అహల్య

0
3

[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘అహల్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“అహల్యా! ఇంకా అయిదేళ్ళ పాటు ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు స్వచ్ఛంద విరమణ సంగతి ఎందుకే?” కాలేజీ ముగిసాక అహల్యను ఇంటి దగ్గర కారులో దిగబెడుతూ అడిగింది వాణి.

“ఏమిటోనే, కొన్ని రోజుల నుంచి ఈ హడావిడి జీవితం నుంచి విశ్రాంతిగా గడపాలని అనిపించింది. మా అమ్మలా ఉండాలనిపించింది. అమ్మ ఇంటిని, పిల్లలను ప్రేమగా, ఆత్మీయంగా చూసుకునేది. ఇంటికి చుట్టపక్కాలు వస్తే ఆదరించేది. ఎప్పుడూ, ఎంతో శాంతంగా, ఓర్పుగా అన్నీ పనులనూ, చక్క బెట్టేది.”

“నువ్వు చూసుకోవటం లేదా? నీ పిల్లలు చక్కగా స్థిరపడ్డారు. మీ ఆయనకు మంచి హోదా ఉంది. ఇదంతా నీ వల్లనే కదా!” అహల్య వంక తిరిగి చూస్తూ అంది వాణి.

“నిజమే కాని, నేను నా పనులన్నింటినీ బాధ్యతతో చేసాననిపిస్తోంది. పిల్లలను చదువు అంటూ. క్రమశిక్షణ అంటూ వాళ్ళతో కొంత కఠినంగా వ్యవహరించాను. మా ఆయన నన్ను ఉద్యోగం చేయనియ్యడమూ, నా వ్యాసంగాలకు అంతరాయం కలుగనివ్వక పోడము స్త్రీ స్వేచ్ఛ అనుకున్నాను, కాని నేను నా రెండు భుజాలకూ, అనేక రెక్కలను తగిలించుకున్నాననిపిస్తుంది. రోబోలా భావ విభావాలు అన్నింటినీ వదిలేసి యాంత్రికంగా రోజును గడిపేసాననిపిస్తుంది. ఇప్పుడు సంతోషంగా నలుగురితో తీరికగా గడపాలని అనిపిస్తుంది. భావ గీతాలను పాడుకుంటూ, పూల తొట్టెల్లో పూలను చూస్తూ, ఉండాలని అనిపిస్తుంది. పెళ్ళయి కాపురాలు చేసుకుంటున్న, కూతురు, కొడుకుల ఇళ్ళకు వెళ్ళి సమయం గడపాలని ఉంటుంది. పేకేజ్ టూర్లకు వెళ్ళి ప్రదేశాలను చూడాలని ఉంది..”

ఇలా చెప్పుకు పోతున్న అహల్య మాటలకు అడ్డు పడుతూ, “అవన్నీ అటు తరువాత అరవై ఏళ్ళు నిండాక కూడా చేయొచ్చు కదే!” అంది వాణి.

“ఇప్పుడు ఇంకా నాలో కోరికలు, ఆరోగ్యం ఉన్నప్పుడే హాయిగా సమయం నాకు తోచినట్లు గడపాలని ఉందే..”

“సరే అయితే నువ్వు అనుకున్నట్లు ఆలోచిస్తూనే ఉండు, బీ హేహీ. నే వెళ్తాను” అంటూ అహల్యను ఇంటి దగ్గర దింపి వెళ్ళింది వాణి.

***

ఆ రోజు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేద్దామని అనుకుంది.

ఇంట్లోకి వచ్చి హాయిగా బరువును దింపుకున్నట్లు చేతులను చాపి ఊపిరి పీల్చింది.

భర్త రాగానే అడిగాడు. “ఏమిటి? స్నేహితులందరూ ఏమంటున్నారు?”

“అదే.. రిటైర్మెంట్ తీసుకుంటే రోజంతా ఏమి చేస్తావని అడిగారు.”

“అదే నేనూ అంటున్నాను. కొడుకూ. కూతురూ వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. బాధ్యతలన్నీ తీరాయి. ఇప్పుడు నీకు నువ్వుగా నీ పనిని చేసుకోవచ్చు. ఈ సమయానికల్లా ఇంటికి తిరిగి రావాలి, పిల్లలు ఎదురుచూస్తారు. వంటా వార్పూ సమయానికి చేయాలి, అనే నిర్బంధాలు ఏవీ లేవుకదా?”

భర్త మాటలను అందుకుంటూ, “అవునండీ నేను నిర్బంధనాలను అన్నింటినీ వదిలి హాయిగా ఉందామనే ఆ నిర్ణయం తీసుకున్నాను..” కొంత ఆవేశపడుతూ.. తనను ఎవరూ అర్థం చేసుకోవటల్లేదు అనే ఉక్రోషంతో అంది అహల్య.

“నీ ఇష్టం” అంటూ భర్త పైన తన గదిలోకి వెళ్ళాడు.

భర్త వచ్చేటప్పటికి తను ఇంట్లో ఉండడం చూసి సంతసిస్తాడనుకుంది అహల్య.. అలా ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయేసరికి దిగులుపడింది.

“అలా ఏదైనా మంచి రెస్టోరెంట్‌కు వెళ్ళి ఫలహారం చేసి వద్దాం రండి”, అంటూ పిలిచింది.

“అబ్బా! ఇప్పుడేమీ తినే మూడ్‌లో లేను, ఆఫీసులో ఇవాళ డైరెక్టర్స్‌కి లంచ్ ఇచ్చారు. ఆకలిగా లేదు” అన్నాడు.

అహల్యకు కూడా ఏమీ తినాలని అనిపించలేదు. ఏదైనా బుక్ తీసి చదువుదామని షెల్ఫ్ దగ్గరకు వెళ్ళింది.

వి. రాజారామమోహనరావు గారి నవలా హృదయం వాల్యూము కనిపించింది. ఇరవై ఏడు ప్రసిద్ధ నవలల విమర్శనాత్మక వ్యాసాలు అందులో ఉన్నాయి. కొద్దిసేపు కొన్ని పేజీలను తిరగేసింది.

ఇదివరలో మర్నాటి తరగతికి ఏమి పాఠం చెప్పాలో రాత్రి పొద్దు పోయేవరకు నోట్స్ రాసుకుని సిద్ధపడేది.

మెల్లిగా నిదురలోకి జారుకుంది.

***

పొద్దున లేవగానే కాలి నడకకు బయలుదేరింది. చుట్టు పక్కల వాళ్ళు నలుగురైదురు యువతులు కలిసారు. కొంత నడక అయిన తరువాత వాళ్ళు ఆఫీసులకు సమయం అయిపోతుందని ఎవరి తోవన వారు వెళ్తామని చెప్పుతుంటే అహల్య అక్కడ బెంచి మీద కూచుంది. ఇంతకు మునుపు కాలేజీకి వెళ్ళే అలవాటులో తానే ముందుగా తిరిగి వెళ్ళేది. కొద్ది సేపు ఒంటరితనం అనుభవించాక ఆమెకు ఇక లేచి వెళ్ళాలనిపించింది.

ఆమె వెళ్ళే సరికి అలవాటుగా భర్త కాఫీ ముగించాడు. ఆఫీసు సహోద్యోగితో ఏదో అత్యవసర విషయం మాట్లాడసాగాడు. అహల్య తానూ కాఫీ ముగించింది. భర్త ఫోనులో మాట్లాడుతూనే కార్యాలయానికి వెళ్ళడానికి తయారవబోతుంటే, అతనిని, కొద్ది సేపు ఆగమని

“ఏమండీ, అమ్మాయి యింటికి వెళ్ళి చూసొద్దాం ఇవాళ! తొందరగా వస్తారా!” అని అడిగింది.

వెంటనే ఆయన “లేదు.. లేదు ఇవాళంతా నేను చాలా బిజీ. అయినా అది కూడా పనికి వెళ్ళి అలసిపోయి వస్తుంది. రాగానే దాని పిల్లలను మ్యూజిక్ క్లాసుకూ, ‘జిమ్’కు తీసుకుని వెళ్ళడానికి హడావిడి పడుతూ ఉంటుంది. నువ్వెళ్ళి దాని రొటీన్ భంగం చేయకు” అన్నాడు.

అవును కూతురు లేచింది మొదలు అటు కార్యాలయం పని తోనూ, పిల్లల పనులతోనూ తలమునకలవుతుంటుంది. అల్లుడు కూడ భార్యకు తోడ్పడుతూ, కొద్ది సమయం దొరికితే చాలునని, ఎదురుచూస్తుంటాడు.

ఇదివరలో కూతురు తన పిల్లలను వాళ్ళ పసితనంలో అమ్మ వచ్చి చూసుకుంటే బాగుండును అనుకునేది. అప్పుడు అహల్యకు తీరిక లేదు. కూతురు ఆయాని పెట్టుకుని ఎలాగో తంటాలు పడి పిల్లలను పెంచుకుంది, తల్లిగా పెట్టుపోతలకు లోటు చేయకున్నా పిల్లలను పెంచి పెద్ద చేయడంలో అంతగా తోడ్పడలేదు.

కూతురు తల్లిని గౌరవిస్తుంది.. అధ్యాపకురాలిగా ఆమె పలుకుబడిని చూసి గర్వపడుతుంది. కాని ఆమె పనులకు, అంతరాయం కలిగించదు. ఆప్యాయంగా ఆమెతో కష్టసుఖాలు చెప్పుకోదు.

ఈ రోజు కూతురు ఇంటికి వెళ్ళినా దాని హడావిడిలో అది ఉంటుందని అహల్య ఆ ప్రయత్నం మానుకుంది.

ఇక కొడుకు తల్లి అంటే ఒక విధమైన దూరం పాటిస్తాడు. చిన్నతనంలో తల్లి అవసరం అయినప్పుడు ఆమె కాలేజీలో పరీక్షల సమయం అనీ, ఈ రోజు కాలేజీలో ముఖ్య కార్యక్రమం అనీ తండ్రికి కొన్ని బాధ్యతలు చెప్పి వెళ్ళిపోయేది. తమ ఉన్నత విద్యాభ్యాసానికి, అమెరికా పంపి చదువుకోడానికీ అమ్మ శ్రమ కూడా కారణమే అని తెలిసి ఆమె పట్ల మర్యాదను చూపుతాడు.

తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు అభ్యంతరం చూపని అమ్మ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడు. తన భార్య అమెరికాలో నివాసం ఏర్పరచుకున్న హిందువులకు అక్కడే పుట్టి పెరిగింది కనుక ఆమె తలిదండ్రుల అండ బాగా ఉంది. ఆమె అత్తగారిని చుట్టపు చూపుగా చూస్తుంది తప్ప వచ్చి తమతో ఉండమని ఎలాంటి పరిస్థితిలోనూ అర్థించదు.

అహల్యకు పక్కింటికి వెళ్ళి కొద్ది సేపు మాటామంతీ ఆడివద్దామన్న ఆలోచన అక్కడ ఇంటి వరసల స్త్రీలందరూ ఉద్యోగస్థులని, వాళ్ళ ఇళ్ళు తాళం పెట్టి ఉంటాయని తెలును కనుక మానుకుంది.

అలా బజారు కెళ్ళి కూరగాయలు తెచ్చుకునేందుకు బయలుదేరింది. మనిషి స్పర్శ లేని మాల్‌లో కావలసినవి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది.

భర్తకు ఫోను చేసింది, “ఏమి వండను సాయంత్రానికి?” అంటూ అడిగింది.

“వంటంటూ పెట్టుకోకు. రోజూ తెప్పించుకునే కేటరింగ్ సర్వీసు వాడు మనకు నచ్చాడు కదా! ఈ రోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ తెస్తాడట, నీకు ఇష్టమైన చోటికో లేదా సినిమాకో వెళ్ళు” అని ఫోన్ పెట్టేసాడు.

నెల రోజులు ఇంట్లో గడిపాక తాను ఇంటిని శుభ్రం చేసుకోడం, అలంకరించడం, తోట పని చేయం వంటివన్నీ మొదలు పెట్టినా భర్త కూతురూ కొడుకూ, “ఇవన్నీ చేయడానికి చక్కగా ఇదివరకూ వున్న మనుషులున్నారు కదమ్మా! నీకెందుకు కష్టం” అంటూ ఎవ్వరూ ప్రశంసించలేదు.

***

అలారం మోగింది. ఒక్క ఉదుటున లేచింది అహల్య. తను కళాశాలకు వెళ్ళాలి. ఆ రోజే రిజల్ట్స్ వచ్చాయి. విద్యార్థులందరూ ఆనందంగా ఉన్నారు. అహల్యను చూడగానే ఆమెను చుట్టుముట్టారు.

“మేడం మాథ్స్‌లో మన కాలేజీకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి. అంతా మీ వల్లనే” అంటూ ఆమెపట్ల అభిమానం చూపారు.

“నువ్వు గణితం పాఠాలు చక్కగా బోధించడం వల్ల జాతీయ స్థాయి కళాశాలల్లో మన కాలేజీ విద్యార్థులకు అధిక స్థాయిలో ‘ఐ. ఐ. టి.’ లో స్థానం లభించింది. ఆ విద్యార్థుల తలిదండ్రులందరూ నిన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు. విద్యార్థులందరూ తమ భవిష్యత్తుకు బంగారు బాటను వేసిన మేడం అని నీ గురించి పత్రికా ప్రతినిథులకు చెప్తున్నారు” అంటూ సహ అధ్యాపకులు అహల్యను ప్రశంసించారు.

మంచి కంపెనీలో ఉన్నత ఉద్యోగం వచ్చిన వార్తను అధ్యాపకులందరికీ తెలుపడానికి వచ్చిన పూర్వ విద్యార్థి మార్తాండ అహల్య వద్దకు వచ్చాడు. “మేడం ముందుగా మీకు కృతజ్ఞతలు. విద్యార్థిగా నాకు మీరిచ్చిన ప్రోత్సాహమే ఈ రోజు నన్ను ఉద్యోగిగా స్థిరపరచింది. మీరు కేవలం పాఠాలనే కాదు, జీవన సమన్వయాన్ని కూడా నేర్పారు” మార్తాండ మాట్లాడుతుంటే ఆతని కళ్ళలో మెరుపు కనిపించింది.

అహల్య మనసు ఆనందంతో నిండి పోయింది.

తను వృత్తిలో సంతృప్తిని సాధించింది. తల్లిగా ప్రేమ, త్యాగం రెండూ కలగలిపి పిల్లలను పెంచింది. భర్త సహకారం ఉంది కాబట్టి తను సాఫీగా తన కర్తవ్యాలను సాధించగలిగింది. తానొక్కతే కాదు కుటుంబంలో అందరి సహకారం వల్ల వృత్తిలో ఉన్నతినీ, సంసారంలో శాంతినీ సాధించగలిగింది.

మర్నాడు స్వాతంత్ర్య దినం. కళాశాలలో విద్యార్థులు పతాక దినోత్సవానికి ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాతినుంచి నాతిగా మారిన అహల్యలా రాత్రి వచ్చిన కల తన మనసులోని జడ భావాలను అన్నింటినీ దూరం చేసింది. మూసిన కిటికీని తెరిచింది. స్వేచ్ఛగా గాలులు వీచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here