అద్వైత్ ఇండియా-28

0
3

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రూథర్‍ఫర్డ్, రాబర్ట్ ఆదేశాల మేరకు వారి ప్రాంతీయ శ్రేయోభిలాషులు.. పోలీసులు అల్లూరి సీతారామరాజుగారి కోసం తీవ్రంగా వెతుకుతారు. 1924 మే ఆరవ తేదీన శ్రీరాజుగారి అతి సన్నిహిత సహచరుడు అగ్గిరాజుగా ప్రసిద్ధికెక్కిన పేరిచర్ల సూర్యనారాయణ గారిని పోలీసులు పట్టుకుంటారు. ఆయన ద్వారా సీతారామరాజు ఆచూకీ తెలుసుకుంటారు. సీతారామరాజును బంధించి, కొయ్యూరుకు తీసుకువస్తారు. రాజమండ్రిలో 1924 మే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయం. నరసింహశాస్త్రి, వసుంధర వారి యింటి వరండాలో కూర్చొని వున్నారు. సావిత్రి యింటి ముందున్న పూల మొక్కలకు పైపుతో నీళ్ళు పెడుతూంటుంది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై కారుచీకట్లు కమ్ముకొస్తాయి. సూర్యుడు కనుమరుగైపోతాడు. తూర్పు దిశ నుండి పెద్ద తార ఎంతో వెలుగుతో నేల రాలుతుంది. దాన్ని చూసిన ముగ్గురూ ఆశ్చర్యపోతారు. సావిత్రి దాని గురించి భర్తని అడిగితే, ఎవరో మహనీయులు నేల రాలనున్నారని చెప్తారు శాస్త్రి. ఆయన మనసులో అల్లూరి సీతారామరాజు మెదిలి, వారిని రక్షించమని భగవంతుని ప్రార్థిస్తారు. అదే సమయంలో కొయ్యూరులో ఆంగ్లేయులు సీతారామరాజుని కాల్చి చంపుతారు. అద్వైత్ లండన్‍కి వెళ్ళి ఏడు నెలలు గడుస్తాయి. ఈ కాలంలో అతను తండ్రికి ఏడు ఉత్తరాలు రాశాడు. వాటికి జవాబు రాసిన శాస్త్రి గారు సీత గర్భవతి అని తెలిసినా, ఆ విషయం ఉత్తరాల్లో అద్వైత్‍కి రాయలేదు. ఎన్నాళ్ళయినా అద్వైత్ తన పేరు మీద ఉత్తరం రాయకపోయేసరికి నిరాశ చెందుతుంది సీత. ఆమెకు నెలలు నిండుతుంటాయి. సుమతికి నొప్పులొచ్చి, ఆసుపత్రిలో ఆడపిల్లను ప్రసవిస్తుంది. ఆ శుభవార్తను నరసింహశాస్త్రిగారు అద్వైత్‌కి, రాఘవకి ఊత్తరాల ద్వారా తెలియజేస్తారు. పాప బాలసారె వేడుకకి రాఘవ వస్తాడు. వేడుక ఘనంగా ముగుస్తుంది. తర్వాత చెల్లెలితో మాట్లాడుతూ, బావ ఉత్తరాలు రాస్తున్నాడా అని అడిగితే, లేదని చెప్పి, నీకు రాశాడా అని అడుగుతుంది. వారం క్రితం ఓ ఉత్తరం వచ్చిందని చెప్తాడు. నువ్వు గర్భం దాల్చిన సంగతి బావకి తెలుసా అని అడిగితే, మామయ్యగారు తెలిపినట్లు లేదు అని అంటుంది సీత. తాను భద్రాచలం వెళ్ళాకా అద్వైత్‍కి ఉత్తరం రాసి విషయం తెలియజేస్తానంటాడు. ఈలోపు అల్లూరి సీతారామరాజుగారి మృతి విషయం తెలుస్తుంది. రాఘవ కలత చెందుతాడు. కృష్ణదేవిపేటకు వెళ్ళీ అల్లూరి సమాధి వద్ద దుఃఖిస్తాడు. ఈ బాధలో సీతకు చెప్పినట్టుగా, అద్వైత్‍కి ఉత్తరం వ్రాయలేకపోతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 55:

భద్రాచల ప్రాంతపు అడవుల్లో ఆంగ్ల ఫారెస్టు అధికారి రిచ్చర్డ్ రాఘవ బాస్.. రాబర్ట్ తమ్ముడు.. కొందరు స్థానికులను తన గుప్పిట్లో పెట్టుకొని టేకు చెట్లను నరికించి లారీలకు ఎక్కించి విశాఖపట్నం.. మద్రాస్ పంపుతూ బాగా సొమ్ము చేసుకొనేవాడు. పట్టపగలు త్రాగి ఆ వన్యసీమకు తానే సర్వాధికారిగా వ్యవహరించేవాడు. కంటికి ఇంపుగా కనుపించిన ఆటవీక స్త్రీల పొందును ఆశించేవాడు. కొందరు దళారులు చెప్పే మాటలకు.. వారి యిచ్చే పైసలకు వన్యకాంతలు కొంతమంది లొంగిపోయారు. విషయాన్ని తమ మొగవారికి చెబితే.. తెల్లవారు వారిని కాల్చి పారేస్తారని భయపడ్డారు. నిజాన్ని తమలోనే దాచుకొన్నారు.

అధికారం చేతిలో వుందని హద్దులు దాటి.. మానవత్వాన్ని.. మంచినీ.. నీతిని.. న్యాయాన్ని.. మరచి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తే.. ఒకనాటికి పర్యవసానం.. చాలా విపరీతంగా వుంటుంది.

ఆ గూడెం నాయకుడు గంటన్న కూతురు వెన్నెలపై రిచ్చెర్డ్ చూపు పడింది. తనతో వుండే దళారులకు తన కోర్కెను తెలియజేశాడు.

వెన్నెల వయస్సు పద్దెనిమిది. అభం శుభం తెలియని అమాయకురాలు. దొర కోర్కెను తనకు తెలియజేసిన వారిని కసిరి.. బెదిరించి.. తిట్టి.. వెళ్ళి విషయాన్ని గంటన్నకు చెప్పింది. గంటన్నకు రాఘవకు మంచి స్నేహం.. కారణం రాఘవ తత్వం.. ఎప్పుడూ సరదాగా మాట్లాడే స్వభావం.. ఆ ఆటవీకులను రాఘవ అభిమానించే విధానం..

రిచ్చర్డ్.. తత్వాన్ని గురించి విన్న గంటన్న ముందు నమ్మలేదు.. యిప్పుడు విషయం తన ఇంటి వరకూ వచ్చినందున.. రిచ్చర్డ్‌పై కోపం, పగ గంటన్న మనస్సున చోటు చేసికొన్నాయి. విషయాన్ని రాఘవకు చెప్పాడు. గంటన్న అబద్ధం చెప్పడనే నమ్మకం వున్న రాఘవ.. రిచ్చర్డ్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

గంటన్నతో కలసి అర్ధరాత్రి వేళ రిచ్చర్డ్ బసకు వెళ్లాడు. ఆ సమయంలో.. రిచ్చర్డ్ మరి ముగ్గురు తెల్లవారు కలసి తాగుతూ వారి వారి ప్రతాపాలను గురించి ముచ్చటించుకుంటున్నారు.

వారి సంభాషణ ఆంగ్లంలో సాగుతూ వుంది.

“బాస్ ఆర్డర్.. ఏదైనా సరే నేను నిర్భయంగా చెప్తాను. నాలుగు సంవత్సరాల క్రిందట బండిలో వెళుతున్న వారిని కాల్చి చంపాను. వారు మన.. బాస్ వూహించినట్లుగా విప్లవకారులు కాదు.. భార్యాభర్తలు.. అమాయకులు.. అయినా నా గురికి వారు బలైపోయారు. నా గురి ఎన్నటికీ తప్పదు” వికటాట్టహాసం చేశాడు రిచ్చర్డ్.

రాఘవ.. అంతా విన్నాడు. అతని మస్తిష్కంలో ఆ చనిపోయిన వారిని గురించి ఆలోచన..

వారు వేరెవరో కాదు. రాఘవ తల్లి.. తండ్రి..

అతని కళ్ళ నుండి నీళ్ళు.. మనస్సున ఆవేదన..

ఏడుస్తున్న రాఘవను చూచి గంటన్న..

“దొరా!.. ఎందుకు ఏడుస్తుండావు?..” మెల్లగా ఆందోళనతో అడిగాడు గంటన్న.

రాఘవ గంటన్న చేతిని తన చేతిలోనికి తీసుకొని కొంత దూరం నడిచి ఆగిపోయాడు. అతని ముఖంలోకి చూస్తూ..

“గంటన్నా!.. ఆ రిచ్చర్డ్ నా తల్లిని తండ్రిని చంపాడు..” భోరున ఏడుస్తూ ఆవేశంగా చెప్పాడు. “ఏంది దొరా!..” ఆశ్చర్యపోయాడు గంటన్న.

“నేను చెప్పింది నిజం గంటన్న. వాడు తన తోటి వారితో ఆ విషయాన్ని గురించి ఇంగ్లీష్‌లో చెప్పాడు”

“అది జరిగి ఎంత కాలం అయింది దొరా!..”

“నాలుగు సంవత్సరాలు..”

“మరి మనం ఇప్పుడు ఏం చేయాలి దొరా!..” దీనంగా అడిగాడు గంటన్న.

“ఆ రిచ్చర్డ్‌ను చంపాలి గంటన్నా!.. యిలాంటి పాపులు యీ మన భూమి మీద బ్రతికి మనలను శాసించకూడదు. గంటన్నా వాణ్ణి నేను చంపుతాను” కసిగా చెప్పాడు రాఘవ.

“ఎప్పుడు దొరా!..”

“యిప్పుడు కాదు.. వాళ్ళు చాలా మంది వున్నారు.. సమయం చూచి వాణ్ణి చంపాలి, పద” ఆవేశంగా చెప్పాడు రాఘవ.

ఇరువురూ గూడానికి చేరారు. రాఘవ తన తల్లిదండ్రులను గుర్తు చేసికొని ఏడవసాగాడు. అతని వాలకాన్ని చూచి గంటన్నకు ఏడుపొచ్చింది.

“దొరా!.. వాడి మీద నీకు పగ.. నాకూ పగ.. నీవు చెప్పినట్టుగానే వాణ్ణి దారి కాచి ఏసేద్దాం.. నీవు ఏడవకు.. నీవు ఏడవకు!..” అనునయించాడు గంటన్న.

ఆ రాత్రి గంటన్న అతని ఇల్లాలు ఎంతగా బ్రతిమాలినా రాఘవ ఏమీ తినలేదు. ఏడ్చి ఏడ్చి అలసి.. ఒరిగి పడిపోయి నిద్రపోయాడు.

మరుదినం.. ఉదయం.. నిద్ర లేచి రాఘవ తన నిలయానికి బయలుదేరే దానికి సిద్ధం అయినాడు. గంటన్న అతన్ని సమీపించాడు.

“దొరా!.. నేను ఓ మాట చెబుతాను. వినుకుంటరా!..”

“చెప్పు గంటన్నా!..

“మీరు చాలా మంచోళ్ళు. మీలాంటోళ్ళు నిండు నూరేళ్ళు చల్లగుండాలి. కోపతాపాలకు పోయి కష్టాలపాలు కాకూడదు దొరా!.. ఆ తెల్లోడి సంగతి నేను చూసుకొంటా. మీరు చేయాలనుకొన్న పని నేను చేస్తా. మీరు శాంతంగా మీ పని చూచుకోండి దొరా!..” అనునయంగా చెప్పాడు గంటన్న.

అంతా విని.. ‘సరే’ అన్నట్లు రాఘవ తల ఆడించి.. మౌనంగా వెళ్లిపోయాడు.

అధ్యాయం 56:

వసుంధర.. మనస్సున, తన సొంత మనవడు రాఘవకు వివాహం కాలేదని.. మనవరాలు సీత ఎవ్వరికీ చెప్పకుండా అద్వైత్‍ను వివాహం చేసికొన్నదని ఎంతో ఆవేదన. ఆ కారణంగా రాఘవ వివాహాన్ని ఘనంగా చేయించాలని ఆమె ఆశ. ఆ విషయంలో జాతకంలో రాఘవకు కళ్యాణ యోగం ఎప్పుడు వుందో చూడమని నరసింహశాస్త్రిగారిని కోరింది. శాస్త్రిగారి అక్క కోర్కె ప్రకారం.. రాఘవ జాతకాన్ని చూచారు. వారికి.. రాఘవకు వివాహయోగపు చిహ్నములు జాతకంలో గోచరించకపోగా.. గ్రహవీక్షణాలు.. అవి వున్న స్థానాలను బట్టి.. రాఘవకు త్వరలో మృత్యుగండం వున్నట్లుగా గోచరించింది.

జాతక గ్రహసంచార రీత్యా తాను గణించిన దాన్ని మరోసారి గణించారు శాస్త్రిగారు. ప్రథమాన వారికి గోచరించిన ఫలితం.. మరోమారు ధృవీకరణ అయింది. విచారంగా జాతకాన్ని మూసివేశారు శాస్త్రిగారు.

పెద్దలందరూ.. తమ చేతులతో పెంచి పెద్ద చేసినవారు (పిల్లలు) తమ జీవిత కాలంలో హాయిగా వుండాలని.. వారి కళ్ళ ఎదుట తాము రాలిపోవాలని కోరుకొంటారు. అది సహజమైన వాంఛ. అలా కాకుండా.. వారి కళ్ళ ఎదుటనే ఆ పిల్లలు అల్ప ఆయుషులుగా పెద్దలను విచారసాగరంలో ముంచి వెళ్ళిపోతారని తెలిసిన ఏ వ్యక్తి శాంతంగా బ్రతకలేడు. ఆవేదనకు గురి అవుతాడు.

ప్రస్తుతం నరసింహశాస్త్రిగారి పరిస్థితీ అంతే.. నిట్టూర్చి కళ్ళు మూసుకొన్నాడు.

“ఏరా! నరసింహ!.. రాఘవకు వివాహ యోగం త్వరలో వుందా లేదా!..” అడిగింది వసుంధర.

“అక్కా!.. గ్రహవీక్షణం ప్రస్తుతంలో సరిగా లేదు..” ముక్తసరిగా జవాబు చెప్పాడు నరసింహశాస్త్రి.. తనకు గోచరించిన యథార్థాన్ని తన సోదరికి ఎలా చెప్పగలడు?..

“మరి ఎంత కాలం ఆగాలేం?..” వసుంధర ప్రశ్న.

‘ఏమని జవాబు చెప్పాలి!..’ అని విచారంగా అనుకొని “కొంతకాలం జరగాలి అక్కా!..” అన్నారు నరసింహశాస్త్రి. పంచాంగాన్ని జాతకాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు.

అంతా విని.. వారి ముఖ భంగిమలను గమనించిన సావిత్రి వారిని అనుసరించింది.

“ఏమండీ!..”

“సావిత్రి.. నేను భద్రాచలం దాకా వెళ్ళి రావలసిన పని వుంది. మరో గంటలో బయలుదేరుతాను” అన్నాడు.

తాను ఏమీ చెప్పకముందే వారు తన నిర్ణయాన్ని తెలియజేసినందు వలన సావిత్రికి అనుమానం కలిగింది. కానీ విషయం ఏమిటని శాస్త్రిగారిని నిలదీసి అడిగే ధైర్యం.. సాహసాలను ఆమె అలవరచుకోలేదు. కొన్ని క్షణాల తర్వాత..

“నేను మీతో రావచ్చా!..” మెల్లగా అడిగింది.

“పని మీద వెళుతున్నానని చెప్పానుగా సావిత్రీ!.. అంటే.. నీవు నాతో వచ్చేదానికి వీలుకాదని అర్థం!..”

శాస్త్రిగారు చెప్పిన తీరులో సావిత్రికి అనుమానంతో.. అవగాహన అయింది. “సరేనండీ.. జాగ్రర్తగా వెళ్ళి రండి..” చెప్పింది సావిత్రి.

సీత వారి సంభాషణను విన్నది.

“మామయ్యా!.. అన్నయ్యను కలుసుకోగలరా!..” అడిగింది సీత.

ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు చూచి.. అవునన్నట్లు తల ఆడించారు నరసింహశాస్త్రి. నోరు తెరచి వారు.. బదులు చెప్పకపోవడం.. సావిత్రికి.. సీతకు ఆశ్చర్యాన్ని కలిగించింది. శాస్త్రిగారు సిద్ధమై.. తన సోదరికి చెప్పి భద్రాచలానికి బయలుదేరారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here