తెలుగు వాకిట రంగవల్లి – రంగస్థలం

1
3

[box type=’note’ fontsize=’16’] “నాటకం అయినా, సాహిత్యం అయినా సమకాలీన జీవన విధానానికి, సమాజ స్థితిగతులకి దర్పణం… ఇదే నాటకంలో కూడా చూపించాల్సిన అవసరం ఉంది” అంటున్నారు అత్తలూరి విజయలక్ష్మి తమ రచన “తెలుగు వాకిట రంగవల్లి రంగస్థలం“లో. [/box]

[dropcap]తె[/dropcap]లుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ కళలు పరిడవిల్లుతాయి.

ప్రపంచం మొత్తం అన్ని మతాలు, అన్ని జాతుల వారికీ వివిధ ఆచారాలు ఉన్నట్టే, వివిధ రకాలైన కళలు, కళారూపాలు ఉన్నాయి. వారి, వారి కళలను కాపాడుకునే ప్రయత్నంలో అందరూ ఎంతో, కొంత కృషి చేస్తూనే ఉన్నారు.

అలాగే తెలుగు వారు కూడా. కళలను గౌరవించడం, ప్రేమించడమే కాక ఆసక్తి, అవకాశం ఉన్న వాళ్ళంతా వారి, వారి అభిరుచుల మేరకు సంగీతమో, సాహిత్యమో, నాట్యమో, చిత్రలేఖనమో ఇలా అనేక కళల్లో అభినివేశం, ప్రావీణ్యం సంపాదించుకోడమే కాక ఏ దేశంలో ఉన్నా ఆ కళలను మర్చిపోకుండా కాపాడుకుంటూ, విస్తరించుకుంటూ, ఇతర మతాల, జాతుల, దేశాల కళలను కూడా ప్రేమిస్తూ, కళకి ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు. కళాకారులను గౌరవిస్తున్నారు. అందుకే అమెరికాలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమం తరచూ జరుగుతోంది.

అలాగే డల్లాస్ లో కూడా ఎన్నో సాంస్కృతిక సంఘాలు ఏర్పాటు చేసుకుని తరచూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ కళాసేవ చేస్తున్నారు ప్రవాసీయులు. తెలుగు పండగలు పురస్కరించుకుని దసరా కి బతకమ్మ ఆటలు, దీపావళి ప్రత్యెక కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు, ఉగాది కవి సమ్మేళనాలు, శ్రీరామనవమి ఉత్సవాలు ఇలా అన్ని సందర్భాలను ఉపయోగించుకుంటూ తెలుగు సాహితీ, సంగీత, నాట్య ప్రాభవాన్ని దశదిశలా చాటుతున్నారు. తెలుగువారి ఆచారాలను, సంప్రదాయాలను మర్చిపోకుండా వీలైనంత వరకూ అనుసరిస్తున్నారు.

అయితే తెలుగు ముంగిట ముత్యాల ముగ్గు, తెలుగింటి ద్వారానికి మంగళ తోరణం అయిన నాటకాన్ని అప్పుడప్పుడు తప్ప అంతగా ఎవరూ ప్రదర్శించిన దాఖలాలు గత పదేళ్లుగా చేస్తున్న నా పర్యటనలో నాకు కనిపించలేదు.

నాటకాన్ని ప్రదర్శించడానికి ఆసక్తి ఉంటే చాలదు.. మంచి రచన, దర్శకత్వం చేయగల వ్యక్తులు, నటనపట్ల ఆసక్తి, అభినివేశం, అవగాహన ఉన్న కళాకారులు ఉండాలి, తగినంత సమయం ఉండాలి..

నాటకాన్ని చూసి ఆనందించడానికి రస హృదయం ఉండాలి. అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల్లో దేశాల్లో షేక్ స్పియర్ నాటకాలు ఎంతో ప్రసిద్ధి.. ఇప్పటికి బ్రాడ్వే థియేటర్ లలో ప్రతి శనాదివారాలు ప్రదర్శింపబడుతూ ఉంటాయి.. సినిమా థియేటర్ లు రెండు ఉంటే ఇరవై డ్రామా థియేటర్లు ఉంటాయని తెలుసా .. ప్రతి వారు టికెట్ కొనుక్కుని నాటకం చూస్తారు. ఉచితంగా నాటక ప్రదర్శనలు అంటూ ఉండవని ఆ నాటకాలను చూసి ఎందఱో నాటకాభిమానులు పారవశ్యం పొందుతూ ఉంటారని, మహారాష్ట్ర లో నిత్యం నాటకాలు ప్రదర్శించ బడుతూ ఉంటాయని, ప్రజలు వాటిని ఆదరిస్తూ ఉంటారని ఎంతమందికి తెలుసు!

ఒకప్పుడు నాటకమే కాలక్షేపం అయిన రోజుల్లో పౌరాణిక నాటకాలు విరివిగా ఆడేవాళ్ళు. మన తిరుపతి వెంకట కవులు రాసిన పాండవోద్యోగంతో పాటు, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మృచ్చకటికం లాంటి పద్యనాటకాలు ఎంతో అభిమానంతో చూసేవాళ్ళు ప్రజలు.

అలాగే కన్యాశుల్కం, వర విక్రయం, చింతామణి వంటి ఆధునిక నాటకాలు ఎంతో ప్రాచుర్యం పొంది ఆదరింపబడ్డాయి. ప్రస్తుతం నాటక రంగం పట్ల ఆకర్షణ, అభినివేశం ఉన్న కొందరు నాటకాభిమానులు తప్ప మిగతావారు ఎందుకు నాటకాలను చూడరు? ఎందుకంటే నాటకాన్ని ప్రేమేచేవారికి తప్ప మిగతావారికి నాటకం పట్ల చిన్నచూపు. ముఖ్యంగా యువతరం ఇంగ్లిష్ నాటకాల పట్ల చూపించే ఆసక్తి తెలుగు నాటకాల పట్ల చూపించడం లేదు. సినిమాల పట్ల చూపించే ఆదరణ నాటకానికి లేదు..

వెండితెర వెలుగు జిలుగులు నాటకంలో ఉండవు.. నాటకంలో జీవితం ఉంటుంది. ఆ జీవితం మన చుట్టూ ఉన్నది, మనకు తెలిసినది అయి ఉంటుంది.. ఆ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. పాత్రలు మనచుట్టూ పరిభ్రమిస్తాయి.. అవి మనలను ఊహాలోకంలోకి తీసుకుని వెళ్ళవు. నిలకడగా నిలబడి ఆలోచించమంటాయి .. ఇది జీవితం అని బల్ల గుద్ది చెప్తాయి. అది తట్టుకునే మనో ధైర్యం మనకి ఉండదు.. మనం కాల్పనిక సాహిత్యం చదువుతూ ఊహల్లో తేలిపోతూ ఉంటాము.

తెలుగులో ఎందఱో గొప్ప నాటక రచయితలూ, గొప్ప కళాకారులు, గొప్ప దర్శకులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అనేక సంస్థలు పరిషత్తులు నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నది. ఎందఱో రచయితలు, దర్శకులు, కళాకారులు ఈ పరిషత్తుల్లో పాల్గొంటూ బహుమతులు పొందుతున్నారు తద్వారా నాటకాన్ని సజీవంగా ఉంచుతున్నారు. కానీ ఇంకా మన తెలుగు నాటకాల్లో ఆధునిక మార్పులు చోటు చేసుకోలేదు. అమ్మ సెంటిమెంట్, భార్యాభర్తల గొడవలు, రాజకీయాలు వీటి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆధునిక భావజాలానికి చోటు లేదు. ఆధునిక సమాజ పోకడలు, స్థితిగతులు నాటకంలో ప్రతిఫలించడం లేదు.

నాటకం అయినా, సాహిత్యం అయినా సమకాలీన జీవన విధానానికి, సమాజ స్థితిగతులకి దర్పణం …ఇదే నాటకంలో కూడా చూపించాల్సిన అవసరం ఉంది. బహుమతులను దృష్టిలో పెట్టుకుని నాటకం రాసే ద్రుక్పధం మారాలి. తెలుగు వారికి మొదటినుంచి నాటకంలో మెలో డ్రామా పండించడం అలవాటు.. ఆ మెలో డ్రామా నేటి యువతరం అంతగా జీర్ణించుకోలేక పోవడం వలన తెలుగు నాటకానికి వారినుంచి ఆదరణ తక్కువ అయింది. అలాగే నాటకంలో నటించడాన్ని కూడా ఒక వృత్తిగా, కళ కోసం కాకుండా ఆదాయం కోసం అన్నట్టుగా భావించే వ్యాపార ద్రుక్పధం ఎక్కువ అవడం కూడా తెలుగు నాటకాల్లో నాణ్యత లోపించడానికి కారణం అయింది.

కానీ అమెరికాలో ముఖ్యంగా కొందరు ఔత్సాహికులు ఇటీవల కాలంలో చక్కటి కదాంశాలతో, ఆధునిక , సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చక్కటి నాటకాలు ప్రదర్శిస్తున్నారు. వాటిని అక్కడి రసజ్ఞులైన ప్రేక్షకులు టికెట్ కొనుక్కుని చూసి ఆనందిస్తున్నారు.

అలాంటి వాటిలో తెలుగు సినిమా చరిత్రలో మకుటాయమానం అయిన మిస్సమ్మ చిత్రాన్ని నాటకంగా ప్రదర్శించి విజయఢంకా మోగించారు. అంతర్జాతీయ నాటక ప్రదర్శనలో తెలుగు నాటకానికి స్థానం కల్పించారు. అలాగే అనగనగ రాజకుమారి అనే జానపద నాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు. ఇవి టికెట్ కొనుక్కుని ఆరు వందలమంది ప్రేక్షకులు చూసారంటే మామూలు విషయం కాదు. అలాగే ఇటీవల చిలకమర్తి వారి ప్రహసనాల్లో కొన్ని ముఖ్యంగా బధిర చతుష్టయం, శ్రీని ప్రభల రాసిన డోంట్ వర్రీ బి హాపీ అనే హాస్యనాటకం ప్రదర్శించి చక్కటి హాస్యం పండించారు.

“నాటకాంతం హి సాహిత్యం” అన్నారు పెద్దలు.. “కావ్యేషు నాటకం రమ్యం” అన్నారు. మరి ఇంత ఘన చరిత్ర ఉన్న తెలుగు నాటకానికి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందు, ముందు మంచి ఆదరణ లభిస్తుందని ఆశించవచ్చా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here