ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-15

0
4

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

క్షేత్రజ్ఞుడు – మొదటి భాగం:

క్షేత్రయ్య – జీవిత సంగ్రహ చరిత్ర:

[dropcap]క్షే[/dropcap]త్రయ్య క్రీ.శ. 1600 – 1680 కాలము నాటివాడు. తెలుగు బ్రాహ్మణుడు. జన్మస్థానము కృష్ణా జిల్లాలోని ‘మొవ్వ’ అను గ్రామము. భాగవతుల కూచిపూడికి సమీపమున కలదు. మొదటి వేరు వరదయ్య. బాల్యములో సంగీత, సాహిత్య, నాట్యాభినయాలంకారాది శాస్త్రము అభ్యసించునపుడు తన సహపాఠియైన ఒక దేవదాసిని ప్రేమించినందున వారిద్దరి మధ్య నడచిన సంభాషణలు తన పదరచనలందు యిమిడ్చాడు. తరువాత దేవదాసి యొక్క కోరికపై, అక్కడ వెలసిన శ్రీ వేణుగోపాల స్వామిపై ‘శ్రీపతి సుతు బారికి’ ఆనందభైరవి రాగంలో రచించాడు. కంచి వరదునిపై రచించిన పదములతో తన జీవిత కథను చిత్రించాడు. ఇతడు మధుర, తంజావూరు, గోల్కొండ, విజయనగర సంస్థానములకు వెళ్లి ఆయా రాజుల కోరికపై అనేక పదములు రచించి వినిపించి ఘన సత్కారములు పొందాడు. తంజావూరు వెళ్లినపుడు శ్రీవిజయరాఘవుని కోరికపై ‘పంచరత్న’ముగా పదములు రచించి రాజుకి అంకితమిచ్చాడు. పదములు వాడుటలో అద్వీతీయుడు. శృంగారరస ప్రధానముగా 4,000 పదములు రచించాడు. అతని పదములు మువ్వగోపాల ముద్ర గలియుండును. సంక్షిప్తంగా అతని జీవిత చరిత్ర ఇది.

గేయవాఙ్మయము ప్రతి భాష యందు ముందు పుడుతుంది. సాధారణముగా మానవ హృదయం ఉల్లాసంతో వెల్లి విరిసినపుడు గేయము తనంతట తానే ఉత్పన్నమవుతుంది. కరుణ రసము ప్రసరించినపుడు ఆకస్మికముగ గేయములు హత్తంత్రుల మ్రోగించి నాదరూపమున బాహ్యమున అభివ్యక్తమవుతుంది. ఇట్టి గేయాలనే పదములంటారు. ఆంధ్రమున ‘పాట’ అని అంటారు. గేయ వాఙ్మయము రెండు రకాలు అని చెప్పవచ్చు.

  1. శ్రావ్యము: ఉదాహరణ త్యాగరాజ కీర్తనలు
  2. శ్రావ్యము, అభినేయం: ఉదాహరణ క్షేత్రయ్య పదములు. ఈయన పదములందు విశిష్టతను చాలా మంది చాలా అభిప్రాయాలన్ని వెల్లడించారు.

“The Padas of Kshetrajna form one of the richest treasures of Raga and Bhava in Carnatic Music. Kshetrajna, an Andhra Musician Composer of a place called Muvvapuri in Guntur District composed heaps of Padas for the Art of Abhinaya in Bharata Natya” (Hyderabad as a centre of Sangita. The Journal of the Music Academy Vol. XVI: Page 117 Ref. చెన్నపురి రావెళ్ల వారి ప్రకటితం)

~

క్షేత్రయ్య గూర్చిన అంశములు :

  1. స్వస్థలం గూర్చి అభిప్రాయములు
  2. దర్శించిన క్షేత్రాలు
  3. శృంగార రసమంజరి భానుదత్తుడు
  4. లక్ష్య లక్షణ సమన్వయం
  5. పచ్చి శృంగారం
  6. సంకీర్తన రచనా పరిణామం
  7. సంగీత రచన
  8. క్షేత్రయ్య గుణగణాలు (అనగా ఆ కాలపు రాజుల వాతావరణం)
  9. క్షేత్రయ్య గొప్పకవి అనుటకు ఉదాహరణ
  10. క్షేత్రయ్య గొప్ప గాయకుడు అనుటకు ఉదాహరణ
  11. రచనలలో అతని శైలి – భాష గురించి
  12. తెలుగు దేశంలో ఈయన పదములకు గల స్థానం
  13. పదములు లక్షణములు
  14. క్షేత్రయ్యకు ఇతర వాగ్గేయకారులకు గల పోలిక
  15. క్షేత్రయ్యకు – త్యాగయ్య, అన్నమయ్య గల పోలిక
  16. క్షేత్రయ్య వాడిన లోకోక్తులు
  17. ముఖ్య వాగ్గేయకారుల ముద్రలు, భాష
  18. విమర్శలు నెం. 17

~

స్వస్థలం గూర్చి అభిప్రాయాలు:

  • మువ్వగోపాల, మువ్వపురి గోపాల, మోవనాడు కల్గిన మువ్వ గోపాల దేవా స్వీయ చరిత్రాత్మాక రచనలు: ఉదా:
  1. ఏమిర వరద నీ మోము చిన్నబోయినది
  2. ఎంత లేదని యేంచకురా! కంతునిగన్న చక్కని కరిగిరవరద నా సామి
  3. బాల ఇందుకే నా మనసు జాలి పొందెరా, ఎన్ని తలచుకొందునమ్మా, ఎట్లా మరపు వచ్చునమ్మా, కన్నెరో – అను పదములలో వరదయ్య ప్రేయసిని విడచి దూరదేశం వెళ్లి యుండగా ఆమె విరహవస్థను పొందడమూ, దూత చేత రాయబారం పంపడం, తరువాత అతడు కూడా తన వలెనే విరహావస్థలో వున్నాడని తెలిసి తానే బయలుదేరి అతన్ని అక్కడ కలుసుకోవడం, ఈ సంఘటనలు అన్ని ఉదాహరణలుగా గ్రహించవచ్చునని శ్రీ అప్పారావు గారు వ్రాశారు.
  • ఈయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొవ్వ అని, ఇంటి పేరు సహితము మొవ్వ అని, వీరి పేరు వరదయ్య అని కూడా శ్రీ అప్పారావు గారే పేర్కొన్నారు.
  • వరదయ్య సంగీత విద్య అభ్యసించిన సమయంలో ‘మోహనాంగ’ అను వారకాంతతో స్నేహ మేర్పడి, వారిరువురు భార్యాభర్తలవలె కొంతకాలము గడిపిరని, ఆమె స్వగ్రామము కూడా ‘మొవ్వ’ అనియు శ్రీ అప్పారావుగారు చెప్పారు.
  • కొంతమంది విజ్ఞులు వరదయ్య చాలా క్షేత్రములు దర్శించి ఆయా క్షేత్ర దేవతలపై పదములు వ్రాసినందు వల్ల ఆయనకు క్షేత్రయ్య అని పేరు వచ్చెనని, అదే పేరు స్థిరమై చరిత్రచే క్షేత్రయ్యగా గుర్తింపబడినట్లు చెప్పుచున్నారు.
  • సుబ్బరాయ దీక్షితులు తన విఖ్యాత సంగీత గ్రంథంలో క్షేత్రయ్యను గూర్చి యిలా వ్రాశారు: ‘తెలుగు బ్రాహ్మణుడు. ఉనికి మొవ్వపురి. ఆంధ్రభాషా, సంగీత, సాహిత్యములలో జ్ఞానము గలవాడు. బాలదశలో ఒక మహా యోగి వలన మంత్రోపదేశం పొందాడని, గోపాల ఆలయంలో చాలా కాలము మంత్రవృత్తి చేసుకుంటూ, శృంగార రసాధి దేవతయైన గోపాలుడు దర్శనమిచ్చి అనుగ్రహించిన తోడనే ‘శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే కోపాలా? మువ్వ గోపాలా?’ అని ప్రప్రథమున ఒక పదము రచించాడు.’

క్షేత్రయ్యను బోలిన పదకర్త లేరని సుబ్బరాయ దక్షితులు వాసారు.

~

క్షేత్ర పర్యటన (దర్శించిన క్షేత్రాలు):

18 పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడి వేల్పులకు అంకితముగా పదాలు రచించాడు. మానవ మాత్రుల ఆస్థానాలు నాలుగు మాత్రం దర్శించి అక్కడి రాజుల కోరిక కూడా చెల్లించి పదాలు చెప్పాడు. దర్శించిన క్షేత్రాలు:

క్షేత్రస్థలం  వేలుపు పేరు రచించిన పద సంఖ్య
వరహురం శ్వేత, ఆది వరాహుడు 3 పదాలు
చిదంబరం గోవింద రాజస్వామి 2 పదాలు
కడప వేంకటేశుడు 1 పదము
కంచి వరదరాజస్వామి

చెవ్వంది లింగడు

13 పదాలు

3 పదాలు

వేదారణ్యం వేదనారాయణుడు
వేదపురి వేదపురి నిలయుడు 2 పదాలు
హేమకూటం హేమాద్రి స్వామి 1 పదము
యాదగిరి చెలువ రాయుడు 1 పదము
శ్రీరంగం రంగనాథుడు 2 పదాలు
మధుర మధురాపురీశుడు 1 పదము
సత్యపురి వాసుదేవుడు 1 పదము
పాలగిరి చెన్నడు 1 పదము
శ్రీనాగశైలం మల్లికార్జున స్వామి 1 పదము
చలువ చక్కెరపురి చలువ చక్కెరపురి 1 పదము
చక్రపురం కోవళ్ళూరు
కోవళ్ళూరు మువ్వగోపాలుడు 1 పదము

పైన చెప్పిన అన్ని వేల్పులకు మువ్వగోపాల అభేదం పాటించి, క్షేత్రయ్య గోపాల భక్తుడైనా, శివకేశవాభేదం పాటించాడు.

~

శృంగార రసమంజరి – భానుదత్తుడు – అలంకార శాస్త్ర లక్ష్యం:

15వ శతాబ్దంలో తెలంగాణాలో వెలసిన భానుదత్తుడు మహా పండితుడు. సంస్కృతంతో రసతరంగిణి, రసమంజరి అనే అలంకార శాస్త్ర గ్రంథాలను రచించి, వాటిలో అంతకు ముందు అలంకారికులు చూపని నాయికా నాయక భేదాలను వివరించి లక్షణము చెప్పి వాటికి లక్ష్య శ్లోకములను కృషి పరంగా రచించాడట. క్షేత్రయ్య తన పదర రచనలో భానుదత్తుని తోవనే అనుసరించాడు.

క్షేత్రయ్య మానవ జీవితంలో నుంచి సహజమైన సన్నివేశాలలో వారి మనోభావాలను గేయ రూపంగా వివిధ అవస్థలలో చిత్రించాడు. అతని మనస్తత్వ పరిజ్ఞానము, అనుభవ పరిణతి అలంకార శాస్త్ర జ్ఞానము కంటె మించినట్టివి.

శృంగార రసమంజరి – భానుదత్తుడు:

సంగీత అలంకార శాస్త్రములను అభ్యసించిన మువ్వ వరదయ్య కూడా ‘రసమంజరి’ని చదివి, అందులో లక్ష్యములుగా యివ్వబడిన శ్లోకాలకంటే హృద్యములయిన లక్ష్యాలను తెలుగులో పదాలుగా రచించాలనే కుతూహలం కల్గి, రసమంజరిలోని నాయికా, నాయక, సఖీ, దూతికా లక్షణాలకు లక్ష్యాలుగా తన పదాలను రచించి ఉంటాడని శ్రీ విస్సా అప్పారావుగారు ఊహించారు. క్షేత్రయ్య తన పదాలలో చివర శృంగార రసమంజరిని కూడా చేర్చారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here