మరుగునపడ్డ మాణిక్యాలు – 99: త్రీ ఆఫ్ అజ్

0
4

[సంచిక పాఠకుల కోసం ‘త్రీ ఆఫ్ అజ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]2[/dropcap]023 లో వచ్చిన హిందీ చిత్రం ‘త్రీ ఆఫ్ అజ్’ డిమెన్షియా (మనుషులని గుర్తుపట్టలేని ఒక వ్యాధి) బారిన పడ్డ ఒక స్త్రీ కథ. అయితే డిమెన్షియాకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత లేదు. కొందరు మనుషుల జీవితాల్లో జరిగే కొన్ని విషాద సంఘటనలు, అనుకోకుండా విచ్ఛిన్నమయ్యే బంధాలు ఇందులో ప్రధాన ఇతివృత్తం. ఈ కథ చెప్పటానికి డిమెన్షియాని ఒక సాకుగా వాడుకున్నారు. నిజానికి డిమెన్షియా అనే పదం సినిమాలో దాదాపు చివర్లోనే వస్తుంది. దానికి అంత ప్రాముఖ్యం లేదని చెప్పకనే చెప్పారు. కథ ఆ స్త్రీ, ఆమె భర్త, ఆమె స్నేహితుడి చుట్టూ తిరుగుతుంది. ‘త్రీ ఆఫ్ అజ్’ అంటే ‘మాలో ముగ్గురు’ అనే అర్థం వస్తుంది. ‘మేం ముగ్గురమూ’ అనే అర్థం రావాలంటే ముందు ‘ద’ చేర్చాలి. ‘ద త్రీ ఆఫ్ అజ్’ అని పేరు పెడితే బావుండేది అని నాకనిపించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

శైలజకి వయసు నలభై దాటింది. ఆమెకి డిమెన్షియా లక్షణాలు మొదలయ్యాయి. ఆ వయసులో రావటం అరుదు. పనులు మర్చిపోకుండా లిస్టు రాసుకుంటుంది. ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఆమె భర్త దీపాంకర్ సోషల్ సెక్యూరిటీ ఏజెంటు. ముంబయిలో ఉంటారు. వారికో కొడుకు. వేరే ఊళ్ళో చదువుకుంటున్నాడు. అందరికీ ఆమె పరిస్థితి గురించి తెలుసు, వారి స్నేహితులకి కూడా. ఒకరోజు ఆమె దీపాంకర్‌తో “ఒక వారం సెలవు పెడతారా? వెంగుర్లా వెళ్ళొద్దాం” అంటుంది. ఆమె ఐదు నుంచి ఎనిమిది వరకు కొంకణ్ లోని వెంగుర్లాలో చదువుకుంది. కానీ దీపాంకర్‌కి ఎప్పుడూ చెప్పలేదు. ఆమె నాగపూర్, పుణే నగరాల్లో చదువుకుందని అతను అనుకున్నాడు. అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తానికి ఇద్దరూ వెంగుర్లా వెళతారు. ఒక హోమ్ స్టేలో బస చేస్తారు.

వెంగుర్లా సముద్రతీరాన ఉన్న ప్రశాంతమైన ఊరు. మొదట వారిద్దరూ ఆమె చదువుకున్న స్కూల్‌కి వెళతారు. స్కూల్ మూసి ఉంటుంది. అక్కడ ఉన్న ఒకతన్ని ఆమె “ప్రదీప్ కామత్ తెలుసా?” అని అడుగుతుంది. అతను తెలియదంటాడు. తర్వాత వారు ఒక వీధిలో నడిచి వెళుతుంటే ఒకామె ఆమెని గుర్తుపట్టి వస్తుంది. శైలజా అని పలకరిస్తుంది. శైలజ ఆమెని వెంటనే గుర్తుపడుతుంది. శైలజ “ఈమె గౌరి” అని భర్తకి పరిచయం చేస్తుంది. “పరశురాం ఇక్కడే ఉండేవాడు కదా” అంటుంది. “అవును. ఇదే అతని ఇల్లు. నా ఇల్లు కూడా” అంటుంది పరశురాం భార్య అయిన గౌరి. శైలజ గౌరిని వెంటనే గుర్తుపట్టటం వింతగా ఉంటుంది. ఉప్మాలో ఉప్పు వేయటం మరచిపోయే ఆమెకి దాదాపు ముప్ఫై ఏళ్ళ నాటి మిత్రులు, ఇన్నాళ్ళూ కలవని వారు గుర్తున్నారు. మనిషి మెదడు విచిత్రంగా పని చేస్తుంది. వారి మాటల్లో ప్రదీప్ ప్రస్తావన మళ్ళీ వస్తుంది. శైలజ, ప్రదీప్ చాలా కలివిడిగా ఉండేవారని తెలుస్తుంది. దీపాంకర్ ఏమంటాడో అని శైలజకి ఇబ్బందిగా ఉంటుంది. దీపాంకర్‌కి విషయం అర్థమవుతుంది కానీ అతను సంస్కారం కలవాడు. ఇలాంటివి మామూలే అన్నట్టు ఉంటాడు.

గౌరి సాయంతో శైలజ ప్రదీప్‌ని కలుస్తుంది. అతను బ్యాంక్‌లో మ్యానేజరు. ఆమెని చూడగానే గుర్తుపడతాడు. దీపాంకర్ వారిద్దరినీ మాట్లాడుకోమని ఫోన్ పట్టుకుని వెళతాడు. ప్రదీప్ ‘మీరు’ అని సంబోధిస్తుంటే ఆమె “మీరు అంటావేంటి? స్కూల్లో నువ్వు అనేవాడివి కదా” అంటుంది. ఆమె అతన్ని గుచ్చి గుచ్చి చూస్తుంది. అతను కళ్ళు కలపటానికి కూడా సంకోచిస్తుంటాడు. ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పదు. తర్వాత ముగ్గురూ గౌరిని తీసుకుని స్కూల్‌కి వెళతారు. ఇక్కడ ప్రేక్షకులకి తమ తమ స్కూళ్ళు గుర్తు రావటం తథ్యం. స్కూల్లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం వస్తాయి. తరగతి గదిలోకి వెళ్ళాక గౌరి “ఎంత ఇరుగ్గా ఉందో. ఎలా కూర్చునేవాళ్ళమో ఇక్కడ” అంటుంది. దీపాంకర్ “పెద్దయ్యాక చిన్నప్పటి ప్రదేశాలు చిన్నగా కనపడతాయి” అంటాడు. ఎంత నిజమో! మేము కొన్నేళ్ళ క్రితం మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినపుడు మా పెద్దమ్మ కొడుకు అక్కడి అరుగు చూసి “చిన్నప్పుడు ఈ అరుగు ఎంత పెద్దగా కనిపించేదో. ఇప్పుడు చిన్నగా ఉంది” అన్నాడు. చిన్నప్పుడు పొడుగు తక్కువ ఉంటాం కాబట్టి అలా అనిపించవచ్చు. కానీ వస్తువు అదే అయినా దృష్టిభేదం ఉంటుంది అనటానికి ఇదో ఉదాహరణ.

ప్రదీప్‌కి భార్య, ఇద్దరు కూతుళ్ళు. అతను భార్యకి శైలజ గురించి ఇంతకు ముందే చెప్పాడు. శైలజ తనని చూడటానికి వచ్చిందని చెబుతాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. ఇన్నాళ్ళ తర్వాత గుర్తు పెట్టుకుని వచ్చిందనే ఆశ్చర్యమే కానీ ఆమెలో అసూయ ఉండదు. అతను “పాత ప్రదేశాలన్నీ చూడటానికి తోడు రమ్మంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను” అంటాడు. “వెళితేనే మంచిది. కానీ నాకు అంతా చెప్పాలి. లంచం కూడా ఇవ్వాలి” అంటుందామె. వారి బంధం ఎంత మధురమైనదో ఈ చిన్న సన్నివేశంలో తెలుస్తుంది. అతను శైలజ గురించి తన భార్యకి చెప్పాడు. కానీ శైలజ అతని గురించి తన భర్తకి చెప్పలేదు. ఇది ఆమెలోని లోపం కన్నా అతనిలో ఉన్న సున్నితత్వాన్నే ఎక్కువ చూపిస్తుంది. అందరూ చిన్నప్పటి సంగతులు అన్నీ బయటికి చెప్పుకోరు. ఆమె వెంగుర్లాలో గడిపిన సమయం మనసు పొరల్లో ఎక్కడో దాచేయటానికి ఇంకో కారణం కూడా ఉంది. అది త్వరలోనే తెలుస్తుంది.

మర్నాడు శైలజ, దీపాంకర్, ప్రదీప్ గుడికి వెళతారు. అక్కడి నుంచి శైలజ కుటుంబం అప్పట్లో ఉన్న ఇంటికి వెళతారు. అక్కడ ఒక పెద్దావిడ, ఆమె మనవడు కనపడతారు. పెద్దావిడ శైలజని అప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తుంది. శైలజ తాను ఆ ఇంట్లో ఉండేదాన్నని చెబుతుంది. ఇల్లు చూస్తానంటే పిల్లవాడు శైలజకి చూపిస్తాడు. పెరట్లోకి తీసుకువెళతాడు. అక్కడ బావిని దూరం నుంచి చూసి శైలజ మ్రాన్పడిపోతుంది. ప్రదీప్ హడావిడిగా ఆమెని తీసుకుని వచ్చేస్తాడు. ఆ బావి దగ్గర ఏదో జరిగింది. దాన్ని శైలజ పూర్తిగా మరచిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా గుర్తు వచ్చింది. కొన్నాళ్ళకి జీవితంలో జరిగినవి అన్నీ మరచిపోతామని తెలిస్తే చిన్ననాటి జ్ఞాపకాలని లేదా మధురమైన జ్ఞాపకాలని నెమరు వేసుకోవాలని అనుకోవటం సహజమేనేమో. కానీ ఆ తీపి జ్ఞాపకాల మధ్యలో చేదు అనుభవాలు కూడా ఉంటాయి. అవి ఒక్కసారిగా పైకొస్తే? ఈ ద్వంద్వాన్ని ఒక సన్నివేశంలో చక్కగా చూపించారు. శైలజ తాను భరతనాట్యం నేర్చుకున్న పాఠశాలకి వెళుతుంది. అక్కడి టీచరు ఆమెని గుర్తుపడుతుంది. టీచరు అడగటంతో శైలజ అక్కడి విద్యార్థులతో కలిసి నాట్యం చేస్తుంది. ఆ నాట్యంలో ఆనందాన్ని పొందుతుంటుంది. ఇంతలో ఒక ముద్ర తప్పు చేస్తుంది. దాంతో పక్కకి వెళ్ళి ఒక స్తంభం చాటున నిలబడిపోతుంది. ‘నాకు ఆనందంగా ఉండే అర్హత లేదు’ అన్నట్టు ఉండిపోతుంది. జీవితమనే నాట్యంలో తప్పటడుగులు అందరూ వేస్తారు. వాటితో రాజీ పడి సాగిపోవాలి. రాజీ పడలేకపోతే మనకే కాదు, మనవారికి కూడా వేదన తప్పదు.

ఈ చిత్రానికి అవినాష్ అరుణ్, ఓంకార్ బర్వే, అర్పితా చటర్జీ స్క్రీన్ ప్లే సమకూర్చారు. అవినాష్ అరుణ్ దర్శకత్వం, ఛాయాగ్రహణం చేశాడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కిల్లా’ (2015) కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువగా ఉంటుంది. కానీ సంక్లిష్టమైన కథని చెప్పాలంటే నాటకీయత కొంతవరకు అవసరమే. కొంకణ్ ప్రాంతంలోని ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. ఛాయాగ్రహణానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. శైలజగా శెఫాలీ షా నటన అద్భుతంగా ఉంటుంది. మనసులో గూడు కట్టుకున్న విషాదమంతా ఆమె ముఖంలో కనిపిస్తుంది. నవ్వుతున్నా ఆ విషాదపు ఛాయలు పోవు. ఆమెకి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ (క్రిటిక్స్) అవార్డ్ వచ్చింది. ప్రదీప్‌గా జైదీప్ అహ్లావత్ నటించాడు. 2023లో ఈ చిత్రంతో పాటు ‘జానెజాన్’ చిత్రంలో నటించి నటుడిగా తన సత్తా చాటాడు. దీపాంకర్ గా స్వానంద్ కిర్కిరే నటించాడు. అతని ముఖంలో సరళత్వం ఉంది. పాత్రలో ఒదిగిపోయాడు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

తర్వాత ముగ్గురూ శైలజ టీచర్ ఇంటికి వెళతారు. ఆ టీచర్ కూతురు శైలజకి స్నేహితురాలే. ఆ టీచర్ “శైలజ ఇప్పుడిలా ఉంది కానీ అప్పుడు పెద్ద ఆకతాయి. ఈ ప్రదీప్ ఆమెకి తోడుదొంగ” అంటుంది దీపాంకర్‌తో. ఇద్దరూ బాగా అల్లరి చేసేవారన్నమాట. తర్వాత ఒక మంత్రగత్తె ప్రస్తావన వస్తుంది. “సముద్రతీరంలో లోపలికి గుడిసె వేసుకుని ఓ మంత్రగత్తె ఉండేది. ఇప్పుడూ ఉందా?” అంటాడు ప్రదీప్ టీచర్ కూతురితో. “ఆమె నిజంగా ఉండేదా? అవన్నీ పుకార్లని అనుకున్నాను” అంటుందామె. టీచర్ “ఏం కాదు. శైలజ వెళ్ళి ఆమెతో మాట్లాడేదిగా” అంటుంది. శైలజ “అవును. ఆమె ఉండేది” అంటుంది. “ఇప్పుడు ఉందో లేదో” అంటాడు ప్రదీప్. శైలజ ప్రదీప్ వంక గాయపడినట్టు చూస్తుంది. అతను కంగారుగా “ఉండే ఉంటుంది. కానీ బాగా ముసలిది అయిపోయి ఉంటుంది” అంటాడు. ఆ రాత్రి దీపాంకర్ “నాకు నీ గతంలోని ఈ అధ్యాయం గురించి ఎప్పుడూ చెప్పలేదేం?” అంటాడు. “కావాలని దాచలేదు. అలా జరిగిపోయిందంతే. మీరు ఇక్కడ చూస్తున్న శైలజని పట్టుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. దొరకట్లేదు. మీకు దొరికితే జాగ్రత్తపెట్టండి” అంటుందామె. ఇది కొంచెం నాటకీయంగా అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు లేము అని చాలామంది అనుకుంటారు. జీవితం మనిషిని ఆటాడిస్తుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ప్రదీప్ తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అతను శైలజతో “మనలో చాలామంది అన్నీ వదిలి పారిపోవాలని అనుకుంటారు. కానీ ధైర్యం చాలదు. ఆయన వెళ్ళిపోయారు. ఒకప్పుడు కోపంగా ఉండేది. ఇప్పుడు జాలేస్తుంది. మళ్ళీ కనపడితే ఎందుకు వెళ్ళిపోయారు అని అడగాలనిపిస్తుంది. కనపడితే ఇంటికి తీసుకురావాలని దొంగమనసు కోరిక. పోనీ ఇంటికి తీసుకురాకపోయినా ఒకసారి చూస్తాను కదా అనుకుంటాను” అంటాడు ఉద్వేగంగా.

శైలజకి దేవుడంటే నమ్మకం లేదని దీపాంకర్ ప్రదీప్‌కి చెబుతాడు. చెప్పి “పోన్లెండి. మీకు ఆమె గురించి తెలియని విషయం నాకొకటి తెలుసన్నమాట” అంటాడు. తన కన్నా ప్రదీప్‌కే ఆమె గురించి బాగా తెలుసని అతని భావన. శైలజ తలిదండ్రులు ఆమె పెళ్ళి అయ్యాక సంవత్సరంలోపే చనిపోయారని చెబుతాడు. “ఆమెకి వీనూ అని ఓ చెల్లెలుండేది. చిన్నప్పుడే..” అంటే ప్రదీప్ “తెలుసు” అంటాడు. తర్వాత దీపాంకర్ శైలజతో “ప్రదీప్ చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన కారణంగా మగవారిని నమ్మటం మానేశానని అన్నాడు. అందుకే ఆడవారితో స్నేహం చేసేవాడట. ఇప్పుడు అతని భార్యే అతని స్నేహితురాలు. నన్ను మాత్రం నమ్మవచ్చని అన్నాడు. శైలజ నమ్ముతుంది కాబట్టి అన్నాడు” అంటాడు.

ప్రదీప్‌కి కవితలు రాసే అలవాటు ఉండేది. శైలజని కలిశాక మళ్ళీ కవితలు రాయటం మొదలుపెడతాడు. అతని భార్య ఇది గమనిస్తుంది. అయినా సంతోషపడుతుంది కానీ చిన్నబుచ్చుకోదు. “చిన్ననాటి ప్రేయసి కనపడగానే కవిత్వం వచ్చిందే” అని ఆటపట్టిస్తుంది. ఒకరోజు శైలజ దంపతులు ప్రదీప్ ఇంటికి వస్తారు. ప్రదీప్ భార్య శైలజతో “మీరు అన్నీ వదిలి ఈ ఊరికి మళ్ళీ వచ్చారు. ఎంత బలమైన కోరిక లేకపోతే అలా వస్తారు. అది నాకు నచ్చింది” అంటుంది. ప్రదీప్ అచ్చువేయబోయే కవితలు శైలజకి ఇస్తాడు. అతని ఇంటి నుంచి తిరిగి వచ్చాక ఆమె అవి చదువుతూ ఆనందంలో మునిగిపోయి ఉంటుంది. దీపాంకర్ “నాతో ఎప్పుడైనా ఇంత సంతోషంగా ఉన్నావా?” అంటాడు. “నేను నా చిన్ననాటి ఇంటికి వచ్చాను. సహజంగానే సంతోషం ఉంటుంది. దాని అర్థం మీతో సంతోషంగా లేనని కాదు” అంటుందామె. “మరి ఆ సంతోషం నాకు గుర్తులేదే” అంటాడతను. “మనుషుల స్వభావమే అంత. సాఫీగా గడిచిపోయిన రోజులు గుర్తుండవు. మరచిపోతాం. మారిపోతాం” అంటుందామె. “నేనేం మారలేదే” అంటాడతను. “మారారు. నేనూ మారాను. మన బంధం మారింది. ఇదేం వింత కాదు. జీవితం ఇంతే. మీరు అడిగారు కదా మనం ఆఖరిసారిగా సంతోషంగా ఎప్పుడున్నామని. ఇప్పుడు నేనడుగుతున్నాను. మనం ఆఖరిసారిగా దుఃఖంగా ఎప్పుడున్నాం?” అంటుందామె. “చాలాసార్లు ఉన్నాం. డిమెన్షియా వల్ల అది కూడా మరచిపోయానని మాత్రం అనకు?” అని అతను లేచి వెళ్ళిపోతాడు. ఎంత సంస్కారవంతుడైనా తన భార్య మరో మగవాడిని తనకంటే ఎక్కువ ఇష్టపడుతోందని అనిపిస్తే తట్టుకోలేడు. అయినా ఇది ఇప్పటి విషయం. గతంలో ఆమె అతనితో పూర్తిగా సఖ్యంగా ఉండేది కాదని నాకనిపించింది. దీనికి కారణం అతని మీద ఇష్టం లేక కాదు. జీవితంలో ఎదురైన ఆటుపోట్లు కారణం. మరి అతనితో పంచుకోవచ్చుగా? కొన్ని విషయాలు తలచుకోవటానికే బాధాకరంగా ఉంటాయి. ఇక పంచుకోవటం ఎలా?

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

శైలజ రాత్రివేళ సముద్రతీరానికి వెళుతుంది. ఒడ్డున నిలబడి వెనక్కి తిరిగి చూస్తే దూరంగా చెట్ల మధ్య దీపం కనిపిస్తుంది. అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. శైలజ అక్కడికి వెళుతుంది. అక్కడొక స్త్రీ ఉంటుంది. మంత్రగత్తెలా ఉంటుంది. “నన్ను గుర్తుపట్టావా?” అంటుంది శైలజ. ఆమె “ఆ కొత్త సంచీ ఏమిటి? ఏముంది అందులో? ఏదో మోసుకొచ్చావు” అంటుంది. శైలజ “నేనూ వీనూ తాడాట ఆడుకుంటూ ఉన్నాం. తాడు లాగే ఆట ఆడదామంది. అదే గెలుస్తుందని దానికి తెలుసు. నన్ను చూసి నవ్వింది. నేను తాడు గట్టిగా లాగి చుట్టి పట్టుకున్నాను. ఇంతలో తాడు పట్టు జారిపోయింది. వీనూ బావిలో పడిపోయింది. నేను పరుగెత్తి వెళ్ళాను. దాని కాళ్ళు కనపడ్డాయి. తల పైకి పెట్టి ‘శైలూ’ అంది. నేను నాన్న దగ్గరకి వెళ్ళి ‘వీనూ’ అని ఏడ్చేశాను” అని కన్నీరు పెట్టుకుంటుంది. మళ్ళీ “మీరు ఇప్పుడు ఇక్కడ ఉండరని అందరూ అన్నారు” అంటుంది. “నువ్వు గుర్తుపెట్టుకున్నావు కాబట్టే నేను బతికి ఉన్నాను. మళ్ళీ రా” అంటుందామె. ఆ మంత్రగత్తె నిజానికి ఎవరో పుట్టించిన పుకారు. కానీ శైలూ చిన్నప్పుడు ఆమె ఉందని ఊహించుకునేది. ఆమెతో మాట్లాడినట్టు ఊహించుకునేది. కొందరు పిల్లలకి కల్పిత స్నేహితులు ఉంటారు. ఎవరికీ చెప్పనివి వారికి చెబుతారు. మంత్రగత్తె నిజంగా లేదనటానికి ఇంకో నిదర్శనం ఆమెకి వయసు పెరగకపోవటం. ఈ సన్నివేశం చూస్తే నాకు మార్టిన్ స్కోర్సెసీ తీసిన ‘షటర్ ఐలండ్’ (2009) చిత్రంలోని ఒక సన్నివేశం గుర్తొచ్చింది. అందులో నాయకుడు సముద్రం ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన గుహలో ఒక స్త్రీని కలుసుకుంటాడు. ఆమె అతని కల్పన అని నాకనిపించింది. ఇక్కడ మంత్రగత్తె సంచీ అనటం వెనక ఉద్దేశం మనుషులు మోసే భావోద్వేగాల సంచీ (Emotional baggage). అందరూ ఎంతో కొంత భారం మోస్తూనే ఉంటారు. ఆ భారం దించుకోవాలంటే క్షమాపణలైనా చెప్పాలి, క్షమాపణ చెప్పటానికి ఎవరూ లేకపోతే మూడో వ్యక్తితో పంచుకోవాలి. అందుకే కొందరు సైకియాట్రిస్టుల దగ్గరకి వెళతారు. వారైతే మనతో ఏ సంబంధమూ లేదు కాబట్టి మన గురించి తీర్పులు ఇవ్వరు.

శైలజ అపరాధభావాన్ని జీవితమంతా మోసింది. ఎంత నరకం! తెలియక చేసినా మన వల్ల ఒక ప్రాణం పోయిందంటే ఎంత బాధ! అదీ సొంత చెల్లెలు. అందుకే చిన్నప్పుడు చలాకీగా ఉన్న ఆమె ముభావంగా మారిపోయింది. భర్తతో కూడా సఖ్యంగా ఉండలేకపోయింది. ఇలాంటివారు ‘బాగానే ఉన్నాను కదా. ఇంకేం చేయాలి?’ అన్నట్టు ఉంటారు. కానీ భర్తకి లేదా భార్యకి ఆ దూరం తెలిసిపోతూ ఉంటుంది. తమలో లోపం ఉందా అని వారు అనుకుంటారు. దీపాంకర్ కూడా అలాగే అనుకున్నాడు. కానీ కొన్ని గాయాలు చాలా లోతుగా ఉంటాయి. వాటిని ఇతరులకి చూపించటం చాలా కష్టం. దీపాంకర్ చాలా మంచివాడు. శైలజ అతనికి చెప్పుకుంటే ఆమె భారం తగ్గేది, అతనికి మరింత దగ్గరయేది. చెప్పకపోవటంతో ఆమే బాధపడింది, అతన్నీ బాధపెట్టింది. చిన్నప్పుడు మంత్రగత్తెతో తన మనసులోని భావాలు చెప్పుకునేది కాబట్టి ఆమెకి చెప్పి భారం దించుకుంది. ఇలాంటి గాయాలున్నవారు నిజజీవితంలో కూడా ఉంటారు. తాను చేసిన కారు ఆక్సిడెంట్లో ఇతరుల ప్రాణాలు పోతే బతికి బయటపడినా డ్ర్రైవరుకి ఎంత నరకం? తన తప్పు లేకపోయినా బాధ ఉంటుంది. ఇక తప్పు ఉంటే వేరే చెప్పాలా?

శైలజ, దీపాంకర్ తిరిగి వెళ్ళే రోజు దగ్గరపడుతుంది. సముద్రం ఒడ్డున తిరునాళ్ళు జరుగుతుంటాయి. రంగుల రాట్నం, జయంట్ వీల్ లాంటివి ఉంటాయి. ప్రదీప్ తన చిన్న కూతురిని తీసుకుని వస్తాడు. శైలజ, పాప కలిసి ఒక రంగుల రాట్నం ఎక్కుతారు. ప్రదీప్ దీపాంకర్‌ని “శైలజ బాగానే ఉందా?” అని అడుగుతాడు. దీపాంకర్ అప్పుడు ఆమెకి డిమెన్షియా ఉన్న సంగతి చెబుతాడు. “ఆమె కోరుకున్నది జ్ఞాపకాలన్నీ మరుగునపడే ముందే..” అని దీపాంకర్ చెప్పబోతుంటే “తన ఉద్గమ స్థానానికి రావాలని” అని ప్రదీప్ పూర్తి చేస్తాడు. ఉద్గమ స్థానమంటే నది పుట్టిన చోటు. శైలజ జీవితానికి ఆ ఊరు ఉద్గమ స్థానం లాంటిది. తర్వాత శైలజ, ప్రదీప్ జయంట్ వీల్ ఎక్కుతారు. తిరుగుతున్న వీల్ కాసేపు ఆగుతుంది. శైలజ “పోయిన వారం ముంబయిలో ఉండగా ఇక్కడి రావాలని తహతహ. ఇక్కడికొచ్చాక ముంబయి గుర్తుకొస్తోంది. కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఏ తొందరా లేదు. ఇదే నా గమ్యం. వచ్చేశాను” అంటుంది. ఆమె గాయం మానటం మొదలయింది. పైగా ప్రదీప్ పక్కనే ఉన్నాడు. కానీ ప్రదీప్‌ని పీడిస్తున్న ప్రశ్న ఒకటి ఉంది. “నువ్వు ముందే ఎందుకు తిరిగి రాలేదు?” అంటాడు. “తెలియదు. స్కూల్ అయ్యాక సమయమే చిక్కలేదు. జీవితమంతా ఉరుకులు పరుగులుగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా అనే అయోమయంలోనే గడిచిపోతుంది. కొన్నాళ్ళ క్రితమే జీవితం ‘ఇక చాలు’ అంది. అంతే” అంటుంది.

తర్వాత తాము చిన్నప్పుడు తిరునాళ్ళకి వచ్చిన రోజు గురించి అడుగుతుంది. “నేను మరచిపోయాను. ఏం జరిగిందో చెప్పు” అంటుంది. “నీ స్నేహితురాలు ‘ప్రదీప్ నీ కోసం పువ్వులు తెచ్చాడు’ అని నీకు చెప్పింది. నువ్వు కంగారుపడి ‘నా కోసమే ఎందుకు? అందరికీ తేలేదా?’ అన్నావు. నేనొక్కడినే మిగిలినా నాతో జయంట్ వీల్ ఎక్కలేదు నువ్వు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ మనం కలుసుకోలేదు” అంటాడతను. “వీనూ ఘటన అప్పుడే జరిగింది. మేం ఊరు వదిలి వెళ్ళిపోయాం. సారీ. ఈ సారీ నేను తిరునాళ్ళలోనే చెప్పాల్సింది. కానీ మనం కలుసుకోవటం అదే ఆఖరిసారి అని నేననుకోలేదు” అంటుందామె. “జీవితంలో మళ్ళీ కలుస్తామని నేననుకోలేదు. అందుకే తిరిగి వచ్చినందుకు థ్యాంక్స్” అంటాడతను. ఇద్దరూ కంటతడి పెట్టుకుంటారు. అంత చిన్న వయసులో నిజమైన ప్రేమ పుట్టినవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వీళ్ళు అదే కోవకి చెందినవారు. నాకైతే ఇంత గాఢమైన ప్రేమ ఉంటుందా అనే అనిపించింది. స్కూలు రోజుల్లో ప్రేమలో పడినవారికి ఉంటుందనే అనిపిస్తుంది. ఎందుకంటే అది అమాయకమైన ప్రేమ.

శైలజ ప్రదీప్ చేత అతని భార్యకి ఒక చీర బహుమతిగా పంపిస్తుంది. ప్రదీప్ తాను స్వయంగా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో చీరని భార్యకి కానుకగా ఇస్తాడు. “ఇది నీ లంచం” అంటాడు. వీరిద్దరి బంధమే నాకు గాఢమైనదిగా అనిపించింది. చివరి సన్నివేశంలో దీపాంకర్ శైలజ తలకి మర్దనా చేస్తుంటాడు. కొడుకుతో ఇద్దరూ ఫోన్లో మాట్లాడతారు. తర్వాత శైలజ “నేను వాడిని మరిచిపోతే?” అని వెనక్కి తిరిగి భర్త ముఖంలోకి చూస్తుంది. దానికేం సమాధానం ఉంటుంది? దీపాంకర్ మౌనంగా ఉండిపోతాడు. మళ్ళీ మర్దనా మొదలుపెడతాడు. శైలజ ‘ఈ క్షణాలని వదులుకోకూడదు’ అన్నట్టు కళ్ళు మూసుకుంటుంది. జీవితం ప్రస్తుతంలోనే ఉంటుంది. గతంలో తప్పులు కనిపిస్తాయి. భవిష్యత్తులో ముప్పులు కనిపిస్తాయి. రెండిటినీ మరచిపోవటమే ప్రశాంతమైన జీవితం. కానీ మనుషుల్ని మరచిపోకూడదు. విషాదమేమిటంటే శైలజ కొన్నాళ్ళకి మనుషుల్ని మరచిపోతుంది. అలా జరగక ముందే ఆమె క్షమాపణలు చెప్పాల్సిన వారికి చెప్పేసింది. స్వయంగా తనను తానే క్షమించుకుంది. ఇది చేయలేక చాలామంది కుమిలిపోతుంటారు. ఇతరుల మీద దయతో ఉన్నట్టే మన మీద మనం దయతో ఉండాలి. Be kind to yourself.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here