మత్తునుంచి బయటకు రావలసిన యువత

0
3

[box type=’note’ fontsize=’16’] “మొదట ఎంజాయ్‌మెంట్ అంటూ మొదలుపెట్టి తర్వాత అలవాటు పడిపోవడం దీనికి తొలి ప్రాతిపదిక. దీనికి బానిసవడం.. దీనికోసం ఏదైనా చేయడం అంతిమ లక్ష్యం” అంటూ మాదకద్రవ్యాల గురించి, వాటి ప్రభావాన్ని వివరిస్తున్నారు డా. సమ్మెట విజయమత్తునుంచి బయటకు రావలసిన యువత” లో. [/box]

[dropcap]ప్ర[/dropcap]పంచాన్నంతా కంటికి కనిపించకుండా యువతరం సత్తువను కబళించి వేస్తున్న ప్రధానమైన సమస్య మత్తుమందులు సేవించడం. మాదక ద్రవ్యాలు మానవ శరీరానికి హాని కలిగించే పదార్థాలు. వీటిని వాడుకలో ‘డ్రగ్స్’ అంటారు.

కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్‌డి, మారిజువానా, గంజాయి, నల్లమందు, చరస్, ఎండిఎంఏ వంటివి మత్తుని కలిగించే పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు సరదాగా మైకంలో పడేయడం నుంచి మొదలుపెట్టి చివరకు అవి లేకుండా బతకలేనంత స్థాయికి తీసుకువెళ్తాయి. ఒకసారి మత్తుమందుకు అలవాటుపడితే తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. డ్రగ్స్ తీసుకున్నవారు ఉద్రేకంగా ప్రవర్తిస్తారు. కోపం, పిచ్చిగా నవ్వడం, అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొకైన్, గంజాయి, ఎంబిఎంఏ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కోపం, గొడవపడటం, కాళ్లు చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గంజాయి, గుట్కా, వైటెనర్లు తీసుకోవడం వల్ల నోరు పాడవుతుంది. ఎల్‌సిడి, ఎండిఎమ్ఏలు చప్పరించినప్పుడు మత్తు ప్రారంభమై ఆరుగంటల వరకు మైకంలో ఉంచుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా 208 మిలియన్ల జనాభా డ్రగ్స్ బారీన పడ్డారు. కేవలం అమెరికాలో డ్రగ్స్ వాడకంపై జరిపిన సర్వేలో 19.9 మిలియన్ల అమెరికన్లు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసింది. 2008లో ప్రపంచ డ్రగ్ రిపోర్ట్ ప్రకారం సర్వసాధారణ మత్తు అయిన ఆల్కహాల్ సేవించి మోటారు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నవారు 3.9%, డ్రగ్స్ తీసుకుంటున్న వారి వయస్సు 15 సంవత్సరాలనుంచి మొదలైంది. వీరు తీసుకుంటున్న ప్రధానమైన మత్తుమందు మరిజువానా. 2007 లెక్కల ప్రకారం 45% హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవించారు. 19.7% ధూమపానం చేస్తున్నట్లు తెలుస్తుంది.

యూరప్‌లో 15 నుంచి 16 సంవత్సరాలవారు మారిజువానా వాడకం 10% నుంచి 40% వరకు ఉంది. చెక్ రిపబ్లిక్ 44%, ఐర్లాండ్ 39%, యుకె 38%, ఫ్రాన్స్ 38%, స్పెయిన్, యుకె, నార్వేలలో ఈ శాతం మరింత పెరగడం గమనించవలసిన విషయం.

ఫిలిప్పీన్స్‌లో డ్రగ్స్ సరఫరా చేసేవారిని అధ్యక్షుడు రెడ్రిగొ డ్యుట్టరె ఆదేశాల ప్రకారం 3800 మందిని పోలీసులు కాల్చి చంపారు. భారతదేశంలో దేశవ్యాప్తంగా డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని నిర్ణయించబడింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో గిరిజనులు బతుకుతెరువు కోసం గంజాయి పండిస్తున్నారు. ఆఫ్రికా నుంచి కొకైన్, బ్రౌన్ షుగర్ గ్రాము 2000, 2200, 2800, 3000 వరకు బేరం రెట్టబడుతుంది. బొంబాయిలో, ఢిల్లీలో రు. 500-600 కు దొరికే మత్తుమందులు హైదరాబాద్‌లో గ్రాముకు 2000-3000 వరకు పలుకుతుంది. అందువల్ల నైజీరియన్లు హైద్రాబాదును తమ డ్రగ్స్ మాఫియాకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. పైగా వీరి కార్యకలాపాలపై సరియైన నిఘా లేకపోవడంవలన ఈ వ్యాపారం క్రమంగా పుంజుకుని మరింత లాభదాయకంగా మారిపోయింది. దీనికి ప్రధాన లక్ష్యం కార్పోరేట్ ఉద్యోగులు, విలాసజీవితం గడిపే వారు, ధనవంతులు, రేవ్ పార్టీలు చేసుకునేవారు, ఫాంహౌస్‌కి వెళ్శేవారు.

మొదట ఎంజాయ్‌మెంట్ అంటూ మొదలుపెట్టి తర్వాత అలవాటు పడిపోవడం దీనికి తొలి ప్రాతిపదిక. దీనికి బానిసవడం.. దీనికోసం ఏదైనా చేయడం అంతిమ లక్ష్యం. ఫలితంగా లక్షలాది యువతీయువకులు తమ జీవితాలను తమకు తెలియకుండానే కోల్పోతున్నారు. మత్తుమందులకు బానిసలవుతున్నారు. ఈ మత్తుపదార్థాల వినియోగంలో విచక్షణను కోల్పోతున్నారు. తాము చేస్తుంది తప్పు అని తెలుసుకుని బయటపడాలనుకునే ఆలోచన వచ్చాక తిరిగి మామూలు దశకు చేరుకోలేక నలిగిపోతున్నారు. కొందరు ఈ దశలో కుటుంబ సభ్యులనుంచి దూరమవుతున్నారు. మరికొందరిని కుటుంబమే వెలి వేస్తుంది. కొందరు పట్టుదలగా వారిని తమదారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు వాటినుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరిని ఆ మత్తు క్రమంగా మృత్యువు తన ఒడిలోనికి తీసుకుంటుంది.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకొట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం 1985లో ఏర్పడింది. దీనిని ఎన్.డి.పి.ఎస్ చట్టం అంటారు. 1985 ఆగస్టు 23 న పార్లమెంటులో ప్రవేశపెట్టబడి ఉభయచట్ట సభల ఆమోదం పొంది నవంబరు 14న అమలులోకి వచ్చింది. 1988 లోను, 2001 లోను సవరణలు పొంది 2004లో మరింతగా సవరించబడింది. మత్తు పదార్థాలకు లోనైన వారికి తగిన చికిత్స, సంరక్షణ చర్యలు చేపట్టడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసే పునరావృత దోషానికి 30 సంవత్సరాల జైలు శిక్షను చిన్న పరిణామాలలో తీసుకుంటే 6 నెలలనుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్షను ఖరారు చేసింది.

2016 లో ఏర్పరచిన డ్రగ్ రిపోర్టులు డ్రగ్ మార్కెట్లో జరుగుతున్న కొత్తమార్పులు, ఆరోగ్య ప్రభావం తదితర విషయాలను పొందుపరుస్తూ డ్రగ్స్ వల్ల వచ్చే సమస్యలను చేపట్టవలసిన చర్యలను గురించి వివరణ ఇచ్చింది.

ఢిల్లీలో 20 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. దీనికి కారకుడైన నైజీరియన్ పెడ్లర్ నాలుగో అంతస్తునుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. మాదక ద్రవ్యాలపై నిఘా పెంచి గోవా, ముంబై, హైదరాబాదులలో ఘరానా స్మగ్లర్లను పట్టుకోవడం కోసం కాల్విన్ మస్కరెన్హాస్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేసారు. పీయూష్ అనే యువ ఇంజనీర్ డ్రగ్స్‌కి అలవాటుపడి తన తెలివితేటలతో మత్తుమందును తయారు చేసే దందాను వ్యాపారంగా మలుచుకుని నయగ్రా, గంజాయి, యాంటి డిప్రెషన్ నిద్రమాత్రలను కలిపి లోకల్ మందుగా రూపొందించి తక్కువధరకే అమ్ముతూ ఎక్సైజ్ నార్కోటిక్ టీం అధికారుల చేతికి చిక్కాడు. అదే విధంగా అనిరుధ్ అనే వ్యక్తి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుపడ్డాడు. ఇతను ZEBPAY ఆప్ ద్వారా డార్క్‌నెట్ సహాయంతో ఈ ప్రయత్నం కొనసాగించాడు. DARKNET లేదా DARKWEB ద్వారా బిట్ కాయిన్లను డిమాండ్ చేస్తూ డ్రగ్స్‌ను డెలివరీ చేస్తున్నారు. బిట్ కాయిన్ అనేది ఇంటర్నెట్‌లోని కరెన్సీ.

ఆయా దేశాల్లో, నగరాల్లో ఎక్సైజ్ శాఖలోని స్టేట్ టాస్క్‌ఫోర్సులు ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరా చేసే దందాలను ఛేదించి వాటిని సీజ్ చేస్తున్నారు. విస్తృతంగా చేస్తున్న తనిఖీలలో నమ్మశక్యం కాని ఎన్నో విషయాలు వెలికి వస్తున్నాయి. డ్రగ్స్‌కి అలవాటు పడుతున్న వారు పెద్ద పెద్ద వ్యాపార వేత్తల కుటుంబీకులు, సినిమా రంగంలోని వారు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. విద్యార్ధులు ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు అనే సమాచారం బయటకు రాగానే ప్రధానమైన విద్యాసంస్థలు ఉలిక్కిపడ్డాయి. కొన్ని సంస్థలు మా సంస్థలో అటువంటివి ఏమీ జరగడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాయి. మరికొందరు అప్రమత్తమై సత్వరమే ఆయా విద్యాసంస్థలలో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి తల్లితండ్రులను పిలిపించి కౌన్సలింగ్‌లు చేశారు.

ఈ సమస్య పూర్వాపరాలను గురించిన చర్చ, అభిప్రాయాల పరంపర కొనసాగింది. తెలిసో తెలియకో డ్రగ్స్‌కు అలవాటు పడడంలో తల్లితండ్రుల పాత్ర ఎక్కువ. పాశ్చాత్య సంస్కృతి ప్రభావాలలో తల్లితండ్రులు – పిల్లల మధ్య పరస్పర అవగాహన కొరవడడం ఒక కారణం అయితే పిల్లలలో విపరీతమైన ముందుచూపు పెరిగిపోయి కొత్తపద్ధతులు, కొత్త సంస్కృతికి దూసుకుపోతూ ఏది చేయాలో ఏది చేయకూడదో (టీనేజ్) తెలియని అయోమయ స్థితిలో మత్తుమందులకు బానిసవుతున్నారు. కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. చిన్నవయసులోనే వారు తమని తాము పెద్దవారుగా ఊహించుకుని సిగరెట్లు తాగటం, మద్యం సేవించడం, ఇదేదో ట్రై చేద్దాం అంటూ మత్తుమందులను రుచి చూడటం ఆ తర్వాత వాటిని అలవాట్లుగా మార్చుకుంటున్నారు.

పల్లెటూర్ల నుంచి చదువులపేరుతో నగర జీవనంలోకి అడుగుపెట్టి ఒక్కసారిగా నగర జీవనంలోని కొత్త హంగులకు ఆకర్షితులై తమ మూలాలను మరిచిపోయి మత్తుపదార్థాలను సేవిస్తున్నారు కొందరు. మరికొందరు కుటుంబంలో తల్లితండ్రులు సరిగ్గా పట్టించుకోక ఇచ్చిన పాకెట్ మనీని ఖర్చుపెట్టే విషయంలో సరైన అవగాహన లేక చుట్టూ చేరిన స్నేహితులకు ప్రభావితులై వారు చూపించిన అలవాట్లకు బానిసలవుతున్నారు. కొందరి కుటుంబాలలో ఆర్థిక సమస్యలు పరస్పర వాగ్వివాదాలు, మానసిక స్పర్థలు ఉండి గొడవలు పడుతున్న వాతావరణం ఉంటే దానిని తట్టుకోలేక ఎవరికీ చెప్పుకోలేక మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు.

కొందరు తమకుటుంబంలోనే తల్లితండ్రులకు ఆ అలవాట్లు ఉండటం పిల్లల ముందే తండ్రి, బంధువులు కలిసి మద్యం సేవించడం లేదా ఇతర మాదకద్రవ్యాలను వినియోగించడం చూసి మనమూ ఈ పని చేయవచ్చనే భరోసాతో ఆ దిశలో మత్తు మందులకు అలవాటు పడుతున్నారు.

సర్వసాధారణ విషయం కుటుంబంలో తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగస్థులు కావడం. పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించలేకపోవటం వీటివల్ల పిల్లలు మత్తుమందులకు అలవాటు పడుతున్నారు. పిల్లలతో చేరే స్నేహితులు ఎటువంటివారో తల్లితండ్రులు పట్టించుకోక పోవడం కూడా పిల్లలు మత్తుమందుకు అలవాటు పడటానికి కారణంగా మారుతుంది.

పిల్లలు తమ విద్యా సంస్థల బయట వాతావరణం ఎలా ఉంటుందో తల్లితండ్రులు కాని విద్యాసంస్థల యాజమాన్యాలు కాని పట్టించుకోనట్లయితే పిల్లలు మత్తుమందులకు అలవాటు పడే అవకాశం ఉంది .ముఖ్యంగా ఆయా సంస్థల బైట ఉన్న బడ్డీ కొట్లు, స్టోర్లూ… వారు ఏం విక్రయిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. కొత్త స్నేహితులెవరైనా వచ్చి చేరుతున్నారా అనే విషయం కూడా గమనించాలి.

ఆధునిక సమాజంలో ఫోన్ల వాడకం పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, వీడియో గేమ్స్ తదితర అంశాలపై విద్యార్థులకు మోజు ఎక్కువ. కొన్ని విద్యాసంస్థలు ఫోన్లను వాడటం నిషేధిస్తే కొందరు అనుమతినిస్తున్నారు. ఫోన్ ఉపయోగిస్తున్న విధానం ఎవరెవరితో ఫోన్‌లో సంభాషిస్తున్నారు, ఏం చేస్తున్నారనేది ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అదే విధంగా ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు పిల్లలకు ఎంతవరకు అవసరమో చూసుకోవాలి. కంప్యూటర్, లాప్‌టాప్‌లు ఉపయోగిస్తున్నప్పుడు వాళ్లు ఏ సైట్ లోకి వెళుతున్నారు, ఏ రకంగా వాటిని ఉపయోగిస్తున్నారు తెలుసుకుంటూ ఉండాలి . ఒక గదిలో కంప్యూటర్‌తో యువతను వదిలేస్తే యువత పక్కదారులు తొక్కే అవకాశం ఉంది. అందుకే వీలైతే మన పర్యవేక్షణకు వీలుగా వాళ్ళను గమనిస్తూ ఉండాలి. ఇలా కాపలా కాస్తూ ఎంతకని కనిపెట్టగలమన్నది సందేహమే. దీనికి సమాధానంగా కంప్యూటర్ వాడకంపై పూర్తి అవగాహన కలిగించి సక్రమంగా ఉపయోగించేలా చేయడం మంచిది.

ఏది ఏమైనప్పటికీ ప్రపంచమంతా ఒక ఊపు ఊపేస్తున్న డ్రగ్స్ దందాపై మరింత కఠినమైన నిఘాను పెంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని వెంటనే పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయాలి. ఈ మాఫియా మరింత పెరగకుండా అన్నిరకాలుగా తగిన చర్యలు అటు ప్రభుత్వాలు ఇటు ప్రజానీకం తీసుకోవాలి. యువత పక్కదారులు పట్టకుండా మత్తుమందులకు బానిసలుగా మారకుండా వారికి అందమైన భవిష్యత్తుని నిర్మించుకునే సహృదయ వాతావరణాన్ని మనం కల్పించాలి. కుటుంబాలలో ప్రేమ, అన్యోన్యత పెరగాలి. ఒకరికొకరు మనసు విప్పి తమ ఆలోచనలను పంచుకోవాలి. ఎక్కడ ఎవరు మత్తుమందులకు అలవాటు పడుతున్నా చూస్తూ ఊరుకోకుండా వెంటనే వారిని అందులోంచి తప్పించడం కోసం సంబంధిత వ్యక్తులకు సమాచారం అందించాలి. డ్రగ్స్ నివారణా చట్టం సక్రమంగా అమలుచేయాలి. యువత తమ భవిష్యత్తును ఏ ఆటంకాలు, అలవాట్లకు లోను కాకుండా నిర్మించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here