శ్రీవర తృతీయ రాజతరంగిణి-26

1
4

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

రాజాగ్రదాగతాస్తీక్ష్ణాః శరాస్తత్పక్షపాతినః।
స్వయం పాహీతి భీత్యేవ స్ఖలన్తః సమచోదయన్॥
(శ్రీవర రాజతరంగిణి, 158)

రాజు పక్షం నుండి వచ్చి హాజీఖాన్ పక్షం సైనికుల నడుమ కురుస్తున్న బాణాల వర్షం వారిలో భయోత్పాతాలు కలిగిస్తూ, ‘మిమ్మల్ని మీరు రక్షించుకోండి’ అన్న ప్రేరణ నిస్తున్నది.

రాజు పక్షం నుంచి శత్రు పక్షం పైన వర్షంలా పడుతున్న బాణాలు శత్రు సైనికులలో భయం కలిగిస్తున్నాయన్న మాట. భయం కలిగించటమే కాదు, మిమ్నల్ని మీరు రక్షించుకోండి అన్న సందేశాన్ని, ప్రేరణను కలిగిస్తున్నాయి. అంటే, అంత భీకరంగా ఉందన్న మాట బాణాల వర్షం.

ధ్వజచేలాంచల రాజ సుతస్యాగ్రే తు వాయునా।
సకంపా రణభీత్యేవ పశ్చాద్భాగమషిశ్రియన్॥
(శ్రీవర రాజతరంగిణి, 159)

హాజీఖాన్ ధ్వజం కూడా గాలికి వణుకుతూ వెనక్కు వెళ్తోంది. యుద్ధ భయంతో అది వెనక్కు పారిపోవాలని ప్రయత్నిస్తున్నట్టుంది.

సాధారణంగా గాలి వీస్తున్న దిశను బట్టి జెండా కదులుతూ ఉంటుంది. ఇక్కడ గాలి ఎదురుగా వీస్తుండటంతో ధ్వజం వెనక్కు వెళ్తోది. ఇది మామూలుగా అందరికి కనిపించే దృశ్యం. అందరికీ కనిపించే దృశ్యంలోనే అందరికీ కనబడని దాన్ని చూసి ప్రకటించటమే కవి పని. శ్రీవరుడు అదే చేస్తున్నాడు.

ఎదురుగా గాలి వీస్తున్నప్పుడు జెండా గాలికి కదులుతూ వెనక్కు వెళ్లడం అందరూ చూస్తారు. ఎదురుగా వీచే గాలి, ఎదుటి నుంచి వచ్చి పడుతున్న బాణాల వర్షంగా, గాలికి వణుకుతున్నట్లు కనిపించే జెండాను భయంతో వణుకుతున్నట్టుగా, వెనక వైపుకు పోవటాన్ని భయంతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఊహించటం కవికే చెల్లింది. జెండా ఒక ప్రతీక, ఒక చిహ్నం. జెండాకు అవమానం జరిగితే, ఆ దేశానికో, ఆ రాజుకో, రాజ్యానికో అవమానం జరిగినట్టు జెండా వణుకుతోంది, భయపడుతోంది, ఆశ్రయం కోరుతోంది అంటే ఆ జెండాను ప్రతీకగా చేసుకుని పోరాడుతున్న వారు భయంలో వణుకుతున్నారని, ఆశ్రయం కోరుతున్నారని ప్రతీకాత్మకంగా చెప్తున్నాడు కవి.

శస్త్ర కృత్త స్ఫురద్దీర శిరః కమల నిర్భరా।
జీవనాశా చలత్పత్రా నళినీ రణభూరభూత్॥
(శ్రీవర రాజతరంగిణి, 160)

మారణకాండ సంభవిస్తున్న యుద్ధభూమి కమలాలతో నిండిన సరస్సులా ఉంది. యుద్ధవీరుల తెగిన తలలు కమల పుష్పాలలా ఉన్నాయి. కదులుతున్న రథాలు నీటి మీద తేలుతున్న కమల పత్రాలలా ఉన్నాయి.

ఈ వర్లన అనౌచిత్యంగా అనిపిస్తుంది. బీభత్సమైన యుద్ధరంగాన్ని కమలాలతో నిండిన సరస్సుతో పోల్చటం, తెగి పడిన మనుషుల తలలను కమలాలనటం – కవి యుద్ధరంగాన్ని ఉద్యానవనంగా భావిస్తున్నట్టనిపిస్తుంది. అయితే, కవి వర్ణిస్తున్న యుద్ధరంగంలో శత్రువు దెబ్బ తింటున్నాడు. నిజానికి శత్రువు శత్రువు కాదు. ఇది తండ్రి కొడుకుల నడుమ పోరు. ఇరు వైపులా నేలకొరిగిన వీరులు, రెండు వైపుల వారికీ కావల్సినవారు. యుద్ధంలో ప్రాణాలు త్యాగం చేసినవారు వీర స్వర్గానికి వెళ్తారు. అందుకని శ్రీవరుడు బీభత్సమైన యుద్ధరంగాన్ని అందంగా వర్ణిస్తున్నాడు. ఇక్కడ రణభూమిని ‘నళిని’తో పోల్చటం వెనుక కూడా అర్థం ఉంది.

కల్హణుడు ‘నళిని’ ని చితాజ్వాలతో పోల్చాడు, చితాజ్వాల మనుషులను భస్మం చేస్తుంది. కాల్చి బూడిద చేస్తుంది. అలాగే యుద్ధరంగం కూడా వ్యక్తుల ప్రాణాలను హరిస్తుంది. అందుకు కూడా శ్రీవరుడు యుద్ధభూమిని కమలాలతో నిండిన సరస్సుతో పోల్చి ఉండవచ్చు.

శౌర్యమత్యద్భుతం దుష్టవా సూనోస్తత్కటకస్య చ।
పునర్జాతమివాత్మానం రణోత్తీర్ణ నృపోవిదత్॥
(శ్రీవర రాజతరంగిణి, 161)

తన కొడుకుకి చెందిన సైన్యం ప్రదర్శించిన అత్యద్భుతమైన శౌర్యపరాక్రమాలు రాజు చూశాదు. యుద్ధం పూర్తయి తాను విజేతగా నిలవటం తనకు లభించిన పునర్జన్మగా భావించాడు.

కృత్వా సర్వదినం యుద్ధం బలాద్ భృత్యైర్నివారితః।
హాజ్యీఖానః సవిత్రాణః సమరాత్ స న్యవర్తత॥
(శ్రీవర రాజతరంగిణి, 162)

రోజంతా యుద్ధం జరుగుతున్నా, హాజీఖాన్, ఆ యుద్ధంలో పాల్గొనకుండా, అతడి సేవకులు బలవంతాన అతడిని బంధించారు. ఇప్పుడు యుద్ధంలో పరాజితుడయిన తరువాత అతడు యుద్ధరంగం వదలి పోయాడు.

యుద్ధం వదలి హాజీఖాన్ శూరపురం పారిపోయాడని ఫరిస్తా రాశాడు. తబాకత్-ఇ- అక్బరీలో, హాజీఖాన్, అత్యంత వీరత్వం ప్రదర్శించాడని, ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోరాడినా, పరాజయం తప్పలేదని, అప్పుడతను యుద్ధం వదలి పారిపోయాడనీ రాశాడు.

శ్రీవరుడు, యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి. హాజీఖాన్‌ని యుద్ధంలో పాల్గొననివ్వలేదని, అతని సేవకులు అతడిని బంధించి యుద్ధంలో పాల్గొననివ్వ లేదని రాశాడు. పర్షియన్ చరిత్ర రచయితలు యుద్ధానికి ప్రత్యక్ష సాక్షులు కారు. శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. కాబట్టి శ్రీవరుడు చెప్పినదాన్ని నమ్మాల్సి ఉంటుంది.

భగ్నం నిజానుజం దృష్ట్వా పశ్చాల్లగ్నో వివిద్నధీః।
అగ్రజోథావధీల్లగ్నాన్మగ్నాం స్త్రాసార్ణవే భటాన్॥
(శ్రీవర రాజతరంగిణి, 163)

పిరికివాడయిన ఆదం ఖాన్, తన సోదరుడు, పరాజయాన్ని అంగీకరించి పారిపోవటం చూశాక అతడిని వెంబడించాడు. పరాజయంతో సిగ్గుపడుతున్న హజీఖాన్ సైనికులను హతమార్చాడు.

శ్రీవరుడు రాసిన దానికీ, పర్షియన్ రచయితలు రాసిన దానికీ ఇక్కడ తేడా వస్తుంది. పిరికివాడని శ్రీవరుడు ఆరంభం నుంచి చెప్తూనే ఉన్నాడు. ఆదమ్ ఖాన్‌ను హాజీఖాన్ నుంచి రక్షించేందుకు జైనులాబిదీన్ ఆదమ్ ఖాన్‌ను తన దగ్గర ఉంచుకుని, హాజీఖాన్‌ను కశ్మీర్ బయటకు పంపించాడు. ఈ యుద్ధానికి కారణం అదే. తండ్రి దగ్గర ఉన్న ఆదమ్ ఖాన్ ఎక్కడ రాజయిపోతాడో అన్న భయంతో హాజీఖాన్ యుద్ధానికి వచ్చాడు. కానీ పర్షియన్ రచయితలు ఆదమ్ ఖాన్ గొప్ప వీరుడని, యుద్ధంలో గొప్ప శౌర్యం ప్రదర్శించాడని రాశారు. ఆదమ్ ఖాన్ అంత గొప్ప వీరుడే అయితే, అతడిని తన వెనుక దాచుకోవాల్సిన అవసరం జైనులాబిదీన్‌కు వచ్చేదే కాదు.

కిముచ్యతే నృశమత్వం యేన శూరపురాన్తరే।
జన్యయాత్రాగతో మోహాన్నిహితః పథికవ్రజః॥
(శ్రీవర రాజతరంగిణి, 164)

పిరికివాడయిన ఆదమ్ ఖాన్ శౌర్యం గురించి ఏం చెప్పాలి? ఓడిన వారిని చంపే ఆత్రంలో ఆయన శూరపురంలో, పెళ్ళి సంబరాలకు వెళ్తున్న యాత్రికులను కూడా చంపేశాడు.

అంటే, తన శౌర్యం ప్రదర్శించే ఆత్రంలో ఆదమ్ ఖాన్ ముందు వెనుకా చూడకుండా కనబడిన వారందరినీ చంపేశాడన్న మాట. ‘వరయాత్ర’ అంటే పెళ్ళి సంబరాలలో పాల్గొంటున్న వారి దగ్గర ఆయుధాలుండవు. అయినా సరే, వారందిరినీ చంపేశాడంటే, ఆదమ్ ఖాన్ ఎంత గొప్ప వీరుడో అర్థం చేసుకోవచ్చు.

ఇలా నిరాయుధలయిన యాత్రికులను చంపిన ఆదమ్ ఖాన్‌ను గొప్ప వీరుడిగా చూపాలని పర్షియన్ చరిత్ర రచయితలు ప్రయత్నించారు. తరువాత కశ్మీరు చరిత్రను రచించిన ఆంగ్లేయులు ఆదమ్ ఖాన్ పిరికివాడు అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. ఆంగ్లేయుల చరిత్రను, పర్షియన్‍ల చరిత్రను ప్రామాణికంగా తీసుకోవటంతో ఆదమ్ ఖాన్ చరిత్ర విద్యార్థులకు వీరుడిగా పరిచయమయ్యాడు. అయితే, అటు కశ్మీరు సుల్తాన్ కాకపోవటంతో చరిత్ర రచయితల దృష్టిలో అతనికి అంత ప్రాధాన్యం లభించలేదు.

యాస్యాం మందప్రభా భాస్వాంజనైః సర్వైర్విలోకితః।
దక్షిణస్యా దిశస్తస్యాః ప్రవాసీ స నృపో భవత॥
(శ్రీవర రాజతరంగిణి, 165)

సూర్యుడు మందంగా ప్రకాశించే దక్షిణ దిశ వైపు నడిచాడు రాజు. యుద్ధభూమిలో, శవాల నడుమ నుంచి రాజు దక్షిణ దిశవైపు నడిచాడు అంటున్నాడు శ్రీవరుడు.

దక్షిణ దిశ యుముడి దిశ. యముడు మృత్యువు. అంటే, నెమ్మదిగా, జైనులాబిదీన్ మరణం వైపు ప్రయాణం ఆరంభించాడని సూచిస్తున్నాడు శ్రీవరుడు. దక్షిణ దిశ యముడి దిశ. అందుకే మరణించిన వారి కాళ్ళు దక్షిణం వైపు పెడతారు. అంటే, వారు దక్షిణం వైపు ప్రయాణిస్తున్నారని సూచిస్తున్నారన్న మాట. ఇస్లాంలో కూడా మరణించిన వారి కాళ్ళు దక్షిణం వైపుంచే సాంప్రదాయం ఉంది.

దుర్యోధనా పితరమా గురుశల్యవిప్టా
భీష్మప్రియాః పరహతిం ప్రతి దత్తకర్ణాః।
యే ధర్మ జాతి విమనస్కతయా కృపేచ్ఛా
స్తే కౌరవా ఇవ రణేన జయం లభన్తే॥
(శ్రీవర రాజతరంగిణి,166)

భూభారాన్ని దుష్టులకు అప్పగించేవారు, శల్యుడిపై అధిక విశ్వాసం ఉంచేవారూ, ఇతరులకు హాని తలపెట్టేవారు, ధర్మం, జాతి పట్ల ఉదాసీనత ప్రదర్శించేవారూ – కౌరవులలా ఎన్నడూ విజయం పొందలేరు. దుర్యోధనుడికి రాజ్యభారం అప్పజెప్పేవారు, శల్యుడిని నమ్మేవారు, భీష్మడికి ప్రియమైనవారు, శత్రువుల చెడుకోరే కర్ణుడిని వెంటపెట్టుకొన్నవారూ, ధర్మశాస్త్రం పట్ల ఉదాసీనత ప్రకటించే కృపాచార్యుడిని ఇష్టపడే వాళ్లయిన కౌరవులు ఎన్నటికీ యుద్ధంలో విజయం పొందలేరు.

ధర్మం గెలుస్తుంది. ధర్మాన్ని జాతిని భ్రష్టం చెందకుండా కాపాడుకునే వాడినే విజయం వరిస్తుంది అని చెప్పేందుకు శ్రీవరుడు మహాభారతంలోని పాత్రలను ప్రతీకలుగా వాడుకున్నాడు. దుర్యోధనుడు, శల్యుడు, ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మహా వీరులు, ఎదురులేని వారు. ఏదో ఒక దశలో కౌరవ సైన్యానికి సేనాపతులుగా ఉండి కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపినవారే. ఇంత గొప్ప వీరులై కూడా వారు పరాజయం పాలయ్యారు. కారణం వారు వ్యక్తిగతంగా ఎంత గొప్ప వీరులైనప్పటికీ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడటం వారి పరాజయానికి కారణమయింది. వారు యుద్ధం చేస్తున్నది కౌరవుల పక్షం నుంచే అయినా వారి మనస్సులలో పాండవ పక్షపాతం ఉంది. అందుకని వారి యుద్ధంలో విధేయత ఉన్నా, నిజాయితీ లోపించింది. అధర్మం వైపు ఉండేవారు ఎన్నటికీ గెలవలేరని నిరూపిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here