[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘త్యాగేనైకే అమృతత్త్వ మానశుః’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
శ్లోకం:
అర్థ మనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యమ్।
పుత్రాదాపి ధానభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః॥
భావం:
[dropcap]ధ[/dropcap]నం వల్ల కించిత్తు కూడా సుఖం వుండదు. ధనవంతుడికి సొంత కుమారుని నుండి కూడా భయమే కలుగుతుంది. సర్వే సర్వత్రా ధనం నడిచే పద్ధతి అలానే వుంటుంది!
***
ఆ రోజు ఆగస్ట్ 15వ తేదీ 2016. అందరికీ తెలిసిన విశేషం స్వాతంత్య్ర దినోత్సవం. స్వామీ దయానంద సరస్వతి శిష్యులకు, భక్తులకు స్వామిజీ జన్మదినం!
స్వామీ దయానంద ఆశ్రమం, ఋషికేష్, ఆర్ష విద్యా పీఠంలో ప్రారంభించే లాంగ్ టర్మ్ వేదాంత & సంస్కృత కోర్సుకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన మా యాభై మందికి విద్యారంభ సంరంభం! మేము రెండు రోజులు ముందుగానే ఆశ్రమానికి చేరుకున్నాము. మాలో ఇరవై మంది విదేశీయులు వున్నారు. స్వామీ తత్త్వ విదానంద సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి కోర్సు ప్రారంభించారు. మా అందరికీ మునివాటికలో కుటీరాలు కేటాయించారు.
ప్రధాన ఆచార్య స్వామి బ్రహ్మా విద్యానంద మొదటి క్లాస్ తీసుకున్నారు. క్లాస్ చాలా సరదాగా జరిగింది. ఒక్కొక్కరిని నిలబడి పరిచయం చేసుకొమ్మన్నారు. యాభై మంది పరిచయం చేసుకున్నాక స్వామీజీ మా ప్రతి ఒక్కరి పేరు ఆయన తిరిగి చెప్పి ఆశ్చర్యపరిచారు. ఆయన గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి అలాంటివి మరి! అందుకే అన్నారు ఆయన్ని ‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా’ అని.
“ఆత్మ స్వరూపులారా! ఈ రోజు మీతో సరదాగా మాట్లాడాలను కంటున్నాను! రేపటి నుండి సీరియస్‌గా పాఠాలు చెప్పుకుందాము. మీకు అవసరము లేని దానిని విడిచిపెట్టడమే వేదాంత శాస్త్రం యొక్క ప్రయోజనం! చీకటిలో వున్న వాడికి వెలుతురు కావాలి. అజ్ఞానంలో వున్నవానికి జ్ఞానం కావాలి. ఇప్పుడు ఒక ప్రశ్న. మీలో ఎవరైనా అజ్ఞానులు వుంటే చేతులు ఎత్తండి” అంటూ అడిగారు.
మాలో ఇరవై మంది వరకూ చేతులెత్తారు నాతో సహా! స్వామి నవ్వారు.
“మీరు ఎవరూ అజ్ఞానంలో లేరు. శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఋషికేశ్ వరకూ వచ్చారంటే మీలో ఎవరూ అజ్ఞానులు లేరు. మీరంతా జిజ్ఞాసువులు! మీరు వెతుకుతున్నది జ్ఞాన జ్యోతిని. అది మీ లోపలే ఉంది బయట లేదు. ఏది అది కాదో శాస్త్రం చెబుతుంది. ఏది అదేనో తెలుసుకోవడం ద్వారా మీరే ఆవిష్కరించు కోవాలి. ఈ పవిత్ర మానవ జన్మ లభించింది అందుకే!
వెదకండి! సత్యం లభిస్తుంది. సత్యాన్ని వెదకాలనే అభిలాష లేనివాడికి వేదాంతం శాస్త్రం అనవసరం! వానికి కావాల్సిన దానిని శాస్త్రం గానీ, గురువు గానీ ఇవ్వలేరు. వితౌట్ క్వెస్ట్ లైఫ్ బికమ్ మొనాటనీ. దేర్ మస్ట్ బి ఎ సెర్చ్ ఫర్ ట్రూత్ ఇన్ ఒన్స్ హార్ట్. ట్రూత్ ఈస్ బ్రహ్మన్.. గాడ్.. యూ! ఎకార్డింగ్ టు వేదాంత థింకింగ్ ఈస్ టైం బౌండ్ అండ్ నోయింగ్ ఈస్ టైమ్‌లెస్. దట్స్ వై సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్. నౌ అండ్ హియర్!
మీలో చాలా మంది ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత సన్యాసం స్వీకరించాలని, ఆశ్రమాలను స్తాపించెయ్యాలని, శిష్యులను, భక్తులను అలరించెయ్యాలని ఊహలు చేస్తూ వుంటారు. దట్ ఈస్ ది బేసిక్ మిస్టేక్! ఆ ఊహే సన్యాసిని కూడా సంసారంలోకి నెట్టేస్తుంది.
మీరంతా ఈ పవిత్ర గంగా తీరంలో, ఈ ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో మీ వేదాంత విద్యను పూర్తి చేసుకొని, మిమ్మల్ని మీరు తెలుసుకొని ఈ ఆర్ష విద్యా సాంప్రదాయాన్ని, పరంపరను ముందుకు తీసుకెళతారని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తున్నాను!” క్లాస్ ముగించారు.
తర్వాత క్లాస్ స్వామిని సద్విద్యానంద సరస్వతీ మాతాజీ.
“దివ్యాత్మ స్వరుపులారా! బంధుగణా! మనం వేదాంతులం. మనం విడిచిపెట్టాల్సిన బుద్ధులు మూడు! అవి నామరూప బుద్ధి, కాలబుద్ధి, దేశ బుద్ధి! మీలో చాలా మంది తర్వాత కాలంలో సన్యాస ఆశ్రమం స్వీకరిస్తారు. సన్యాసం అంటే విడిచిపెట్టడమే! బరువు నెత్తి మీదకు ఎత్తుకోవడం తేలికా? దించుకోవడం తేలికా? సన్యాసం సన్యాసిగా రియలైజ్ కావడానికే గానీ, తనను తాను ప్రత్యేకంగా పేర్కొంటూ ఇతరులనుండి వేరు చేసుకోడానికి కాదు. సన్యాసం సమస్యల నుండి దూరం చేయలేదు. ఒకవేళ సమస్యలకు పరిష్కారం సన్యాసం అయితే ఈ ప్రపంచంలో అందరూ సన్యాసులే ఉంటారు! ఈ జగత్తు పంచ భూతాత్మకం, ఆ పంచ భూతాలు నీ సృష్టి! నీ కళ్లు తెరచి చూస్తే నీ శరీరం వుండటానికి ఆకాశాన్ని సృష్టించుకుంటావు! ఆ ఆకాశంలో పరుగెడుతూ గాలిని సృష్టించుకుంటావు. ఆ పరుగులో నీ శరీరంలో వేడి పుడుతుంది. అదే అగ్ని! ఆ వేడికి నీకు పట్టే ఆ చెమటే నీరు! ఆ నీరు పారడానికి నేల కావాలి కాబట్టి భూమిని సృష్టించుకుంటావు! ఆ విధంగా పంచ భూతాలు నీ సృష్టి. నామ రూపాత్మకం ఈ జగత్తు. ఎందుకంటే మామిడి చెట్టు తాను మామిడి చెట్టునని నీతో చెప్పదు. కోకిల తాను కోకిలనని నీతో చెప్పదు. నది తాను నదినని నీతో చెప్పదు. ఆఖరికి దేవుడు కూడా తాను దేవుణ్ణని నీతో చెప్పడు!ఈ నామ రూపాలన్నీ కేవలం నీ సృష్టి మాత్రమే! నీవు వాటికి పేర్లు ఇచ్చావు. నీ కంటే ముందు అవి లేవు. నీ తర్వాత అవి వుండవు. లైఫ్ ఈస్ ఎ పాసింగ్ షో లైక్ డ్రీమ్! ఇకపోతే నమ్మకము, శాస్త్రము ఒకటేనని భావించకు. నమ్మకం నీకు మాత్రమే పరిమితం, శాస్త్రం సర్వులకు ఆచరణీయం! నీవు జన్మించలేదు కాబట్టి మరణించబోవు. ఏది వచ్చిందో అది పోతుంది!
నీకిది అరవైవ జన్మదినం. అంటే ఏమిటి అర్థం? అరవై సార్లు జన్మించావనా? లేక యాభై తొమ్మిది సార్లు మరణించావనా? అహం – ఇదం. అహం లేకుండా ఇదం ఉండదు. కానీ ఇదం లేక పోయినా అహం ఉంటుంది అదే అద్వైతం!” అంటూ క్లాస్ ముగించారు మాతాజీ.
ఆ తర్వాత క్లాస్ ఒక హైటెక్ స్వామిది! ఆయన్ని అందరూ చాక్లెట్ స్వామి అంటారు. ఒక లాప్‌టాప్ ముందు పెట్టుకొని అందులో చూసి చాలా గంభీరంగా పాఠం చెబుతాడు! మధ్యలో సెల్ రింగ్ అయితే కాల్ మాట్లాడుకుంటారు. క్లాస్ అయింతర్వాత క్లాస్ రూమ్ బయట నిలబడి బయటకు వచ్చే ప్రతి స్టూడెంట్‌ను నా క్లాస్ ఎలా వుంది అని అడుగుతారట. బావుంది అని చెప్పిన వారికి ఒక చాక్‌లెట్టు. చాలా బావుంది అని చెప్పిన వారికి రెండు చాక్‌లెట్లు ఇస్తారట. అందుకే ఆయన్ని అందరూ చాక్‌లెట్ స్వామీ అంటారు.
***
రోజులు చాలా హ్యాపీగా గడిచి పోతున్నాయి. గతంలో చేసిన పుణ్యకర్మల ఫలితాలు అనుభవం లోకి వస్తున్నాయని పిస్తుంది. అక్టోబర్ నెలలో చాక్‌లెట్ స్వామి పుట్టిన రోజు వచ్చింది. మా యాభై మందిని ఏసీ బస్సుల్లో ‘ది మాడ్ కేఫ్’ కు తీసుకెళ్లారు. అక్కడ మాకు పిజ్జా, కోక్‌లు సర్వ్ చేశారు. ఈ వేదాంతా కోర్స్ పుణ్యమా అని జీవితంలో పిజ్జా తినే అవకాశం వచ్చింది. పిజ్జా తింటున్నప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మ, ఉల్లిపాయలు పచ్చి మిర్చి సన్నగా తురిమి వరిపిండి, మైదా, మజ్జిగలో కలిపి చల్ల అట్టు, పుల్ల అట్టు అనే పేరుతో అట్లు చేసి పెట్టేది. అంటే నేను చిన్నప్పుడే కొద్దిపాటి రుచి తేడాతో ఈ పిజ్జా లాంటిది తిన్నానన్న మాట! ఈ రోజు పిజ్జా వ్యాపారం కోట్ల మీద నడుస్తుంది. జనన మరణాలు మిథ్య అని క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పే ఒక సన్యాసి స్వామి జన్మదిన వేడుకల్లో మొదటి సారి ఈ పిజ్జా రుచి అనుభవం లోకి వచ్చింది నాకు!
***
ఆ రోజు నవంబర్ 9వ తారీకు 2016. చాక్‌లెట్ స్వామి క్లాస్ మాత్రమే వుంది. క్లాస్‌కు వెళ్లాలనిపించలేదు. నెట్‌లో గూగుల్ న్యూస్ పెట్టాను. అద్దిరిపోయే వార్త! నిన్న రాత్రి ప్రధాని మోడీ గారి డిమోనిటైజేషన్ ప్రకటన. దేశంలో నల్లధనం వున్నవారు, బ్లాక్ మార్కెట్ వాళ్లకీ గుండెల్లో రైళ్లు పరిగెట్టే వార్త! ఆ వార్త విని అర్ధరాత్రి నుండీ ఇప్పటి వరకూ గుండె ఆగి చనిపోయిన వారి సంఖ్యను క్రింద ట్రోల్ చేస్తున్నారు.
మధ్యాన్న భిక్షకు గంట కొట్టారు. కంప్యూటర్ కట్టేసి బయలుదేరాను. ఎవరిని చూసినా నాకు కొత్తగా, వింతగా కనిపిస్తున్నారు. నిన్నటి వరకు ఓడలుగా వున్నవి నేడు తోపుడు బళ్లయినట్టు ఏమిటేమిటో మాట్లాడుకొంటున్నారు. భోజనశాలకు వెళ్లి భోజనం చేస్తున్నాను. అక్కడ కూడా అందరి ప్రవర్తనా వింత గానే వుంది. సన్యాసి స్వాములు కూడా ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నారు. నిన్నటి వరకు మూగ నోము పట్టిన వారు నోము విడిచి పెట్టినట్టు వుంది. భిక్ష చేసి బయటకు వచ్చాను. గేట్ దగ్గరున్న పండ్ల దుకాణానికి వెళ్లి యాపిల్స్, లిచి పళ్ళు తీసుకున్నాను. జేబు లోంచి ఐదు వందల నోటు తీసి ఇచ్చాను. పిచ్చివాణ్ని చూసినట్టు చూసి “ఇది చెల్లదు సార్! ఐదు వందలు, వెయ్యి నోట్లు నిన్న రాత్రి 12 గంటలకు రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు.” అంటూ ఈ మాత్రం తెలీదా అన్నట్టు చూసాడు నావంక. నాకు సిగ్గనిపించింది. బుర్ర తిరిగిపోయింది. షాక్ కొట్టినట్టయింది. తీసుకున్న పళ్ళు ఇచ్చేసి కుటీరానికి వెళ్లిపోయాను. సూట్ కేసు తెరచి నా దగ్గరున్న డబ్బు లెక్క పెట్టాను. ఎనభై మూడు వేలు వుంది అన్నీ వెయ్యి, ఐదు వందల నోట్లే! చిన్న నోట్లు ఏమీ లేవు. ఉన్నవన్నీ చిత్తు కాగితాలతో సమానమన్నమాట! పిచ్చి ఎక్కి నట్లయింది. గూగుల్ న్యూస్ ఆన్ చేసాను.
“ఉయ్ హావ్ డిసైడడ్ దట్ ది ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్ రూపీ కరెన్సీ నోట్స్ ప్రెజెంట్లీ ఇన్ యూజ్ విల్ నో లాంగర్ బి లీగల్ టెండర్ ఫ్రమ్ మిడ్నైట్ టు నైట్, థట్ ఈస్ ఎయిట్ నవంబర్ 2016.” ప్రధాని మోడీ గారి గొంతు మారు మ్రోగిపోతుంది.
యూ ట్యూబ్ లో ఒక ఛానెల్ విశ్లేషణ ప్రారంభించింది. ‘భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, టెర్రరిజాన్ని అరికట్టేటందుకు నల్లధనం లేకుండా చేసేటందుకు సర్క్యూలేషన్‌లో వున్న 86% కరెన్సీని రద్దు చేస్తూ విప్లవాత్మాక మైన నిర్ణయం తీసుకుందని, ఈ చర్యలు మనకు కొత్త కాదని మొదటి సారి 1946 లో అప్పటి గవర్నర్ జనరల్ ఫీల్డ్ మార్షల్ అర్చిబా వెయ్యి, పదివేల నోట్లను రద్దు చేశారని, అవే నోట్లను మళ్ళీ 1954లో చలామణి లోకి తెచ్చారని, మళ్ళీ 1978లో శ్రీ నీలం సంజీవ రెడ్డి ప్రెసిడెంట్‌గా ఉండగా వెయ్యి ఐదు వేలు, పది వేల నోట్లను ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేశారని, మళ్ళీ ఇంత కాలానికి శ్రీ నరేంద్ర మోడీ జీ అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నార’ని పేర్కొంది!
మూడు సంవత్సరాల పాటు నా అవసరాలకు ఉపయోగ పడుతుందని ఆంధ్రా నుండి తెచ్చుకున్న మొత్తం చిత్తు కాగితాలతో సమానమైపోయింది. ఇంతకీ నేను నల్లధనం గల వాడినా? అవినీతిపరుడినా?నా ఆలోచన ఇలా ఉంటే, వేల లక్షల కోట్ల నల్ల ధనం గల వారి పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో?
మరో యూట్యూబ్ ఛానెల్‌లో నా సమస్యకు పరిష్కారం చెప్పబడింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు లతో బాంకుకు వెళ్లి రద్దయిన నోట్లను చెలామణిలో వున్న నోట్లతో మార్చుకోవచ్చని చెప్పారు. డబ్బులు బ్యాగ్‌లో వేసుకొని బయలు దేరాను. చంద్రబాగ్ పూల్ దాటగానే స్టేట్‌బ్యాంక్ వుంది. అక్కడికెళ్లి చూసిన నాకు దిమ్మ తిరిగిపోయింది! క్యూ రెండు కిలోమీటర్ల అవతల వున్న ఉత్తరాఖండ్ బస్ స్టాండ్ వరకూ వుంది. డెహరాడూన్ రోడ్ లోని ఎస్ బాంక్ వద్దా, రైల్వే రోడ్ లోని పీ ఎన్ బీ వద్దా కూడా పరిస్థితి అంతే ఘోరంగా వుంది. ఇది మన వల్ల అయ్యే పని కాదనిపించింది! అక్కడే తెలిసింది రైల్వే రోడ్‌లో వున్న కొఠారి మెడికల్స్‌లో రద్దయిన నోట్లకు మందులు అమ్ముతున్నారని. నాకు చాలా ఆనందం కలిగింది. నాకు వున్న రోగాలను గుర్తు చేసుకున్నాను. భవిష్యత్‌లో నాకు వచ్చే అవకాశం వున్న రోగాలను ఉహించుకున్నాను. ఒక కాగితం తీసుకుని ఇంటర్నెట్‌లో శోధించి మందుల లిస్ట్ రాసుకున్నాను. షాప్ ముందు కూడా క్యూ వుంది. మరీ పెద్దది కాదు. క్యూ లో నించున్న అరగంట తర్వాత నా వంతు వచ్చింది. నేనిచ్చిన లిస్టు లోని మందులన్నీ ఇచ్చి బిల్లు పంతొమ్మిది వందల ఎనభై అన్నాడు. రెండు వెయ్యి నోట్లు ఇచ్చాను. రెండు పది నోట్లు ఇచ్చాడు. ఎనభై వేల కంటే ఈ ఇరవై రూపాయలు చాలా విలువైన వని అనిపించింది.
తిన్నగా రాజస్థాన్ టీ స్టాల్ దగ్గర టీ తీసుకొని తాగుతున్నాను. అడుక్కొనే సాదువు నాదగ్గర కొచ్చి “ప్రొద్దుట నుండీ ఏమీ తినలేదు, తాగలేదు. ఈ రోజు భిక్షం వేసే వారే కరువయ్యారు సాబ్!” అన్నాడు మిగిలిన పది ఇచ్చి అతనికీ టీ ఇప్పించాను. నా ప్రక్కనే నిలబడి టీ తాగుతున్నాడు. అతని దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర చలామణిలో వున్న డబ్బులేదు. మేమిద్దరం ఒకటే!!
గంగా తీరానికి వచ్చేసాను. ఏ ఇద్దరు మాట్లాడుకొంటున్నా ఇదే విషయం. పిచ్చెక్కిపోతుంది. అలా నడుచుకుంటూ రామ్ ఝాలా వరకూ వచ్చేసాను. అక్కడ లాలుబాయ్ టీ బంక్ వుంది. ఎప్పుడొచ్చినా అక్కడ టీ తాగి ఝాలా అవతలి వైపుకు వెళతాను. ఝాలా పక్కనే కూర్చున్న రెండు కాళ్ళూ చచ్చు పడిపోయిన మంగల్‌కు నా దగ్గరున్న చిల్లర నాణాలలో కొన్ని ధర్మం చేసి ముందు కెళతాను. ఆ రోజు లాలుబాయ్ టీ బంక్ వైపు చూడనట్టుగా ముందుకెళ్ళిపోయాను గానీ మంగల్ నమస్కారాల నుండి తప్పించుకోలేక పోయాను. జేబులో చెయ్యి పెడితే ఐదు వందల నోటు బయటకు వచ్చింది. ఉన్నవవేగా! మంగల్ చేతిలో పెట్టాను. ముఖం అదోలా పెట్టి “ఇది చెల్లదు సార్. రద్దయిపోయింది.” అంటూ నా చేతిలో పెట్టేసాడు. నేను చాలా నిస్సహాయంగా చూస్తూ ముందు కెళ్ళిపోయాను. ఝాలా అవతలి వైపు అంతా తిరిగి మళ్ళీ ఇవతలికి వచ్చేసాను.
“ఇదర్ ఆయీయే సాబ్!” అంటూ మంగల్ పిలిచాడు.
దగ్గర కెళ్లాను. నా చెయ్యి పట్టుకొని అందులో పది రూపాయల నోటు పెట్టి “ఈ రోజు మీరు చాయ్ కూడా తాగలేదు. పరిస్థితి నాకు తెలుసు. కాదనకండి. వెళ్లి చాయ్ తాగండి” అన్నాడు.
నాకు చాలా సిగ్గనిపించింది. నిన్నటి వరకూ నేను అతనికి ధర్మం చేసే వాడిని! ఈ రోజు అతనే నాకు ధర్మం చేసాడు. టీ తాగేసి ఎక్కడా ఆగకుండా గంగా తీరంలో నడుచుకుంటూ ఆశ్రమానికి వచ్చేసాను. కుటీరానికి వెళ్లిపోయాను. ఆ రాత్రి డిన్నర్ చేయాలని పించలేదు. సత్సంగానికి కూడా వెళ్ళలేదు. స్నానం చేసి మంచం ఎక్కేసి రజాయ్ కప్పేసుకున్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. మాగన్నుగా నిద్ర పట్టినా.. కల.. కలలో నా కుటీరమంతా ఐదు వందలూ, వెయ్యి నోట్లతో నిండి పోయినట్టు.. అందులో నేను కూరుకు పోయినట్టు!
ఇంత చిన్న మొత్తానికే నేను ఇలా ఇదయిపోతుంటే లక్షల కోట్ల నల్ల ధనం వున్నవారు ఏమి చేస్తున్నారో అనిపించింది. ఏదో ఒకటి చెయ్యాలి ఈ పరిస్థితి నుండి విముక్తి పొందాలి! వేదాంత శాస్త్రం దీని గురించి ఏమి చెబుతుందో..?. అర్ధరాత్రి దాటాక నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున మెలకువ వచ్చేటప్పటికి అవధూత అఖాడా నుండి ఒక నైష్ఠిక బ్రహ్మచారి చేస్తున్న కైవల్య ఉపనిషత్తు దాంటింగ్ వినిపిస్తుంది.
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః।
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశన్తి॥
వెంటనే లేచి స్నానం, నిత్య కర్మలు పూర్తి చేసుకొని మా కోర్స్ కో ఆర్డినేటర్ రవీంద్ర కౌల్ కుటిరానికి వెళ్లాను. అంత ప్రొద్దుటే వెళ్లడంతో కొద్దిగా కంగారుగా “క్యా బాత్ హై రెడ్డీజీ?” అన్నాడు.
నా దగ్గరున్న రద్దయిన నోట్ల వివరాలు చెప్పి ఆశ్రమంలో వాటిని విరాళంగా గానీ మరో విధంగా గానీ తీసుకుంటారా? అని అడిగాను
వెంటనే అతను మేనేజర్ వీరేంద్ర పాటిల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
“తీసుకొంటారట! కాకపొతే డిమోనిటైజేషన్‌కు ముందు రోజు అంటే నవంబర్ 7వ తేదీన తీసుకున్నట్టు రశీదు ఇస్తారట!” చెప్పాడు రవీంద్ర కౌల్. వెంటనే కుటీరానికి వెళ్లి నా దగ్గరున్న ఎనభై ఒక్క వెయ్యి తెచ్చి ఇచ్చేసాను. కొండంత భారం దించుకున్నట్టయింది. భోజనశాలలో టీ తాగి గంగ ఒడ్డుకు వచ్చి ప్రవాహాన్ని గమనిస్తూ కూర్చున్నాను. నిన్నటి నా మానసిక వైక్లభ్యం తొలగిపోయింది. గంగా ప్రవాహం చాలా నిర్మలంగా, ప్రశాంతంగా వుంది!!!
*స్వస్తి*