మహాప్రవాహం!-45

1
4

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[బేబమ్మ పుట్టిన రోజు వేడుకలకు రుక్మాంగద రెడ్ది, యశోద తప్ప మిగిలిన బంధువులంతా హాజరవుతారు. వేడుక ఘనంగా జరుగుతుంది. ఫంక్షన్ ముగిసాకా, కేశవరెడ్డి దంపతులు, రుక్మిణి దంపతులు – సుజాతమ్మ ఇంటికి చేరతారు. భోజనాలయ్యాక అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు. వచ్చే నెలలోనే సిన్నాయన పిన్నమ్మల పెండ్లిరోజు. ఇరవైమూడు జూను, దాంట్లో ఒక విశేసమున్నాది, చెప్పుకోండి చూద్దాం అని కేశవరెడ్డి అంటే, ఎవరూ చెప్పలేకపోతారు. అప్పుడు తానే చెప్తాడు వాళ్ళది యాభైవ పెళ్ళిరోజని. అందరూ కల్సి ఆ వేడుకని బొమ్మిరెడ్డి పల్లెలో ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. నాలుగు రోజుల తర్వాత అందరూ కర్నూలులో పెదరెడ్డి ఇంట్లో కలిసి ఏం చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించుకుంటారు. చర్చల అనంతరం బొమ్మిరెడ్డి పల్లెలోని పెదరెడ్డి ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చాలనీ, పాడుబడిన రామాలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయిస్తారు. ఊరి నుంచి వెళ్ళి వేర్వేరు చోట్ల రకరకాల వృత్తులలో, ఉద్యోగాలలో స్థిరపడ్డ ఆ ఊరి పిల్లలను వేడుకకి ఆహ్వానించాలని డా. నరసింహారెడ్డి అంటాడు. విషయం తెల్సిన బడేమియా, సరెడ్డి అనుమంత రెడ్డి, మానుకింది మద్దయ్య, రామానుజశెట్టి కొడుకు, కుంటి సుబ్బారెడ్డి కొడుకు, గొల్లమద్దిలేటి అందరూ వచ్చి రుక్మాంగద రెడ్డిని కలిసి – వేడుక గురించి విన్నామని, ఇది తమందరి పండుగ అని అంటారు. అప్పుడు పెదరెడ్డి కొడుకుని బయటకి రమ్మని పిలిచి – ఊరి వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్లు తీసుకోమని చెప్తాడు. బడేమియా, అనుమంత రెడ్డి చెప్పిన పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకుంటాడు నరసింహారెడ్డి. కేశవరెడ్డి నాలుగు రోజులకొకసారి వచ్చి మహడీకి చిన్న చిన్న రిపేర్లు చేయించి, రంగులు వేయిస్తాడు. నరసింహా రెడ్డి ఫోన్‍లు చేసి అందరినీ ఆహ్వానిస్తాడు. రుక్మాంగద రెడ్డి కేశవరెడ్డిని అనంతపురానికి పంపించి, పద్మనాభయ్య స్వామిని స్వయముగా పిలిచి రమ్మని చెప్తాడు. ఆయన రెడ్డికి ఫోన్ చేసి అభినందించి కొన్ని యాగాలు చేయించుకోమంటాడు. సరేనంటాడు రెడ్డి. అందరూ బాగుండాలని ఏదైనా క్రతువు చేయిద్దామనుకుంటున్నానీ, పద్మనాభస్వామినే వచ్చి చేయించమని కోరుకుంటాడు. ఆయన ఒప్పుకుని యాగ నిర్వహణకి కావల్సిన వసతులు, ఏర్పాట్లు చేయించమని చెప్తాడు. అందరూ కర్నూలు, బొమ్మిరెడ్డి పల్లెకి చేరుకుంటారు. పద్మనాభయ్య బృందానికి మహాడీలోనే బస ఏర్పాటు చేస్తారు. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]హా సుదర్శన యాగము చాలా బాగా జరిగింది. “పెదరెడ్డి తమ యాభయ్యవ పెండ్లి రోజున జనమంతా బాగుండాలని యాగము చెయ్యిస్తుండాడంట” అని చూడటానికి శానామంది వచ్చినారు.

23వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపే అన్నీ పూర్తయి, పూర్ణాహుతి జరిగింది. రుక్మాంగద రెడ్డి దంపతుల తోనే చేయించినాడు పద్మనాబయ్య స్వామి.

రెండు గంటలకు అన్నదానము మొదులయింది. సుమారు వెయ్యిమంది భోంచేసినారు. చుట్టుపక్కల ఊర్లనించి గూడ వచ్చి తిన్నారు. బూందీ లడ్డు, వెజిటబుల్ పలావు, మిర్చి బజ్జీ, రైతా, మామిడికాయ పప్పు, నించుడు వంకాయ, మునక్కాయచారు, పెరుగు. ఇవీ అన్నదానములో వడ్డించిన అధరువులు.

సాయంత్రము ఐదుగంటలకు కొత్తగా తయారయిన రాముల దేవళములో సభ. ముందు పెదరెడ్డి దంపతులు రాముల వారి దర్శనం చేసుకొని ప్రసాదము, హారతి తీసుకున్నారు. ధ్వజస్తంభము ఎనక చాలా స్థలముంది. పది కుర్చీలు, రెండు టేబుల్లతో వేదిక ఏర్పాటయింది. వేదిక మీద పెదరెడ్డి దంపతులు, పద్మనాబయ్య సామి, బడేమియా, కేశవ రెడ్డి, సుజాతమ్మ, డాక్టర్ దంపతులు కూర్చొన్నారు.

ముందు వరుసలో సోఫాలు ఏసినారు. వెనక ప్లాస్టిక్ కుర్చీలు అన్నీ నిండిపోయి ఎనక శానామంది నిలచినారు. కొందరు చుట్టుపక్కల మిద్దె లెక్కినారు

ముందు పద్మనాభయ్య సామి ఒక ప్రార్థనా శ్లోకము పాడినాడు. “కస్తూరీతిలకం లలాటఫలకే..” అన్నది. అంత వయసు మీద పడినా సామి గొంతులో వణుకు లేదు.

సభకు అధ్యక్షత వహించవలసినదిగా బడేమియాను కోరినారు. ఆయప్ప తొలిపలుకులు జెప్పినాక, డాక్టరు నరసింహారెడ్డి సభను నడిపించినాడు.

“అందరికీ నమస్కారం. ఈ రోజు శానా మంచిరోజు. మా అమ్మనాయినల 50వ పెండ్లిరోజు మన ఊర్లో ఇంత బాగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మన ఊరినించి వెళ్లి రకరకాల వృత్తులలో ఉద్యోగాలలో రాణించిన మన ఊరికి పేరు తెచ్చిన వారికి నా అభినందనలు. వారిలో కొందరు మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిఉన్నారు. వారికి మా కృతజ్ఞతలు” అన్నాడు.

ముందు వేసిన సోఫాలలో ప్రదీపు, మాదవ, చలమేశు, వీర, కొండారెడ్డి, ఆయన బిడ్డ సుజాత, ఆమె భర్త, కొడుకు కంబిరెడ్డి, హెడ్మాస్టరు శివ కోటేశ్వరరావు, పార్వతీశం సారు,  దావీదు, మార్తమ్మ, మేరీ, శశాంక సారు, జహంగీరు ఇంకా కొందరు కూర్చున్నారు.

దేవళం బయట ఒక కారు వచ్చి నిలబడింది. దాంట్లోంచి కేదార.. అదే నిశ్చలానంద మహరాజ్ జీ దిగినారు. నేరుగా వచ్చి వేదిక మీదున్న అమ్మానాయినలకు పాదనమస్కారము చేసినాడు. ఆయన వెంట ఇద్దరు శిష్యులు వచ్చినారు. జనం కేదారను గుర్తుపట్టలేదు. ఎవరో స్వామి అనుకున్నారు. చానా రోజులకు కొడుకును చూచిన ఆనందము పద్మనాభయ్య సామి దంపతులలో కనబడినాది.

“ఇప్పుడు మన ఊరికి గురుతుల్యులు ఐన పద్మనాబయ్యస్వామి గారిని మాట్లాడవలసినదిగా కోరుతున్నాను” అని చెప్పి మైకు స్వామికిచ్చినాడు నరసింహరెడ్డి.

“సభాయై నమః” అని ప్రారంభించినాడు స్వామి. “ముందుగా పెదరెడ్డి దంపతులకు స్వర్ణోత్సవ ఆశీర్వచనములు అందచేస్తున్నాను. నాయనా, కాలమహప్రవాహములో మనందరము కొట్టుకొని వచ్చి ఇట్లున్నాము. ఇంకా ఈ ప్రవాహములో మన ప్రయాణము ఉంది. ఇది మన మరణముతోగాని అంతము కాదు.

మానవ జీవితము అనూహ్యము అంటే ముందేం జరుగుతుందో ఊహించలేము. మా తరం వాండ్లము ఇప్పటికీ అనుకుంటుంటాము – మా కాలంలో.. అట్లా ఉండేది శానా బాగుండేది అని. అదంతా మన భ్రమ. కాలము నిరంతర గమనశీలమైనది. మార్పు దానికి అతి సహజము. దాన్ని స్వీకరించడం తప్ప మనము చెయ్యగలిగిందేమో లేదు. మనిషి పురోగమనము అదంతట అదే జరుగుతుందా, మన తెలివితేటలు, కృషి, ప్రయత్నము ఇవేవీ అవసరము లేదా అనే ప్రశ్న వస్తుంది. అవన్ని ఉన్నాయి. ఉంటాయి. కాని వీటన్నిటిని మించి కాలమనే ఒక బలీయశక్తి మన జీవితాలను నిర్దేశిస్తూ ఉంటుంది. మహాకవి కాళిదాసంతటి వాడు అన్నదేమంటే, ‘పురాణమిత్యేవ న సాధు సర్వమ్’. అంటే, పాతదయినంత మాత్రాన అంతా మంచిది కాదు. అట్లే కొత్తదంతా చెడ్డది కాదు. కొన్ని వందల సంవత్సరాల కిందటే ఎంత బాగా చెప్పాప్పినాడు చూడండి. ఈ రోజు మేము పురోహితులము కూడా కార్లలో తిరుగుతున్నాము, సెల్‍ఫోన్‌లలో మాట్లాడుతున్నాము. చివరికి ఆన్‌లైన్ పూజలు చేయించేంతవరకు వచ్చింది. కాలము మార్పు అనే రూపంలో మనందరి జీవితాలను ఆవరిస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మనే గీతలో ‘కాలోస్మి’ అని చెప్పుకున్నాడు. అంటే ‘నేను కాలమునై ఉన్నాను’ అని. కాలము భగవంతుడని గ్రహించాల. ‘నిమిత్తమాత్రం భవ కౌంతేయ’ అన్నట్లుగా, ఈ కాలమనే జగన్నాటకంలో మనం సాధనాలము మాత్రమే, అట్లని మానవ ప్రయత్నము మరువకూడదు.

పెదరెడ్డి తన విశాలమైన భవంతిని వృద్ధాశ్రమముగా మారుస్తున్నాడని విని ఆనందించినాను. మాకు సుంకులమ్మ గుడి వద్ద కొంత పొలమున్నాది. ఈ మధ్య రియల్ ఎస్టేటు బాగా అభివృద్ధి జరిగి చేన్ల రేట్లు బాగా పెరిగినాయని తెలిసింది. మా పొలాన్ని సరైన ధరలో అమ్మి ఆ సొమ్మును వృద్ధాశ్రమమునకు మా వంతు విరాళముగా సమర్పిస్తున్నాను.”

సభలో చప్పట్లు!

“స్వస్తి” అని పద్మనాభయ్య కూర్చున్నాడు.

“తర్వాత, వారి కుమారులు శ్రీ నిశ్చలానంద మహారాజ్ గారిని వేదిక దగ్గరకొచ్చి, ప్రసంగించవలసినదిగా కోరుతున్నాను” అన్నాడు డాక్టరుగారు.

మహరాజ్ వచ్చి మైక్ ముందు నిలబడి “ప్రకృతిమాతా కీ జయ హో!” అని నినదించినాడు. సభకులందరితో పలికించినాడు. అప్పుడర్థమయింది జనానికి. ఈయన పద్మనాభయ్య స్వామి కొడుకని తెలిసిపోయినాది. ఆశ్చర్యంతో చూడసాగినారు.

“పరమాత్మ సంతానమైన మీకందరికీ శుభం! నేను ఈ ఊరివాడినే కాని ప్రస్తుతం ఈ ప్రపంచమంతా నా ఊరే. మా గురువుగారు ప్రభుదత్త మహరాజ్ గారు చెప్పే ఈ సిద్ధాంతమే నన్నాకర్షించి సన్యాసము స్వీకరించేటట్లు చేసింది. మా నాయన గారు ఎంతో వ్యయప్రయాసలు పడి నన్ను నూక్లియర్ ఫిజిక్సుతో పి.హెచ్.డి వరకు చదివించినారు. తర్వాత పుణెలో న్యూక్లియర్ రీసర్చు సెంటరులో సైంటిస్టుగా మంచి ఉద్యోగం వచ్చింది. అవన్నీ వదులుకొని ప్రకృతి సేవకునిగా దీక్ష తీసుకున్నాను. ప్రస్తుతం ఒరిస్సాలోని ‘కటక్’ నా కార్యస్థానం” అంటూ తమ ఆశ్రమ కార్యకలాపాలను ప్రజలకు వివరించినాడు మహరాజ్.

“ఒక విధంగా ఇప్పడే మా నాయన గారు చెప్పిన కాల మహా ప్రవాహ సిద్ధాంతము నాకు గూడ వర్తిస్తుంది. కాలము అనేది నిర్వచించటానికి వీలు లేని ఒక మహాశక్తి. ఎవ్వరయినా దాని ముందు తలవంచవలసినదే. మహాకాలుడు, కాలుడు అన్న పదలను యమునికి పర్యాయపదాలుగా వాడతారు. యముడంటే ఎవరు? మృత్యువు. అంటే తప్పనిది తప్పించుకోరానిది. అదే కాల ప్రవాహం. కాలకాలుడు అంటా సాక్షాత్తు పరమేశ్వరుడు.

ఇంగ్లీషులో ‘రెవల్యూషన్’, ‘ఎవల్యూషన్’ అని రెండు. మొదటిది అనుకోకుండా జరిగే మార్పు. రెండవది క్రమంగా జరిగే మార్పు. నా ఉద్దేశ్యములో మొదటిది కూడ రెండవదానిలో అంతర్భాగమే. ఈ మారుమూల పల్లెలో ఉండిన మా తండ్రిగారు అనంతపురము చేరి తన విద్వత్తుతో అపార కీర్తిని ధనాన్ని ఆర్పించినారు. నేను పెద్ద చదువులు చదివి, ఉన్నతోద్యోగము చేసి, సంసారాన్ని త్యజింనాను. దీన్నేమంటాం? డెస్టినీ ఉందామా, ఫేట్ అందామా! కాలానికున్న విభిన్న పార్శ్వాలే ఇవి.

అయితే పుట్టిన ఊరికి నా వంతు నేను చేయాల కదా! మా ఆశ్రమం తరపున మన ఊరికి ఒక సంచార వైద్యశాలను సమర్పిస్తున్నాను. అందరూ ప్రకృతిని కాపాడండి. పరోపకారము చేయండి. ప్రకృతి మాతా కీ జయహో!” అని మైకు డాక్టరుకందించి వెళ్లిపోయినాడు మహరాజ్.

తర్వాత ప్రదీపును పిలిచినారు. “తల్లితండ్రులను వృద్ధాశ్రమములో పెట్టిపోయిన నేను ఆదర్శవంతమయిన కొడుకును కాదని నాకు తెలుసు. కాని నా భవిష్యత్తును బలిచేసుకొని ఇక్కడకు రాలేను. నన్ను క్షమించండి! నాలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. నా వంతుగా పదిలక్షల రూపాయలు పెదరెడ్డి గారి ఛారిటీ ట్రస్టుకు విరాళము ఇస్తున్నాను” అని దిగిపోయినాడు.

తర్వాత వీరబ్రమ్మం. “అందరికీ నమస్కారం. నాకు పని నేర్పించిన దేవుడు ఆదోని గౌసుమియా గారికి పాదాభివందనం. ఈ కాలాలు, ప్రవాహాలు నాకు తెలియవు. కష్టపడి పనిచేసినాను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మా నాయన కమ్మరిపని చేసిన ఊరిది. నా వంతుగా వృద్ధాశ్రమానికి కావలసిన ఉడ్‌వర్క్, మంచాలు, బెంచీలు, బోజనాల బల్లలు అన్నీ నేను చేయిస్తాను. అంతే కాకుండా మా నాయిన పేరున, అమ్మ పేరున, మన స్కూల్లో టెంతులో ఫస్టు వచ్చిన విద్యార్థికి లక్షరూపాయలు స్కాలర్‌షిప్ ఇస్తాను. మా గురువు గౌసుమియా పేరు మీద స్కూలు హాస్టలులో సౌకర్యాలు బాగుపరచడానికి మూడు లక్షలు ఇస్తాను” అని చెప్పి విరమించినాడు.

మాదవ, చలమేశు చెరొక ఐదులక్షలు ప్రకటించినారు. జహంగీరు “మా నాయిన ఏం చెప్పినాడంటే, పెదరెడ్డి పెడుతున్న ముసిలాండ్ల ఆశ్రమానికి వారానికొకసారి వెయ్యి రూపాయల పండ్లు పంపిస్తాడంట ఉచితంగా. నేను నా వంతుగా ఆశ్రమానికి ఆరు ఫాన్లు తెచ్చి బిగిస్తా” అన్నాడు. అందరూ శభాషన్నారు.

దావీదు కుతురు టి.వి.ఇ.వో మేరీ పుసంగించింది. “నేనెంత పెద్ద అధికారినైనా దావీదు మార్తమ్మల బిడ్డనే. స్వామి, మహరాజ్ గారు చెప్పింది నాకు నచ్చింది. కూలీ పని చేసి మా అమ్మ నాయన నన్ను చదివిఛినారు. వాండ్ల కోసరము నేను పెండ్లి కూడా మానుకోని ఉంటిని. కాని శశాంక గారు నా మనసును అర్థం చేసుకొని నన్ను పెండ్లి చేసుకున్నారు. ఏమండీ! ఒక్కసారి రాండి” అని భర్తను పిలిచింది మేరీ.

“నేను ఇంగ్లీషు సాహిత్యము చదువుకున్నాను. టైమ్‌ను ఎటర్నిటీ అనీ, ఇన్ఫినిటీ అనే అంటారు. ఎడతెగనిది, అనంతమైనది అని అర్థం. ‘టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్’. అంటే కాలము, అలలు ఎవరి కోసము నిలబడవని అర్థం. ‘టైమ్ ఈజ్ ఎ గ్రీట్ హీలర్’. కాలం ఒక గొప్ప ఔషధము. ఇవన్నీ నేను ఇంగ్లీషులో చదువుకున్నాను. దాని మహిమ కాకపోతే.. నా బ్యాక్‍గ్రౌండేమి నేనున్న పొజిషనేమి?”

శశాంక వచ్చి ఆమె పక్కన నిలబడినాడు. “మా అమ్మ నాయిన మార్తమ్మ దావీదుల పేరు మీద ఆశ్రమానికి కావలసిన కూరగాయల కర్చు మేము భరిస్తాము. మా ఆయన అనాథ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. పెదరెడ్డిగారి ఆధ్యర్యంలో మన ఊర్లో ఒక అనాథాశ్రమము గూడ రావాలనీ, దానికి మావంతు సహకారము కూడ ఉంటుందనీ మనవి చేస్తున్నాను “అని చెప్పి భర్తతో కలిసి దిగిపోయింది మేరీ.

“చివరగా పార్వతీశం సారుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను” అన్నాడు నరసింహారెడ్డి,

పార్వతీశం సారు వచ్చి చిరునవ్వుతో అందరికీ అభివాదము చేసినాడు. “ఈ ఊర్లో నేను ఐదారేండ్లు పనిచేసినాను. ఇక్కడే కాపురముండి పిల్లలకు ట్యూషన్లు కూడ చెప్పినాను. ప్రదీపును గైడ్ చేసింది నేనే. కాని వాడికి నేను వాండ్ల అమ్మను నాన్నను వృద్ధాశ్రమములో వదిలిపెట్టమని గైడ్ చేయలేదు.”

నవ్వులు!

“గురువులుగా మేం ఎంతోమందికి చదువు చెబుతాం, తీర్చిదిద్దుతాం. కొందరు ప్రయోజకులవుతారు. కొందరు జనానికి మంచి చేసే అధికారులౌతారు. కొందరు జాతివ్యతిరేకశక్తులు కూడా కావచ్చు. అందరికీ అదే చదువే. మరి ఎందుకిట్లా అంటే కాల మహాప్రవాహమేనేమో! మేం నిమిత్తమాత్రులమేమో!

కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసేస్తుందని సామెత. మన జీవితాలు కూడా అంతే. కాలమహా ప్రవాహంలో పోయేవి పోతుంటాయి, వచ్చేవి వస్తుంటాయి. రెండూ సహజమే. మహారాజ్ గారు కూడ నా శిష్యుడే. రెవల్యూషన్ కూడా ఎవల్యూషన్‌లో అంతర్భాగమే అని ఆయన చెప్పిన మాట చాలా శక్తివంతమైనది.

‘ఓల్డ్ ఆర్డర్ చేంజెస్, ఈల్డింగ్ ప్లేస్ టు ది న్యూ’ అన్నాడొక ఆంగ్లకవి. కానీ మానవ స్వభావ మేమంటే కొత్తను అంత త్వరగా స్వీకరించదు. పాతదే మేలంటుంది. పద్మనాబయ్య స్వామి అన్నట్లు పాతదంతా మంచిదని చెప్పలేము. మనం స్వీకరించినా స్వీకరించకపోయినా కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. కొంత కాలానికి అందరూ వాటిని స్వీకరిస్తారు.

కొన్నేండ్ల కిందట వృద్ధాశ్రమాల కాన్సెప్టే లేదు. మరి ఇప్పుడు? సమాజంలో అవి భాగమైనాయి. నీళ్లను కొనుక్కోవాల్సి వస్తుందని ఏనాడయినా అనుకున్నామా? సమాచార విప్లవం మనల్ను ముంచెత్తుతోంది. ప్రపంచీకరణ అన్నింటినీ సమూలంగా మార్చిపారిస్తుంది. నాకొద్దు, నేను మారను ఉంటే కాలం ఊరుకోదు. తనతోపాటు ఈడ్చుకపోతుంది. కొంత దూరం కొట్టుకుపోయినాక మనకు ఆ ఒరవడి అలవాటయితుంది. అందుకే ‘యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇటీజ్!’ అని అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా జీవితాన్ని స్వీకరించు. ఏ సమస్యా ఉండదు.

చివరగా ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు గొప్ప రచయిత. రావిశాస్త్రిగా ఆయన ప్రసిద్ధులు. ఆయన 1950లో, జాస్మిన్ అనే కలం పేరుతో ఒక కథ వ్రాసినారు. అది ‘భారతి’లో ప్రచురించినారు. దాని పేరు ‘ఆఖరి దశ’. ఈ రోజు మనం చర్చించిన దాన్ని ఆయన అందమైన కథగా మలిచినారు. ఆ కథను విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర ఇలా అన్నారు:

‘మానవ విలువలూ, దృక్పథాలూ క్రమంగా మారుతూ ఉంటాయనీ, మార్పులకు మనుషులెప్పుడూ సిద్ధంగా ఉండరనీ ఆయన గ్రహించారు. కౌరవులు ఓడిపోయినపుడూ, శంకరుడు బౌద్ధాన్ని దెబ్బ కొట్టినపుడూ, చివరి మొగలాయి చక్రవర్తి చనిపోయినపుడూ, భారతదేశానికి స్వాతంత్ర్యమిచ్చి ఇంగ్లీషు వాళ్ళు తమ దేశానికి వెళ్లిపోయినపుడూ, ఒక బలమైన వర్గం పుట్టి మునిగిపోయినట్లే నమ్మింది! అయితే అదొక మలుపు మాత్రమే!

కధలో  నాలుగు భాగాలుంటాయి. కాశీనగరంలో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. భీముడు గదాయుద్ధంలో దుర్యోధనున్ని తొడల మీద కొట్టి చంపాడనీ, కృష్ణుడే చెప్పి చంపించాడనీ. అధర్మం ప్రబలిపోతుంది. ప్రపంచానికి అంత్యకాలం ఆసన్నమయినట్లుంది అనుకుంటారు.

రెండోది, ఆదిశంకరాచార్యులు బౌద్ధమతాన్ని ఓడించి వైదికమత స్థాపన చేస్తున్న కాలం. ఇద్దరు బౌద్ధ భిక్షులు ‘ఈ జాడ్యం ప్రబలితే, మన సంఘాలు, మన ధర్మపద్ధతి, మన భిక్షువులు లేనినాడు ప్రపంచం చివరిదశకు వచ్చినట్లే’ అనుకుంటారు.

మూడో భాగంలో ఇద్దరు ముస్లిములు మాట్లాడుకుంటుంటారు. ‘ఔరంగజేబు పాదుషా చనిపోయినాడనీ ఇక కాఫిర్లు (హిందువులు) మనల్ను బతకనివ్వరనీ, మొగల్ సామ్రాజ్యానికీ ఆఖరు రోజులొస్తే, ఈ మహాప్రపంచానికీ ఆఖరు రోజులొచ్చినట్లే’ అని!

నాలుగోది మనకు స్వతంత్రం వచ్చిన రెండో రోజు. ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ‘బ్రిటిష్ పాలన లేకపోతే భారతదేశం సర్వనాశనమవుతుందనీ, చూస్తుంటే ప్రపంచానికీ ఆఖరిదశ సమీపించింద’నీ!.

రావిశాస్త్రి చివర్లో ఒకటే మాట అని కథను ముగిస్తాడు.

‘ప్రపంచం సాగుతూనే ఉంది!

ఇన్ని వేల సంవత్సరాల నుంచీ,

ఇన్ని యుగాల నుంచీ!’

సభికులారా! అదీ విషయం! నేను త్వరలో రిటైర్ కాబోతున్నాను. తర్వాత ఈ ఊర్లో ఉచితంగా నవోదయ, సైనిక్ స్కూలు, ఎ.పి.ఆర్.జె.సి. ఎంట్రన్సు పరీక్షలకు పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తాను. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి యాభైవేలు పెదరెడ్డి గారి ఛారిటీ ట్రస్ట్‌కు విరాళం ఇస్తాను. ఏమో! నేను నా భార్య ఇదే వృద్ధాశ్రమానికి వస్తామేమో! ఎవరికి తెలుసు? కాలమే గదా నిర్ణయించేది! సెలవు!”

సభ ముగిసింది! కాల మహాప్రవాహంతో ఈ రోజు చాలా మంచిపనులకు అంకురార్పణ జరిగింది. ఇది ఇంతటితో ఆగదు! సాగిపోతూనే ఉంటుంది. ఉండాల కూడా!

‘జీవన్ భద్రాణి పశ్యతి’

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here