[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘ఇద్దరు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఇ[/dropcap]క్కడే ఎవరో కలిసారు
కరచాలనం చేసారు
చిరునవ్వు నవ్వారు కదిలి
నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయారు
ఇంతకూ ఆ కలిసింది ఎవరు
పరిచితులా! అపరిచితులా!!
ఎంత ప్రయత్నించినా
గుర్తుకు రారే
గతాన్ని ఎంత తవ్వినా
ఎక్కడా కనీసం గుర్తులో లేరే
అయినా ఇవ్వాళ
మనిషీ మనిషీ
ఒకరిని ఒకరు
కలవడమే అపురూపం
అది సంతోషమే కాదు
గొప్ప సందర్భం కూడా
ఎవరయినా ఒక మనిషి కలిస్తే
తడి గాలి తగిలినట్టు
తన్మయత్వం కలిగినట్టు
దూరాలు తరిగినట్టు
మనిషితనం పెరిగినట్టూ కదా
కలిసిన ఆ ఇద్దరూ బతికినట్టు
మనుషులుగా నిలిచినట్టే సుమా