కవి, కథకుడు శ్రీ కౌండిన్య తిలక్ (కుంతి) ప్రత్యేక ఇంటర్వ్యూ

0
3

[‘కథా తిలకం’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీ కౌండిన్య తిలక్ (కుంతి) గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కుంతీపురము కౌండిన్య తిలక్ గారూ.

కౌండిన్య తిలక్: నమస్కారం. ముందుగా సంచిక పత్రిక నిర్వాహకులకు నాకు ఈ అవకాశన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే నా ‘మహాభారతంలో మంచి కథలు’ ధారావాహికగా ప్రచురిస్తునందుకు ధన్యవాదములు.

~

ప్రశ్న 1. మీ కలం పేరు కుంతిఅని ఎందుకు పెట్టుకున్నారు? మీ ఇంటిపేరు నుంచి దానిని ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. కుంతిఅని చదవగానే రచయిత్రి అని పొరపడే అవకాశం ఉంటుంది కదా? అలాంటి సంఘటనలేవైనా జరిగాయా?

జ: అవునండి. కుంతీపురం మా ఇంటి పేరు. అలాంటి సంఘటనలు జరిగాయి. తరువాత సమాధానం చెప్పుకోవలసి వచ్చింది.

అందుకే ఈమధ్య కలం పేరుతో పాటు బ్రాకెట్‌లో కుంతీపురం కౌండిన్య తిలక్ అని రాస్తున్నాను.

ప్రశ్న 2. మీ ఈ 27 కథల సంపుటికి కథా తిలకంఅనే పేరు పెట్టడంలోని కారణం ఏమిటి? ‘తిలక్ కథలుపేరిటి ఇప్పటికే పుస్తకం ఉందని, శీర్షికని అలా పెట్టారా? సాధారణంగా సంపుటిలోని ఏదో ఒక కథ పేరునే పుస్తకం శీర్షికగా పెడుతుంటారు కదా? మీరెందుకు అలా వద్దకున్నారో చెబుతారా?

జ: శ్రేష్ఠమైన కథలు అన్న ఉద్దేశంతో, నా పేరు కూడా వచ్చేట్లు అలా పెట్టడమైంది. యే ఒక్క కథ పేరు పెట్టి సంకలనముగా తెచ్చినా, మిగిలిన కథలకు న్యాయం జరుగదు.

ప్రశ్న 3. “ఇందులోని కథలన్నీ మధ్య, క్రింది తరగతి ప్రజల జీవితాల నుండి పుట్టుకొచ్చినవే! కథకునిగా ఇది ఒక మంచి లక్షణం! భారతీయ సమాజంలోని 85 శాతానికి మించిన ప్రజల కొరకు వారి కథా వస్తువులనే చెప్పటం మంచి లక్షణమే కదా!” అని డా. ఆచార్య ఫణీంద్ర తమ ముందుమాటలో పేర్కొన్నారు. “ఈ కథలు కొన్ని నవ్విస్తాయి. ఏడిపిస్తాయి. అన్నింటిని మించి ఆలోంచింప చేస్తాయి. ఈ కథలు విషాదాంతం అయినా, సుఖాంతం అయినా మానవతా ఉదంతాలే కావడం విశేషం” అన్నారు శ్రీ తలపల గోపాలకృష్ణ తమ ముందుమాటలో. మీరు ఎంచుకునే ఇతివృత్తాలను ఈ వాక్యాలు ప్రతిబింబిస్తాయి. ఈ సందర్భంగా, కథా రచయితగా మీ ప్రస్థానాన్ని వివరించండి.

జ: ముందుగా నా కథాతిలకాన్ని చదివి ఆశీర్వచన వాక్యాలు రాసిన ప్రఖ్యాత కవి, గురుమిత్రులు డా. ఆచార్య ఫణీంద్ర గారికి, నవోదయ విద్యాలయ సమితి అధికారి, మిత్రులు శ్రీ తలపల గోపాల కృష్ణ గారికి నా కృతజ్ఞతలు.

అదే విధంగా పుస్తకావిష్కరణ సందర్భంగా నా పుస్తకాన్ని ఆవిష్కరించి, అందులో ఉన్న ప్రతి కథను చదివి, కూలంకషంగా విశ్లేషణ చేసిన మాన్యులు తెలంగాణ సాంస్కృతిక పూర్వ సలహాదారు శ్రీ కే.వి.రమణాచారి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

నేను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను చదివిన పుస్తకాలు, చూసిన మనుషులు, పెరిగిన వాతావరణం నా కథలకు మూలాలు. నేను చూడనిది, అనుభవించనిది, అనుభూతి చెందనిది రాయలేదు.

అలాగే నేను డిగ్రీలో ఉండగా, తరుచుగా పాలమూరు ప్యాసింజర్‌లో సికింద్రాబాద్ నుండి జడ్చర్లకు చేసిన రైలు ప్రయాణంలో చూసిన వ్యక్తులు, పొందిన అనుభవాలు నా కథలకు ప్రేరణలు.

వ్యక్తులను, సంఘటనలను, సంఘర్షణలను సమాజాన్ని లోతుగా పరిశీలన చేయడం, అధ్యయనం చేయడం, విశ్లేషణ చేయడం కూడా నా కథలకు మూలాలు.

నా కథల్లో సమాజానికి సంబంధించిన ఇజాలు, నిజాలు, చీకటికోణాలు, సంఘర్షణలు, పీడిత, తాడిత వర్గాల బాధలు ఉండవు. అలాగని సామాజిక కోణం, సామాజిక స్పృహను వీడి యే కథ ఉండదు.

కథకుడు అనధికార న్యాయమూర్తి అని నేను నమ్ముతాను. కాబట్టి బాధ్యతగా కథలు రాస్తూ, సమాజానికి చెడు చేసే, తప్పుడు సందేశాలు పంపే, ఒక్క వాక్యం కూడా లేకుండా చూసుకుంటాను.

అదే విధంగా కథకు సంబంధించిన ఒక లైన్ తట్టగానే వెంటనే కథ రాయను. ఆ భావాన్ని మథించి, మథించి ఒక రూపానికి వచ్చిన తరువాత కాగితము పైన పెడతాను. ప్రచురణకు పంపే ముందు చాలా సార్లు చూసుకుంటాను.

అలా ఈ రెండు దశాబ్దాల కాలంలో దాదాపుగా 150 కథలు రాసాను.

ఒక ప్రబంధ కావ్యం, రెండు శతకాలు, ఒక సంకలనం (మహా భారతంలో మంచి కథలు) అనేక సాహిత్య వ్యాసాలు రాసాను.

ప్రశ్న 4. గొప్ప కథల గురించి శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు, శ్రీ వాకాటి పాండురంగారావు గారు చెప్పిన నిర్వచనాలు మీ కథలకు అన్వయిస్తాయని అనడం అతిశయోక్తి కాదని డా ముక్తేవి భారతి అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం కలగడానికి – వస్తువు, శైలి, శిల్పం – లలో ఏది దోహదం చేసిందని మీ ఉద్దేశం? ఈ మూడింటిలో కథలకు ఏది ముఖ్యమని మీరు భావిస్తారు?

జ: కథ చదవగానే కాసేపు పాఠకుని గుండె బరువెక్కాలి. ఒక మంచి అనుభూతి పొందాలి. మనసు ప్రసన్నం కావాలి. ఎక్కడో తనను లేదా తాను చూసిన ప్రపంచాన్ని దర్శించాలి.

అది ఒక కథలో వస్తువు వల్ల కావచ్చు, శైలి వల్ల కావచ్చు లేదా శిల్పం వల్ల కావచ్చు. లేదా మూడింటి కలయిక కావచ్చు. శ్రీపాద, రావిశాస్త్రి, కారా మాస్టారు, తిలక్, మధురాంతకం మొదలైన వారి కథల్లో ఈ మూడు ముప్పేటలుగా కలగలిసి కథ ముచ్చట గొలుపుతుంది.

ప్రశ్న 5. “అవసరానికి చేతిలో సెల్ ఉంచుకోవాల్సిన వ్యక్తి, సెల్ చేతిలోకి వెళ్ళిపోయాడు” అని రాశారు చదువుకున్న అనాగరికంకథలో. ఈ కథ కల్పితమా లేక నిజంగా జరిగిందా? ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: ఈ కథకు నేపథ్యం అనునిత్యం మీరూ, నేను మనందరం చూసే వ్యక్తులే.

కానీ ప్రేరణ మాత్రం ఒకసారి నేను విజయవాడ వెళుతుంటే చూసిన యవ్వనంలో ఉన్న స్త్రీ. ఆమె దాదాపు పది నిమిషాలు తన పైట తొలగి పోయినా పట్టించుకోకుండా, చుట్టూ పక్కల ఉన్న తోటి వారు రకరకాల దృష్టులతో చూస్తున్నా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంది. నా పక్కనే కూర్చొని ఉంది. చాలా ఆలోచించి, ఆలోచించి.. మర్యాద పరిధిలో జాగ్రత్తగా ఆమెను మందలించాను. కొసమెరుపు ఏమిటంటే నా మాటలు విన్న తరువాత కూడా ఫోన్ ప్రజ్ఞత వదలలేదు. అది కూడా ఒక ప్రేరణ.

ప్రశ్న 6. భార్యా అనుకూలవతీ శత్రువు!మంచి కథాంశంతో అల్లిన కథ. ఈ కథలోని భర్త లాంటి వాళ్ళు మనకి అప్పుడప్పుడు తారసపడినా, దివ్య లాంటి భార్యలు మాత్రం చాలా అరుదు. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: మన సమాజంలో కనీసం నలుగరు ఆడవాళ్లలో బయటికి కనిపించని ఒక దివ్య ఉంటుంది. అలాగే నలుగురు మగవాళ్ళలో ఇద్దరు కనిపించే దివ్య భర్తలు ఉంటారు. వాళ్ళే ఈ కథకు ప్రేరణ.

ప్రశ్న 7. సబ్బుబిళ్ళకథ చివరిలోని కొసమెరుపు బావుంది. “చేసింది మంచి పనో, తెలివి తక్కువ పనో తెలియక, అలాగే కూర్చుండిపోయాడు” అనే వాక్యాలతో ముగించి ఉంటే, సాధారణ కథ అయ్యేది. కానీ ఆఖరి రెండు మూడు వాక్యాలు కథను విభిన్నమైనదిగా చేశాయని మా అభిప్రాయం! ఈ ఆలోచన ఎలా వచ్చింది?

జ: ఎన్ని సార్లు ఎదురు దెబ్బలు తగిలినా, మోసపోయినా, మంచితనం నిండుగా ఉన్న వారు మంచినే చేస్తారు తప్ప చెడు చేయరు. ఈ సూత్రం ఆధారంగా చూసిన, విన్న సంఘటనల ఆధారంగా ఈ కథ పుట్టింది.

ప్రశ్న 8. అవార్డు కథతెలుగులో వస్తున్న/వచ్చిన మూస సినిమాలపై వేసిన సెటైర్. ఈ కథ కల్పితం కావచ్చు, అక్కడక్కడా విన్న ఉదంతాలతో అల్లినది కావచ్చని అనిపిస్తుంది. మీకు సినీరంగంలో ప్రవేశం ఉందా లేక సినీరంగంలో పనిచేస్తున్న మీ మిత్రులెవరైనా ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో అల్లిన కథా?

జ: సినీ రంగంతో కానీ, సినీ వ్యక్తులతో పరిచయం లేదు. కానీ నేను సినీ ప్రేమికుడను. మన జీవితంలో సినిమా ఒక భాగం. అయితే మన తరం వారు ఇలాంటి చిత్రాలు చాలా చూసారు. మనం చూస్తున్న సినిమాలలో వస్తున్న నేపథ్యంతో, వ్యంగ్య, హాస్య ధోరణిలో రాసిన కథ. పెద్ద బహుమతి కూడా అందుకున్న కథ అది.

ప్రశ్న 9. జీవన ప్రయాణంలో మనిషి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పిన ముందస్తు జాగ్రత్త!కథ చక్కని కథ. ఇది కల్పితమా లేక మీకు తారసపడిన వ్యక్తి జీవితం ఆధారంగా అల్లిన కథా?

జ: మనిషి బతికి ఉన్నప్పుడు మూడు విషయాలు ఆలోచించాలి.

ఒకటి బతికినంత కాలం చేయి చాచకుండా గౌరవంగా బతకడం..

చనిపోయినప్పుడు యే రోగం, రోష్టు లేకుండా చనిపోవడం, అంటే అబ్దుల్ కలాం గారి లాగా..

ఆలాగే చనిపోయిన తరువాత పరమాత్ముని సన్నిధి చేరుకోవడం..

ఇలా మనం కోరుకోవాలి.

కానీ మనిషి ఇవి తప్ప అన్నీ కోరుకుంటాడు. ఆ నేపథ్యం నుండి పుట్టిన కథ ఇది.

ప్రశ్న 10. సాధారణంగా రచయితలకు వారి రచనలన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?

జ: ఈవెంట్ మేనేజ్మెంట్, భార్య అనుకూలవతి.. మరి కొన్ని కథలు.

ప్రశ్న11. ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: నేను బాగా కన్విన్స్ అయ్యేంత వరకు, నా ఊహల్లో పూర్తిగా కథ అయేంత వరకు నేను యే కథ రాయను. ఒకసారి రాయడం ప్రారంభించినాక నాకు యే కష్టం ఉండదు.

నిజానికి కథ, పద్యం, వ్యాసం.. ఇలా యే రచన అయినా లేదా యే ప్రక్రియ అయినా కొంత కాలానికి చదివితే..

ఇలా రాస్తే.. ఇలా పాత్రను మారిస్తే, ఇలా ముగిస్తే.. బాగుండేదని అనిపిస్తుంది.

మనం యే వ్యాస, వాల్మీకి, కాళిదాసు వంటి గొప్ప కవులము కాదుకదా అక్షరం పక్కకు జరుపకుండా ఉంచడానికి. ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు చేయవలసిన మార్పులు గోచరిస్తాయి.

ప్రశ్న12. కథా తిలకంపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా?

జ. కథలు రాయడం, వాటిని ప్రచురణ చేసుకోవడం, దానిని పాఠకులదాకా తీసుకొని వెళ్లడం.. ఇవన్నీ శ్రమతో, వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి.

ఈ బాధలు ప్రతి రచయిత ఎదురుకున్నదే. నేను మినహాయింపు కాదు.

ప్రశ్న13. ఈ పుస్తకానికి పాఠకాదరణ ఎలా ఉంది? ఈ పుస్తకమే కాకుండా, మీ ఇతర పుస్తకాల గురించి పాఠకులకు తెలిసేలా ఏర్పాటేమయినా చేశారా?

జ: ఒక మూడు నాలుగు దశాబ్దాల కింద వరకు కూడా రచయితలు, పాఠకులు వేరుగా ఉండేవారు. ఇపుడు రచయితలే రచయితలు, పాఠకులు. టీవీ, సెల్ ఫోన్‌ల ప్రభావం, సామాజిక మాధ్యమాలు అరచేతిలోకి రావడం, ప్రింట్‌లో ఎక్కవగా పత్రికలు లేకపోవడం, తెలుగు చదివేవారు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల నేడు మనకు పాఠకులు కరువయ్యారు.

అయినా ఇటువంటి వేళలో ఈ పుస్తకాలు రావడం హర్షణీయం.

నేను రాయడం పత్రికలకు పంపడం, అడపాదడపా ప్రచురించుకోవడం తప్ప వేరే ఆలోచనలు చేయలేదు. నా వృత్తి, నా ప్రవృత్తికి ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం ఇవ్వదు. ఈ పుస్తకాన్ని ఎవరు చదివినా ప్రశంసించారు. రెండు మూడు పత్రికల ద్వారా ‘కథాతిలకం’ గురించి పాఠకులకు తెలిపే ప్రయత్నం చేసాను.

ప్రశ్న14. కవిగా, రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఏవైనా కొత్త పుస్తకాలు సిద్ధమవుతున్నాయా?

జ: కథాతిలకం రెండవ భాగం, రైలు కథలు, శ్రీ రామ దూతం బృహత్ కావ్యం (ఇది నా స్వప్నం), చదువుల తల్లి శతకం, మాకందాలు – కావ్యం, కుంతి వ్యాసాలు -సంకలనం, కానైతి – కావ్యం సిద్ధంగా ఉన్నాయి. భగవంతుని అనుమతిని బట్టి అవి వెలికి వస్తాయి.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు కౌండిన్య తిలక్ గారూ.

కౌండిన్య తిలక్: ధన్యవాదాలు.

***

కథా తిలకం (కథా సంపుటి)
రచన: కుంతి (కౌండిన్య తిలక్)
ప్రచురణ: ప్రియమైన రచయితలు, విశాఖపట్టణం
పేజీలు: 248
వెల: ₹ 250/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: 8790920745

 

 

 

 

~

‘కథా తిలకం’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/kathaa-tilakam-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here