దంతవైద్య లహరి-14

15
3

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

రీ-ఇంప్లాంటేషన్

ప్ర: డాక్టర్ గారూ.. మా అమ్మాయి వయసు ఎనిమిది సంవత్సరాలు. చక్కని పలువరుస. అమ్మాయి పలువరుస చూసి, మా బంధువులు, స్నేహితులు కూడా తెగ మెచ్చుకునేవారు. కానీ దురదృష్టవశాత్తు అమ్మయి ఆటలాడుతున్నప్పుడు దెబ్బతగిలి ముందరి పన్ను ఒకటి ఊడిపోయింది. ఇది జరిగి ఆరునెలలు కావస్తుంది. వూడిన పన్ను మళ్ళీ ఆ స్థానంలో వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆ పన్ను రాకుంటే ఎలా? పైగా ఆడపిల్ల కదా! సలహా ఇవ్వగలరు.

– శ్రీమతి ఎమ్. రమాదేవి, భువనగిరి.

జ: రమాదేవి గారు.. మీరు ఇచ్చిన వివరాలను బట్టి, మీ అమ్మాయి దంత సౌందర్యం విషయంలో మీరెంతగా ఆందోళన చెందుతున్నారో, నేను అర్థం చేసుకోగలను. మీరే కాదు అలాంటి పరిస్థితిలో ఏ తల్లిదండ్రులైనా ఆందోళన చెందడం సహజం. ఎందుచేతనంటే ఇది ముఖారవిందానికి చెందిన అంశం, పైగా ఆడపిల్ల కూడాను!

సాధారణంగా ఎనిమిది సంవత్సరాల వయసు, ఊడిపోయింది ముందరి పన్ను అంటున్నారు కనుక ఊడిన పన్ను ఖచ్చితంగా స్థిరమైన పన్ను (పర్మనెంట్ టూత్) అయి ఉంటుంది. దానికి కారణం ముందరి పాలపళ్ళు (ముఖ్యంగా పైదౌడ) ఆరు సంవత్సరాల వయసులో రాలిపోవడం మొదలు పెట్టి స్థిరమైన పళ్ళు రావడం మొదలు పెడతాయి. అయితే ఏదో సందర్భంలో (ప్రమాదాలు, దెబ్బలు వగైరా) ఇవి కూడా రాలిపోతే, మరోపన్ను అక్కడ వచ్చే అవకాశం లేదు. అలాంటి వారికి కృత్రిమ దంతాలే శరణ్యం. పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత కట్టుడు పళ్ళు పెట్టించుకోవచ్చు. అయితే, ప్రమాదం జరిగినప్పుడు, లేదా దెబ్బ తగిలి పన్ను ఊడిపోయినప్పుడు, ఊడిన పన్ను విరిగిపోకుండా లేదా పగుళ్లు తీయకుండా ఉంటే మాతం, దానిని పరిశుభ్రమైన రీతిలో దంతవైద్యుల దగ్గరకు (ఊడిన వెంటనే పన్ను దొరికినట్లైతే) చేర్చినట్లైతే దానిని ఊడిన పంటి కుహరం (టూత్ సాకెట్) లో అమరుస్తారు.

ఊడిన పన్ను. ఎక్స్‌రే ఫిల్మ్ లో కూడా చూడవచ్చు

దానిని కదలకుండా నిర్బంధించడం ద్వారా పంటిని యథావిధిగా పూర్వస్థితికి తీసుకు రావచ్చును. పిల్లల బుగ్గన పెట్టి తీసుకురావడం గానీ, పరిశుభ్రమైన తడి గుడ్డలోగాని చుట్టి పంటిని తీసుకు రావలసి ఉంటుంది. ఇలా ఊడిపోయిన మంచిపన్నును తిరిగి దౌడలో అమర్చడాన్ని ‘రీ -ఇంప్లాంటేషన్ ఆఫ్ టూత్’ అంటారు. చాలామంది దెబ్బతగిలి పన్ను ఊడిపోయిన కంగారులో ఆ.. ఊడిన పన్ను విషయం పట్టించుకోరు. అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమే!

ఊడిన పన్నును పాలలో భద్రపరచిన విధానం
పంటి మూలాన్ని(రూట్) సెలైన్ నీటితో శుభ్రపరుస్తున్న దృశ్యం
రీ-ప్లాన్టేషన్ తర్వాత పలువరుస

రీ-ఇంప్లాంటేషన్ ఉపయోగానికి రాని పిల్లలు మాత్రం వయసు పెరిగే వరకూ తాత్కాలిక కృత్రిమ దంతాలు వాడుకుని, ఆ తర్వాత ‘ఇంప్లాంట్’ పద్ధతిలో పెట్టించుకోవచ్చు. ఇవి కట్టుడు పళ్ళు మాదిరిగా కాక సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ చికిత్స ఆడపిల్లలకైతే తప్పని సరి!

~

బెడ్ కాఫీ/టీ:

ప్ర: సర్! బెడ్ కాఫీ/టీ లను మీరు సమర్థిస్తారా? ఈ అలవాటు వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయా? వివరించగలరు.

– శ్రీమతి గంగాదేవి, మెహిదీపట్నం, హైదరాబాద్.

జ: గంగాదేవి గారూ.. చాలా మంచి సందేహం వచ్చింది మీకు. సంతోషం! చాలా మందిలో ఈ సందేహం వున్నా అడగడానికి సందేహిస్తుంటారు. ఎందుచేతనంటే చాలా ఇళ్లల్లో జరిగే తతంగమే కనుక. ఇలా బెడ్ కాఫీ/టీలు (దంత దావనం చేసుకోకుండా) తీసుకోవడం కొందరికి ఫేషన్ అయితే, కొందరికి అవసరం, మరికొందరికి పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం లాంటి అలవాటు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాన్ని గౌరవించేవారు ఎవరైనా సరే, కాలకృత్యాలు తీర్చుకోకుండా మంచినీళ్లు కూడా ముట్టుకోరు. అదొక అపరిశుభ్ర అనాగరిక చర్యగా భావిస్తారు. పాచి నోటితో త్రాగడం, తినడం వంటివి అసలు సహించరు. పళ్ళు తోముకున్న తరువాతనే తినడమైనా, త్రాగడమైనా చేసి ఇతర పనులకు సన్నద్ధమౌతారు. కానీ నేటి ఆధునిక సమాజం మీద పాశ్చాత్య నాగరికత ప్రభావం ఎక్కువగా విస్తరించి లేని అలవాట్లను కొని తెచ్చుకుంటున్నాం. అది ఆధునికతగా చెలామణి అయిపోతున్నది. ఒకరిని చూసి మరొకరు ఇలాంటి అలవాట్లకు మోజుపడుతున్నారు.

అయితే, పళ్ళు తోముకోకుండా, కాఫీ/టీలు తీసుకోవడం వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయా? అంటే, అలాంటివి ఎక్కడా రికార్డు కాలేదు. శుచి, శుభ్రత, క్రమశిక్షణ దృష్టిలో పెట్టుకునే జీవన శైలి గలవారు మాత్రం ముఖం కడుక్కోకుండా ఏమీ తీసుకోరు. నేను ఇక్కడ బెడ్-కాఫీ తీసుకునే వారిని వ్యతిరేకించడం లేదు, అలాగే సమర్థించడం లేదు కూడా! మనం చేసే పనులన్నీ, ఎదుగుతున్న మన పిల్లలు మనసులో పెట్టుకుంటారన్న విషయం మర్చిపోకూడదు! అలాగే, ఒక సీనియర్ దంతవైద్యుడిగా, కాలకృత్యాలు తీర్చుకుని దంతధావనం చేసుకున్న తరువాతనే, తినడమైనా, త్రాగడమైనా చేయాలని చెబుతాను. మన జీవన శైలిలో ఇదొక ముఖ్యమైన ఘట్టం అనుకోవలసిందే!

2. ప్ర: డాక్టర్ గారూ..! రోజూ రెండు సార్లు పళ్ళు తోముకోవడం అవసరం అంటారా?

జ: ఇది కూడా అందరికీ ఉపయోగపడే సందేహమే సుమండీ! రెండు పూటలా తిండి తినడం అవసరమా? అని అడిగితే, తప్పక అవసరం.. అని చెబుతాం. ఎందుకంటే ఆ ప్రక్రియ ఆరోగ్యంగా బ్రతకడానికి అవసరం గనుక. ఇక్కడ రెండుపూటలా పళ్ళు తోముకోవడం అనేది, పై అంశానికి ఉన్నంత ప్రత్యేకత, అవసరం లేదు. ఎందుచేతనంటే ఒకసారి ఉదయం పద్ధతి ప్రకారం పళ్ళు తోముకోగలిగితే, నోటి పరిశుభ్రత పాటించ గలిగితే రాత్రి బ్రషింగ్ అవసరం ఉండదు. నోటి పరిశుభ్రత ఎలా ప్రాప్తిసుంది? మంచిగా బ్రష్ చేసుకోవడం ఎలాంటి ఆహార పదార్థాలు తిన్నా, పానీయాలు త్రాగినా వెంటనే నోరు మంచి నీటీతో పుక్కిలించడం, చిగుళ్ళను మృదువుగా రుద్దడం చేస్తే, రెండవసారి బ్రష్ చేయవలసిన అవసరం రాదు. కావాలనుకుంటే, అరగ్లాసు నీళ్లలో ఒక స్పూన్ ఉప్పు కలిపి ఆ ఉప్పు నీళ్లతో రాత్రి పడుకునే ముందు నోరు బాగా పుక్కిలిస్తే, నోటి పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసన (హలిటోసిస్) వంటి సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. అందుచేత ఒకసారి బ్రషింగ్ మీద నమ్మకం లేనివాళ్లు వారి.. వారి, తృప్తి కోసం రాత్రి పడుకోబోయే ముందు కూడా పళ్ళు తోముకుని పడుకోవచ్చు. హార్డ్ బ్రష్‌లు వాడేవారు, హార్డ్‌గా బ్రష్ చేసివారు, ఎక్కువ సమయం (2-5 ని. లు, చాలు) పళ్ళు తోముకునేవారు, మాత్రం బహు జాగ్రత్తలు పాటించడం అవసరం. లేకుంటే త్వరగా పళ్ళు అరిగిపోయి ‘జివ్వు’మని గుంజే అవకాశం వుంది. తద్వారా చల్లని ఆహారపదార్థాలు/పానీయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. చల్లని గాలిని కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

పళ్ళు ఎన్నిసార్లు తోముకున్నామన్న దానికంటే, ఎలా తోముకున్నామన్న దానికే ప్రాధాన్యత నివ్వవలసి ఉంటుంది. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, ఇదే సూత్రాన్ని పాటించవలసి ఉంటుంది.

‘నోటి పరిశుభ్రత – ఆరోగ్యానికి భద్రత!’

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here