ఇల్లు-ఆమె వెళ్ళిపోయింది!

1
3

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘ఇల్లు-ఆమె వెళ్ళిపోయింది!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]వును!
ఆమె వెళ్ళిపోయింది!
ఇంట్లో నేల నిండా ఆమె పాద ముద్రలే!

ఆమె నా ఇంట్లో..
ఒకసారి నొప్పితో నడిచింది .
మరోసారి జ్వరంతో నీరసంగా నడిచింది
ఓపిక లేకపోయినా వొణుకుతూ వడి వడిగా నడిచింది.
నాకూ.. నా పిల్లలకూ..
తనకి రక్త సంబంధం అయినా లేని,
నా సమస్త బంధు జనాలకూ..
సేవ చేయడానికి ఉరుకులు పరుగులుగా నడిచింది.
చిన్నప్పుడు నా పిల్లల
మల మూత్రాలు ఎత్తి పోసినట్లే..
మంచాన పడ్డ నా తల్లిదండ్రుల మలమూత్రాలు ఎత్తిపోస్తూ..
ఊపిరితిత్తుల నిండా దుర్గంధ శ్వాస భరించలేక..
వాంతులు చేసుకుంటున్నప్పుడు కూడా..
అయ్యో.. నేను ఊరక ఉన్నాను!

అవును.. ప్రతీ క్షణం ఎవరో తరుముతున్నట్లే .,
గది గదికీ విరామం లేకుండా..
శ్వాస ఆగిపోయేంత ఉక్కిరి బిక్కిరిగా నడిచింది!

అనేక వేల రోజులు., బహుశా యుగాలు,
వంటింటికీ., నా పడకటింటికీ.. మధ్య ఉన్న
అనంత దూరాలల్లో నడుస్తూనే ఉందలా!
ఆమె నొప్పి.. నొప్పిగా నడిచింది.. నొప్ఫై నడిచింది.
ఏనాడూ ఆమెను ..
నేను అలా కూర్చో.. కాసింత ఒరుగు ..
కాస్త నడుం వాల్చు.. ఈ కొంచెం తిను అనలేదు!

జ్వరం వస్తే నుదుటి మీద చేయి వేసి చూడలేదు.
డోలో 650 ని ఆమె గుటకలు గుటకలుగా
కన్నీళ్లతో సహా మింగడాన్ని చూసీ చూడనట్టే ఉండిపోయా.
నా కంటే ముందు ఆమె ఎన్నడూ ఆకలనలేదు., అన్నమనీ అనలేదు.
నా కంచంలోనే వడ్డిస్తూ పోయింది.
ఆమె రహస్యంగా కార్చుకున్న కన్నీళ్లు చిట్లిన ధ్వనీ నాకు వినపడలేదు.
నేను అయ్యో అనలేదు.
ఇంటి రెక్కలని పట్టుకుని ఆమె ఏడ్చే ఉంటుంది.
కానీ.. ఇల్లు.. మాట్లాడేది ఆమెతో!

అయినా., ఇంట్లోని ప్రతీ గదీ..
నేలా ఆమెను గుండెలకు పొదువుకుని
ఓదార్చడం ఎన్నడూ చూడలేదు.
ఆమె నా ముందే దివారాత్రుళ్లు తిరుగుతూ ఉన్నా
అయ్యో.. అయ్యో నేను కళ్ళుండీ చూడనే లేదు.
ఆమె., ఆత్రంగా చెప్పబోయే మాటలైనా ఓహ్హ్ విననే లేదు.
నాకేదో చెబుదామని ఆమె నోరు తెరిచినప్పుడల్లా
సూదీ దారాలతో నోరు కుట్టేస్తూ వచ్చాను.
చివరాఖరికి ఆమె మూగదై పోయింది.
ప్రేమగా పలకరించే.. తల నిమిరే ఇంటితో
మాట్లాడుకోవడం మొదలుపెట్టింది.
***
ఆమె రోజూ డాబా మీద వెన్నెలకి
చల్లబడుతుందనుకున్నా.. కానీ,
తన లోలోపల కాల్చేసే నిప్పునే..
వెన్నెలకిచ్చేసి మెట్లు దిగి
ఇంట్లోకి వస్తుందనుకోలేదు.
***
ఆమె.. ఒంటరై.. గోడలతో కిటికీలు.. తలుపులతో, పెరటితో,
వాకిలితో, తోటతో ఇంటి సమస్తంతో.,
మాట్లాడే రహస్య భాష ఒకటుందని అనుకోనే లేదు.
నా ఇంట్లో ఆమె నాతో చాలా సార్లు మాట్లాడింది..
తన నొప్పుల గురించీ.. తనని దహించివేసే
వంటింటి మంటల గురించీ నాకు చెబుతూనే ఉంది!
అయినా.. అయినా సరే., నాకు వినపడనే లేదు.
నేను అయ్యో అనలేదు!

ఏ ఒక్క నాడూ., ఆమె పాద ముద్రలు
నాకు కనిపించనే లేదు.
ఆఖరికి..
నడవలేక.. ఇంక ఇలా నడవలేనంటూ..
ఇక నొప్పి ఏ మాత్రమూ భరించలేనంటూ.,
ఆమె తనని తానే పట్టుకుని నడిపించుకుంటూ
ఇల్లు దాటి., బయటకు నడిచి వెళ్లి పోయిన తరువాత…
ఇల్లే ఆమెను సంతోషంగా సాగనంపిన తరువాత
ఆమె పాద ముద్రలు,. రక్తంతో నిండి.. స్పష్టంగా కనిపిస్తూ..
ఆమె మిగిల్చిన శూన్యంలో.,
ఆమె లేక అనాథ అయిపోయిన
ఇల్లు మౌనంగా నన్ను నిలేస్తూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here