[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. ఆక్రందన
మద్యం రేటు
పెంచినా తగ్గించినా
ఆదాయం వరదే
అక్కడెక్కడో..
పుస్తెలు తెగిన రోదన!
~
2. మహా నటులు
గుండె బరువెక్కి
కనురెప్పలు బరువెక్కక
అగ్ని గోళాలైన కనుల ధాటికి
కనుల కొలనులు ఆవిరయ్యే
దుర్ఘటనల వెనుక
నటన..
నిత్య జీవితంలో
మహా నటుల మహా నటన!
~
3. వివేకం
నిప్పు దీపం
ఒకే గుణం
నీరు వరద
ఒకే రూపం
పరమార్ధమే వ్యత్యాసం
వ్యత్యాస ఎరుకే
వివేకం
~
4. మనీషి
గాయపడిన కోయిల
సొమ్మసిల్లి నిదురోతే
కట్టు కట్టిన మనిషి
నొప్పితో విల విల!