మరుగునపడ్డ మాణిక్యాలు – 100: గెహరాయీ

0
3

[సంచిక పాఠకుల కోసం ‘గెహరాయీ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]ఈ[/dropcap] శీర్షికలో ఇది 100వ వ్యాసం. ఈ మైలురాయికి తగ్గట్టుగా ఏదైనా భారతీయ చిత్రం గురించి రాయాలని, ఇంతవరకు ఎంచుకోని కథ ఎంచుకోవాలని ఆలోచిస్తుంటే ‘గెహరాయీ’ (1980) గుర్తొచ్చింది. ఇది దుష్టశక్తులకి సంబంధించిన కథ. ఈ సినిమా మొదట్లోనే ‘మానవాతీత శక్తిని నమ్మేవారు ఏ వివరణా కోరుకోరు, నమ్మనివారు ఏ వివరణా ఒప్పుకోరు’ అనే వాక్యం తెర మీద కనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం దేవుడిని నమ్మితే దుష్టశక్తులని కూడా నమ్మాలి. నమ్మనివారి కోసం ఒక మాట. ఈ చిత్రం కేవలం దుష్టశక్తుల గురించే కాదు. మనుషుల మనస్తత్వాలు, బలహీనతలు, కోపాలు ఎలా ఉంటాయో చూపించారు. ‘గెహరాయీ’ అంటే లోతు, అగాధం అని అర్థాలు. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.

70వ దశకంలో రామ్సే సోదరులు హారర్ సినిమాలు తీసేవారు. అవి ప్రేక్షకులకి జుగుప్స కలిగించేలా చేయటం వారి ప్రధాన ఉద్దేశం. 80వ దశకంలో ‘తులసిదళం’, ‘కాష్మోరా’ వంటి నవలల ప్రభావంతో (కనీసం తెలుగులో) ట్రెండ్ మారింది. 90వ దశకంలో రామ్‌గోపాల్ వర్మ ప్రేక్షకులని భయపెట్టటం కోసం హారర్ సినిమాలు తీశాడు. 1980లో వచ్చిన ‘గెహరాయీ’ మరుగునపడిపోయింది. బెంగుళూరులో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. సెట్లు వేయకుండా మామూలు ఇంట్లో, వీధుల్లో ఈ సినిమా తీశారు. ఎంతో నేచురల్‌గా ఉంటుంది. పాత్రలన్నీ కన్నడిగులే. కాకపోతే సంభాషణలు మాత్రం హిందీలో ఉంటాయి.

కథ కర్ణాటకలోని ఒక ఊరిలో ప్రారంభమవుతుంది. అక్కడొక తమలపాకు తోటకు యజమాని చెన్నబసప్ప. ఆయన కుటుంబంతో బెంగుళూరులో ఉంటాడు. తోటని చూడటానికి తన ఊరికి వచ్చాడు. ఆ తోటకి సంరక్షకుడు బసవ. తోటని తల్లిలాగ చూసుకుంటాడు. అతని కూతురు చెన్ని. ఇరవై ఏళ్ళుంటాయి. చెన్నికి రెండేళ్ళ వయసున్నప్పుడు అతని భార్య చనిపోయింది. అతను బిడ్డని చూసుకోవటానికి కెమ్టీ అనే ఒక నిమ్నజాతి స్త్రీని ఇంట్లో పెట్టుకున్నాడు. పచ్చిగా చెప్పాలంటే ఉంచుకున్నాడు. బసవ చెన్నబసప్పకి తోట చూపిస్తాడు. తోట మధ్యలో ఒక డాబా ఇల్లు, పక్కనే బసవ ఉండే పెంకుటిల్లు ఉంటాయి. రాత్రి భోజనం బసవ ఇంటి నుంచే వస్తుంది. చెన్ని చెన్నబసప్ప పిల్లలు నందూ, ఉమ ఎప్పుడొస్తారని అడుగుతుంది. అతను మౌనంగానే భోజనం ముగిస్తాడు. తర్వాత ఒక పిడుగు లాంటి వార్త చెబుతాడు. “ఈ తోట ఒక ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మేశాను. బెంగుళూరులో ఇల్లు కట్టుకోవాలి. వచ్చేవారం కొత్త యజమానులు వస్తారు. వారికి అన్నీ చూపించు” అంటాడు. బసవ నిర్ఘాంతపోతాడు. “మరి ఈ భూమి సంగతి?” అంటాడు. “ఏదీ శాశ్వతంగా ఉండదు. ఇక్కడ ఫ్యాక్టరీ కడతారు. ఊరివాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఇంకా ఫ్యాక్టరీలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది” అంటాడు చెన్నబసప్ప. “ఈ చెట్లు, పాదులు ఏమవుతాయి?” అంటాడు బసవ. “ఇల్లు తప్ప ఏమీ ఉండవు. నీకు కావాలంటే బెంగుళూరులో పని ఇప్పిస్తాను. ఇక్కడే ఉంటానంటే దానికీ ఏర్పాటు చేస్తాను” అంటాడు. తర్వాత బసవ కెమ్టీ దగ్గర తన ఆక్రోశం వెళ్ళగక్కుతాడు. “ఈ భూమి నా తల్లి. నా చేతులతో పోషించాను. రాళ్ళు, ఇటకల కింది భూమి నలిగిపోతుంది. ఇది బలాత్కారం. ఆయన తల్లి అమ్మేశాడు” అంటాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

చెన్నబసప్ప ఒక కంపెనీలో జెనరల్ మ్యానేజరు. అతని భార్య సరోజ. పూజాపునస్కారాలు చేస్తుంది. వారి కొడుకు నందూ, కూతురు ఉమ. నందూ యువకుడు. ఉమకి పదిహేనేళ్ళు ఉంటాయి. ఇంట్లో వీరు కాక వంటవాడు రామా ఉంటాడు. నందూ విహారయాత్రకు వెళతానంటే అతని ప్రయాణం అమావాస్య రోజు అని తెలిసి రామా వద్దంటాడు. సరోజ కూడా వద్దంటుంది. చెన్నబసప్ప మాత్రం “ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. నందూ! నువ్వు వెళ్ళు” అంటాడు. విహారయాత్ర నుంచి వస్తుంటే కుక్క పిల్లని తప్పించబోయి నందూ మోటారు సైకిలు కిందపడుతుంది. అదే రాత్రి ఉమ నిద్రలోనుంచి కేక పెడుతూ లేస్తుంది. ఎవరో గొంతు నులిమినట్టుంది అంటుంది. సరోజ నందూ గురించి కంగారుపడుతుంది కానీ ఉమకి ఏదో పీడకల వచ్చిందని సరిపుచ్చుకుంటుంది. ఉమకి స్కూల్లో మార్కులు తగ్గుతాయి. బాగా చదివే అమ్మాయికి మార్కులు తగ్గటంతో ఏమయిందని ప్రశ్నిస్తారు. ఉమ తనకి కళ్ళు లాగుతున్నాయని, తల భారంగా ఉంటోందని అంటుంది. డాక్టరుకి చూపిస్తారు. మందులు ఇప్పిస్తారు. ఒకరోజు ఉమ కాలికి ఎక్కడో ఎర్ర రంగు అంటుకుంటుంది. ఆమె ఆటల్లో తోటివారితో గొడవపడుతుంది. ఆమె కాలికున్న ఎర్ర రంగు చూసి సరోజ కంగారుపడుతుంది. రామా ఉమకి దిష్టి తీస్తాడు. నందూ ఇది చూసి నవ్వుతాడు. సరోజ “కొందరి కళ్ళు మంచివి కావు. చెడు చూపు పడకుండా దిష్టి తీస్తున్నాం” అంటుంది.

స్క్రీన్ ప్లే చాలా చాకచక్యంగా రాశారు. బసవ చెన్నబసప్పకి తోట చూపిస్తున్నప్పుడు ఒక పాము వస్తుంది. పడగ విప్పుతుంది. చెన్నబసప్ప దాన్ని చంపబోతాడు. బసవ ఆపుతాడు. ఈ సంఘటనతో ఏదో ఉపద్రవం రాబోతోందని ప్రేక్షకులకి సూచన ఇచ్చారు. ఎడిటింగ్ కూడా బావుంటుంది. బసవ “ఆయన తల్లిని అమ్మేశాడు” అని కోపంగా అన్నాక కట్ చేస్తే కత్తి పట్టుకుని ఎవరో వెళుతుంటారు. ఇంతకీ ఆ కత్తితో ఓ పనివాడు కొబ్బరిబొండాలు కోసి చెన్నబసప్ప కారు డిక్కీలో పెడతాడు. ఇలాంటి షాట్లతో ప్ర్రేక్షకులని ఆలోచనలో పడేశారు దర్శకులు అరుణా-వికాస్. నందూ విహారయాత్ర నుంచి రాలేదని సరోజ కంగారుపడటం, అతనికి ఆక్సిడెంట్ జరిగిందని ఫోన్ రావటం – ఇవన్నీ నందూకి ఏదో జరుగుతుందనే భావన కలిగిస్తాయి. కానీ నందూ క్షేమంగా ఇంటికి రావటంతో అన్నిటికీ అనవసరంగా భయపడకూడదు అని దర్శకులు చెప్పదలచుకున్నట్టు ఉంటుంది. అమావాస్య అయితే అన్ని పనులూ మానెయ్యాలా? అమావాస్య రోజు జీవశక్తి తక్కువ ఉంటుంది. ఆరోజు మాంసం తినకూడదని ఒక నియమం. జీవశక్తి తక్కువ ఉంటుంది కాబట్టి మాంసం తింటే అనారోగ్యం రావచ్చు. అలాగని అందరికీ జబ్బు చేయదు. మిగతా పనులు మానేయక్కరలేదు.

నందూ ప్రేయసి నీల. ఆమెని తన కుటుంబానికి పరిచయం చేయటానికి ఇంటికి తీసుకువస్తాడు. ఉమ నీలని ఫొటో ఆల్బమ్ చూపిస్తానని లోపలికి తీసుకువెళుతుంది. కాసేపటిని నీల కంగారుగా బయటకి వచ్చి అందరి దగ్గరా  సెలవు తీసుకుని హడావిడిగా వెళ్ళిపోతుంది. నందూ ఏమైందని అడిగినా చెప్పదు. తర్వాత ఒకరోజు ఉమ స్కూలు నుంచి వస్తూంటే ఏదో వెంటపడినట్టు అనిపించి పరుగున ఇంటికి వస్తుంది. అందరూ ఇంట్లో ఉంటారు. ఆమెని లోపలికి తీసుకువెళతారు. ఆమె ఏడిచేదల్లా హఠాత్తుగా ఆగిపోయి ఏదో గాలి ఆవహించినట్టు అసభ్యమైన భాషలో ఎవరివో అక్రమసంబంధాల గురించి మాట్లాడుతుంది. అందరూ నోటమాట రాక ఉండిపోతారు.

ఉమని పేరున్న సైకియాట్రిస్ట్ దగ్గరకి తీసుకువెళతారు. అతను చెన్నబసప్పతో “మీ అమ్మాయితో మీ సంబంధం ఎలా ఉంది? మీ వంశంలో ఇలాంటి వ్యాధి ఎవరికైనా ఉండేదా? మీరేదో దాస్తున్నారు” అంటాడు. చెన్నబసప్పకి అంతా వింతగా ఉంటుంది. ఇంటికొచ్చాక ఉమ ఏడుస్తూ సరోజతో “నేను ఆ డాక్టరు దగ్గరకి మళ్ళీ వెళ్ళను. ఆయన పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు” అంటుంది. సరోజ నందూని పిలుస్తుంది. నందూ తండ్రి దగ్గరకి వెళ్ళి “వేరే డాక్టరుకి చూపిద్దాం. ఈ డాక్టరు ఏవో తిక్కప్రశ్నలు వేశాడట” అంటాడు. ఆయన “డాక్టరు నన్ను కూడా తిక్క ప్రశ్నలు వేశాడు. విషయం తెలుసుకోవటానికి ఆ పని చేశాడు అంతే. ఆయన కంటే మంచి డాక్టరు దొరకడు” అంటాడు. నందూ ఏం బదులు చెప్పలేకపోతాడు. ఉమ మనసు మళ్ళించటానికి ఆమెని పార్కులకి, సినిమాలకి తీసుకువెళుతూ ఉంటాడు. ఒకరోజు ఇంటికి వచ్చాక ఆమె హఠాత్తుగా నందూ మీద పడి “నా దేహం నీ పొందు కోరుకుంటోంది” అంటూ అతన్ని వదలకుండా పట్టుకుంటుంది. వదిలించుకోవటం నందూ వల్ల కాదు. ఆమె తండ్రి కూడా ప్రయత్నిస్తే ఆమెని పక్కకి లాగగలుగుతాడు. ఇదంతా చూసి సరోజ కుమిలిపోతుంది. తర్వాత నందూ నీలని కలుసుకున్నప్పుడు ఆమె ఉమ ఎలా ఉందని అడుగుతుంది. “నన్ను గదిలోకి తీసుకువెళ్ళినపుడు చాలా అసభ్యంగా మాట్లాడింది” అంటుంది. నందూ ఎలాగైనా ఉమని కాపాడాలని నిశ్చయించుకుంటాడు.

డాక్టరు ఉమకి షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటాడు. రామా సరోజతో “మాంత్రికుడిని తీసుకురావాలి. లేకపోతే చెయ్యి దాటిపోతుంది” అంటాడు. నందూ తండ్రితో “షాక్ ట్రీట్‌మెంట్ పిచ్ఛివాళ్ళకి ఇస్తారు. అంత అవసరం ఏమిటి? దాని వల్ల మెదడులో కణాలు దెబ్బతింటాయి. పాశ్చాత్యులు కూడా ఆ ట్రీట్‌మెంట్ ఎక్కువ వాడటం లేదు. మంత్రతంత్రాల్లో శక్తి ఉంటుంది. అవి చేయిద్దాం” అంటాడు. ఆయన కొట్టిపారేస్తాడు. నందూ “ఒకప్పుడు అణుశక్తికి ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నారు. పాశ్చాత్యులు చెప్పారని షాక్ ట్రీట్‌మెంట్‌ని గుడ్డిగా నమ్ముతున్నారు. మంత్రతంత్రాల గురించి ఎవరూ పరిశోధన చేయలేదు కాబట్టి దాని శక్తిని నమ్మటం లేదు” అంటాడు. చెన్నబసప్ప “షాక్ ట్రీట్‌మెంట్ నా నిర్ణయం కాదు. డాక్టరు నిర్ణయం. ఉమ గురించి నాకు చింత లేదా? నా సమయం వృథా చేయకు. నువ్వు పెద్దవాడివయ్యావు. పెద్దవాడిలా ఆలోచించు” అంటాడు మొండిగా.

నందూ తండ్రికి తెలియకుండా తన పని తాను చేయాలని నిశ్చయించుకుంటాడు. రామా “ఒక మంత్రించిన నిమ్మకాయ ఉమ పరుపు కింద పెట్టాలి. తెల్లారాక అది కుళ్ళిపోతే ఏదో చేతబడి జరిగినట్టు. లేకపోతే చేతబడి కాదు” అంటాడు. రామా తనకు తెలిసిన మాంత్రికుడి దగ్గర నుంచి మంత్రించిన నిమ్మకాయ తెస్తాడు. దాన్ని ఉమ పరుపు కింద పెడతాడు నందూ. కానీ మర్నాడు ఆ నిమ్మకాయ కనపడదు. రామా నిమ్మకాయ మాయమవటం ఎప్పుడూ వినలేదు అంటాడు. నందూకి ఏమీ అర్థం కాదు. సినిమాలో ఆ నిమ్మకాయ ఎలా మాయమయిందో చెప్పలేదు కానీ చెన్నబసప్ప తీసి పారేశాడని నాకనిపించింది.

ఒకరోజు కుటుంబమంతా క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. ఉమ ఉన్నట్టుండి చెన్నబసప్ప వైపు తిరిగి “మహదేవమ్మ బావిలో దూకింది. చెన్ని ఏడుస్తోంది. మహదేవమ్మ కడుపులో పిండం ఉంది. నువ్వే కారణం ఆమె చావుకి. ఎంత కంపు! కుళ్ళిపోయింది. నువ్వామెని తాకినపుడు కూడా కంపు వచ్చిందా? అప్పుడు ఆమె రక్తం వెచ్చగా ఉందిగా. బతికి ఉందిగా. నువ్వు ఓ చిన్న ప్రాణం ఆమెలో పుట్టించావు. అదే ఆమె చావుకి కారణం. చెప్పు! బసవ పెళ్ళాం సొగసుని ఎవడు దోచుకున్నాడు? చెన్ని తల్లిని ఎవడు చంపాడు? ఆమె చచ్చిపోయినపుడు నువ్వెందుకు రాలేదు?” అంటుంది. సరోజు, నందూ నిశ్చేష్టులై ఉండిపోతారు. చెన్నబసప్ప అపరాధభావంతో లేచి వెళ్ళిపోతాడు. “చెన్నబసప్ప పారిపోయాడు” అంటూ ఉమ నవ్వుతుంది.

బసవ భార్యతో చెన్నబసప్పకి శారీరక సంబంధం ఏర్పడింది. అది క్షణికావేశంలో జరిగింది. ఒక్కసారే జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా అతనికి పశ్చాత్తాపం కలగలేదు. ఆడదని అలుసు. తన పనివాళ్ళని అలుసు. కొన్నాళ్ళకి అది అసలు జరగనట్టే మసలుకోసాగాడు. భూమి అమ్మే ముందు బసవకి చెప్పాలనే కనీస మర్యాద కూడా పాటించలేదు. అమ్మేసి ‘నా ఇష్టం’ అన్నట్టు మాట్లాడాడు. భూమి అతనిదే, కానీ ఏళ్ళ తరబడి ఆ భూమి కోసం కష్టించిన మనిషికి మాట చెప్పకుండా అమ్మేయటం పద్ధతి కాదు. చిత్రం మొదట్లో చెన్నబసప్ప భోజనం చేసేటపుడు బసవ కూడా అతనితో కలిసి భోజనం చేస్తాడు. అంటే వారి సామాజిక హోదా ఒకటే. బసవ పేదవాడు అంతే. చెన్నబసప్పని ‘అన్నా’ అని పిలుస్తాడు. “నేను కెమ్టీతో కలిసి ఉండటం మీకు ఇష్టం లేదని తెలుసు. ఆమె కులం తక్కువైనా మనసు మంచిది” అంటాడు. అతను అందరికీ తెలిసేలా కెమ్టీని ఇంట్లో పెట్టుకున్నాడు. చెన్నబసప్ప గుట్టుగా తప్పు చేశాడు. ఎవరు ఉన్నతులు? డబ్బుంటే సరిపోతుందా? ఇంతకీ ఉమని ఆవహించిన దుష్టశక్తి ఎవరు? దానికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? బసవకి దానితో సంబంధం ఉందా? బసవకి చెన్నబసప్ప చేసిన ఘోరం తెలుసా? తెలిసే ఊరుకున్నాడా?

విజయ్ టెండుల్కర్‌తో కలిసి వికాస్ దేశాయ్, అరుణా రాజె స్క్రీన్ ప్లే రాసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాటకీయత లేకుండా సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది. బరుణ్ ముఖర్జీ ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంటుంది. శ్రీరామ్ లాగూ, అనంత్ నాగ్, ఇంద్రాణీ ముఖర్జీ, పద్మినీ కోల్హాపురి, రీటా భాదురి ముఖ్యపాత్రలు పోషించారు. చెన్ని పాత్రలో రీటా భాదురి చివర్లో వచ్చే సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. ఒక మాంత్రికుడి పాత్రలో అమ్రిష్ పురి నటించాడు. హారర్ సినిమా పద్ధతిలో ఉన్నా ప్రేక్షకులని భయపెట్టాలని ప్రయత్నించక ఒక కుటుంబానికి వచ్చిన ఆపదని కుటుంబసభ్యులు ఎలా తట్టుకున్నారనే కథ మీదే దర్శకులు దృష్టి పెట్టటం అభినందనీయం.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

చెన్నబసప్ప తాను చేసిన తప్పు గురించి సరోజకి చెబుతాడు. “ఒక మధ్యాహ్నం ఇద్దరం కాలు జారాం. ఆ ఒక్కసారే” అంటాడు. సరోజ “మీరు అందరిలాంటి వారు కాదనుకున్నాను. ఆడదాన్ని ఆటవస్తువుగా భావించి ఆడుకుని వదిలేశారు. మీ వల్ల ఒక స్త్రీ ప్రాణం తీసుకుంది. మీరు ఒక్క మధ్యాహ్నమే అంటున్నారా? మీది రాతి గుండె. మీ గుండెలో మా గురించి ఏ ఆలోచనలు ఉన్నాయో?” అని లేచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయినా అతను “అలా అనకు సరోజా” అని అంటాడు. అతనికి తన కుటుంబం మీద ప్రేమ ఉంది. అది తన కుటుంబమని స్వార్థం. ఇతరులు ఏమైనా పర్వాలేదు. ఇలాంటి సంకుచితమైన ఆలోచన ఉంది కాబట్టే ఇప్పుడు అతని భార్య కూడా అతన్ని నమ్మటం లేదు. కుటుంబమే సర్వస్వం అనుకున్నవాడికి ఇంతకంటే శిక్ష ఏముంటుంది?

అయితే సరోజ మనసులో ఏమున్నా భర్తకి కూతురిపై ప్రేమ ఉందని నమ్ముతుంది. అందుకని ఉమ షాక్ ట్రీట్‌మెంట్‌కి అడ్డు చెప్పదు. నందూ మాత్రం “ఆయన గుట్టు తెలిసిపోయిందని ఆయన ఉమని బలి ఇస్తున్నారు. ఏ తండ్రైనా ఇలా చేస్తాడా?” అంటాడు. సరోజ అతని మీద కోప్పడుతుంది. “నువ్వింకా చిన్నవాడివి. ఇలాంటి మాటలు మాట్లాడకు. ఆయన వల్లే మనం స్థాయిలో ఉన్నాం” అంటుంది. “అందుకని ఆయన ఏం చేసినా చెల్లుతుందా? ఇంత గుడ్డిగా నమ్మకు. నీకు బాధగా ఉందని నాకు తెలుసు. నువ్వు ఆయన్ని ఆపుతావా లేదా?” అంటాడతను. ఆమె మౌనంగా తలదించుకుంటుంది. “సరే. ఇక నుంచి నేను ఏమీ మాట్లాడను. ఉమ చచ్చిపోయిందని అనుకుంటాను. నా మీద ఏ ఆశలూ పెట్టుకోవద్దు” అని వెళ్ళిపోతాడు. సరోజ విలపిస్తూ ఉండిపోతుంది. తండ్రి అక్రమసంబంధం గురించి తెలిస్తే కొడుక్కి ఎంత నరకం! ఆయన్ని ఎలా నమ్మగలడు? అసలే నందూకి షాక్ ట్రీట్‌మెంట్ మీద నమ్మకం లేదు. ఇప్పుడు తండ్రి మీద కూడా నమ్మకం పోయింది. తల్లి మద్దతు లేదు. సరోజది ఒక నరకమైతే నందూది మరో నరకం. ఒక మనిషి తప్పు కుటుంబానికి శాంతి లేకుండా చేస్తుంది. పరస్త్రీ కోసం అర్రులు చాచేవారు ఇది గుణపాఠంగా తీసుకోవాలి. స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. బసవ భార్య.. యజమాని కదా అని చెన్నబసప్ప పిలిస్తే వెళ్ళి ఉండవచ్చు. అసలు పిలవటం అతని తప్పు. బసవ లేనప్పుడు అతను అక్కడ ఉండకుండా వచ్చేయటమే సరైన పద్ధతి. ఆమె అయినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలి. యజమాని అని నమ్మకూడదు. కోపం వస్తుందని భయపడకూడదు. ఇది కాకపోతే ఇంకో పని. కాయకష్టం చేసుకునేవారికి పనికి లోటు ఉండదు.

ఉమకి షాక్ ట్రీట్‌మెంట్ మొదవుతుంది. చాలాసార్లు షాక్ ఇస్తారు. నందూ ఏం చేయలేక బాధపడుతుంటాడు. ఇంటిపట్టున ఉండకుండా బయట తిరుగుతుంటాడు. నీలతో తన బాధ చెప్పుకుంటాడు. ఆమె “నువ్వు మరీ లోతుగా ఆలోచించకు. శాంతి ఉండదు” అని హెచ్చరిస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఇంట్లో భోజనం పాడయి నల్లని ముద్దలుగా మారిపోతుంది. రామా అది దుష్టశక్తి పని అంటాడు. చెన్నబసప్ప రామా కావాలనే ఇదంతా చేస్తున్నాడని కోపంతో అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొడతాడు. నందూ మాత్రం రామాని వెతికి తీసుకొస్తానని అంటాడు. కానీ రామా దొరకడు. ఉమకి ట్రీట్‌మెంట్ కొనసాగుతూ ఉంటుంది. అయినా ఆమెకి గాలి ఆవహించటం ఆగదు. చివరికి చెన్నబసప్ప మాంత్రికుడిని పిలవటానికి ఒప్పుకుంటాడు. రామా ఉంటే తెలిసిన మాంత్రికుడిని రప్పించేవాడు. ఇప్పుడు వేరే మాంత్రికుడిని పిలిపిస్తారు. అతను చాలారోజుల పాటు కాళికాదేవి పటం పెట్టి వింత చేష్టలు చేస్తూ, ఉమని చెంపదెబ్బలు కొట్టి, వేప మండలతో కొట్టి ఏవో పూజలు చేస్తాడు. డబ్బు బాగా తీసుకుంటాడు కానీ ఫలితం ఉండదు. మరో మాంత్రికుడిని పిలిపిస్తే అతను ఉమని రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా తీసుకెళ్ళి క్షుద్రపూజలు చేస్తాడు. మంచి లక్షణాలున్న కన్యని బలి ఇచ్చి శక్తి పొందాలని అతని దురాశ. ఉమకి తాయెత్తు కట్టి కదలకుండా చేస్తాడు. నందూ సమయానికి అక్కడికి చేరుకుని తాయెత్తు తెంపేసి ఉమని తీసుకుని వచ్చేస్తాడు.

గ్రహశాంతి పేరుతో డబ్బులు గుంజేవారిని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఈ కథలో వేరే దారి లేక అలాంటి వాడిని పిలిపిస్తారు కానీ కొందరు డబ్బు కోసమో, పదవి కోసమో ఇలాంటి పూజలు చేయిస్తారు. ఇది మూర్ఖత్వం. డబ్బు, పదవి కావాలంటే కష్టపడాలి. పూజలు మనశ్శాంతి కోసం చేసుకోవాలి కానీ దేవుడికి లంచం ఇవ్వటానికి కాదు. అక్రమాలు చేస్తూ పూజలు చేస్తే ఏం లాభం ఉండదు. ఇక క్షుద్రపూజలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

చివరికి నందూ రామాని వెతికి తీసుకువస్తాడు. అతను తనకు తెలిసిన మాంత్రికుడిని పిలిపిస్తాడు. ఆయన సాత్వికుడు. చేతబడి జరిగిందని గ్రహిస్తాడు. ఇంటి పైన తూర్పు మూల ఏదో ఉందని చెబుతాడు. వెతికితే నందూకి ఒక నిమ్మకాయ దొరుకుతుంది. ఆ మాంత్రికుడు చుట్టుపక్కల ఉన్న చెట్లలో ఏదో చెట్టు మీద ఒక వస్తువు దొరుకుతుందని కూడా చెబుతాడు. రామా వెతికితే ఒక చేతబడి బొమ్మ దొరుకుతుంది. నిమ్మకాయని, బొమ్మని నిప్పుల్లో తగలబెడతారు. “దీంతో సగం పీడ విరగడయింది. రేపు ఉమని మా ఇంటికి తీసుకురండి. పూజ చేసి ఆ దుష్టశక్తిని తరిమేస్తాను” అంటాడు. మర్నాడు అందరూ అక్కడికి వెళతారు. మాంత్రికుడు గణేశుడి పూజ చేస్తాడు. ఉమలో ఉన్న దుష్టశక్తిని “నిన్నెవరు పంపించారు? చెప్పు. చెబితే నిన్ను ముక్తుడిని చేస్తాను” అని పదే పదే అడుగుతాడు. దుష్టశక్తి పలుకుంది. ఉమ గొంతు మగగొంతుగా మారిపోతుంది. మొదట జవాబు చెప్పటానికి నిరాకరిస్తుంది. మాంత్రికుడు ఉమ మీద మంత్రజలం చల్లుతాడు. ఆ మంత్రజలం ప్రభావానికి తట్టుకోలేక ఆ శక్తి “బసవ ఒక మాంత్రికుడికి చెప్పి నన్ను పంపించాడు. ఈ శరీరంలో హాయిగా ఉంది. ఉండనీ” అంటుంది. “ఈ అమ్మాయిని వదలకపోతే నిన్ను అంధకూపంలో వందేళ్ళు బంధిస్తాను” అంటాడతను. భయపడి ఆ శక్తి ఉమని వదిలి వెళుతుంది. ఉమ స్పృహతప్పి పడిపోతుంది. మాంత్రికుడు అంతా గణేశుడి మహిమ అంటాడు. దక్షిణ ఇవ్వజూపినా వద్దంటాడు. ఉమ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది.

నందూకి ఈ మొత్తం వ్యవహారం ఒక చేదు అనుభవంలా ఉంటుంది. తండ్రి చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగిందని తండ్రిని నిందిస్తాడు. చెన్నబసప్ప “అది నా తప్పే కాదు, ఆమె తప్పు కూడా. తప్పులందరూ చేస్తారు. అయినా బసవకి ఆ విషయం తెలియదు. తెలిస్తే ఇన్నాళ్ళూ ఊరుకుని ఉండేవాడు కాదు” అంటాడు. బసవ ఇంత దారుణానికి ఒడిగట్టాడన్న విషయం నందూ జీర్ణించుకోలేకపోతాడు. ఊరికి వెళ్ళి బసవని నిలదీసి అడుగుతానని వెళతాడు. అయితే బసవ కొద్దిరోజుల క్రితమే చనిపోయాడని తెలుస్తుంది. వేరే మాంత్రికుడి సాయంతో బసవ ఆత్మని రప్పిస్తాడు. ఆ ఆత్మ చెన్నిలో ఆవహించి పలుకుతుంది. “వాడు నన్ను దిక్కులేనివాడిని చేశాడు. నా భూమితల్లిని బలాత్కరించాడు. అమ్మేశాడు. నేను ఆ భూమిని నెత్తురు, చెమట ధారపోసి పోషించాను. తల్లిలా చూసుకున్నాను” అంటుంది ఆ ఆత్మ. “అది నీ భూమి కాదు. అయినా నీకు ఏదో ఒక ఏర్పాటు చేస్తానని మా నాన్న అన్నారుగా” అంటాడు నందూ. “ఇంకా విను. వాడు నా పెళ్ళాన్ని పాడుచేశాడు. నేను చచ్చిన తర్వాతే తెలిసింది. నాకు సంతోషంగా ఉంది. బాగా శాస్తి చేశాను” అంటుంది ఆత్మ. “అది ఒక పొరపాటు మాత్రమే” అంటాడు నందూ. “పొరపాటా? ఒక పెద్దమనిషి వేరొకరి పెళ్ళాన్ని పాడు చేస్తాడు. ఆమెని మృత్యుకూపంలో పడేస్తాడు. భూమిని తెగనమ్ముకుంటాడు. చిన్నమనిషి నోరు మూసుకుని ఉండాలి. ఇదేం న్యాయం? ఆ భూమి ఒళ్ళో సేదదీరేవాడిని. ఆ భూమే నాకు సర్వస్వం” అంటుంది ఆత్మ. “సరే. ఆ భూమే నీకు సర్వస్వం. దాన్ని మా నాన్న అమ్మేశారు. దానికి నా చెల్లిలిని ఎందుకు పీడించావు? తన తప్పు ఏమిటి? నీచుడా” అంటాడు నందూ. “మనకు ప్రియమైన దానికి బాధ కలిగితే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. మాంత్రికుడికి అడిగినంత డబ్బు ఇచ్చాను. వాడి కుటుంబాన్ని నాశనం చేయమన్నాను. వాడి కూతురు గిలగిలా కొట్టుకుని చచ్చేలా చేయమన్నాను” అంటాడు. నందూలో ఆవేశం కట్టెలు తెంచుకుంటుంది. చెన్ని గొంతు నులుముతాడు. ఆమె స్పృహ కోల్పోతుంది. నందూ ఆవేశం ఒక్కసారిగా చల్లారిపోతుంది. దూరంగా జరిగిపోతాడు. పిచ్చిపట్టిన వాడిలా ఉండిపోతాడు.

ఈ ముగింపుకి ఎన్నయినా అర్థాలు చెప్పవచ్చు. నాకు తోచినది బసవ ఆత్మ నందూని ఆవహించిందని. అందుకే నందూ ఆవేశం చల్లారిపోయింది. చెన్ని పరిస్థితి చూసి తాను చేసినది చివరికి తన కూతురి మెడకి చుట్టుకుందని బసవ ఆత్మకి అర్థమవుతుంది. దీనికి అంతెక్కడ? తండ్రి చేసిన తప్పుకి కూతురిని పీడించటం తప్పు. కానీ మనిషి తనకి కలిగే కష్టం కన్నా తనవారికి కలిగే కష్టానికి ఎక్కువ బాధపడతాడు. అందుకని బసవ ఆ పని చేశాడు. ఇది నందూకి ఎంతకీ అర్థం కాదు. ఎవరి తప్పుకి వారే శిక్ష అనుభవించాలి అనుకుంటాడు. ఇంతకీ బసవకి చెన్నబసప్ప తన భార్యకి చేసిన అన్యాయం ముందు తెలియదు. తెలిస్తే ముందే చేతబడి చేసేవాడేమో. అతనికి భూమి గురించే బాధ. ఇది నలభై ఏళ్ళ క్రితం వచ్చిన చిత్రమైనా భూమిని కాపాడుకోవాలనే సందేశం ఉంది. భూమికి అన్యాయం చేస్తే మన కాళ్ళు మనమే నరుక్కున్నట్టవుతుంది. భూమిని నాశనం చేసిన చెన్నబసప్పకి బాధలు తప్పలేదు. తన వారసుడిని బలి ఇవ్వాల్సి వచ్చింది. భూమిని కొల్లగొడితే భావితరాలు బలవ్వాలనే సంకేతమిది. ఇప్పుడు భూమిని ఎన్నిరకాలుగా నాశనం చేసుకుంటున్నామో అందరికీ తెలుసు. వెనుదిరిగే అవకాశం లేదనిపిస్తుంది. ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నాలన్నీ టూ లిటిల్ టూ లేట్ అనే అనిపిస్తున్నాయి.

చేతబడి చేసేవారు కూడా అపరాధులే. బసవ విషయానికే వస్తే అతను భూమి మీద అతి మమకారం పెంచుకున్నాడు. తన వస్తువుల మీదే మమకారం ఉండకూడదు, ఇక తనది కాని వస్తువు గురించి చెప్పే పనేముంది? యజమాని భూమి, యజమాని ఇష్టం అనుకుంటే సరిపోయేది. అప్పట్లో యజమానులు సరిగా జీతాలు ఇచ్చేవారు కాదేమో. అదీ ఒక కారణం కావచ్చు. వేరే ఆధారం లేకపోవచ్చు. వ్యవసాయమే చేసుకోవాలంటే చెన్నబసప్ప తనకి తెలిసినవారి పొలంలోనో, తోటలోనో పని ఇప్పించేవాడు. బసవ ఆ భూమి మీద ఫ్యాక్టరీ కట్టి సారవంతమైన నేలను పాడుచేయటం భరించలేకపోయాడు. కానీ చేతబడి లాంటివి చేయటం దారుణం. ఇలాంటి కక్షలు వదులుకోవాలి. లేకపోతే ఆ పాపానికి శిక్ష భరించకతప్పదు. బసవ తన కక్ష అనే అగాధంలో కూరుకుపోతే నందూ మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకోలేక ఉన్మాదంలో కూరుకుపోయాడు.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here