటి. నాకు మోటర్ వెహికల్ నడపడం అదే కొత్త. పైగా విజయవాడ బందర్ రోడ్డు మీద మొదటిసారిగా కొత్త మోపెడ్ నడపడటం అంటే.. అమ్మో నాకు చెమటలు పట్టేశాయి. అయినా ఏదో మొండి దైర్యం ఆవహించింది. లీటర్ పెట్రోల్ కొట్టించాను. బండి నిదానంగా నడుపుతూ తెలిసిన దారిలో నెమ్మదిగా ఇంటికి చేరి – అమ్మయ్యా.. అంటూ గాలి పీల్చుకున్నాను. మా ఆవిడ సంతోషించింది. సైకిల్ గోల వదిలింది. పైగా మోపెడ్ అయితే తానూ ఎక్కవచ్చు. అది ఆమె ఆనందం. అందుకే ఆ రాత్రి ప్రపొజల్ పెట్టింది. రేపు ఉదయం మాచవరం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వాహన పూజ చేయిద్దామని.
ఆ మాటతో నాకు మళ్ళీ చెమటలు పట్టడం మొదలైంది. ఇంకా బండి సరిగా నడపడం రాలేదు. అసలు మా నాన్నగారేమో సైకిల్ కొనుక్కోరా.. నీ అవసరరాలకు సరిపోతుంది అని అంటుండేవారు. నాకేమో నచ్చలేదు. స్కూటర్ కొనుక్కోవాలన్నది నా ఆశయం. చివరకు ఈ రెండు కాకుండూ బడ్జెట్‌లో వస్తుందని మోపెడ్‌తో సరిపెట్టుకున్నామన్న మాట.
మర్నాడు పొద్దున్నే మోపెడ్‌ని విజయవంతంగా మాచవరం డౌన్ ఆంజనేయస్వామి వారి గుడికి తీసుకువెళ్ళి పూజలు చేయించి ఇంటికి రాగానే ఏదో ఘన విజయం సాధించినట్లు మేమిద్దరం ఫీలయ్యాము. ఇరుగు పొరుగు వాళ్లు కూడా ఎంతో సంతోషించారు.
వేటూరితో ‘వింత’ బంధం:
కొత్త మోపెడ్ వేసుకుని ఠీవీగా ఆఫీస్‌కు వెళ్లగానే లంక వెంకట రమణ గారు, ‘ఏమోయ్, ఎలా ఉంది కొత్త బండి’ అంటూ పలకరించారు. రమణ గారు తెలుగు సినీ రచయిత, కవి వేటూరి సుందరరామ్మూర్తి గారికి స్వయాన మేనల్లుడే. అలా నాకు పెద్దాయనతో పరిచయం ఏర్పడింది. ఒకసారి ఆఫీస్‌కి వెళ్ళిన కాసేపటికి రమణగారు నా దగ్గరకు వచ్చి క్యాంటీన్‌కి తీసుకువెళ్ళారు. ఆలా క్యాంటీన్‌లో టీ త్రాగుతుండగానే ఓ పెద్దాయన అక్కడకు వచ్చారు. ఆయన్ని నాకు పరిచయం చేశారు రమణ గారు. ఆయన మరెవరో కాదు. ప్రముఖ సినికవి వేటూరి సుందర రామ్మూర్తి గారు. వారి గురించి వినడమే కానీ, ఎప్పుడూ చూస్తాననుకోలేదు. మా కాలేజీ లైఫ్‌లో వారు వ్రాసిన పాటలు మారుమ్రోగేవి. ముఖ్యంగా ‘అడవి రాముడు’, ‘యమగోల’ పాటలైతే మా యూత్ చేత చిందులు వేయించాయి. ‘వీడెవడో ఆత్రేయని మించి పోయాడ్రా’ అని మా ఫ్రెండ్ గిరీష్ అనడం నాకిప్పటికీ గుర్తు. ఆ రోజుల్లో సినిమా పాటలంటే చెవి కోసుకునే బ్యాచ్ మాది. అసలు సంగీతం నేర్చుకోవాలని , పాటలు పాడాలని కూడా డిసైడ్ అయ్యాము.
జాలాదిని చూసిన రోజు:
అనుకోకుండా నందిగామ పాత బస్టాండ్ దగ్గర్లోని ఓ మేడ మీద సంగీతం నేర్పే మాష్టారు ఉన్నారని గిరిష్ నన్ను మరో మిత్రుడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. మేడ మెట్లు ఎక్కి ఓ చిన్న గదిలోకి వెళ్ళాము. అక్కడ ఒకాయన హార్మోనియం పెట్టె ముందు కూర్చుని స్వరాలు వాయిస్తున్నారు. గిరీష్ చెప్పాడు, ఆయన జాలాది రాజారావు గారని. అప్పుడు అనుకోలేదు, వీరే ప్రముఖ సినీ రచయిత జాలాదిగా ప్రసిద్ధి చెందుతారని.
వారి కుమార్తె జాలాది విజయ గారు – తానా ప్రపంచ సాహితీ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆమెను చూశాను. అదే సభలో నేనూ విశిష్ట అతిథిగా పాల్గొన్నాను. ఆ సమయంలో ఈ పాత సంఘటన గుర్తుకు వచ్చింది. ఇది వ్రాస్తున్నప్పుడే విజయగారితో ఫోన్‌లో మాట్లాడాను. వారెంతో సంతోషించారు. నందిగామ నుంచే సినీ అవకాశాల కోసం నాన్నగారు మద్రాసు వెళ్ళారనీ, వారి మొదటి సినిమా పాట – చూరట్టుకు జారతాది, చిట్టుక్కు చిట్టుక్కు వాన చుక్క- (పల్లె సీమ- 1976) అని చెప్పారు. విజయగారు కూడా తన చిన్ననాటి నందిగామ విశేషాలను కాసేపు నాతో పంచుకున్నారు.
సరే, మళ్ళీ వేటూరి గారి దగ్గరకు వెళదాము.. అడవి రాముడు సినిమాలో వారు వ్రాసిన – ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు’ – అన్న పాట ఇప్పటికీ ఓ స్ఫూర్తిదాయకం.
కొన్ని పరిచయాలు ఎందుకు ఏర్పడతాయో, అవి ఎటు దారితీస్తాయో ఎవ్వరికీ తెలియదు.
వేటూరి గారు బ్యాంక్ లోన్ తీసుకోవడమేమిటీ, వారు ఆ లోన్ కట్టారా లేదా అని నేను పదేపదే ఆరా తీస్తూ వెంబడపడటమేమిటీ!! వినడానికి చిత్రంగా ఉన్నా, ఇదే జరిగింది. ఓ రకమైన విచిత్ర బంధం కూడా ఏర్పడింది. వేటూరి గారికి టివీ సీరియల్ (ఝుమ్మంది నాదం అనుకుంటా) నిర్మాణం నిమిత్తం లోన్ కావాల్సి వచ్చింది. లక్షరూపాయలు ఇండియన్ బ్యాంక్ వాళ్లు ఇస్తామన్నారు. కాకపోతే షురిటీ సొంతకం కావాలన్నారు. రమణ గారు వేటూరి మాష్టార్‌ని మా ఆఫీస్ కి తీసుకువచ్చి నాకు పరిచయంచేసి సాయం చేయమన్నారు. వేటూరి గారు సినీరంగం ప్రవేశానికి ముందు తొలినాళ్లలో ఆంద్రప్రభ విజయవాడలోనే సబ్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ఆ విషయం రమణ గారు అప్పుడే నాకు చెప్పారు. రెండవ షూరుటీదారునిగా సంతకం చేసే విషయంలో నేను కాదనలేకపోయాను. లక్ష రూపాయలకు షూరిటీ సంతకం చేశాను. కానీ..
వేటూరి గారు అనుకున్న సమయానికి లోన్ తీర్చలేకపోయారు. దీంతో బ్యాంక్ నుంచి నాకు కూడా నోటీసులు రావడం మొదలయ్యాయి. నేను గాభరా పడేవాడ్ని. రమణ గారు వారి మేనమామతో మాట్లాడి కొంత సొమ్ము కట్టేంచేలా చూసేవారు. ఇలా సాగదీత వ్యవహారంగా ఈ నోటీసుల బంధం నేను హైదరాబాద్ వచ్చిన తొలినాళ్ల దాకా సాగింది. ఆ తర్వాత పూర్తిగా లోన్ కట్టేసి, వేటూరి గారు నాకు ఫోన్ చేసి – ‘థాంక్స్ రా అబ్బాయి..’ అంటూ చల్లటి కబురు చెప్పారు. గండం గట్టెక్కినట్లు ఊపిరి పీల్చుకున్నాను.
అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎక్కడా షూరిటీల మీద సొంతకాలు చేయకూడదని. ఆ మాట మీదనే నిలబడ్డాను. మొత్తానికి వేటూరి గారి లోన్ విషయం నాకు ఆందోళన కలిగించినా వారి పట్ల గౌరవం మాత్రం తగ్గలేదు.
ఆ మాపెడ్ బాగా కలిసొచ్చింది. మా కుటుంబం పెరిగింది. మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చేరడం కోసం హైదరాబాద్ వెళుతుంటే నేనూ ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నాను. యాజమాన్యం అంగీకరించడంతో ఫ్యామిలీ షిఫ్ట్ చేశాము. మాతో పాటుగా టీవీఎస్ మోపెడ్ కూడా చైతన్యపురికి దగ్గర్లోని వివినగర్ అద్దె ఇంటికి చేరింది. నేను తెలుగువన్ డాట్ కామ్‌లో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ మిత్రునికి ఈ మోపెడ్‌ని అతి తక్కువకి ఇచ్చేశాను. ఇంటికి బజాజ్ మోటర్ సైకిల్ రావడంతో పాపం ఈ మోపెడ్ గారు, అప్పటికే ఓ మూల దిగులుగా చూస్తుండేది. ‘నీకూ, నీ కుటుంబానికి ఎంతో సేవ చేశాను. నన్ను పట్టించుకోవా..’ అన్నట్లు ఉండేవి దాని చూపులు. కాకపోతే ఓ మంచి మిత్రునికే అప్పగించాను. అలా టీవీఎస్ మోపెడ్ కథ ముగిసింది.
మనిషి కాటు:
సత్యనారాయణపురంలోకి మోపెడ్ ప్రవేశించింది. అక్కడి నుంచి అద్దె ఇల్లు చాలా దగ్గరే. ఆ ఓనరుడు అసలెందుకు టెనెంట్‌ని కొరికాడన్నది నా మదిని తొలుస్తున్న పజిల్. మనిషి కాటుకు మందే లేదంటారు. పైగా కేసు పెడితే జైలుకు పోవడం ఖాయం.
ఇంటి ముందు జనం గుంపుగా చేరారు. నేను ఓ వారగా మోపెడ్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాను. మా ఆవిడ చెప్పుకుపోతున్నది..
మేము అద్దెకుంటున్న ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఐదు ఫోర్షన్లు, పైన మొదటి అంతస్తులో ఐదు పోర్షన్లు ఉన్నాయి. ఓనర్ పైన రెండు పోర్షన్లు మినహా మిగతావి అద్దెకు ఇచ్చారు. ఆయనకు బీపీ ఎక్కువ అని అంటారు. మామూలుగా చాలా పద్ధతి గల మనిషి. ఎంత ‘పద్ధతి’ అంటే ఐదో తారీఖునాటికి అద్దె డబ్బులు ఇవ్వకపోతే పదేళ్ల వాళ్లబ్బాయిని పంపించేవాడు. వాడు తారాజువ్వలా ఇంట్లోకి దూసుకు వచ్చి – ‘ఇంట్లో ఉంటారా, ఖాళీ చేస్తున్నారా..? నాన్న గారు కనుక్కుని రమ్మన్నారు’ అనేవాడు. పైగా ఈ ఓనర్ స్త్రీ ద్వేషి. అద్దెకుండే ఆడవాళ్లకు షరతులు పెట్టేవాడు. కూరగాయల వాడితో మాట్లాడినా తట్టుకోలేడు. ఇద్దరు ఆడవాళ్లు నిలబడి మాట్లాడుతుంటే కోపంతో ఊగిపోయేవాడు. – ఇలా ఉండేది ఓనర్ తీరు. వాడికి క్లాస్ పీకాలన్నంత కోపం వచ్చేది నాకు. ఆయనతో మనకెందుకండీ, టైమ్‌కి అద్దె కట్టేయండి, మిగతా విషయాలు మనకెందుకు అనేది మా ఆవిడ. పైగా, వాళ్లావిడ చాలా మంచిది. తోడునీడగా ఉంటుందని మా ఆవిడ చెప్పడంతో నేను మెత్తపడేవాడ్ని.
పై ఫోర్షన్లో ఉన్న ఒకాయనతో ఓనర్ గారు తగాదా పెట్టుకున్నారట. ఇద్దరికీ మాటామాట పెరిగాయి. చివరకు చేతులకు పనిపెట్టే దాకా వెళ్ళింది. ఓనరుడు అక్కడితో ఆగలేదు. టెనెంట్ చేతిని కొరికేశాడు. దీంతో టెనెంట్ రక్తం కారుతున్న చేతిని అలాగే పట్టుకుని సత్యానారాయణపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. అప్పుడు కానీ ఓనర్ ఆవేశం చల్లారలేదు. ‘లా’ తెలిసొచ్చింది. చట్టాలు కళ్లముందు కనిపించాయి. టెనెంట్ కేసు పెడతాడేమో అన్న భయం ఆవహించింది. వాళ్లావిడ మా ఇంటికి పరిగెత్తుకుని వచ్చి, విషయం చెప్పింది. దీంతో మా ఆవిడ ఆఫీస్‌కి కాల్ చేసింది. ఇదీ కథ. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఏదో సర్దుబాటు చేశాము. మొత్తానికి కేసు పడకుండా టెనెంట్‌ని శాంతింపజేశాము.
ఈ సంఘటనతో మా ఇంట్లో కొత్త చర్చ తెలెత్తింది. ఇలాంటి ఇంట్లో ఉండటం క్షేమం కాదని అర్థమైంది. నెమ్మదిగా బయటపడాలనుకున్నాము. ఇల్లు చూసుకోవడం మొదలుపెట్టాము. ఆ ఇంట్లో అప్పటికే ఏడేళ్ల నుంచి ఉన్నాము. ఇంటితో చక్కటి అనుబంధమే ఉంది. కానీ ఏం చేస్తాము.. నాకు కోపం వచ్చినా, ఓనర్‌కి కోపం వచ్చినా కరిచేది ఓనరే అని తేలిపోవడంతో ఇల్లు మారాము. అక్కడికి దగ్గర్లోనే ఓ చిన్న పోర్షన్ తీసుకున్నాము.
నాకు పెళ్ళి కాకముందు, ఓ మిత్రుడితో కలిసి పూర్ణానందం పేటలోని ఓ మేడమీద గదిలో అద్దెకు దిగాను. పెళ్ళయ్యాక పెట్టాబేడా సర్దుకుని అద్దె ఇంట్లో కాపురం పెట్టాను. అప్పట్లో ఆఫీస్ వాళ్లు ఇచ్చే నెల జీతంలో సగభాగం అద్దెకీ కరెంట్ బిల్లులకు సరిపోయేది. అయినా పెద్దగా ఖర్చులు తెలియని కొత్త సంసారం కావడంతో హాయిగానే రోజులు సాగిపోయాయి. ఈ ఇంట్లో ఓనరమ్మదే హవా. ఓనర్ గారు చనిపోయారు. పిల్లల్ని చదివిస్తూ ఓనరమ్మ ఉండేది. ఆమె చెప్పే కబుర్లకు మా ఆవిడ పడిపోయి అడిగిన వస్తువులు ఇస్తుండేది. వాళ్లకో కుక్క కూడా ఉండేది. ‘మా కుక్కకు పాలు కావాలమ్మా’ అంటూ మొహమాటం లేకుండా అడుగుతుండేది. ఈలోగా నాకు జీతం పెరిగింది. మంచి ఇంట్లోకి మారదామనుకున్నాము. ఇదిగో అప్పుడే ‘కరిచే ఓనరుడి’ ఇంటికి మారింది. ఆ తర్వాత రెండు ఇల్లు మారాక మా ఆవిడ ఇక తాను అద్దె ఇళ్ల గోల భరించలేనంది. దీంతో లోన్ వస్తుందని తెలియడంతో సొంత ఇంటి ప్లాన్ చేశాము. అయోధ్యనగర్‌లో అప్పట్లోనే కట్టిన సూర్యా బాలా ఎపార్ట్‌మెంట్లో ఓ ఫ్లాట్ తీసుకున్నాము. ఎందుకో ఆ ఇల్లు మాకు కలిసిరాలేదు. వచ్చిన వారం పదిరోజుల్లోనే ఇంటి వెనుక ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు వచ్చాయి. పిల్లలను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. దీంతో ఇల్లు అద్దెకు ఇచ్చేసి సత్యనారాయణపురం శివరావు వీధిలోకి మారాము. అక్కడ వసతి బాగానే ఉంది. కొన్నాళ్ల తర్వాత సొంత ఇల్లు అమ్మేశాను. ఈలోగా ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని హైదరాబాద్ చేరాము.
అద్దె ఇల్లు – భయాలు:
ఏదో అద్దె ఇల్లే కదా అని చేరితే ఒక్కోసారి అవి మనల్ని భయపెడతాయి. ఊపిరి పీల్చుకోనివ్వవు. సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మా ఫ్రెండొకడు అనుభవసారంగా చెప్పేవాడు. వాడు చెప్పిన మాటలను నన్ను ఎంతగా ఆలోచింపజేశాయంటే, ఒకటి రెండు నాటికలు వ్రాసేటంతగా.
హైదరాబాద్‌లో మేము మొదటిసారిగా చేరిన అద్దె ఇల్లు శ్మశానానికి దగ్గర్లోనే ఉండేది. (డింగరి – అన్న భాగంలో ఈ ఇంటి ప్రస్తావన తీసుకువచ్చాను) మొత్తానికి క్షేమంగా ఆ ఇంటి నుంచి బయటపడ్డాము. మా బంధువుల్లో ఒకాయన అద్దె ఇంట్లో చేరగానే ‘మరో మనిషి’ ఆ ఇంట్లో ఉన్నాడన్న ఫీలింగ్ కలిగిందట. భార్యా భర్తలు – ఇద్దరు పిల్లలు. ఇంతే వారి కుటుంబం. కానీ ‘ఐదో మనిషి’ ఎవరో ఇంట్లో కదులుతున్నట్లు ఫీలయ్యామని నాతో చెప్పారు.
ఒక మిత్రుడొకడు – ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి హడావుడిగా అద్దె ఇంట్లో చేరాడు. అప్పటికి అతగాడికి పెళ్ళి కాలేదు. చేరిన కొద్ది రోజులకు ఇల్లు పరిశీలనగా చూస్తుంటే, కిటికీ ఊడ పీకి మళ్ళీ బిగించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అలాగే చెక్క తలుపు పగలగట్టినట్లు పగుళ్లు, చారలు కనిపిస్తున్నాయి. పాత తలుపుకి కొత్త గొళ్లెం బిగించినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత అతని అమ్మా, నాన్న వచ్చి ఆరా తీస్తే భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. అంతే..
ఆ ఇంట్లో అంతకు ముందు ఇద్దరు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. వీడు పడుకున్న మంచం పైన ఉన్న ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఒక అమ్మాయి చనిపోయిందట. మరో వ్యక్తి బాత్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ శవాలను బయటకు తీయడానికే తలుపులు బద్దలు కొట్టాల్సి వచ్చిందనీ, కిటికీ తలుపులు కూడా తీయాల్సి వచ్చిందని పనిమనిషి ద్వారా తెలిసింది. దీంతో మా వాడికి హడల్. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి, కొత్త ఇంట్లోకి చేరాడు. అప్పటి నుంచి వాడు ఎప్పుడు ఎక్కడ అద్దె ఇల్లు చూసినా, గోడలు, కిటికీలు, తలుపులను, ఇంటి పరిసరాలను ఓ డిటెక్టీవ్ దృష్టితో చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇంటి ప్రక్కన శ్మశానం గట్రా ఉన్నాయోమో అని కూడా ఆరా తీయడం అలవాటు చేసుకున్నాడు. వాడి భయం వాడిది.
అందుకే అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వాడు అందరికీ హితబోధ చేస్తుంటాడు. ఈ భయాలతో పాటుగా ఇంటి ఓనర్ మంచివాడు కాకపోతే అదో ఇబ్బంది. పైన ఓనర్ ఉండి, క్రింద మనం ఉన్నామనుకోండి, వారు పెట్టే రూల్స్ పాటించలేక, ఎదురుతిరగలేక అష్టకష్టాలు తప్పవు. ఓనర్ లేదా ఓనరమ్మ పెట్టే బాధలు పడలేక అద్దె ఇంటి నుంచి విముక్తి కోసం ఆ దేవుడ్ని ప్రార్థించే వారి ఎందరో ఉన్నారు. ఇలాంటి ఇతివృత్తంతోనే నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కోసం ‘నరుడే వోనరుడైతే’ అన్న నాటిక వ్రాశాను. అద్దె ఇంటి ఓనర్ పెట్టే కష్టాలు తట్టుకేలేక ఒక మధ్యతరగతి సంసారి (నరుడు) సొంత ఇల్లు కోసం తపిస్తుంటాడు. అతని తపస్సుకు మెచ్చి దేవత ప్రత్యక్షమై కోరిక తీరుస్తుంది. వర ప్రభావంతో అతగాడు త్వరలోనే ఓనరుడైపోతాడు. దీంతో పాటుగా అతని మనస్తత్వం కూడా మారిపోతుంది. అంతవరకు టెనెంట్ (సామాన్య నరుడి) గా పడిన కష్టాలు మరచిపోయి, వోనరుడి అవతారం ఎత్తి టెనెంట్‌ని అంతే స్థాయిలో కష్టాలు పెడతాడు. దీంతో దేవత ఆగ్రహించి, అతడ్ని మళ్ళీ టెనెంట్‌గా మారుస్తుంది. ఇదంతా కల అని తెలుసుకుని ఆ సంసారి తాను ఓనర్ అయితే టెనెంట్లను ఏడిపించ కూడదని తీర్మానించుకుంటాడు. ఇది ఈ నాటిక సంక్షిప్త రూపం.
అద్దె ఇళ్ల వేట కంటే సొంత ఇంటి వేట ఇంకా క్లిష్టతరమైనది. ఈ వివరాలు మరో భాగంలో ముచ్చటిస్తాను.
(మళ్ళీ కలుద్దాం)