జీవితమొక పయనం-6

0
3

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[యోగా శిక్షణకొచ్చిన వాళ్లందరినీ వివేకానంద రాక్‌ మెమోరియల్‌కు తీసుకువెళ్తారు నిర్వాహకులు. ఆ రోజు బయటివారినెవరినీ అనుమతించటం లేదనీ, కేవలం యోగా శిక్షణకి వచ్చినవారినే అనుమతిస్తున్నామని, హాయిగా అన్నీ తిరిగి చూడమని, ధ్యానం చేసుకోమని, విశ్రాంతి తీసుకోమని చెప్తారు నిర్వాహకులు. రాఘవ మాధవరెడ్డితో కలిసి నడుస్తూ వివేకానంద మంటపంలోకి అడుగుపెట్టబోతుంటే, ఆయన ఆపి – అక్కడ నీళ్లు ఉన్నట్టు భ్రమ కలిగించే గ్రానైట్ రాళ్ళను చూపి, ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎలా భ్రమించారో చెప్తారు. వివేకానందుడి గురించి, ఆయన ఇక్కడికి వచ్చి సముద్రంలో ఈదుకుంటూ వచ్చి ఆ శిల మీద ధ్యానం చేసిన సంగతి రాఘవకి చెప్తారాయన. తర్వాత ఆయన ధ్యానానికి కూర్చుంటే, రాఘవకి ఏకాగ్రత కుదరక మంటపం బయటకి వచ్చి, అటుఇటు తిరిగొచ్చి సముద్రాన్ని చూస్తూ నిలుచుంటాడు. మాధవరెడ్డి ధ్యానం అయి బయటకి వచ్చాకా, తనకి ఏకాగ్రత కుదరలేదని అందుకే బయట తిరుగుతున్నానని చెప్తాడు రాఘవ. తర్వాత భోజనాలయ్యాకా, కాస్త విశ్రాంతి అనంతరం అక్కడున్న నెలవారీ సూర్యోదయ దిశలూ, ఆయనాలూ వాటికి సంబంధించి గీసిన రేఖలను పరిశీలిస్తారు. సాయంత్రం ఐదు గంటలకి బయల్దేరి అందరూ కేంద్రానికి వచ్చేస్తారు. నిర్వాహకులు నేర్పుతున్న యోగాభ్యాసాలకి, ప్రాణాయామానికి సాధకులు అలవాటు పడతారు. వారు నేర్పుతున్న దేశభక్తి గీతాలు అందరిలో స్ఫూర్తిని నింపుతాయి. ఒకరోజు ప్రొ॥ ప్రభాకరంగారు రామాయణంలోని అహల్య వృత్తాంతాన్ని వివరంగా చెప్తారు. ఆ క్లాస్ అయిపోయాకా, రాఘవకి దిగులు కలుగుతుంది. అతన్నలా చూసిన మాధవరెడ్డి కారణమడిగితే, అహల్య కథ తనని బాధించిందని చెప్తాడు రాఘవ. పురాణాల లోని సంఘటనలను ఉన్నది ఉన్నట్టు చూడాలే కానీ, దాని పూర్వాపరాలను, తప్పొప్పులను బేరీజు వెయ్యకూడదని, విమర్శించకూడదని, వాటిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలని మాధవరెడ్డి చెబుతారు. శారదాంబ తోటలో జరిగే తరువాతి క్లాసుకు ఇద్దరూ బయల్దేరుతారు. – ఇక చదవండి.]

12. పర్వతారోహణం

[dropcap]“బా[/dropcap]బాయ్‌, మనమిప్పుడు ఎక్కడికెళుతున్నాం?”

బస్సులో నుండి కిందికి దిగుతూ ఆసక్తిగా మాధవరెడ్డిని ప్రశ్నించాడు రాఘవ.

“ఆ విషయం నాకూ తెలియదు రాఘవా. ట్రెక్కింగ్‌కు వెళుతున్నాం అని మాత్రం తెలుసు! కానీ, ఎక్కడికి, ఏ పర్వతం మీదికి వెళుతున్నామో తెలియదు. పైగా ఆ పర్వతానికున్న విశేషమేమిటో అక్కడికి వెళితేనే గానీ మనకు తెలియదు.”

ఇంతలో వివేకానంద కేంద్రం మేనేజరు అందరికీ వినబడేటట్టు ఇలా అన్నాడు:

“మిత్రులారా, ఇక్కణ్ణించి మిమ్మల్ని మా గైడ్స్‌ లీడ్‌ చేస్తారు. వాళ్ల ఆజ్ఞల్ని మీరందరూ తప్పకుండా పాటించాలి. వాళ్లు ఆగమన్న చోట ఆగాలి. వాళ్లు వెళ్లకూడదు అన్నచోటికి వెళ్లకండి. వాళ్లు ఏం చెబితే అది వినాలి. అర్థమైందనుకుంటాను. మళ్లీ చెబుతున్నాను, మీలో ఎవరికైనా హార్ట్‌ ప్రాబ్లెమ్‌, ఆస్తమా, బ్రీతింగ్‌ ప్రాబ్లెమ్‌ వంటి సమస్యలుంటే ఇక్కడే ఆగిపోండి. అంతేకానీ, మొండిగా బయలుదేరి మధ్యలో మీకేదైనా ఇబ్బందులు ఎదురైతే అక్కడ మీకు వైద్యం చెయ్యటానికి ఏ డాక్టరూ ఉండరు. ఓకేనా! అయితే, హ్యాపీగా ట్రెక్కింగ్‌ చేసి రండి! సాయంత్రం మీరు మళ్లీ ఇక్కడికి చేరుకునేసరికి మీ కోసం ఈ బస్సులు తయారుగా ఉంటాయి. అందరమూ కలిసి మళ్లీ మనం మన కేంద్రానికి వెళ్లిపోదాం. సరేనా! వెళ్లి రండి, ఆల్‌ ది బెస్ట్‌!” అంటూ ఆయన వచ్చిన బస్సులోనే తిరిగి వెళ్లిపోయాడు.

అందరూ ఇప్పుడు ఏం చెయ్యాలన్నట్టుగా ఉత్సాహంతో గుంపుగా చేరటంతో.. గైడ్లు ఒక బండరాయి మీదికెళ్లి నిలబడి.. “మిత్రులారా, మా అంచానాకు మించిన సంఖ్యలో మీరు మాతో వస్తూ ఉండటం మాకెంతో ఆనందాన్నిస్తోంది. మనం ఈ క్షణం నుంచి హాయిగా, కబుర్లు చెప్పుకుంటూ, నెమ్మదిగా, శ్రమ లేకుండా మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ పర్వతం మీదికి వెళ్ళబోతున్నాం. మీరు ఎక్కడ ఆగాలో, మీకు ఎక్కడ విశ్రాంతినివ్వాలో, అన్నీ మేము ఆలోచించాం. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగండి, మేము ఏర్పాటు చేస్తాం. కంగారుపడకుండా, టెన్షన్‌ లేకుండా, ఆ పర్వతాన్ని మనం అధిరోహిద్దాం. ఏమంటారు? సరేనా, ఓకే చలో..” అంటూ ఒక గైడ్‌ అందరికన్నా ముందు కదలగానే ఆయన వెనకే తక్కినవాళ్లు కదిలారు. అందరికన్నా చివరన మరో గైడ్‌ వాళ్లను అనుసరించాడు.

“బాబాయ్‌, అక్కడేం ఉంటుందంటావు?” ఆసక్తిగా అడిగాడు రాఘవ.

“రాఘవా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ట్రెక్కింగ్‌కు వెళ్లేవాళ్లు పైన ఏదో ఉంటుందనో, ఏదో చూద్దామనో వెళ్లరు. కొండలెక్కి దిగటం ఒక సాహసం. ఒక వ్యాయామం. దానికి చక్కటి అనుభవం కావాలి. లేదూ నీలాగా యువకులుగానైనా ఉండాలి. శ్రమ అనుకుంటే ట్రెక్కింగ్‌ వేస్ట్‌. పైకి ఎక్కాలి అనుకుని వెళితే అదో చక్కటి అనుభూతినిస్తుంది. ఇంకో విషయం ట్రెక్కింగ్‌లో ఎప్పుడూ తొందరపాటూ పనికిరాదు, పోటీతత్వమూ ఉండరాదు. పద!” అంటూ రాఘవను ఉత్సాహపరిచి ముందుకు నడిచాడు మాధవరెడ్డి.

అందరూ జతలు జతలుగా విడిపోయి హాయిగా మాట్లాడుకుంటూ కొండను ఎక్కసాగారు.

అలా గంటకు పైగా మెల్లగా నడుస్తూనే ఉన్నారు. ముందు వెళుతున్నవాళ్లు అప్పుడప్పుడూ తాము వచ్చిన దిక్కుగా కిందికి చూడసాగారు.

రాఘవ కూడా ఒకచోట ఆగి వెనక్కు చూడబోయాడు.

“రాఘవా ఆగు! వెనక్కు తిరిగి చూడకు. ట్రెక్కింగ్‌కు వెళుతున్నవాళ్లు అలా తాము ఎంతదూరం నడిచి వచ్చామోనని వెనక్కు తిరిగి చూడటం అంత మంచి కాదు. అది మానసికంగా మనల్ని దెబ్బతీస్తుంది. ఇంత దూరమేనా మనం నడిచొచ్చింది, ఇంకా ఎంతసేపు నడవాలో అనుకుంటూ ఉస్సూరుమని ముందుకు వెళతారు. అది మన లక్ష్యాన్నే నీరుగార్చేస్తుంది. అందుకే వెనక్కు చూడకుండా ముందుకు నడువు!” అంటూ అక్కడ నిలబడ్డ కొందరిని దాటుకుంటూ ముందుకెళ్లాడు మాధవరెడ్డి.

ఆయన్ను అనుసరించాడు రాఘవ.

కొంతదూరంలో ఒక పెద్ద రాతిగుండు కనిపించింది. అక్కడున్నవాటిలో అదే చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఆ రాతిగుండుకు అక్కడక్కడా నెర్రెలు (పగుళ్లు) కనిపిస్తున్నాయి. ముందుకు నడుస్తున్నవాళ్లల్లో కొందరు దానికి తమ ముఖాన్ని ఆనించి, రెండు చేతులూ కళ్లకు రెండువైపులా అడ్డంపెట్టుకొని లోపల దేన్నో పరీక్షగా చూస్తున్నారు.

వాళ్లు ఏం చూస్తున్నారా అని తక్కినవాళ్లకు ఆసక్తి కలిగింది.

చూసినవాళ్లు తప్పుకోగానే వేరేవాళ్లు నెర్రెలోంచి లోపలికి చూడసాగారు. చూసినవాళ్లను మిగతావాళ్లు చుట్టుముట్టి లోపల ఏం చూశారని అడుగుతున్నారు.

“లోపల ఒక బుషి తపస్సు చేస్తున్నాడు.” అని ఎవరో అనగానే విన్నవాళ్లు నోళ్లు వెళ్లబెట్టారు.

‘అసలిది బుషులు తపస్సు చేసుకునే కాలమేనా? అప్పుడెప్పుడో పురాణాల కాలంలో మునులు, బుషులు తపస్సు చేసుకునేవాళ్లని చదువుకున్నాం. ఈ కాలంలోనూ అలాంటివాళ్లున్నారా? నిజంగానే అతను బుషా, మనిషా? అతను చేస్తున్నది తపస్సా, ధ్యానమా?..’ రాఘవలో కలిగిన అనుమానాలివి.

‘అసలు ఆ బుషి ఆ రాతిగుండులోకి ఎలా వెళ్లుంటాడు? అటువైపు ఇంకేదైనా దారి ఉందా?’

జవాబులేని ప్రశ్నలెన్నో రాఘవలో ఉవ్వెత్తున లేచాయి.

ఈలోపు మాధవరెడ్డి ఎలాగో ఆ నెర్రె దగ్గరికెళ్లి లోపలికి చూడసాగాడు. అతనికి ఏమీ కనిపించలేదు. అంతా చీకటిగా అనిపించింది. కళ్లు చిట్లించుకుని ఏమైనా కనిపిస్తుందేమోనని తీక్షణంగా చూడసాగాడు. కానీ అతని కంటికి ఏమీ కనిపించలేదు.

ఈలోపు రాఘవ ఎలాగో మాధవరెడ్డి దగ్గరికెళ్లి “బాబాయ్‌, ఏంటీ నిజంగానే బుషి తపస్సు చేస్తున్నాడా?” అని అడిగాడు.

మాధవరెడ్డికి విసుగొచ్చి రాఘవ వైపుకు తిరిగి “నాకేమీ కనిపించలేదు, నీకేమైనా కనిపిస్తుందేమో చూసి నువ్వే చెప్పు..” అంటూ అతను చూడ్డానికి వీలు కల్పించాడు.

ఈసారి రాఘవ నెర్రెలోంచి లోపలికి చూశాడు. అంతా అంధకారంగా ఉంది. సన్నని వెలుతురులో ఏదో లీలగా మసమసకగా కనిపించింది. తీక్షణంగా చూచాడు. ఎంతసేపు చూసినా లోపలున్నది మనిషో కాదో తెలుసుకోలేకపొయ్యాడు.

‘ఇంతకీ అక్కడున్నది మనిషేనా? అతను శ్వాస తీసుకునే కదలికైనా కనిపిస్తుందేమోనని’ ఇంకొంతసేపు చూశాడు. కానీ ఏ కదలికా కనిపించలేదు. అతని చుట్టూ చిల్లర నాణేలూ, ఏవో ఎండిపోయిన, కుళ్లిపోయిన కొన్ని పండ్లూ లీలగా కనిపించాయి.

ఇంతలో ఎవరో రాఘవను నెట్టటంతో ఇక ఎక్కువసేపు చూడలేమని గ్రహించి పక్కకు తప్పుకున్నాడు.

ఎవరో ఆ రాతి గుండుకు అటువైపు ఏమైనా దారి ఉందేమోనని కూడా వెళ్లి చూసొచ్చారు. ఊహూ.. ఏమీ కనిపించలేదట.

బాబాయ్‌ ఎక్కడికెళ్లాడబ్బా అని చుట్టూ చూశాడు రాఘవ.

దూరంగా దారికి పక్కగా ఒక చెట్టుకింద కూర్చుని ఉన్నాడు బాబాయ్‌. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఆయన్ను కలుసుకుని, “బాబాయ్‌, నిజంగా లోపలున్నది బుషేనంటావా?” అని ఆసక్తిగా ప్రశ్నించాడు.

అతను సమాధానం చెప్పేలోపు.. వాళ్లకు కాస్త దూరంగా రెండు మూడు మేకలు మేస్తూ కనిపించాయి. మేకలున్నాయా అంటే వాటిని కాయటానికి కాపరీ ఉండాలిగా. ఏడి అతనూ?.. అంటూ అటుఇటు దిక్కులు చూశాడు మాధవరెడ్డి. కొంత దూరంలో.. భుజమ్మీద పొడవాటి కర్రను పెట్టుకున్న ఒక పెద్దాయన కనిపించాడు. ఆయన చుట్టూ దూరదూరంగా మరో ముప్పై మేకలు వరకూ పచ్చిక మేస్తున్నాయి. మాధవరెడ్డి అతణ్ణి దగ్గరికి పిలిచాడు.

అతను దగ్గరికి రాగానే, ఆ రాతిగుండు దగ్గర మనుషులు లోపలికి తొంగిచూస్తూ ఉండటాన్ని చూపించి.. “లోపల ఉన్నది నిజంగా బుషేనా?” అని వచ్చీరాని తమిళంలో అడిగాడు.

“రామాయణ కాలంలో ఈ కొండమీద గొప్పగొప్ప బుషులంతా తపస్సు చేశారట. కనుక ఆయనా బుషే అని మాబోటోళ్లంతా నమ్ముతున్నామయ్యా. నేనేకాదు ఈ చుట్టుపక్కల చాలామంది ఇటుగా మేకల్ని కాయటానికి వస్తాం. వచ్చినప్పుడల్లా ఆ గుండు లోపలికి చూస్తాం. ఆయన కదలక మెదలక కూర్చుని కనిపిస్తాడు. తపస్సులో మునిగిపోయి ఉంటాడు. లోపలికి ఎట్లా వెళ్లాడబ్బా అనుకుని రాతిగుండును అంగుళం అంగుళం గాలించాం. ఎక్కడా ఇంత సందు కూడా కనబడలేదు. గుండుపైకెక్కి మరీ చూశాం. ఊహూ.. అంతుచిక్కలేదు.

తిండి లేకుండా మనిషెట్లా బతుకుతాడు పాపం, అనుకుని మేము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత తీసి ఆ సందులో పెట్టి వెళ్లిపోతాం. మరుసటిరోజు అది అలాగే ఎండిపోయి కనిపిస్తుంది. పోనీ పళ్లులాంటివేవైనా తింటాడేమోననుకుని రకరకాల పండ్లను పెట్టి చూశాం. ఊహూ.. పెట్టింది పెట్టినచోటే చీమలుపట్టి కనిపించాయి.

తిండీ నీళ్లూ లేకుండా ఒక మనిషి ఎన్నాళ్లుండగలడు? అదీ చూశాం! ఎన్ని రోజులైనా అతనలాగే తపస్సులో ఉండిపోయేవాడు.

ఉన్నట్టుండి ఒకరోజున ఆయన కనిపించలేదు. ఆయనకోసం ఈ చుట్టుపక్కలంతా వెతికాం. కానీ ఎక్కడా కనిపించలేదు.

ఇక రేపట్నించి కనిపించడేమో అనుకున్నాం. మరుసటిరోజు మేకల్ని తోలుకుని ఇటు వచ్చినపుడు యాదృచ్ఛికంగా లోపలికి చూశాం. ఆశ్చర్యం! ఆయన లోపల తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఒక దారంటూ ఏదీ లేనప్పుడు ఎటునుండి బయటికొచ్చాడు, ఎటునుండి లోపలికెళ్లాడు. గాలిలో గాలైతే తప్ప! అంతా మాయగా అనిపించింది. అప్పుడనుకున్నాం, అతను మామూలు మనిషి కాడని.

ఇదేనయ్యా ఆయన కథ. ఎక్కడివాడో, ఎప్పటివాడో, ఎవరో, ఏమిటో.. చెప్పేవాళ్లెవరూ? అతనై చెబితే తప్ప!..” అంటూ ఆగి రెండు మేకలు మేస్తూ మేస్తూ ఎటో వెళ్లిపోతోంటే దాన్ని అదిలించటానికి వాటికేసి శబ్దం చేస్తూ అటు వెళ్లాడు ఆ కాపరి. మాధవరెడ్డి పైకి లేచి ఆ గుండువైపుకు చూసి నమస్కరించాడు.

“ఇదంతా ఏంటో మర్మంగా ఉంది బాబాయ్‌. మీరు నమ్ముతున్నారా దీన్ని?” ఆయనకేసి చూస్తూ అడిగాడు రాఘవ.

“లోపల నీకెవరైనా మనిషి కనిపించాడా?.. కనిపించి ఉంటే కల్పన కాదు, లేదంటే భ్రమ అనుకో!” అంటూ ముందుకు అడుగులు వేశాడు మాధవరెడ్డి.

ఆపైన వాళ్లిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉండిపోయారు.

సుమారు మరో రెండు గంటల ప్రయాణం అనంతరం వాళ్లు ఆ పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నారు.

అక్కడ ఒక చదునైన ప్రదేశముంటే అక్కడికి తీసుకెళ్లారు గైడ్లు. అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది. అందరూ బాగా అలిసిపోయారు.

గైడ్లు అందరినీ కొంతసేపు విశ్రాంతి తీసుకోమన్నారు. ఎక్కువ దూరం వెళ్లొద్దని సూచించారు.  చాలామంది చెట్లకింద మేను వాల్చారు. మరికొందరు నేలమీద కాళ్లు బార్లా చాపుకుని చేతులు వెనక్కు పెట్టుకుని అలసట తీర్చుకోసాగారు. అక్కడ వీస్తున్న చల్లని గాలులకు అందరూ హాయిగా సేదదీరసాగారు.

కొంతసేపటికి అందరిలోనూ.. అప్పటిదాకా ఉన్న బడలిక, అలసట, ఆయాసం కాస్త ఉపశమించినట్టుగా అనిపించింది.

దూరంగా ఒకచోట చెట్లకింద ఒక షామియానా వేసి ఉండటం కనిపించింది. దానికింద ఎవరో మనుషులు అటుఇటు తిరుగుతూ కనిపించారు. ఎవరో పిక్నిక్‌కో లేదూ తమలాగా ట్రెక్కింగ్‌కో వచ్చినట్టున్నారు. అక్కణ్ణించి ఏవో సువాసనలు గాలిలో తేలి రాసాగాయి. సోలిపోయి ఉన్నవాళ్ల నాసికాగ్రాలకు అవి సోకి వాళ్లల్లో జిహ్వార్తిని రేపినట్టుంది.

అవునూ.. తమకిప్పుడు భోజనాలు ఎలా? అన్న అనుమానం అందరిలోనూ కలిగాయి.

కొంతసేపటికి.. అందరినీ ఆ షామియానా దగ్గరికి భోజనానికి వెళ్లమని సూచించారు గైడ్లు.

అప్పటిదాకా అక్కడ తమ కోసమే వంట ఏర్పాట్లు చేశారని తెలిసి అందరూ ఆశ్చర్యపొయ్యారు. వివేకానంద కేంద్రం వారి ఏర్పాట్లు చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లేని ఉత్సాహం తెచ్చుకున్నారు.

పర్వతంపైకి వెళ్లగానే తమను ఆ షామియానా దగ్గరికి అనుమతించి ఉంటే, వంటవాళ్ల పనులకు ఆటంకం కలిగిస్తారని భావించే.. తమను దూరంగా ఉంచినట్టుగా గ్రహించారందరూ.

అందరూ చేతులు శుభ్రంగా కడుక్కున్నాక, వచ్చిన వాళ్లందరికీ భోజనాలు వడ్డించారు. అందరూ ఆకలితో ఆవురావురుమంటూ కడుపునిండా భోజనం చేశారు.

కడుపులో ఆహారం పడేసరికి అందరిలోనూ రెట్టించిన ఉత్సాహమూ, శక్తీ వచ్చినట్టుగా భావించారు. ఆ వెంటనే వాళ్లల్లో భుక్తాయాసమూ కలిగాయి.

అందరినీ వెళ్లి విశ్రాంతి తీసుకొమ్మనీ, 3 గంటలకు ఇక్కడే ఒక ప్రాంతానికి తామందరూ వెళ్లనున్నట్టు, దాని గొప్పతనమేమిటో తెలిస్తే ఆందరూ ఆశ్చర్యానికి గురౌతారని గైడ్లు తెలిపారు.

ఎవరినీ దూరంగా వెళ్లవద్దని దరిదాపుల్లోనే ఉండవలసిందిగా కోరారు.

అందరూ ఇందాక తాము విశ్రాంతి తీసుకున్న చోటుకు వెళ్లి విశ్రాంతిగా కూర్చున్నారు. కొంతమంది ఒక కునుకు తీద్దామన్న ఆలోచనతో నేలమీద తువ్వాలు పరుచుకుని పడుకున్నారు.

ఠంచనుగా మధ్యాహ్నం మూడు గంటలకు అందరినీ నిద్రలేపారు గైడ్లు.

అందరూ లేచి ముఖాలు కడుక్కోగానే వేడి వేడి టీ అందింది. టీ కడుపులో పడగానే ఏదో తెలీని ఒక నూతనోత్సాహం అందరిలోనూ పుట్టుకొచ్చింది.

“మిత్రులారా ఒక అర్దగంట ప్రయాణం తర్వాత మనం ఒక ప్రదేశానికి వెళ్లబోతున్నాం. అక్కడి ప్రత్యేకతను చూశాక అక్కడనుండి అటే మనం కిందికి దిగివెళ్లిపోతాం. ఒకరకంగా ఇప్పటినుండే మన తిరుగు ప్రయాణం మొదలౌతుందన్నమాట. బయలుదేరండి.” అంటూ ముందుకు దారితీశారు గైడ్లు.

వాళ్లు చెప్పినట్టుగా అందరినీ పర్వత కొస ప్రాంతానికి తీసుకెళ్లారు. మనుషులు వలయాకారంలో నిలబడి చూడటానికి తగ్గట్టుగా, అక్కడొక ఇనుప బారికేడ్‌ కూడా నిర్మించారు. అందరూ అక్కడ వరుసగా నిలబడ్డారు.

“మిత్రులారా, ఒకసారి దూరంగా నేలమీదికి మీ దృష్టిని సారించండి. మీకేమి కనిపిస్తోందో దాన్ని నిశితంగా గమనించండి.. దూరంగా మీకు చుట్టూ పరుచుకున్న సముద్రం కనిపిస్తోంది కదూ! ఓకే! మనం ఇప్పుడు భారతదేశానికి చివరనున్న కన్యాకుమారి ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి మనం మన భారతదేశ చిత్రపటాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టయితే.. ద్వీపకల్పమైన మన భారతదేశపు దక్షిణ భాగం సముద్రంలోకి చొచ్చుకుపోయినట్టుగా ఉంటుంది. తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రాలకు మధ్యన దక్షణ భాగం కొసన ఉన్న కన్యాకుమారి ఒక అద్భుతమైన త్రివేణీ సంగమం. ఇక్కణ్ణించి గమనించినట్టయితే ఆ మూడు సముద్రాల కలయికను మనం గమనించవచ్చు. చూడటానికి మూడు సముద్రాలు కలిసిపోయినట్టుగా ఉన్నా వాటి రంగులలోని తేడాను మనం చూడవచ్చు. నిశితంగా సముద్ర జలాలను గమనించండి. మూడు నదులే కాదు, మూడు సముద్రాల కలయిక అయిన ఈ త్రివేణీ సంగమ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఆ రకంగా మీరందరూ పుణ్యాత్ములే!”

అందరూ ఆ మాటలకు పులకించిపోతూ.. సముద్రాల్లోని తేడాను గుర్తించే పనిలో పడ్డారు.

క్రమంగా అందరూ ఆ తేడాను గుర్తించగలిగారు.

రాఘవ ఆ మూడు సముద్రాల తేడాను గుర్తించాడు. మాధవరెడ్డితో తన భావాలను పంచుకుని ఆనందించాడు.         క్రింద నుండి చూస్తే ఆ విషయాన్ని గ్రహించలేకపోవచ్చు. కానీ ఇంత ఎత్తయిన ప్రదేశం నుండి చూడ్డం ఒక చక్కటి అనుభూతి.

అలా ఒక పావుగంట చూడనిచ్చాక ఒక గైడ్‌.. “మిత్రులారా, మనం ఇక్కణ్ణించి ఇప్పుడు బయలుదేరితేనే చీకటిపడే లోపు కిందికి చేరుకోవచ్చు. లేకపోతే, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అన్నట్టు చివరిగా మీకో గొప్ప సమాచారాన్ని అందించబోతున్నాను. అదేంటంటే ఇప్పుడు మనం నిలబడున్న ఈ పర్వతం, రామాయణంలో ఒక గొప్ప సంఘటనకు సాక్షీభూతమైన పర్వతం. అదేమిటంటే.. రామరావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు లక్ష్మణుడి మీదికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దాంతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతారు. అప్పుడు జాంబవంతుని ఆదేశం మేరకు హనుమంతుడు సర్వౌషధి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకొచ్చి లక్ష్మణుడికి మళ్లీ స్పృహ వచ్చేలా చేస్తాడు. ఆనాడు హనుమంతుడు తీసుకొచ్చిన ఆ మహాపర్వతంలోని కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందట. అదే ఇది! దీన్ని ఈ ప్రాంతంలోనివారు ‘మరుండు వాళుం మలై (ఔషధ పర్వతం)’ అని పిలుస్తారు. ఇప్పటికీ ఎందరో వైద్యులు, యోగులు, పరిశోధకులు, విదేశీయులు ఇంకా ఎందరెందరో ఆశాజీవులు.. ఆ ఓషధి మొక్క కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. ఏనాటికైనా అది లభించి మనుషుల్ని పునర్జీవులను చేసే శక్తిని తమ సొంతం చేసుకోవాలని మానవుడి ఆశ, ఆరాటం. అది నెరవేరుతుందనే ఆశిద్దాం!” అంటూ ముగించాడు.

ఆయన మాటలు పూర్తికాక మునుపే కొందరు నేలమీదపడి సాష్టాంగ నమస్కారాలు చేశారు. కొందరు నేలమీదికి వంగి నేలను ముద్దాడారు. మరికొందరు నేలమీదున్న మట్టిని తీసుకుని నుదుటికి పూసుకున్నారు. ఇంకొందరు అక్కడ కనిపించిన ఏవో మొక్కల్ని గిల్లి తమ బ్యాగుల్లో పదిలపరుచుకున్నారు.

మాధవరెడ్డి వంగి చేతులతో నేలను తాకి మొక్కుకున్నాడు.

రాఘవ తలవంచి ఆ పర్వతానికి నమస్కరించాడు.

13. చావు కబురు చల్లగా..

మూడు వారాల యోగా శిక్షణ శిబిరం ముగింపుకొచ్చింది.

ఆ రోజు రాత్రి భోజనానంతరం అందరూ సమావేశ మందిరంలో కలుసుకున్నారు.

ఆర్గనైజర్‌ అంగీరస్‌.. మైక్‌ అందుకుని ఇంగ్లీషులో తన మాటల్ని మొదలుపెట్టాడు.

“మిత్రులారా, యోగా శిక్షణ శిబిరం పేరుతో మనం ఈ మూడువారాలు కలిసి ప్రయాణం చేశాము. ఈ మూడు వారాల్లో మీకు కొన్ని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు, క్రియలు వాటితోపాటుగా పురాణ సంబంధమైన అంశాలు అనగా.. రామాయణం, భారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు, అలాగే భగవద్గీతా పఠనం, దేశభక్తి గీతాలాపన, వివేకానంద జీవితచరిత్ర, మొదలైనవాటిపై ఒక అవగాహనను కలిగించామనే అనుకుంటున్నాము. ఇవన్నీ ఇక్కడితో ఆగిపోకూడదు. మీరు మీమీ ఇండ్లకు వెళ్లినా వీటిని ఇప్పటిలాగే జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ మీ జీవితంపై గొప్ప ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నాము. మీలో గొప్ప మార్పును తప్పక ఇది తీసుకువస్తుందని అనుకుంటున్నాము. ఇన్నాళ్లూ మీరు నేర్చుకున్నది మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, మీ శ్రేయాభిలాషులు, మీ బంధువులు అలా అలా మన హైందవ జాతికంతటికీ విస్తరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంతటితో మన బంధం ఆగిపోకూడదు. మీరు ఎప్పుడు కన్యాకుమారికి వచ్చినా మమ్మల్ని కలిసి వెళ్లవచ్చు. రెండుమూడు రోజులు ఇక్కడే గడిపి కూడా వెళ్లవచ్చు.

చివరిగా.. కొందరు నిరుద్యోగులు మా సంస్థలో సేవాభావంతో ఉపాధ్యాయులుగా పనిచేయటానికి ఎంతో ఆసక్తితో ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఆ వచ్చినవాళ్లల్లో ఎవరెవరు ఉపాధ్యాయులుగా ఎన్నుకోబడ్డారో తెలపాల్సిన సమయం వచ్చింది. కానీ ఆ విషయాన్ని ప్రస్తుతం మేము తెలియజేయలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దు. నిజానికి ఎవరెవరు ఎన్నుకోబడ్డారో మా కమిటీ ఈ మధ్యాహ్నమే నిర్ణయించింది. కానీ వాళ్లెవరో ప్రకటించలేకపోతున్నాము. అందుకు బలమైన కారణమే ఉంది. మా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మా పై అధికారులు అంగీకరించవలసి ఉంది. ఆపైనే దాన్ని ప్రకటన చెయ్యవలసి ఉంది. కానీ ఏం జరిగిందంటే.. సరిగ్గా ఇప్పటికి వంద సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద ఈ కన్యాకుమారికి పాదచారియై వచ్చి ఇక్కడి సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి ప్రస్తుతమున్న శిలా స్మారకంపై కూర్చుని ధ్యానం చేశారట.

ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఈ యేడాది స్వామివారి శతాబ్ది ఉత్సవాలను జరపాలని మా కేంద్రం నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా స్వామి వివేకానంద నడిచి వచ్చిన మార్గంలోనే మా అధికార గణం, మరికొందరు అనుచరులతో కలిసి కరదీపికలను చేతబట్టుకుని పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. నిజానికి ఈపాటికే వాళ్లు ఇక్కడికి చేరుకొని ఉండవలసింది. కానీ ఎందుకో ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మా పై అధికారుల అనుమతి లేకుండా ఎంపిక కాబడ్డ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించే అధికారం మాకు లేదు. కనుక అభ్యర్థులు రేపు మీమీ ఊళ్లకు తిరుగు ప్రయాణమై వెళ్లిపోండి. మా పై అధికారులు ఇక్కడికి రాగానే మీ విషయం వాళ్లకు తెలియజేసి వాళ్ల అనుమతితో.. ఎవరెవరు ఎన్నిక కాబడ్డారో వాళ్లకు ఆ విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేయగలమని విన్నవించుకుంటున్నాం.” అంటూ ముగించాడు.

ఆ మాటలు వినగానే రాఘవకు పాలపొంగుమీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయింది. ముఖం వెలవెలబోయింది. దేని కోసమైతే తాను ఇంత దూరం వచ్చాడో అది తేలకనే వాయిదా పడింది. ఇప్పుడెలా?

వీళ్లేమో వాళ్ల వాళ్ల ఇండ్లకు వెళ్లిపొమ్మంటున్నారు. ఇంటికి వెళితే ఎంత అవమానం? ఇప్పట్లో ఇంటికి రాననీ, తన గురించి వెతకవద్దనీ, ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్‌ అయ్యాకే తిరిగి వస్తాననీ ఉత్తరం రాసి, ఇప్పుడు మళ్లీ ఇంటికి వెళితే ఏం బాగుంటుంది? ఎగతాళి చెయ్యరూ? ఎంత అసహ్యంగా ఉంటుంది.

తను ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేస్తే బావుంటుంది? ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు రాఘవకు. ముభావంగా ఉండిపొయ్యాడు.

“రాఘవా.. మీ విషయం ఎటూ తేల్చకనే ఉండిపోయారే? ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావు?” ఆసక్తిగా అడిగాడు మాధవరెడ్డి.

ఆయనకేం చెప్పాలో తెలియక అయోమయానికి గురై మనసంతా శూన్యమైనట్టుగా అయిపోయింది రాఘవకు.

సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు. అలాగే మౌనంగా ఉండిపొయ్యాడు.

అతణ్ణి ఈ రెండు వారాల్లో ఎప్పుడూ అలా చూడలేదు మాధవరెడ్డి.

ఆయనకూ చాలా బాధగా అనిపించింది.

“బాధపడకు! ఏముందీ, ప్రస్తుతానికి ఇంటికెళ్లిపో. వీళ్లు ఉద్యోగంలో వచ్చి చేరమని నీకు ఉత్తరం రాస్తే వచ్చి చేరిపో! ఈ మాత్రం దానికి ఎందుకింత డీలా పడిపోవటం?” విషయాన్ని తేలిక చేస్తూ అన్నాడు మాధవరెడ్డి.

తాను ఇంట్లో చెప్పా పెట్టకుండా వచ్చేశాడన్న విషయాన్ని మాధవరెడ్డి దగ్గర దాచాడు రాఘవ.

“అది కాదు బాబాయ్‌, నాకిప్పుడు ఈ ఉద్యోగం ఎంతో అవసరం. ఒఠి చేతులతో తిరిగి వెళ్లటం నాకిష్టం లేదు.”

“వీళ్లు ఉద్యోగం ఇవ్వము అనటం లేదుగా. ప్రస్తుతానికి వాయిదా వేశాం అంటున్నారు; అంతేగా!”

“ఇవ్వము అనటం లేదు, కానీ ఇస్తామన్న గ్యారెంటీనూ ఇవ్వటం లేదు. అందుకే ఏం చెయ్యాలో తెలీక సతమతమవుతున్నాను.”

“అంత అవసరమా బాబూ నీకు ఉద్యోగం. మరి కొంతకాలం ఆగలేవా?”

“లేదు బాబాయ్‌, ఇక ఎంతమాత్రమూ ఆగటానికి వీల్లేదు. ఇప్పటికే ఇంట్లో వాళ్లకు నేను చాలా భారమైపొయ్యాను. వాళ్లకింకా ఆ కష్టాన్ని కలిగించలేను.”

“అంత అర్జంటుగా నువ్వు ఉద్యోగంలో చేరుదామనుకున్నా వీళ్లు జీతమంటూ ఏమీ ఇవ్వటం లేదుగా. మరి ఏ రకంగా నువ్వు మీ ఇంటిని ఆదుకోగలవు?”

గతుక్కుమన్నాడు రాఘవ. వెంటనే తేరుకుని, “జీతం ఇవ్వరని తెలుసు బాబాయ్‌, కనీసం ఇంట్లోవాళ్లకు భారంగా ఉండకుంటే చాలని ఇంత దూరం వచ్చాను.” అన్నాడు నిట్టూరుస్తూ.

మాధవరెడ్డి ఏదో ఆలోచనలో పడ్డాడు.

“నీకు జీతంతో అవసరం లేనప్పుడు, జీతంలేని ఏ ఉద్యోగమైనా నువ్వు చేస్తావా?” అడిగాడు మాధవరెడ్డి.

“చేస్తాను బాబాయ్‌, వాళ్లు భోజనమూ, ఉండటానికి వసతీ కల్పిస్తే చాలు!”

“ఎక్కడికైనా వెళ్లగలవా?”

“కన్యాకుమారికే వచ్చినవాణ్ణి. కలకత్తాకు వెళ్లమన్నా వెళతాను.”

“అలాగా. అయితే సరే! హైదరాబాద్‌లోని వీణాపాణి విద్యానికేతనం వాళ్లు మన రాష్ట్రమంతటా 275 కి పైగా బడులను నడుపుతున్నారు. వరంగల్‌కు దగ్గరలో వాళ్లదే ఒక ఆవాస విద్యాలయం ఉంది. దానికి మా బావగారే కార్యదర్శి. ఆయన్ను కలిసి నీ ఉద్యోగం విషయం అడిగి చూస్తాను.”

“అయితే బాబాయ్‌, నేనూ మీతోపాటు మీ ఊరొస్తాను?” ఉత్సాహంగా అన్నాడు రాఘవ.

“వద్దొద్దు! ఆయనతో మాట్లాడాక నీకు ఉత్తరం రాస్తాను. రమ్మంటే వద్దువు. లేకపోతే నువ్వు రావటం వృథా కదా?”

“లేదు బాబాయ్‌, నేనూ మీతోపాటు వస్తాను. ఉద్యోగం ఖాళీ ఉందంటే.. ఉండిపోతాను, లేకపోతే తిరిగి మా ఊరెళ్లిపోతాను.”

“అహ, అలా బాగుండదు రాఘవా. నేను కనుక్కుని నీకు ఏ విషయమూ ఉత్తరం రాస్తాను!” సమాధానమిచ్చాడు మాధవరెడ్డి.

‘అయితే తాను ఇంటికి తిరిగి వెళ్లక తప్పేటట్టు లేదు.’ అనుకుని మనసులోనే నిట్టూర్చాడు రాఘవ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here