సగటు మనిషి స్వగతం-5

8
4

[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‍ని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]క గొప్ప కవి ఎవరో ‘బ్రతుకంత బాధగా’ అన్నాడు. సగటు మనిషి నవ్వుకున్నాడు. కవులంతే, బాధలు లేని చోట కూడా బాధలను ఊహించుకుని బాధ పడుతూ బాధల కవితలు రాసి బాధిస్తారని. బాధలు లేకపోవటం వారికి పెద్ద బాధ అని. ఎందుకంటే, సగటు మనిషికి అసలు బాధలే లేవు. బ్రతుకంత ఆనందంగా, సుఖంగా, పూలతోటలా అని పాడుకుంటూంటాడు. బాధలు ఎంతగా అలవాటయిపోయాయంటే, బాధ కూడా సౌఖ్యంగా భావించటం సగటుమనిషికి అలవాటయిపోయింది.  కానీ, ఈ మధ్యకాలంలో, అన్నీ బాధలే అనిపిస్తున్నాయి. ఎటుచూసిన వేదనల గాథల బాధలే కనిపిస్తున్నాయి. ఎంతగా నవ్వుకోవాలని ప్రయత్నిస్తే అంతగా ఏడిపించే విషయాలే కనిపిస్తున్నాయి.

అదేదో హైడ్రాట!!!

సగటు మనిషి కళ్ళకైతే అది డ్రాగన్ లాగా, గోడ్జిల్లా లాగా అతి భయంకరంగా, హారర్ సినిమాల్లో టెంటకిల్స్ కదుపుతూ అతి భీకరంగా మనుషులని నలిపి నోట్లో పెట్టుకుని నమిలిమింగే రాక్షసుల్లాగా కనిపిస్తోంది. అక్రమంగా, కట్టకూడని స్థలాల్లో ఇళ్ళు కట్టుకున్నారని, కట్టిన ఇళ్ళను కూల్చేస్తున్నారట.. కానీ, జీవితమంతా కూడబెట్టిన డబ్బును తలపై ఒక నీడకోసం ఖర్చుపెట్టి హమ్మయ్య అనుకునేలోగా గూడును కూల్ఛి నీడను చీల్చి కట్టుబట్టలతో నడివీధిలో బికారీల్లా నిలబెడుతున్నాయి ఈ హైడ్రాలు. మధ్యతరగతి మనుషులపై కక్షకట్టిన గోడ్జిల్లా!!!

అలా, నిలబడి రోదిస్తున్న వారి స్థానంలో తనను ఊహించుకుంటే సగటు మనిషి గుండెలు చెరువులై, కన్నీటితో కాల్వలు నిండి వరదలై పొంగిపొర్లుతున్నాయి. అంతలోనే ఈ కన్నీటి వరదలు చూసి, ఇక్కడెప్పుడో ఒక చెరువుండేదేమో అన్నమాట ఏ శాటిలైట్ అన్నా పొరపాటున అంటే, నేనున్నానంటూ హైడ్రా ఢామ్మంటూ వచ్చేసి నా ఇంటిని కూల్చేస్తుందేమో అన్న భయంతో కన్నీళ్ళను కళ్ళల్లోనే కుక్కుకుని వెక్కిళ్ళను బిక్కపోయి ఆపుకుని నీళ్ళు ఆవిరవటం కోసం ఎండలో నుంచుందామనుకుంటే, సూర్యుడే రాడే.. రమ్మనకుండానే వాన ధనధనా వచ్చి కురిసి మురిసిపోతూ పోతోంది. సగటు మనిషిని ఏడిపించటం అంటే అందరికీ సరదా…

ఈ కూల్చే ఇళ్ళన్నీ సామాన్యులవే.. ఏన్నో తంటాలుపడి, డబ్బులు జమచేసి, ఎందరివో చేతులు తడిపి, ఎవరెవరినో బ్రతిమిలాడి, కాళ్ళావేళ్ళా పడి కట్టుకున్నవే. ఊపిరి పీల్చుకునేలోగా అంతా ఆవిరైపోతూంటే, కన్నకలలు ఛిన్నాభిన్నమయిపోతూంటే, గుండెలాగిపోవూ!!!! రాజకీయ నాయకులు చెరువుల్లోనే భవనాలు, కాలేజీలు కట్టుకుంటే ఆ వైపు కూడా చూడని హైడ్రా, సామాన్యులతో కర్కశంగా, రాక్షసానందం అనుభవిస్తున్నట్టు ప్రవర్తిస్తుంటే, ఈరోజు కాకపోతే, రేపు, ఈ కారణం కాకపోతే ఇంకో కారణంతో ఉరుము ఉరమకుండానే సగటు మనిషి మీద పిడుగు  విరుచుకుపడిపోతుందేమోనన్న భయం సగటు మనిషికి కలగటంలో ఆశ్చర్యం, అనౌచిత్యం ఏమైనా వుందా?? అందరూ సమానమయిన ప్రజాస్వామ్యంలో కొందరు అందరికన్నా ఎక్కువ సమానమనీ, సగటుమనుషులు సమానంకన్నా తక్కువ సమానమనీ అర్ధమయిన తరువాత భయం బాధలు మరింత ఎక్కువయ్యాయి.

మూసీ దగ్గర వాళ్ళవి కూల్చాలంటే వాళ్ళంతా ఒక్కటై ధర్నాలు, అరుపులు, కేకలు.. వాళ్ళ ఎమ్మెల్లేలు, ఎంపీలు బెదిరింపులూ, భయపెట్టటాలూ.. చెరువు మధ్యలో కాలేజీ కట్టిన ఓ ఎంపీ అయితే నా కాలేజీ కూల్చకండి, నన్ను కాల్చండి అనగానే సామాన్యుల పాలిటి రౌద్రనేత్ర, అగ్నిహోత్ర, క్షుద్రగాత్ర, విషపుమాత్ర, రాక్షస పుత్ర, జాలిలుప్త హైడ్రా గుడ్డిదయి, చెవిటిదయి, అవిటిదయి, ఆరిన దివిటీ అయి, తుస్సుమన్న ఔటూ అయి, లాకౌట్ అయి, లాగౌట్ అయి.. గెటౌట్ అయిపోయింది. కూల్చటం లేదు, కాల్చటమూ లేదు.  అదే మధ్యతరగతి సగటుమనుషుల ఇళ్ళతో అకాండతాండవోద్దండమార్తాండబ్రహ్మాండచండప్రచండ మహాప్రతీపప్రతాప దీపనిర్వాణమహాబలులు, బాహుబలులకే మహాబలబాహుబలిలా ప్రవర్తిస్తుంది. అందరిలాగే సగటు మనిషికి కూడా, అమాయకుల ఇళ్ళు కూల్చి కళ్ళల్లోని కలలను కన్నీళ్ళ వరదల్లో ముంచుతున్నారు కానీ, మరి అక్కడ ఇళ్ళు కట్టుకోవటానికి అనుమతులిచ్చి, రిజిస్ట్రేషన్లు చేసి, ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నొప్పి పన్ను, పిప్పి పన్ను, అమ్యామ్యా పన్ను, చేయితడుపు పన్ను, ఇంకా ఎన్నెన్నో పన్నులను వసూలు చేసిన వారికేమీ శిక్ష లేదా? అన్న సందేహం వస్తోంది.  వాళ్ళేమో వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో చల్లగా వుంటే, డబ్బులన్నీ వూడ్చిపెట్టిన సగటు మధ్యతరగతి మనిషి వర్షానికి తడుస్తూ, అన్నీ పోగొట్టుకుని కనీసం కార్చే కన్నీళ్ళు కూడా వర్షంలో కొట్టుకుపోయి ఏమీ లేకుండా నిలబడుతున్నాడు. ప్రతి చిన్న విషయానికీ గోల చేసే వారెవరూ వీరి గోలను పట్టించుకోవటం లేదు. సగటు మనిషికి న్యాయం నీడ లభించదు. చివరికి ఫుట్‌పాత్ మీద సంవత్సరాలతరబడి అక్రమంగా ఆక్రమించిన వారి ఆక్రందనలు విని పరుగెత్తుకువస్తారు కానీ (అందరి ఆక్రందనలకూ స్పందించరన్నది చేదునిజం), మధ్యతరగతివారి రోదన దగ్గరకు వచ్చేసరికి ప్రతివాడూ మూడుకోతుల అనుచరులయిపోతారు.

ఇది వదిలేయండి..

తిరుపతి లడ్డూ విషయం కూడా సగటు మనిషిని బాధిస్తున్నది. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందో లేదో కానీ, ఈ కల్తీ  విషయం కన్నా, ఈ విషయం బహిర్గతం కాగానే మేధావుల ప్రవర్తన బాధకే బాధ కలిగిస్తోంది.  రాజకీయ నాయకులను వాళ్ళంతే అని  వదిలేస్తే, తమని తాము మేధావుల్లా, ఎడమవైపు వారిలా, అన్నీ  వదిలేసిఏమీ పట్టించుకోనివారిలా (లిబెరల్స్), పరమతం పుచ్చుకోవటంతోటే, పుచ్చు పోయి శుభ్రమయిపోయిన పుచ్చకాయల్లా భావించుకుంటున్నవారి వ్యాఖ్యలు, చేతలు బాధకే బాధను కలుగచేస్తూ మరింతగా బాధిస్తున్నాయి.

తిరుపతి లడ్డూలో వాళ్ళేమైనా కలపనీయండి, సగటు మనిషికి బాధలేదు. అది ‘ప్రసాదం’ అన్న మరుక్షణం పవిత్రమైపోతుంది. ప్రసాదం పేరు చెప్పి ఏమిచ్చినా కళ్ళ కద్దుకుని స్వీకరిస్తాడు సగటు మనిషి. భగవంతుడికే ప్రసాదం విషయంలో పట్టింపులులేవు. మాంసం ఇచ్చినా స్వీకరిస్తాడు. చక్కర ఇచ్చినా స్వీకరిస్తాడు. ఏమీ ఇవ్వకున్నా పర్లేదు. అందుకేగా తిక్కన్న, ‘కిమస్థిమాలాం, కిము కౌస్తుభం వా, పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం, కిం కాలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద  ప్రభో మే‘ అన్నాడు. భగవంతుడికే పట్టింపులేనప్పుడు సగటుమనిషికేం పట్టింపు?  సగటు మనిషి భక్తిభావన ముందు మురికి కూడా పవిత్రమైపోతుంది. దాన్ని అపవిత్రం చేసినవాడే దాని పాప ఫలితాన్ని అనుభవిస్తాడు.

మీరా విషాన్ని తాగి, విషాన్ని కూడా అమృతం చేసింది. అది భక్తి శక్తి. భక్తి భావ ప్రభావం. అది మేధావులకూ, రాజకీయ నాయకులకూ, అన్నీ వదిలేసి ఏదీ పట్టించుకోని  వాళ్ళకు, ఎడమవైపు వాళ్ళకూ, పరమతం స్వీకరించి శుభ్రమైన పుచ్చకాయల  వాళ్ళకూ అర్థం కాదు. ప్రసాదం పేరు పెట్టగానే దానికెన్ని దోషాలున్నా అన్నీ పటాపంచలయిపోతాయి. అందుకే తిరుమల లడ్డూలో ఏ ఫాట్ కలసినా సగటు మనిషికి బాధలేదు. అదీగాక, సగటు మనిషికి చిన్నప్పటి నుంచీ తనకు ఇష్టం లేని పనులు బలవంతానో, మోసం చేసో చేయించాలని ఇతరులు ప్రయత్నించటం అలవాటే.

మాంసాహారం తినను అని అంటే, మధ్యాహ్నభోజనంలో మాంసాహారం తెచ్చుకుని కొంచెం టేస్ట్ చెయ్యి అని బలవంతాన టిఫిన్లో ఫ్రేండ్స్ ఒక ముక్క వేస్తే టిఫిన్లోని అన్నంతో సహా టిఫిన్‌ను విసిరేసి ఆకలితో కూర్చోవటం, ఇతరులు ఆట పట్టిస్తూంటే, పంటి బిగువున కన్నీళ్ళనూ, కోపాన్నీ అదిమిపట్టటం సగటు మనిషికి అలవాటే. మద్యం తాగను అంటే, కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి తాగించాలని చేసే ప్రయత్నాలు గమనించి కూల్ డ్రింక్ తాగటం మానేశాడు సగటు మనిషి. ఇప్పటికీ కూల్ డ్రింక్ తాగడు. ఆరోగ్యానికి మంచిది అది. ఎందుకు తినవు మేం తినటం లేదా? అని వాదించేవారికి, మేం తింటున్నాం కాబట్టి అపవిత్రులమా? అని కోపించేవారికీ,  అందరికీ దూరంగా వుంటే, అంటరానితనమూ ఒంటరితనమూ అనాదిగా మీ జాతికి అదే మూలధనమూ అని ఏడిపిస్తూనే వున్నారు. ఇప్పటికీ మాంసాహారం మా హక్కు అని ఉద్యమాలు చేస్తున్నారు. శాఖాహారం నా హక్కు అన్న సంగతిని వదిలి.  సగటు మనిషి మనిషి  కానట్టు, హక్కే లేనట్టు ప్రవర్తిస్తున్నారు. ఆమధ్య ఒక మేధావి ఎవరో నాన్ వెజిటేరియన్లకు అద్దెకు  ఇళ్ళివ్వట్లేదని అదేదో  ఇంటర్నేషనల్ ఇష్యూ అన్న లెవెల్ లో కథ రాసి తెలుగు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోయాడు. కానీ, నేను డబ్బులు పెట్టి నాకిష్టమయినట్టు కట్టుకున్న ఇల్లు నాకిష్టమైనవారికి అద్దెకిచ్చే హక్కు నాకుంటుందన్న గ్రహింపు లేకపోవటమే మేధావితనం అని బోధించాడా గల్లీలెవెల్లో  ఇంటర్నేషనల్లీ ఫేమస్ ఇంటలేక్చువల్ సంకుచిత  మేధావి.   ఇప్పుడు, తిరుపతి లడ్డూ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. లడ్డూలో జంతువు కొవ్వు కలిస్తే ఏమయిందని వెక్కిరిస్తున్నారు. రోజూ తినే తిండిలో కొవ్వు కలవదా? అని హేళన చేస్తున్నారు, ప్రసాదమన్న భావనతో ఏమాత్రం పరిచయం లేని పూజ పద్ధతి రహితులు, ప్రసాద శూన్యులు.

ఇంకొందరు, అన్యమతం స్వీకరించినవారు, వారి మతం గురించి మాట్లాడుకోకుండా, ప్రసాదం గొడవ ఆధారంగా గుళ్ళ పైన ప్రభుత్వం హక్కు తొలగించే ఉద్యమం చేస్తారు, ఎట్టి పరిస్థితులలో గుడి ప్రభుత్వ పంజాలోనే వుండాలని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా వాళ్ళ మతం గురించి వాళ్ళేం అనుకున్నా అనుకోనీండి కానీ, నా నమ్మకం గురించి, నా ధర్మం గురించి వ్యాఖ్యానిస్తూ నన్నుధ్ధరించాలన్న తపన వీళ్ళకెందుకు? అని ప్రశ్నించాలని సగటుమనిషికి అనిపిస్తుంది. కానీ, సగటుమనిషి అంత ధైర్యంగా అడగలేడనుకోండి.  పెర్షియన్లు, అరబ్బులు మనల్ని అనాగరికులుగా భావించి ఉద్ధరించాలనుకుంటే అర్ధం చేసుకోవచ్చు. యూరోపియన్లు మనల్ని బార్బేరియన్లనుకుని బాగు చేయాలనుకోవటం అర్ధం చేసుకోవచ్చు. కానీ, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే బ్రతుకుతూ, ఇక్కడే మట్టిలో కలసిపోయేవాళ్ళు కూడా ఇలా సగటుమనిషిని ఉద్ధరించాలని  ప్రవర్తించటం ఆశ్చర్యం ఆవేదనలను కలిగించటంలో ఆశ్చర్యం ఏమైనా వుందా?  దీన్ని బట్టి సగటు మనిషికి అర్థమయిందేమిటంటే, ఇతర మతాలు బయటనుంచి వచ్చినవి. అవి ఈ దేశంలో  ప్రత్యేకం. భిన్నం. ఈ దేశంలో ఏమయినా వాటికి సంబంధం లేదు. ఈ దేశం గుళ్ళు గోపురాలు, పూజలు, పునస్కారాల వాళ్ళది. అందుకని వాళ్ళ గుళ్ళ ఆదాయం ప్రభుత్వానికి, ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ చెందాలి. కాబట్టి, గుళ్ళు ప్రభుత్వం అధీనంలోనే వుండాలి. ఇతర మతాల పవిత్ర స్థలాలు మాత్రం ఆయా మతాలకే చెందాలి. ఆయా మతాలవాళ్ళు గుళ్ళ గురించి, వాటి పద్ధతుల గురించి వ్యాఖ్యానిస్తూనే వుండాలి. హేళన చేస్తూనే వుండాలి. ఇక్కడ స్థిరపడి వేల వేల సంవత్సరాలయినా, ఇంకా కొత్తగా అత్తగారింట్లో అడుగుపెట్టిన కొత్తపెళ్ళికూతుళ్ళలాగే, అల్లుళ్ళలాగె వారిని ప్రత్యేకంగా చూడాలి.  సగటు మనిషి తన ధర్మం గురించి  సిగ్గుపడుతూనే వుండాలి. తన పధ్ధతులగురించి న్యూనతాభావాన్ని అనుభవిస్తూనేవుండాలి. అదే ఎవరయినా వారి మతం గురించి వ్యాఖ్యానిస్తే కోపతాపశాప ఆవేశ కావేశ, క్రోధేశ, హింసేశలన్నీ ఏదీ శేశం లేకుండా జరిగిపోతాయి. పైగా వాడు కోట్ల రూపాయల భవనాల్లో వుంటూ, విమానాల్లోతిరుగుతూన్నా, విదేశాల్లో వుంటూ గౌరవమర్యాదలందుకుంటూన్నా, మతం మారినా పనికిరాదని వదలిన పాతమతం వాళ్ళకి లభించే సౌకర్యాలన్నీ అనుభవిస్తూనేవున్నా,  వారంతా ఇప్పుడేకాదు, ఎప్పుడూ   అణచివేతకు గురవుతూన్నవాళ్ళే. రాకూన్ల రక్కసి కర్కశ దంష్ట్రలలో పడి నలుగుతున్నవాళ్ళే. ఏదో నెలకింత సంపాదిస్తూ, అన్ని కోరికలకూ కళ్ళేంవేస్తూ, చస్తూ బ్రతుకుతూ, పడుతూ లేస్తూ, నవ్వుతూ ఏడుస్తూ, జీవికను వెళ్ళదీస్తున్న సగటుమనిషి వాళ్ళను  అణచివేసే క్రూరుడు, హీనుడు, నీచుడు, నికృష్టుడూనూ!!  సగటుమనిషి మనసులో మాట పెదిమ దాటిందా, అనర్ధమూ, ప్రళయమూ, విలయమూనూ!!

 ఇప్పుడు జరుగుతున్నవి చూస్తూంటే,   గతంలో ఎన్నడూ లేని విధంగా సగటు మనిషికి భయం, బాధలు కలుగుతున్నాయి.

ఇప్పుడీ స్వగతం బహిర్గతం కాగానే సగటు మనిషి మనోగతానికి రాజకీయరంగులు, మతం హంగులు పులుముతారు. కులంకుళ్ళు పులుముతారు.  మత ఛాందసవాది అని దూషిస్తారు. మతం బురదలో కూరుకుపోయి, తీవ్రవాద జోరులోకి జారిపోయిన చీడపురుగని చీదరించుకుంటారు. ఇదీ సగటు మనిషి భయం. మేధావులు, గొప్పగొప్ప ఆలోచనలు చేసేవారు, తామే ఉన్నతులమన్నట్టు వ్యాఖ్యానించేవారు, సర్వం తమకు కరతలామలకం అని నమ్మేవారు, ఎంత సంకుచితంగా, ఎంత నీచంగా, ఎంత మతవూబిలో చిక్కుకున్న దున్నలయినా, కులం కుళ్ళు సంకుచితంలో ఎంతగాపడిపొర్లుతున్నా, ఎంత అనౌచిత్యంగా  ప్రవర్తించినా అది విశాలత్వమే కానీ, సగటు మనిషి ఎంత తార్కికంగా మాట్లాడినా, ఎంత న్యాయబద్ధంగా మాట్లాడినా వారికి నచ్చకపోతే  అది మౌఢ్యమూ, మత ఛాందసమూనూ!!! అందుకే సగటుమనిషి ఇలా ఆలోచిస్తున్నాడనీ, ఇలా బాధపడుతున్నాడనీ, ఇలా భయపడుతున్నాడనీ ఎవ్వరికీ చెప్పకండి. ఏదో బాధ, భయాలు దాచుకోలేక మీకు చెప్పుకుంటున్నాను. ఇది మీకు నాకూ మధ్యనే వుండాలి. మళ్ళీ అనవసరమైన గోలలూ, చికాకులూ సగటుమనిషి పడలేడు. ఆమెవరో గొప్పామె కాబట్టి నా స్పూన్ నేను తెచ్చుకుంటానని అని, ఎవరేమన్నా పట్టించుకోకుండా తట్టుకుని నిలబడింది. సగటుమనిషికి అంత శక్తి లేదు. కానీ, అనకుండా ఉండలేడు. అంటే, బ్రతకలేడు.

ఇప్పుడర్థమయిందా, సగటు మనిషికి స్వయంగా ఎలాంటి బాధలు లేకున్నా, ఎందుకు బాధపడుతున్నాడో!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here