[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘అక్షరాల కుప్పలు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సా[/dropcap]మాజిక స్పృహ లేని
సభ్యసమాజం వైఖరిపై
కత్తులు దూస్తోన్న అక్షరాలు!
ప్రేమ భావనకు తిలోదకాలిచ్చి
కుటుంబ బంధాలను తుంగలో తొక్కి
అనుబంధాలను ఆపహాస్యం చేస్తోన్న
ఆధునిక జీవనయానంపై
కొరడా ఝళిపిస్తోన్న అక్షరాలు!
పేగుబంధాలను వృద్ధాశ్రమాలకు తరలిస్తోన్న
రక్త సంబంధాల వారసత్వంపై
యుద్ధం ప్రకటించిన అక్షరాలు!
ప్రజాపాలన ముసుగులో నియంతృత్వం!
న్యాయం కోసం ఎదురు తిరిగిపోరాడితే..
కత్తుల బోనులో కఠిన కారాగార శిక్షలు!!
బంధుప్రీతి.. ఆశ్రిత పక్షపాతం..
పాలకుల పారదర్శకతను ప్రశ్నిస్తున్న వేళ
నా కలంలోని అక్షరాలు
అడుగడుగునా అవినీతిని ఎండగడుతున్నాయి!
నైతిక విలువలు అడుగంటిపోయిన వ్యవస్థలో
పసిబిడ్డలపై పైశాచిక దాడుల క్రీడలు..!
చిన్నారుల హృదయ వేదనను..
పసిమనసుల గాయాల మౌన రోదనను..
విశ్వవ్యాపితం చేసిన అక్షరాలు,
నా దేశం నలు చెరగులా
మతాల మత్తులో తూలుతోన్న
మానవమృగాల సమూహాలు
కత్తులతో కుత్తుకలు కోసుకుంటూ
జాతి చరిత్రను సరికొత్తగా
లిఖిస్తోన్న వైనాన్ని..
నా మనోనేత్రం అక్షరబద్ధం చేస్తోంది!
ప్రపంచ పటంలో
నా దేశం ముఖచిత్రాన్ని
మహోన్నతంగా లిఖించాలని
కలలు గంటోన్న..
నా మదిలోని గదులన్నీ..
అక్షరాలతో కుప్పలతో..
నిండిపోయాయి నిస్సహాయంగా..!!