[శ్రీ ఆసూరి హనుమత్ సూరి రచించిన ‘బీ ఐ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“గ[/dropcap]త సంవత్సరం నుండీ ఒక్క రీసెర్చ్ పేపర్ అప్రూవ్ అవలేదు! వచ్చినవన్నీ డూప్లికేషన్స్ లేదా సిమిలర్ సబ్జెక్టు మీదే ఉంటున్నాయి!” నిట్టూరుస్తూ చెప్పాడు డాక్టర్ నచికేత్.
“మీదైనా నయం! మా యూనివర్సిటీలో నయితే పదుల కొద్దీ కాపీలు ఒకరే పంపారా అన్నట్టున్నాయి! ఇన్నోవేషన్స్ మాట అటుంచితే మినిమమ్ బెంచ్ మార్కులు కూడా దాటట్లేదు. ఇలా అయితే మా రీసెర్చ్ సెల్ మూసుకోవలసిందే!” అట్నుంచీ అంతే నిరుత్సాహంగా ఉంది డాక్టర్ యోషినక కంఠం.
“ఇది కనిపెట్టటానికేనా మీకు లక్షల కొద్దీ డాలర్ల జీతం. ఇది నాకెప్పుడో తెలుసు. మీరు కొత్తగా కనిపెట్టేదేం లేదు.” తనలో తాను గొణుక్కుంటున్న రీసెర్చ్ అసిస్టెంట్ తకషిత వైపు సీరియస్‌గా చూసాడు యోషినక.
“నేను లంచ్‌కి వెళ్ళొస్తాను! కాస్త ఈ రీసెర్చ్ పేపర్లన్నీ కట్ట కట్టి రోబోటిక్ సెల్‌కి పంపించు. సాయంత్రానికల్లా పిడిఎఫ్‌లు నాకు మెయిల్ అయ్యేట్లు చూడు.” పురమాయిస్తున్నట్లు చెప్పాడు యోషినక.
“ఏ ఐ రాజ్య మేలుతున్న ఈ యుగంలో కూడా ఇంకా ఇలాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి వాళ్ళను ఎందుకు మేపుతున్నారో నాకు అర్థం కాదు.” గొణుక్కుంటూ సరేనంది తకషిత.
అనుకున్నదే తడవుగా ఫ్లైటో (ఎగిరే ఆటో) రావడం, వెళ్లడం (అదే.. ఎగిరిపోవడం) క్షణాల్లో జరిగి పోయాయి.
డాక్టర్ నచికేత్, బెనారస్ ఏ ఐ యూనివర్సిటీలో హెడ్ అఫ్ ది రీసెర్చ్ డిపార్ట్మెంట్. డాక్టర్ యోషినక.. హిరోషిమా స్కూల్ ఆఫ్ ఏ ఐ లో తన కౌంటర్‌పార్ట్. ఇద్దరూ నిన్నటి తరం ప్రొఫెసర్‌లు. నేటి తరం దృష్టిలో ఎందుకూ కొరగాని పాత చింతకాయ తొక్కులు.
***
2051వ సంవత్సరం.. హైదరాబాద్ ..
అయోమయ తన ఒక్క గానొక్క కొడుకు సర్వజ్ఞ ని బిల్ గేట్స్ స్కూల్, కాలిఫోర్నియాలో సిక్స్త్ స్టాండర్డ్‌లో అడ్మిట్ చేసింది. రెండు నెలల కొకసారి తనని ఫిజికల్ క్లాస్‌కి కాలిఫోర్నియాకి పంపాలి. టికెట్స్ బుక్ చేసుకొమ్మని చెప్పి నాలుగు రోజులయింది. వాడు అస్తమానూ చాట్ బోట్‌ని అడగడం అది నానా ప్రశ్నలతో పక్క దోవ పట్టించడం వాడు డీవియేట్ అవడం తలనొప్పిగా మారింది అయోమయకి.
“వీడ్ని ఫిఫ్త్ స్టాండర్డ్ లోనే పట్టించుకుని ఉంటే బావుండేది. ప్రాంప్టింగ్ పేపర్‌లో అత్తెసరు మార్కులు వచ్చినా పట్టించుకోక పోవడం తన తప్పే. ఏ సొల్యూషన్ అయినా చిటికెలో చెప్పేసే చాట్ బోట్‌ని సూటిగా అడగడం కూడా రాకపోతే ఇంక వీడేం బాగు పడతాడు. ఇకనుంచీ ఏ ఐ ప్రాంప్టింగ్ టెక్నిక్‌లో ట్యూషన్ పెట్టించాల్సిందే. రేప్పొద్దున కాలిఫోర్నియాకి వెళ్లి టీచర్‌ని ఎలా మెప్పిస్తాడు?” అని విసుక్కుంటున్న అమ్మని గమనించి, “అమ్మ విసుక్కుంటే నేనేం చెయ్యాలి?” అని చాట్ బోట్‌ని అడుగుతున్న సర్వజ్ఞకి ఆ పేరు ఎందుకు పెట్టానా అని తెగ బాధ పడిపోయింది అయోమయ.
సర్వజ్ఞ ఒక సగటు తెలివి గల కుర్రాడు. రెణ్ణెల్ల పాటు ఆన్లైన్‌లో క్లాసులు విని విసుగెత్తి రిలాక్స్ కోసం ఫిజికల్ క్లాసులకి వెళ్లాలని కలలు కంటున్నాడు. తల్లి మాత్రం తండ్రి పడాల్సిన ఆదుర్దా కూడా తనే పడుతూ కొడుకు గురించి ఆందోళన చెందుతోంది. కారణం అయోమయ ఒక సింగిల్ లేడీ. సరోగసి ద్వారా కన్న టెస్ట్‌ట్యూబ్ బేబీ సర్వజ్ఞ.
***
న్యూయార్క్‌లో ఫ్లైట్ దిగి వెయిటింగ్ లాంజ్‌లో డాక్టర్ నచికేత్ తన పాత మిత్రుడు యోషినక కోసం వెయిట్ చేస్తున్నాడు. కాసేపట్లో టోక్యో నుండీ ఫ్లైట్ దిగుతుందని అనౌన్స్ చెయ్యడంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. అంత లోనే ఫ్లైట్ ల్యాండ్ అవడం, యోషినకతో పాటు ఇంకో లేడీ కూడా ఉండడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు నచికేత్.
చాలా రోజుల తర్వాత కలుస్తున్న మిత్రుడితో ఎన్నో విషయాల్ని పంచుకోవాలన్న ఆశ కాస్త సన్నగిల్లినట్లయింది. బహుశా యోషినక తన భార్యతో వస్తున్నాడా? అలా అయితే ముందే చెప్పే వాడేనే? తను ఎవరయ్యుంటుంది అని ప్రశ్నించుకునే లోపే తనని సమీపించిన యోషినక, తన పక్క నున్న లేడీని ఛాయా బెనర్జీగా పరిచయం చేశాడు. తన పూర్వీకులది ఇండియానట. ప్రస్తుతం చైల్డ్ సైకాలజీలో టోక్యోలో రీసెర్చ్ చేస్తుందనీ, తన తోటి ప్యాసింజర్‌గా పరిచయం అయిందని చెప్పాడు.
నచికేత్ హమ్మయ్య అనుకునేంత లోపే తను కూడా మనం పాల్గొనబోయే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఏ ఐ స్టడీస్ అండ్ ఇంప్లికేషన్స్‌కి పార్టిసిపెంట్‌గా వస్తోందని, తనకి కూడా మనకి ఇచ్చిన హోటల్ లోనే వసతి ఇచ్చారని చెప్పాడు యోషినక. చేసేదేం లేక వాళ్ళకోసం అరేంజ్ చేసిన పికప్ ఫ్యాబ్ (ఫ్లైయింగ్ క్యాబ్) లో ఎక్కి హోటల్ చేరుకున్నారు.. ముగ్గురూ..!
***
“సర్వా! ఎన్ని సార్లు చెప్పాలి నీకు? అస్తమానూ ఆ సాజిద్‌తో చాట్ చెయ్యొద్దని. వాడు నీ స్కూల్ కూడా కాదు. ఒక మామూలు గవర్నమెంటు స్కూల్‌లో చదూతున్నాడు. ఇంకా కావాలంటే వాళ్ళక్క సమయ తో చాట్ చెయ్యి. కాస్త తెలివయినా పెరుగుతుంది. తనకి ఏ ఐ టెక్నీక్స్‌లో ఏ ప్లస్ గ్రేడ్ వచ్చింది. రేపే మనం యూఎస్ బయలుదేరాలి. బ్యాగ్ సద్దుకున్నావా?” అయోమయ సర్వజ్ఞని గదమాయిస్తోంది.
“మమ్మీ, తను నా వయసు కాదు. నా క్లాస్ కూడా కాదు. సాజిద్‌తో చాట్ చేస్తుంటే టైమే తెలీదు. వాడు చెప్పే కథలు, కబుర్లు అస్సలు బోర్ కొట్టవు. వాళ్ళ స్కూల్‌లో అన్నీ వాళ్ళే రాసుకుంటారు. వాళ్ళకు వాళ్ళ టీచర్స్ ఎంత ఫ్రీడమ్ ఇస్తారో చెప్తుంటే నాకు వాళ్ళ స్కూల్‌లో చేరాలనుంటుంది. కనీసం తనతో చాట్ కూడా చెయ్యనివ్వవా? వాడికి ఈ రోజు స్కూల్ బంద్ అట. ప్లీజ్ కొద్ది సేపే!” రిక్వెస్ట్‌గా అడిగాడు సర్వజ్ఞ అమ్మని.
“ఎందుకట స్కూల్ బంద్. వాళ్ళమ్మని అడుగుతానుండు. వాడేదో చెప్పడం నువ్వు నమ్మేయ్యడం. బావుంది వరస!” అంటూ సాజిద్ వాళ్ళమ్మకి ఫోన్ చేసింది అయోమయ.
సమయ, సాజిద్ అక్కా తమ్ముళ్లు. సర్వజ్ఞ వాళ్ళ పక్క వీధి లోనే ఉంటారు. ఉమేరా, మయాంక్ వాళ్ళ అమ్మా, నాన్నలు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. ఏదయినా ఇద్దరూ సమానంగా షేర్ చేసుకుంటారు. పనయినా, అభిప్రాయాలయినా. మయాంక్ కాస్త మోడరన్. ఉమేరా కొంచెం పాతకాలపు అభిప్రాయాలు గలది. అందుకే వారి వారి ఇష్టాల మేరకు సమయని మోడరన్ స్కూల్ లోనూ, సాజిద్‌ని ఒక మామూలు గవర్నమెంటు స్కూల్ లోనూ చేర్చారు.
ఉమేరా ఒక సంప్రదాయవాది. స్కూల్ స్థాయి నుండే విపరీతమైన టెక్నాలజీ, ఏ ఐ వాడకానికి వ్యతిరేకంగా చేసే ఉద్యమాలకి అనుకూలంగా పత్రికల్లో వ్యాసాలూ రాస్తుంటుంది.
ఆ రోజు సాజిద్‌కి స్కూల్ బంద్‌కి కారణం ఇలాంటి ఉద్యమాలు చేసేవారిచ్చిన పిలుపే. ఈ విషయం ఉమేరాకి ఫోన్ చేసి తెలుసుకున్న అయోమయ, ఇలాంటి కన్ఫ్యూషన్‌తో ఇంట్లో వీళ్లెలా నెట్టుకొస్తున్నారో? తనకిలాంటి అడ్డంకులేవీ లేకపోవడం గురించి తల్చుకుని తనెంత అదృష్టవంతురాలో అని పొంగిపోయింది.
“సర్వా! ఇక చాలు వెళ్లి బ్యాగ్ సర్దుకో. నేను నా అసైన్మెంట్ కంప్లీట్ చేసి వస్తాను. ఈ లోగా ఫుడ్ ఆర్డర్ పెట్టాను. వచ్చేస్తుంది.” అంటూ తన పనిలో నిమగ్నమైంది అయోమయ.
***
తమ కాన్ఫరెన్స్‌కి ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో ఆ రోజుకి రెస్ట్ తీసుకుని మరుసటిరోజు హోటల్‌లో కాఫీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు నచికేత్ మరియు యోషినక. ఇంతలో ఛాయా ఇంకో అతనూ వచ్చి జాయిన్ అయ్యారు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ. ఆ నాలుగో వ్యక్తిని మిస్టర్ రోజర్ అని, తను ఒక ఏ ఐ ప్రాంప్ట్ ఇంజినీర్ అని తన కోలాబోరేషన్‌తో పిల్లల పైన, వారి సైకాలజీ పైన ఏ ఐ ప్రభావాన్ని గురించి పరిశోధన చేస్తున్నానని చెప్పింది ఛాయా.
అప్పటి దాకా పానకంలో పుడక లాగా ఉందని ఫీలయిన ఛాయాని కాన్ఫరెన్స్‌లో తాము ఇవ్వబోయే ప్రెజెంటేషన్‌కి పనికొస్తుందని గ్రహించాడు నచికేత్. త్వరగా రెడీ అయి పదకొండింటి కల్లా మీటింగ్ రూమ్‌లో కలుద్దామని ఎల్లుండి ఇవ్వబోయే ప్రెసెంటేషన్ గురించి మాట్లాడుకుందామని చెప్పి వెళ్లిపోయారు అందరూ.
***
అనుకున్న టైం కన్నా ముందుగానే అందరూ మీటింగ్ రూమ్‌కి చేరుకున్నారు. ఫార్మల్‌గా అందరూ తమను తాము పరిచయం చేసుకున్నారు.
నచికేత్ ఉత్సాహంగా ప్రారంభించాడు..
“మన నలుగుర్నీ గమనిస్తే ఈ కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఏ ఐ యొక్క ఫ్యూచర్‌ని డిసైడ్ చెయ్యాలని నడుం బిగించినట్టే కనిపిస్తోంది. మీరంతా ఓకే అంటే మన సబ్జెక్టు వేరే అయినా కామన్‌గా ఏ ఐ వల్ల దేనిమీద ఎంత ప్రభావం ఉందో ఒక అంచనాకి వద్దాం!”
“ముందు ఏ ఐ గురించి కాస్త వివరంగా రోజర్ చెబితే బావుంటుంది. ఏమంటావ్ రోజర్?” ఛాయా ప్రశ్నించింది.
“ష్యూర్! తప్పకుండా! కానీ ఏ ఐ ప్రస్తుతం నడివయసు దాటినట్లు అనిపిస్తోంది నాకు. ముందు బాల్యం నుండీ ప్రారంభిస్తే ఏదయినా సరిగ్గా ఉంటుంది. ఏమంటావ్ ఛాయా?” ప్రశ్నించాడు రోజర్.
“ఓ అలా వచ్చారా? అయితే పిల్లల్ని స్టడీ చేసే నన్నే ప్రారంభించమంటావ్ అంతేగా?” అంది ఛాయా.
“మనమంతా కలిసి ఒక సమాధానం కనుక్కోవడానికి ఇక్కడ కూర్చున్నాం. కానీ ప్రశ్నలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారే!” అన్నాడు యోషినక.
అంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
ఛాయా మొదలు పెట్టింది..
“పిల్లలు ఒక వయసు దాకా మాత్రమే చుట్టూ ఉన్న పరిసరాల్ని, మనుషుల్ని గమనిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇది ఏమిటి? అది ఏమిటి? అది ఎందుకు? ఇది ఎందుకు? అని విసిగించయినా సరే సమాధానం వచ్చేదాకా అడుగుతూనే ఉంటారు. ఈ ప్రశ్నించే తత్వమే వాళ్ళని జ్ఞానవంతులుగా చేస్తుంది. సో, ప్రశ్న అనేది చాలా ముఖ్యమైంది అంటాన్నేను. అవునా?”
“సరిగ్గా చెప్పారు.. ఈ ప్రశ్నే మా ఏ ఐ చాట్ బాట్‌కి మూలం. ప్రతీ ప్రశ్నకి సమాధానం ఇవ్వడం మాకు ఒక సవాల్. ఇంకా చెప్పాలంటే అత్యుత్తమ సమాధానం ఇవ్వడం మాకు ఒక బెంచ్ మార్క్.” మధ్యలో అందుకున్నాడు రోజర్.
“మరి ఈ సమాధానాలు ఎలా ఇవ్వగలుగుతారు.? ఏది అత్యుత్తమం అని ఎలా డిసైడ్ చేస్తారు?” ప్రశ్నించాడు యోషినక.
నచికేత్ ఎంతో కుతూహలంగా అన్నీ నోట్ చేసుకుంటున్నాడు.
“మీరు అడిగే ప్రతి ప్రశ్ననీ కీ-వర్డ్స్‌గా చిన్న చిన్న వాక్యాలుగా విడగొడతాం. వాటికి సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలంలో ఉన్న వివిధ మూలాల ద్వారా వెతుకుతాం. ఎక్కువమంది ఆమోదించిన సమాధానాన్ని ఉత్తమమైన సమాధానంగా పరిగణించి దాన్ని మీకు రెస్పాన్స్‌గా ఇస్తాం. అయితే మనం అడిగే ప్రశ్న ఎంత ఖచ్చితంగా ఉంటుందో సమాధానం అంతే ఖచ్చితంగా వస్తుంది. ప్రాంప్ట్ ఇంజినీర్‌గా నేను చేసే పని అదే.” వివరంగా చెప్పాడు రోజర్.
“సూటిగా అడుగు సుత్తి లేకుండా అంటావ్ అంతేనా?” నవ్వాడు నచికేత్. అంతా గొల్లున నవ్వారు.
“ఛాయా గారు! మీరు చెప్పండి. మీ పరిశోధనల్లో ఏం కనుక్కున్నారు? పిల్లలకి ఏ ఐ ఎలా ఉపయోగపడుతోంది?” యోషినక అడిగాడు.
“మొదట్లో బాగానే ఉపయోగ పడుతోందనే అనిపించేది. కానీ ఏ ఐ టూల్స్, ప్రాంప్టింగ్ వాళ్ళ పాఠ్యాంశంలో భాగమయ్యాక వాళ్ళు దాని మీద పూర్తిగా ఆధారపడడం మొదలయ్యింది. అత్యుత్తమమైన సమాధానం రాబట్టడం ఎలాగో పిల్లలకు తెలిసే కొద్దీ సమాధానాల్లో కొత్తదనం లేకుండా పోతోంది. అన్నీ మూస సమాధానాలే!” పెదవి విరుస్తూ చెప్పింది ఛాయా.
“మరి మీరు రక రకాల రీసెర్చ్ పేపర్స్ చూస్తుంటారు కదా! మీకేం అనిపిస్తోంది? మీ అబ్సర్వేషన్స్ చెప్పండి.” అడిగాడు రోజర్.. ప్రొఫెసర్స్ నచికేత్ మరియు యోషినకల వైపు చూస్తూ.
“మేం ఎన్నో సైన్స్‌కి సంబంధించి రీసెర్చ్ పేపర్స్ చూస్తుంటాం. ఇటీవలి కాలంలో వచ్చేవేవీ ఏ మాత్రం కొత్తదనంతో ఉండటం లేదు. పైగా చాలా సిమిలర్‌గా ఉంటున్నాయి. అదే మాకూ అర్థం కావడం లేదు. ఒక్కసారిగా పెద్ద గాప్ వచ్చినట్లని పిస్తోంది.. పరిశోధనల్లో. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఈ రోజు విసిగిద్దామనుకుంటున్నాం..!” అంటూ రక రకాల ప్రశ్నలతో రోజర్‌ని విసిగిస్తూనే ఉన్నారు నచికేత్ మరియు యోషినక.. రాత్రి దాకా!
***
మరుసటి రోజే కాన్ఫరెన్స్. అందరూ ఎంతో ఉత్సాహంగా న్యూయార్క్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారో అంతస్తు లోకి చేరుకుంటున్నారు. అన్ని లిఫ్ట్‌లు బిజీగా ఉన్నాయి. నచికేత్, యోషినక ముందుగానే కాన్ఫరెన్స్ హాలుకి చేరుకున్నారు.
ఛాయా కాస్తా ఆలస్యంగా రోజర్‌తో కలిసి పరుగు పరుగున ఒక లిఫ్ట్ లోకి ప్రవేశించింది. ఎదురుగా తన స్కూల్ మేట్ అయోమయ.
“హాయ్.. ఛాయా నువ్వెంటి ఇక్కడ?” ఆశ్చర్యంగా పలకరించింది అయోమయ.
“నేను ఒక కాన్ఫరెన్స్ కోసం ఇలా వచ్చా. మరి నువ్వు ?”అడిగింది ఛాయా.
“నేనూ ఓ కాన్ఫరెన్స్ కోసమే. మా అబ్బాయిని కాలిఫోర్నియాలో స్కూల్‌లో దిగబెట్టి ఇలా వస్తున్నా! ఇంతకీ ఏం కాన్ఫరెన్స్ కోసం” ఒకర్నొకరు ప్రశ్నించుకున్నారు. ఇద్దరూ ఏ ఐ కి సంబంధించిన కాన్ఫరెన్స్ కోసమే వచ్చారని తెలుసుకుని చర్చల్లో మునిగిపోయారు.
అందరూ ఎదురు చూస్తున్న ఏ ఐ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.
ఏ ఐ ని అభివృద్ధి చేయాలని, దాని ఉపయోగాన్ని కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి రంగాల్లోనే కాకుండా సంగీతం, సాహిత్యం ఇలా అన్ని రంగాలకు విస్తరించాలని కొందరు, దీని వాడకానికి పరిమితులుండాలని ఇంకొందరూ వాదిస్తూ ఉన్నారు.
చివరకు నచికేత్ అండ్ యోషినక టీమ్ వంతు రానే వచ్చింది. ఇద్దరూ తమ రిపోర్ట్‌తో స్టేజి ఎక్కి చెప్పడం ప్రారంభించారు.
“అందరికీ గుడ్ మార్నింగ్. మనందరం ఏ ఐ ని మన జీవితాల్లోకి ఆహ్వానించి 20 ఏళ్ళకి పైమాటే అయింది. 2024 ప్రాంతాల్లో ప్రారంభమైన ఏ ఐ ప్రభంజనం సుమారు 7 ఏళ్లలో పతాక స్థాయికి చేరింది. మొదట్లో కేవలం టెక్నాలజీ రంగం లోనే వున్న దీని వాడుక మెల్లిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి బదులు అండర్ గ్రాడ్యుయేట్ లోనే ప్రవేశించింది. మెల్లిగా అది స్కూల్ స్థాయిలో ప్రవేశ పెట్టబడింది. పిల్లలకు ఏ ఐ స్కిల్స్ అప్పట్నుంచే నేర్పించడం మొదలు పెట్టడంతో వారిలో క్రమంగా పెంపొందాల్సిన సృజనాత్మక నైపుణ్యాల బదులు కేవలం ఖచ్చితమైన సమాధానాలు రాబట్టడం కోసం ఏ ఐ ని విచక్షణారహితంగా వాడడం అలవాటుగా మారింది.
మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏ ఐ, తానిచ్చే సరైన సమాధానం లేదా సొల్యూషన్‌కి మూలం ఇప్పటిదాకా పోగైన సమాచారం మాత్రమే. ఇప్పటి దాకా మన మెదళ్ళు రకరకాల ఆలోచనల్ని చేసి మథించగా వచ్చిన ఎన్నో రకాల విషయాల్ని గ్రంథ రూపం లోనో , మాటల రూపం లోనో, దృశ్య రూపం లోనో నిక్షిప్తం చేస్తూ వచ్చాము. ఇలా తర తరాలుగా క్రోడీకరించబడ్డ సమాచారమే ఏ ఐ కి మూలం. ఇలాంటి సమాచారం నుండీ అత్యుత్తమమైన వాటిని మానవ స్పందనల్ని గ్రహించి మనకి అందించడమే ఏ ఐ చేస్తున్న పని. ఏ ఐ ఎప్పుడైతే ఊపందుకుందో అంటే సుమారు 2031 లో స్కూల్ స్థాయిలో ఏ ఐ ప్రవేశ పెట్టడం ఎప్పుడైతే మొదలైందో ఉన్నసమాచారాన్ని ఉపయోగించుకోవడం తప్ప కొత్తగా ఎలాంటి ఆలోచనల్ని, వ్యక్తీకరణల్ని చేర్చడం ఆగిపోతూ వచ్చింది. అప్పుడు స్కూల్ స్థాయిలో ఉన్న పిల్లలు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికి వచ్చారు. అంటే ఇప్పుడు వీరికి లభించే సమాచారం అప్డేట్ అవడం ఎప్పుడో ఆగిపోయింది. అలాగే వీళ్ళకి సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాలు కూడా క్రమంగా సన్నగిల్లుతూ వచ్చాయి. దీని పర్యవసానమే మాకు స్పష్టంగా తెలుస్తోంది.
అందుకే ఏ రంగంలో చూసినా కొత్త ఆవిష్కరణలు రావడం కాకుండా ఉన్నవాటినే మరింత మెరుగు పరుచుకోవడం పైనే దృష్టి సారించడం జరిగింది. అందుకే మా యూనివర్సిటీల్లో కూడా రీసెర్చ్ పేపర్స్ ఏవీ అప్రూవ్ అవడం లేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రంగాల్లో స్తబ్దత ఆవహించింది. అంటే బేసిక్ ఇంటెలిజెన్స్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మింగేసింది. అందుకే ఈ అంతర్జాతీయ వేదికపై మేం ఒక తీర్మానాన్ని చేస్తున్నాం. ఇకపై మన మంత్రం ఏ ఐ కాదు బి ఐ. అన్ని దేశాలు క్రమంగా ఏ ఐ వినియోగాన్ని తగ్గిస్తూ బి ఐ పై దృష్టి సారించాలి. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో ఏ ఐ ని నిషేధించాలి. అన్ని దేశాలూ ఇందుకు నిర్దుష్ట చట్టాలు చేసి అమలయ్యేలా చెయ్యాలి. లేకపోతే భవిష్యత్ తరాలు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.” అని ముగించారు.
సభలో ఒక్క సారి నిశ్శబ్దం ఆవహించింది. అక్కడున్న అందరిలో కొత్త ఆలోచన మొగ్గ తొడిగింది. బహుశా చాన్నాళ్ల తర్వాత అనొచ్చేమో. ఎందుకంటే ఏ ఐ మోజులో పడి ఇన్నాళ్లూ ఆలోచించడమే మానేసిన బుర్రల్లో మొలిచిన కొత్త ఆలోచన.. బి ఐ.
అయోమయకి తాను చేసిన తప్పు తెలిసొచ్చింది. తన కొడుకు సర్వజ్ఞని తనతో పాటు తీసుకెళ్లి ఒక సాధారణ స్కూల్‌లో చేర్చడానికి నిశ్చయించుకుంది.