వింత ప్రేమ

0
3

[శ్రీ కర్లపాలెం హనుమంతరావు రచించిన ‘వింత ప్రేమ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]డవిలో ఎండు కొమ్మలు ఏరుకొనేటప్పుడు కనిపించింది ఆ ఎలుగ్గొడ్డు పిల్ల.. కంపలో. వళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని నొప్పితో మూలుగుతోంది! తల్లి ఎటు పోయిందో ఏమో గానీ.. కంప నుంచి బైటపడలేక దిక్కులు చూస్తోంది పాపం పసిది. వడుపుగా దాన్ని బైటికి లాగి.. కాడికి కట్టి భుజం మీద మోసుకొంటూ అడవి నుంచి బైటపడే వేళకి చీకటి పడనే పడింది. జంతువు ఎవరి కంటా పడకుండా ఇంటికి తెచ్చుకొన్నందుకు సంతోషం అనిపించింది.

నేను కోతుల్ని ఆడించుకొంటూ బతికే సంచార జాతివాణ్ణి. కాన్పు కష్టమై సీతాలు నా దోసిట్లో పెట్టి పోయిన పచ్చి గుడ్డు కోసం, తిరుగుళ్లు తగ్గించి వున్న వాళ్ళోనే ఏదో కాయా కంపా అమ్ముకొంటూ బతుకీడుస్తున్నా. కోతుల్ని ఆడించే విద్య తాతల నాటి నుంచి పట్టుబట్టం వల్ల దొరికిన ఈ ఎలుగ్గొడ్డుకి ఆ ఆటా పాటా నేర్పించి తండ్రి బాటలో నడవాలనిపిస్తుంది ఇప్పుడు.

గాయపడ్డ జంతువు తేరుకోవాలి ముందు. పాపం అనిపించినా ఎలుగు పిల్లను ఇంటి ముందు చెట్టుకు కట్టేయక తప్పింది కాదు. కొత్తచోటుకి బెంబేలెత్తి అది పెడబొబ్బలు పెడుతుంటే మా శంకరం ఒకటే ఏడుపు. తెల్సిన పసరు వైద్యం చేస్తూ ఎలుగ్గొడ్డు పుళ్ళు మానిందాకా ఓపిక పట్టా. క్రమంగా మాలిమి అవటంతో మా శంకరానికి మల్లే దానికీ భీముడూ అని ఒక పేరు తగిలించి పిలవటం మొదలుపెట్టా.

అభం శుభం తెలీని పసిపిల్లల్ని కొట్టి కోసి దారికి తెచ్చుకోలేం. జంతువే అయినా భీముడిదీ మా పిల్లగాడి ఈడే. శంకరం పాలూ, బువ్వా టైమే భీముడి తేనే, తేనెపట్టు టైం.

ఎలుగుబంటికి శిక్షణిచ్చే టైమొచ్చింది. భీముడి నుదుటి కింత గంధం పులిమి మెడకో పలుపు తాడు గట్టి, ముక్కు పుటాలకు గుచ్చిన బులాకీలాంటి ఇనప చక్రం గుండా ఓ ప్లాసిక్ తాడును లాగి కళ్ళెంలా ఏర్పాటు చేసుకొన్నా. భీముడిప్పుడు ట్రైనింగుకి రడీ!

భీముడు సూక్ష్మగ్రాహి. రోజుల వ్యవధిలోనే ట్రిక్కులన్నీ నేర్చేసుకొన్నాడు. క్రికెట్ బ్యాటు పట్టుకోవడం, చురుగ్గా సైకిలు తొక్కటం లాంటి వడుపులు బాగా వంటబట్టాయి.

వీధి ప్రదర్శన రక్తి కట్టాలంటే భీముడు నేర్చుకోవల్సిన ముఖ్యమైన ఐటం ఇంకోటుంది.. నృత్యం. షో మొత్తానికి ఇదే హైలైట్. సినిమా పాటలకు తగ్గట్లు భీముడు స్టెప్పులేస్తే.. కాసులు కనక వర్షంలా కురవటం ఖాయం.

ఎలుగుబంటిని నర్తకిగా మార్చే పద్ధతి కాస్త మొరటుగానే వుంటుంది. గాడిపొయ్యిని ఇంటి కప్పుకు వాడే సీనా రేకుల షీట్‌తో మూసి పొయ్యిలోని బొగ్గులకు నిప్పటించాలి ముందు. సీనా రేకులు వేడెక్కేలోగా ముందు కాళ్ళు తాడుతో కట్టేసిన ఎలుగ్గొడ్డును దాని మీదకు ఎక్కిస్తే సరి. వేడికి కాళ్ళు బొబ్బలెక్కి నొప్పికి తాళలేక ఎలుగు చిందులేస్తుంది. బెదిరిన గొడ్డును సీనా రేకు మీదే కట్టడి చేస్తూ పాట వినిపించాలి. నాగా లేకుండా ఈ శిక్షణ రోజూ కొనసాగిస్తే చాలు.. ఎలుగుకి పాటకు తగ్గట్లు కాలు కదిపే వాటం పట్టుబడుతుంది.

ఆ పాటికే భీముడు మా ఇంటి మనిషై పోయాడు. వాడూ శంకరం అన్నదమ్ములకు మల్లే కలివిడిగా ఉంటున్నారు. నాకు భీముడిని కాపలా కాసే పని తప్పిపోయింది. వాళ్ళిద్దరూ ఒకే చాప మీద పక్కనక్కన పడుకొని నిద్రపోవడం చూసి ఇరుగు పొరుగు నోరు వెళ్ళబెట్టేవాళ్ళు కూడా!

ఆ ఆదివారం సాయంత్రం భీముణ్ణి వూరి మధ్య పార్కుకు తీసుకెళ్ళాను. సీతాలు కట్టి విడిచిన ఎర్ర చీరను నేల మీద పరిచి వెంట తెచ్చిన సామాను సర్దుతుంటే క్రమంగా జనం పోగవుతున్నారు. నుదుటి నల్లటి బొచ్చుమీద పసుప్పచ్చని చందనం బొట్టు, హరిదాసుకు మల్లే మెడలో బంతిపూల దండ, నెత్తి మీద జోకరు టోపీలో వున్న ఎలుగుబంటిని చూస్తే ఎవరికైనా ఎందుకు ఆసక్తి కలగదు! ముఖ్యంగా పిల్లలు చుట్టూ చేరి కేరింతలు కొడుతున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళను అదిలిస్తూనే తామూ అబ్బురంగా చూస్తున్నారు.

క్రమంగా గుంపు పెద్దదయింది. చాలా మంది సెల్ ఫోన్లు బైటికి తీసి వీడియోలు తీస్తున్నారు.

ఆట మొదలుపెట్టా. “భీముడూ! కమ్ హియర్” అని అజ్ఞాపించా. బళ్ళో పిల్లాడిలా బుద్ధిగా గిరి మధ్యలో కొచ్చి నిలబడ్డాడు. “సిట్ డౌన్” అన్నా. కూర్చున్నాడు. “స్టాండప్” అన్నా. లేచి నిలబడ్డాడు.

ఓ అయిదుసార్లు దాంతో గుంజీలు తీయించి చేతికి ఓ ప్లాస్టిక్ క్రికెట్ బ్యాటు అందించా. అల్లంత దూరంలో బంతి పట్టుకొని నిలబడ్డ శంకరాన్ని చూపిస్తూ “అడిగో! కపిల్ దేవ్! బాలు విసుర్తున్నాడు. కాచుకో!” అని కేకేశా. స్టంప్స్ ముందు నిలబడ్డ భీముడు శంకరం విసిరిన బంతిని బ్యాటుతో కొట్టటంతో బాల్ గుంపు మీంచి బైటికెళ్ళి పడ్డది. అట్లాగే బౌలర్‌గా మారి శంకరాన్ని మొదటి బంతికే డకౌట్ చేయటంతో చూసే జనాల ఆనందానికి అడ్డులేకపోయింది. భీముడు ట్రైసైకిలెక్కి గిరి చూట్టూ రౌండ్స్ వేయటం, టేప్ రికార్డరులో వందేమాతరం గీతం విన్నంతసేపూ సుశిక్షితుడైన సోల్జర్‌లా సెల్యూట్ ఫోజులో నిలబడ్డం చూసి జనాలు నోరెళ్ళబెట్టేసారు. ఇక ఆఖరి ఐటం డేన్స్. ‘నాటు నాటు’ పాటకు శంకరంతో కలిసి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ని అనుకరిస్తో వేసిన స్టెప్పులకయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అద్భుతం. భీముడి జనరంజన ప్రదర్శనకు పరిచిన మీద కురిసిన నాణేలే నిదర్శనం. మబ్బుల్లో తెలుకుంటూ ఇంటికొచ్చి పడ్డా. శంకరానికి వెంకయ్య కొట్టు మిఠాయి, భీముడికి ముంత నిండా కల్లు, నాకయితే జానీ వాకర్.. సీతాలు పోయినా చాలా కాలానికి ఈ గుడిసెలో ఆనందం తాండవించింది. మంచి జీవితం మీద ఆశ ఆ రాత్రి నుంచే మొదలయింది.

గుంటూరు లాంటి చిన్న వూరు నా ఆశలకు తగిన చోటు కాదు. నా ఆలోచనలను చిన్ననాటి మిత్రుడు కోళ్ళ ఫారం మస్తాను ముందు పెట్టినప్పుడు అతగాడు అదోలా నవ్వాడు. “ఆశకు అంతుండాలి భాయ్! కడుపులో చల్ల కదలకుండా కాలంవెళ్ళి పోతుంది కదా ఇక్కడ! పెద్దపట్నం పోయి బావుకునేదేముంది? కొత్తచోటు.. కొత్త మనుషులు.. అలవికానివాటి కోసం అంగలార్చకు.. ఆలోచించుకో!” అని హెచ్చరించాడు.

అక్కడితో నా ఆవేశం చల్లారింది. రోజులు గడుస్తున్నాయి. భీముడి ప్రదర్శనలకు చుట్టుపక్కల వూళ్ళలో ఆదరణ ఎక్కువయింది.

విజయవాడ ఎగ్జిబిషనప్పుడు మస్తాను సలహా ఇచ్చాడు. “నువ్వెట్లాగూ నగరం దాకా పోయి నెగ్గుకు రాలేవు కానీ, బెజవాడలో ఎగ్జిబిషను జరుగుతుంది నెలరోజుల పాటు. భీముడి ఆటా పాటా అట్లాంటి చోట బాగా చూస్తారు. నువ్వనుకున్నట్లు మన శంకరానికి మంచి చదువూ జీవితం ఇవ్వచ్చు.. పోయిరా ఇబ్బంది వుండదు.”

మస్తాను మాటతో మనసులో మళ్ళీ ఆశలు చిగురించాయి.. సీతాలుకు పుట్టబోయే బిడ్డ పెద్ద కలకటేరు కావాలని కలలుండేవి. దాని పిచ్చాశకు అప్పట్లో నవ్వొచ్చింది కాని శంకరానికి మంచి బతుకు కల్పించే అవకాశం చేతిదాకా వచ్చింది. సీతాలు కోరికేనా తనదీ అదే ఆరాటం. మస్తాను చెప్పినట్లే చేయటానికి సిద్ధమయ్యాను.

కానీ అయ్యగారి సంబడం ఆర్నాళ్ళకే ముగిసింది. ఆపసోపాలు పడి అంతలేసి దూరం ఎండా వానలకు పడి వచ్చిన ముచ్చట రెండో ఆదివారమే ఆవిరయింది.

ఎప్పట్లానే ఆరోజూ అపరాహ్నం దాకా ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఆదివారాల్లో తతిమ్మా అన్ని రోజుల కన్నా హడావుడి ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లే భీముడి ప్రదర్శనా.. ఆడియన్సూ స్పందనా అద్భుతంగా జరుగుతుండగా ముంచుకొచ్చిందా ప్రమాదం.

గుమికూడిన జనాన్ని చీల్చుకొంటూ ఒక ఆడమనిషి నా ముందుకొచ్చి నిలబడింది. కోపంలో కందగడ్డలా వుందా పొత్తేం మొహం. ఏమిటేమిటో అంటోంది అదే పనిగా చేతులు ఆడించేస్తో.. భీముణ్లి చూపించి. నాకేం అర్థం కాలే ఆవిడ ఘోషేంటో. భీముడైలే బెదిరిపోయి నేలక్కరుచుకొని పడుకుండిపోయాడు. ఇంతట్లో రెండు ఖాకీలు ప్రత్యక్షం.. లాఠీలు ఆడిస్తూ! ఆడమనిషి అంతకు ముందే ఏదో పితూరీ చేసినట్లుంది.. నన్నూ, శంకరాన్నీ ఒక వేనులో, భీముణ్ణి ఇంకో వేనులో పడేసి ఎక్కడికో తీసుకెళ్ళారు. భీముడెక్కిన బండి మీద ‘జంతు సంరక్షణ కేంద్రం’ అని రాసి వుండటం చూసా.

ఆ రాత్రంతా నేను అదేదో పోలీస్ స్టేషన్ లాకప్‌లో వుండిపోయా. శంకరం ఇంకా మైనరే కాబట్టి లాకప్ బైట బెంచీ మీద పడుకొన్నాడు. ఏడ్చి ఏడ్చి బల్లమీదే సొమ్మసిల్లి పడున్న బిడ్డను చూసి నా గుండె బద్దలయింది.

మర్నాటి సాయంత్రానికి మస్తాను స్టేషను కొచ్చాడు. అతగాడి అడ్రసు నేనే ఇచ్చా. నా మీద ఏదో కేసు కట్టబోతున్నారని చెప్పాడక్కడి పోలీసాయన. వన్యపాణి సంరక్షణ చట్టం ప్రకారం సరైన రిజిస్ట్రేషన్ లేకుండా ఏ జంతువునూ వినోదం కోసం ఉపయోగించకూడదంట. తెలిసినా, తెలీక పోయినా అట్లా దుర్వినియోగం చేస్తే మాత్రం జరిమానానో, జైలుశిక్షో, ఆ రెండూనో ఖాయమని అప్పుడు తెలిసింది.

“ఈ గొడవలేవీ మా పల్లెటూరి బైతులకు తెలవవు సార్. మా దోస్తును మీరే ఎట్లాగో కాపాడాల! వీడు జైలుకెళితే పసోడి బతుకు బజార్న పెడుతుంది సార్! ఈ ఒక్క దఫాకి తప్పు కాయండి” అంటూ మస్తాను కాళ్ళా వేళ్ళా పడ్డంతో ఏ కళ నున్నాడో స్టేషను పెద్దాఫీసరు కేసు కట్టకుండా వదిలేశాడు. బతుకు జీవుడా అంటూ నేనూ బిడ్డా వూరికొచ్చి పడ్డాం.

మస్తాను పూనికతో మా ప్రాంతం ఎమ్మెల్యే బ్యాంకులో ఆటో లోను ఇప్పించాడు నాకు. ఇప్పుడు ఆ ఆటోనే నాకు జీవనాధారం.

ఎలుగ్గొడ్డుతో పోలిస్తే ఆటో నడపటం సుఖం. శంకరాన్నిప్పుడు మంచి బళ్ళో చేర్పించా. ఆ దఫా స్కూలు యానివర్శిరీలో శంకరం స్టేజీ మీద భీముడి ఆటపాటలనే ప్రదర్శించాడు అద్భుతంగా. ముఖ్యంగా ఎలుగుబంటి వేషంలో వాడు తాజా సినిమా పాటలకు తగ్గట్లు స్టెప్పులేస్తుంటే ఆనందంతో జనం నుంచి చప్పట్లే చప్పట్లు!

అభయారణ్యంలో బతికే భీముడికి ఇప్పుడు ఈ ఆటా పాటా గుర్తుండక పోవచ్చు. కానీ శంకరంతో సమానంగా పెంచిన మనిషిని నేనెట్లా మరచిపోతాను? భీముడూ, ఆటో.. రెండూ రెండు పూటలా తిండి పెట్టేవే అయినా పెంపుడు జంతువుతో ఉండే అనుబంధం మర బండితో ఏర్పడుతుందా!

భీముడు గుర్తుకొచ్చి గుండె బరువెక్కింది.. సీతాలు దూరమైనప్పుడూ ఇదే కోత!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here