[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
మెదడు – ఆరోగ్యం:
[dropcap]భౌ[/dropcap]తిక శరీరం లాగే మెదడుకు కూడా ఆరోగ్యవంతమైన సాంఘిక, భౌతిక వాతావరణం ఉండితీరాలి. పరిసరాలలోని అస్థిరత, మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. వాతావరణంలోని మార్పులు – శారీరక ఆరోగ్యం మీదనే కాక మెదడు పనితీరునూ ప్రభావితం చేస్తాయి. జీవజాతి మనుగడ ఆసాంతం పరస్పరాధారితం.
ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. ప్రవర్తనలో మార్పులు, ఉద్రిక్త స్వభావం సాధారణం అయిపోవటం వంటి వాటితో బాటుగా ఆత్మహత్యా భావనలూ చోటు చేసుకుంటున్నాయి. గృహహింస కేసులూ సర్వసాధారణం అయిపోతున్నాయి. స్వయం హింస, పరహింస వంటి కారణాలుగా పలువురు రోగగ్రస్థులు అవుతున్నారు. హింసాత్మక స్వభావం సాధారణం అయిపోయింది.
ఎపిడెమిక్స్‌పై 2022లో నిర్వహించబడిన ఒక అధ్యయనంలో – వాతావరణంలోని అధిక వేడిమి వల్ల గర్భస్థ దశ తొలినాళ్ళలో నున్న శిశువులలో స్కిజోఫ్రెనియా బారిన పడే రిస్క్‌కు కారణం అవుతోందని తేలింది. ఉష్ణోగ్రతలు – అనొరెక్సియా, న్యూరోసైకియాట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశాన్ని పెంచుతున్నాయని తేలింది.
మెక్సికోలో సూక్ష్మ ఓజోన్ కణాలు అధికంగా ఉన్న వాతావరణానికి గురికావడంతో వృద్ధాప్య దశకు చేరుకోకుండానే చిన్న వయసులోనే అల్జిమర్స్ బారిన పడే ప్రమాదం ఉందని వారి పాథాలజీ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సగటుకు మించి ఉష్ణోగ్రతలు ఉన్న దేశాలలో పార్కిన్‍సన్స్, అల్జిమర్స్ వంటి వ్యాధులు అధికమయ్యే ప్రమాదం పొంది ఉన్నది. వేడెక్కిపోతున్న మంచినీటి వనరులలో సూక్ష్మజీవుల కల్చర్స్ పెరిగిపోయి అవి న్యూరోటాక్సిన్‍లను విడుదల చేస్తాయి. ఆ టాక్సిన్స్ కారణంగా నాడీక్షీణత కారణంగా సంభవించే అనారోగ్యాలు పెరిగిపోతాయనీ సర్వేలు చెప్తున్నాయి.
పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయిన కారణంగా తైవాన్‌లో స్కిజోఫ్రెనియా రిస్క్ పెరిగింది. స్విట్జర్లాండ్‌లో మానసిక సమస్యలతో హాస్సిటల్‍లో చేరే వారి సంఖ్యా పెరిగిపోయింది. ఆల్రెడీ రిస్క్‌లో ఉన్న వారి సంగతి చెప్పనవసరం లేదు. హాస్పిటల్స్ బయట వివిధ రోగకారక కీటకాలు పెరిగిపోయి, జికా, ఎల్లో ఫీవర్, సెరెబ్రల్ మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తిస్తున్నాయి.
సంజయ్ సిసోడియా బృందం అద్యయనాలు:
2024లో 24 మంది న్యూరాలజిస్టులు వివిధ నాడీ సమూహాల సమన్వయశీలతకు సంబంధించిన అంశాలపై జరిపిన పరిశోధనలలో సంఘటన, వ్యాప్తి, వాటి తీవ్రత వంటి సందర్భాలలో వాతావరణ మార్పులు కేవలం మనుష్యుల ప్రవర్తనలనే కాక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తున్నాయని వెల్లడయింది. మైగ్రేన్, స్ట్రోక్స్, మల్టిపుల్ స్కెర్లోసిస్, సీజర్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉష్ణోగ్రతల కారణంగా ప్రభావితం అవుతున్నాయని వారి సర్వేలో వెల్లడయ్యింది. ఈ బృందం జరిపిన 332 శాస్త్రీయ అధ్యయనాలు ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా తలెత్తే విపరిణామాలను సవివరంగా వెల్లడించాయి.
దార్శనికులు – సార్వకాలీనత:
జాన్ రస్కిన్ 19వ శతాబ్దపు మేటి దార్శనికుడు. రచయిత. చక్కటి ఉపన్యాసకుడు. కవి లేక రచయిత. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న అప్పటి రాజ్యవ్యవస్థలో పలు రాజీ ఒప్పందాలకు రూపకల్పన చేసిన రాజకీయవేత్త. ఇలా పలు రంగాలలో నిష్ణాతుడుగా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞాశీలి. అతను చక్కటి కళాకారుడే కాక కళావిమర్శకుడు కూడా.
‘మానవ ప్రేరిత వాతావరణ మార్పులు – ఆ కారణంగా సంభవించగల విపరిణామాలు’ ప్రసంగ వస్తు విశేషంగా అతడు పలు ఉపన్యాసాలు చేశాడు. విస్పష్టమైన మెటీరియోలాజికల్ అంచనాలతో కూడిన ఆ లెక్చర్స్‌లో అతడు మానవ సమాజంలో వస్తున్న సాంస్కృతిక మార్పులను గురించి, మారిపోతున్న విలువలు, ప్రాధామ్యాలను గురించి, ఆ కారణంగా ఆనాడు విక్టోరియన్ సమాజంలో రాగల పెను మార్పులను గురించి ముందుగానే ప్రస్తావించాడు. ‘The storm Cloud of the 19th Century’ గా అతడు పేర్కొన్న ఆ మార్పు ప్రకారం – “ప్రళయ మారుతం/ షెనుగాలి – కారుమబ్బులా విక్టోరియన్ నగరాలన్నిటినీ కమ్మివేస్తుంది. వాతావరణంలోని కారుమబ్బుల వలెనే సమాజంలోని నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్నీ చీకటి కమ్మివేస్తుంది”.
దురదృష్టవశాత్తు, మనిషి ఆత్మను గురించి, పర్యావరణాన్ని గురించి స్పష్టమైన అవగాహనతో, అంతకంటే విస్పష్టమైన అంచనాలతో అతను చేసిన హెచ్చరికలు గాని, అతను వెలిబుచ్చిన ఆందోళనలను కానీ సమకాలీన సమాజం పెద్దగా పట్టించుకోలేదు. పారిశ్రామిక విప్లవం వెల్లువలో – పశుసంపదతో కళకళలాడుతుండే అనేక ప్రాంతాలు పారిశ్రామికవాడలుగా మారిపోతూ రావడాన్ని సుదీర్ఘ కాలం పాటు ప్రత్యక్షంగా చూచినవాడు రస్కిన్. సస్యశ్యామలమైన వాతావరణం – పారిశ్రామిక వనరులు, రసాయనాలు, ఉత్పత్తులు, వ్యర్థాలు మొదలైన వాటితో, వాటి దుష్పరిణామాలతో ఉక్కిరిబిక్కిరిగా మారిపోవడాన్ని స్వానుభవంలో చూచినవాడు. ఆ ప్రభావానికి గురైనవాడు కూడా.
తీవ్రమైన ఆందోళన, నిరాశ, నిస్పృహలు అంతటి మేధావి జీవితాన్నీ అతడే ఊహించిన విధంగా కారుమబ్బుల్లా కమ్మివేశాయి. అతడి జీవిత చరమాంకం విషాదాంతమే. అయితే, వస్తు విశేషం, ఎప్పటికైనా విశేషమైనదీ, విశిష్టమైనదే!
మానవాళి పర్యావరణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో బ్రియాన్ డిల్లాన్ (ఒక శాస్త్రజ్ఞుడు, జిజ్జాసువు) రస్కిన్ ఉపన్యాసాలన్నిటినీ ‘2019 పారిస్ రివ్యూ’లో పునః సమీక్షించడం జరిగింది. రస్కిన్ అంచనాలన్నీ నూరుశాతం నిజం అయ్యాయని ఆ రివ్యూలో తేలింది.