[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఇంటిపనిలో ఎంత లీనమైపోతున్నా, మీనాక్షికి మనసులో అసంతృప్తిగానే ఉండేది. మధ్యాహ్నం పూట కాస్త తీరుబడి దొరికినప్పుడు మనసు పూనా వెళ్ళిపోయి, తన చదువూ, డిగ్రీ గుర్తుకొచ్చి బాధపడేది. కానీ తనకి తాను నచ్చజెప్పుకుంటూ తాను పెద్దగా చదువుకోలేదన్న అభిప్రాయం కలిగిస్తూ, కాపురం చేస్తూంటుంది. పెళ్ళయి పదేళ్ళు గడుస్తాయి, చందూ అనే కొడుకు, వీణ అనే కూతురు పుడతారు. ఈలోపు ప్రభాకర్ తన అవసరాల కోసం కంప్యూటర్ కొని, ఇంటర్‍నెట్ కనెక్షన్ పెట్టించుకుంటాడు. అతను ఆఫీసుకు వెళ్ళాకా, కంప్యూటర్‍ని వాడుకుంటుంది మీనాక్షి. తనకి లాగిన్ ఐడి, పాస్‍వర్డ్ క్రియేట్ చేసుకుంటుంది. తన సైకాలజీ సబ్జెక్ట్ మీద ఒక వెబ్‍సైట్ తయారు చేసుకుంటుంది. అందులో మానసిక సమస్యలకు సంబంధించిన రచనలు ఆంగ్లంలో, తెలుగులో రాస్తూ, అవసరమైన వారికి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. ఆస్క్ మీన్స్, మీన్స్‌ని అడగండి – అని ప్రకటన ఇస్తుంది. దానికి గొప్ప స్పందన వస్తుంది. తర్వాతి రెండేళ్ళలో మీనాక్షి అత్తమామలు కాలం చేస్తారు. ఇంటి కోడలుగా మీనాక్షి నిలబడి, ఆడపడుచులకి పెద్ద దిక్కవుతుంది. పండగలకు పిలిచి చీరాసారె పెట్టి పంపుతూంటుంది. పిల్లలు పెద్ద క్లాసులకొచ్చేసరికి ప్రభాకర్ పెట్టుకున్న క్లినిక్ పుంజుకుంటుంది. పిల్లల చదువులకు ఇదివరకులా టైమ్ కేటాయించనవసరం లేకపోవడంతో మీనాక్షికి తీరిక దొరుకుతుంది. ప్రైవేటుగా ఎం.ఎ. చేస్తానంటే వద్దంటూ తేలిగ్గా తీసిపారేస్తాడు ప్రభాకర్. పక్క వీధి సావిత్రి గారు గుడిలో కలిసారాని, వాళ్ళ అబ్బాయి సుధీర్‍కి ఓ సమస్య వచ్చిందటూ ప్రభాకర్‌కి చెప్తుంది. ప్రభాకర్ చేత అతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తుంది, మీన్స్‌గా, ప్రభాకర్ ప్రశ్నలకు ఆన్‍లైన్‍లో సమాధానాలు చెప్తూ ఉంటుంది. ప్రభాకర్ మాత్రం – భార్యని గుర్తించక, లోకువగానే చూస్తుంటాడు. ఇక చదవండి.]
అధ్యాయం 11
[dropcap]ప్ర[/dropcap]భాకరం దృష్టిలో పడకుండా తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మీనాక్షిని ఉరమని పిడుగులాగా ఆడపడుచు రాధ కూతురిని తీసుకుని అకస్మాత్తుగా రావడం కంగారు పెట్టింది. మామూలుగానే ఇరువైపుల పెద్దవాళ్ళూ కుటుంబం, సాంప్రదాయం, జాతకాలూ అన్నీ చూసే చేసేరు రాధ పెళ్ళి.
రాధ మొగుడు పతంజలి బెజవాడలో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నాడు. పెళ్ళైన ఏ నాలుగైదు నెలలు సవ్యంగా ఉన్నాడో కానీ ఆ తర్వాత నుంచీ రాధ మొగుడు పతంజలి రాధని నానాబాధలూ పెట్టడం మొదలెట్టాడు. పతంజలి తల్లితండ్రులు మాకేం సంబంధం లేదూ, మీ అల్లుడూ మీరూ చూసుకోండని పట్టించుకోడం మానేసారు. అతను పెళ్ళైన కొత్తలో ఇంకా ఇంకా డబ్బు తెమ్మని రాధని పుట్టింటికి పంపేవాడు. ఇచ్చినన్నాళ్ళు ఇచ్చాక ఇంక వీళ్ళు డబ్బివ్వరని తెలిసి రాధని హింసించడం మొదలుపెట్టాడు. చాలా సాంప్రదాయమైన కుటుంబాల్లోలాగే చాలామంది రాధని “మొగుడన్నాక కొట్టకుండా, తిట్టకుండా ఉంటాడా! ఆడదన్నాక కొన్నాళ్ళు ఓర్చుకోవాలి. అతని చేతులు నెప్పెట్టేక అతనే ఊరుకుంటాడు..” అన్నారు. పాపం.. వెఱ్ఱిది. నమ్మింది. అలాగే తిట్లూ, దెబ్బలూ భరిస్తూ ఇన్నేళ్ళూ కాపరం చేసింది. కానీ నిన్న చావగొట్టి, ఆరేళ్ళ కూతురు సరోజతో సహా రాధని రాజమండ్రీ బండెక్కించేసేడు. మళ్ళీ రావక్కర్లేదని కరాఖండీగా చెప్పేసేడు.
ప్రభాకరం, మీనాక్షీ రాధని అక్కున చేర్చుకున్నారు. నాలుగురో జులు గడిచేయి. రాధ కాపురం విషయం యేం చెయ్యాలో ఇద్దరికీ తోచటం లేదు.
“ఇలా నిన్ను పంపించేస్తే మీ అత్తమామలు ఎలా ఊరుకున్నారమ్మా!” అనడిగేడు ప్రభాకరం రాధని.
“వాళ్ళు ఊర్లో ఉన్నారు కదా. వాళ్లకి తెలీదు. తెలిసినా కూడా వాళ్ళేం చెయ్యలేరు అన్నయ్యా. ఈయన వాళ్ళని కూడా చాలా అసహ్యంగా తిడతారు. అందుకే అసలు మా ఇంటికి కూడా రారు వాళ్ళెప్పుడూ. కట్టుకున్నదాన్ని నాకు తప్పదు కదా! ఇంకెక్కడికీ పోలేక అలా పడున్నాను. ఇంకిప్పుడు అక్కణ్ణించి కూడా పంపించేసేరు. ఇంక నాకు నువ్వే దిక్కన్నయ్యా..” అంటూ భోరు మంటున్న రాధని చూస్తుంటే గుండె నీరైపోయింది ప్రభాకరానికీ, మీనాక్షికీ.
“నీకేం పరవాలేదు రాధా, నేనున్నానుగా. అయినా అతనికి చెప్పేవాళ్ళు ఇంకెవరూ లేరా!” అనడిగేడు.
“ఎవరి మాటా వినరన్నయ్యా. అందుకే ఎవరూ చెప్పను కూడా చెప్పరు.”
“రోజూ ఇలాగే తిడుతూ కొడుతూంటాడా!” అడిగింది మీనాక్షి బాధపడుతూ.
రాధ మొహం కాస్త విడింది. “రోజూ లేదు వదినా.. రోజూ మామూలుగా ఏవో మాటలంటూనే వుంటారు. కానీ వారం పదిరోజులకోసారి మరీ ఎక్కువైపోతుంటాయి తిట్లూ, దెబ్బలూ కూడా.”
ఆ కాస్త సానుభూతికే మొహం విడిన రాధని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది మీనాక్షికి. ఇలా వారం పదిరోజులకోసారి ఎక్కువౌతోందంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకుంది. అదేమాట ప్రభాకరంతో అంది.
“కొంత కొంతమందికి నరాల బలహీనత, బ్రైయిన్‌లో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా అవుతూంటుందండీ. అతన్ని ఒకసారి మంచి న్యూరోసర్జన్‌కి చూపిస్తే మంచిదేమో.” అంది.
“నీకెలా తెల్సూ!” తీక్షణంగా అడిగేడు ప్రభాకరం. తడబడింది మీనాక్షి. తను ఇవన్నీ చదువుకుందని తెలిస్తే ముందు తన కాపరానికే ముప్పొచ్చేట్టుంది అనుకుంటూ,
“అహా.. ఏం లేదూ.. టివీలో ఎవరో డాక్టర్ సలహాల్లో చెప్తుంటే విన్నానంతే..” అంది తేలిగ్గా అన్నట్టు.
“నీ మొహం. ఇదేమీ శరీరానికి సంబంధించింది కాదు. ఆ పతంజలిని చిన్నప్పట్నించీ వాళ్ళమ్మా నాన్నా గారం చేసి పాడు చేసేరు. నేనన్నమాటే చెల్లాలీ అన్న అహంకారంతో పెరిగేడతను. అలాంటి వాళ్ళింతే. ఎదుటివాళ్ల గురించి ఆలోచించరు..” అన్నాడు. తన విషయం బైట పడలేదనుకుంటూ హమ్మయ్య అని నిట్టూర్చింది మీనాక్షి.
ఎవరి మాటా వినని అతన్ని దారిలో పెట్టడమెలాగో ప్రభాకరానికి అర్థం కాలేదు. అంతకన్న ముందు చెల్లెల్ని మళ్ళీ అక్కడికి పంపించాలి. ఎలా పంపించడం, ఎవరు తీసికెడతారు అని ఆలోచిస్తున్న ప్రభాకరాన్ని ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి.
“ఏంటీ, వచ్చిందగ్గర్నించీ ఆ దెబ్బల కొచ్చిన జ్వరంతో పడుంది. ఇవాళే లేచి రెండు మెతుకులు తింది. అప్పుడే మీరు తనని ఎలా పంపాలా అని చూస్తున్నారా!”
“అంటే.. పెళ్ళైనదాన్ని పుట్టింట్లో ఉంచుకుంటావా!”
“మళ్ళీ పంపితే చంపేస్తాడేమోనండీ!”
అతను కొట్టిన దెబ్బలకి రాధ శరీరం మీదయిన గాయాలు చూసి అంది మీనాక్షి.
“ఏవీ చంపడు. ఛస్తే జైలు కెడతాడని వాడికీ తెల్సు. ఓ నాల్రోజులకి వాడి కోపం తగ్గుతుది. అప్పుడు తీసికెళ్ళి దింపేసి వస్తాను.” అంటున్న ప్రభాకరాన్ని ఏమనుకోవాలో మీనాక్షికి అర్థం కాలేదు.
వారం రోజుల పాటు రాధనీ, కూతుర్నీ కంటికి రెప్పలా చూసుకుంటే అప్పటికి కాస్త ఊపిర్లొచ్చేయి వాళ్లకి. మర్నాడు ఇద్దరినీ తీసుకుని విజయవాడ వెళ్ళాడు ప్రభాకరం. ఆడపడుచుకి చీరె, సారె ఇచ్చి మొగుడి దగ్గరికి పంపింది మీనాక్షి. కానీ వీళ్ళు వెళ్ళేటప్పటికే పతంజలి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేడు. చుట్టుపక్కల వాళ్ళెవరితోనూ అతనికి స్నేహం లాంటిది లేదు. అందుకని అతనెక్కడికెళ్ళాడో వాళ్ళు చెప్పలేకపోయేరు. పతంజలి పనిచేసే కాలేజీకెళ్ళి కనుక్కున్నాడు. అప్పటికి మూణ్ణేళ్ళ క్రితమే ఆ కాలేజీ ఉద్యోగానికి రిజైన్ చేసేసేడని విని తెల్లబోయేడు ప్రభాకరం.
ఊళ్ళో ఉన్న పతంజలి తల్లితండ్రులకి ఫోన్ చేసి అక్కడి కొచ్చేడేమోనని అడిగేడు. కానీ ప్రభాకరం చెప్పిన విషయం విని వాళ్ళే ఆశ్చర్యపోయేరు. అసలు ఉద్యోగం వదిలిన సంగతీ, ఇల్లు ఖాళీ చేసిన సంగతీ ఏవీ కూడా వాళ్లకి తెలీవుట. ఇంకేం చెయ్యలేక చెల్లెల్నీ, మేనకోడల్నీ తీసుకుని వెనక్కి రాజమండ్రీ వచ్చేసేడతను. ఇంటి కొస్తూనే కుప్పకూలిపోయింది రాధ. ఇంక తన బతుకేంటని నెత్తి కొట్టుకుంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలుపెట్టింది. పాపం పక్కనే ఉన్న ఆరేళ్ళ పిల్ల సరోజ హడిలిపోయి బావురుమంది. హాల్లో జరుగుతున్న ఈ దృశ్యాన్ని చిత్రంగా చూస్తూ నిలబడ్డారు ప్రభాకరం పిల్లలిద్దరూ.
మీనాక్షి తేరుకుని ముందు పిల్లలిద్దరినీ బెడ్ రూమ్ లోకి పంపించేసి, మళ్ళీ పిలిచేదాకా రావద్దని చెప్పింది. సరోజని ఎత్తుకుని, లోపలికి తీసికెళ్ళి కళ్ళూ, మొహం చల్లటినీళ్ళతో కడిగి, మంచినీళ్ళు తాగించి, బెడ్రూమ్‌లో పిల్లల దగ్గర కూర్చోబెట్టి వచ్చింది.
చల్లటి మంచినీళ్ళు తెచ్చి, కుర్చీలో కూలబడిపోయిన ప్రభాకరానికి అందించి, కింద కూర్చున్న రాధ పక్కన కూర్చుని మంచినీళ్ళు తాగించింది.
“ఇంకేముంది వదినా.. నా బతుకు బండలైపోయింది. మేం దిక్కులేని పక్షులమైపోయేం. ఇంక నేనూ, అదీ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవల్సిందే..” అంటూ హాలు మధ్యలో కూర్చుని ఏడవసాగింది. మీనాక్షికి ఎందుకో రాధ అలా ఏడవడం బాగా అనిపించలేదు. అందుకే ధైర్యం చెప్తూ, “అదేంటి రాధా అలా అంటావ్. నీకు మేం లేమూ.. అతనెక్కడున్నాడో ఆరా తీద్దాం. అలా వదిలేస్తావేవిటీ..” అంది.
“ఎక్కడని వెతుకుతావ్.. ఆ వెధవ ఉద్యోగం కూడా రిజైన్ చేసి పోయేడు. వాళ్ల అమ్మానాన్నలక్కూడా చెప్పలేదు. వెధవాని వెధవ..” అంటూ తిట్లవర్షం కురిపించడం మొదలెట్టేడు ప్రభాకరం.
“పోలీస్ రిపోర్ట్ ఇద్దామండీ.. ఎక్కడున్నా పట్టుకుంటారు వాళ్ళు. కట్టుకున్న పెళ్ళానీ, పిల్లల్నీ వదిలేసి వెడితే ఎవరూరుకుంటారూ” అంది.
“ఇంత బతుకూ బతికి ఆఖరికి పోలీస్ స్టేషన్‌కి వెడితే మన పరువేం కానూ!” విసుక్కున్నాడు ప్రభాకర్.
“నీ పరువు మర్యాదలకు లోటేమీ రాదన్నయ్యా.., నేనూ, నా కూతురూ ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం..” నిష్ఠూరంగా జవాబిచ్చింది రాధ.
“అంత అభిమానమున్నదానివి మొగుణ్ణి దారిలో పెట్టుకోలేకపోయేవా. హూ..”
ఒకళ్ళ నొకళ్ళు తిట్టుకుంటూ, చావుని ఆహ్వానిస్తున్న ఆ అన్నాచెల్లెళ్ళిద్దరినీ చూస్తున్న మీనాక్షికి ఏం చెప్పాలో తెలీలేదు. “ముందు నువు లోపలకి రా..” అంటూ రాధని అక్కణ్ణించి లోపలికి తీసుకుపోయింది.
అధ్యాయం 12
ప్రభాకరానికి ఆవేశం తగ్గి కాస్త చల్లబడ్డాక ముందేం చేద్దామనే ఆలోచనలో పడ్డాడు. తననేమైనా సలహా అడుగుతాడేమో, వాళ్లకేం పరవాలేదూ, మనమున్నాం కదా అని చెప్దామనుకుంది మీనాక్షి. కానీ ప్రభాకర్ ఈ విషయం గురించి బైట బంధువులతో చర్చించేడు, స్నేహితులని సలహా లడిగేడు కానీ మీనాక్షితో ఈ విషయం గురించి అసలు ప్రస్తావించనే లేదు.
అందరూ భార్యని అలా హింసించినందుకు పతంజలి మీద గృహహింస కేసు పెట్టమన్నారు. కానీ అతనెక్కడున్నాడని కేసు పెడతారూ! అతనెక్కడున్నాడో కనుక్కోమని పోలీస్ రిపోర్ట్ ఇమ్మన్నారు. కొంతమంది రాధ జాతకం జ్యోతిష్కులకి చూపించి, శాంతు లేమైనా చెయ్యాలంటే చేయించమన్నారు. ఇంకొంతమంది ఫలానా బాబా ప్రశ్న చెపుతాడనీ, రాధ భర్త ఎక్కడున్నాడో అంజనం వేసి కనుక్కుంటాడనీ చెప్పేరు. ప్రభాకరం రాధని వెంటబెట్టుకుని ఆ బాబా దగ్గరికి వెళ్ళేడు. ఆయన అంజనం వేసి పతంజలి దేశాలు దాటిపోయేడనీ, ఒక పదివేలు హుండీలో వేస్తే వెనక్కి రప్పిస్తామనీ చెప్పేడు. ప్రభాకరం ఇంటికొచ్చి ఆ పదివేలూ ఎలా సమకూర్చాలా అని ఆలోచిస్తుంటే తనంతట తనే కల్పించుకుని మీనాక్షి అంది..
“అతను విదేశాలు ఎలా వెళ్ళగలడండీ. ఏదైనా ఉద్యోగాల కెళ్ళాలంటే పెద్ద పెద్ద డిగ్రీలుండాలి. అతను ఎమ్.ఎ. మాత్రమే చేసేడు. ఇంక వెడితే ఏ అరబ్ కంట్రీలకో లేబర్‌గా వెళ్ళాలి. అది మటుకు అంత తేలికైందేం కాదు కదా! ఇప్పుడు మనం ఈ పదివేలూ హుండీలో వేస్తే మటుకు అక్కణ్ణించి అతను వచ్చేస్తాడన్న నమ్మకం ఏంటీ!”
అసలే రాధ కాపరం అస్తవ్యస్తమైందన్న బాధతో ఎవరేం చెపితే అది చేస్తున్న ప్రభాకరం మీనాక్షి మాటలకి అంతెత్తు లేచాడు. “నమ్మాలంతే, తప్పదు.. నా తంటాలేవో నే పడతాను. అడదానివి. నీ కెందుకీ గొడవలు!” అన్నాడు.
మనసు చివుక్కుమంది మీనాక్షికి. మోహం చిన్నబుచ్చుకుని అక్కణ్ణించి లేచి వచ్చేసింది. భార్యని అంత మాట అన్నాక కానీ తనెంత తప్పు మాటన్నాడో తెలీలేదు ప్రభాకర్‌కి.
“ఛీ..” అంటూ తనని తను తిట్టుకుని, మీనాక్షిని పిలిచి సారీ చెపుదామనుకున్నాడు.
“మీనూ,” అంటూ అతను పిలిచిన పిలుపుకి వెనక్కి తిరిగిన మీనాక్షి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. కళ్ళు ఎర్రగా అయిపోయి పిచ్చివాడిలా రెండుచేతుల మధ్యా తల పట్టుకుని గట్టిగా అటూ ఇటూ తలని తిప్పేస్తున్న అతని దగ్గరికి ఒక్క ఉదుటున వెళ్ళి, “అయ్యో, ఏమైందండీ..” అంది.
పంటి బిగువున దాచుకున్న మగవాడి ననే అహం ఒక్కసారి పక్కకి తప్పుకుంది అతనికి.
“ఏం చెయ్యను మీనూ.. నాకంతా అయోమయంగా ఉంది. రాధ జీవితం ఏమైపోతుందో ననుకుంటుంటే కడుపులోంచి బాధ తన్నుకు వచ్చేస్తోంది. ఎవరేం చెపితే అది చేసెయ్యాలనిపిస్తోంది. అలా చెయ్యకపోతే పతంజలి రాడేమో నన్న భయం వేస్తోంది. ఆ బాబా చెప్పినట్టు చేస్తే పతంజలి వస్తాడు కదూ!” చిన్నపిల్లాడిలా అంటున్న అతని మాటలు విని నీరుగారిపోయింది మీనాక్షి. ఏమయిందితనికి. ఉద్యోగం చెయ్యడ మొకటే కదు, సైకాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తూ, ఎందరెందరి మనసులలో ఉన్న భయాలనీ పటాపంచలు చేసి మామూలు మనుషులను చేసిన భర్త అలా ఒక అమాయకపు మనిషిలా బాధపడుతుంటే చూడలేకపోయింది. ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఇలా చేస్తే పతంజలి వస్తాడూ. అలా చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుందీ అంటున్నాడు.
అతను చెప్పినవన్నీ ఓపిగ్గా వింది మీనాక్షి. లోపల బాధంతా బయటికి కక్కేసేక ప్రభాకరం మనసు తేలికపడింది. “అలాగే చేద్దాం. ఏదైనా కొంచెం టైమ్ పడుతుంది కదా! ముందు మీరు పడుకోండి. లేచేక ఆలోచిద్దాం.” అంటూ అతనికి నచ్చచెప్పి అప్పటికి ఆ ఉధృతం తగ్గించింది.
ప్రభాకరం ఇంత కష్టం వచ్చి మీద పడిందన్న బాధలోంచి కాస్త తొందరగానే బయటపడి, ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ రాధకి నచ్చచెప్పడం మటుకు మీనాక్షి వల్ల అస్సలు కావటంలేదు. చిన్నప్పటినుంచీ పెళ్ళీ, మొగుడూ, పిల్లలే ఆడదానికి కావల్సిన సంపదలు అన్న భావనతో పెరిగిందేమో ఇప్పుడా భర్త తనని పుట్టింటికి పంపించేసి, అతను ఆచూకీ తెలీకుండా వెళ్ళిపోవడం తట్టుకోలేకపోతోంది. ఇదంతా తన దౌర్భాగ్యం వల్లే అయిందనీ, తను దురదృష్టవంతురాలనీ, ప్రస్తుతం శని తనని పట్టుకు పీడిస్తోందనీ, వాటికి శాంతులూ, హోమాలూ చేస్తే తప్పితే తన భర్త తన దగ్గరకు రాడనీ పూర్తిగా నమ్ముతోందా ఇల్లాలు. అందుకే రోజూ చన్నీళ్ళ స్నానాలూ, ఉపవాసాలూ, గుడిలో ప్రదక్షిణాలూ అన్నీ ఎవరేం చెపితే అది చేస్తోంది. ఎవరో ఓ సాధువు రాధ క్రితం జన్మలో ఎవరో దంపతులను విడదీసిందనీ, అందుకే ఈ జన్మలో ఆవిడకీ ఆపద వచ్చిందనీ చెప్పి, ఓ పదిమంది దంపతులకి భోజనం పెట్టి, దక్షిణతో సహా తాంబూలాలిస్తే ఆ దోషం పోయి, ఆమె భర్త తిరిగొస్తాడని చెప్పేడు. దాంతో పదిమందికి దంపతులకి భోజనాలు పెడతానని కూర్చుంది. ఆమెనేమీ అనలేక అలాగే చేసింది మీనాక్షి. పతంజలి వచ్చినా రాకపోయినా ఓ పదిమంది వచ్చి భోజనం చేస్తే పుణ్యమే కదా అనుకుంది. ఇంకొన్నాళ్ళు పోయేక ఇంకేదో శాంతి చెయ్యాలంది. వారానికి నాలుగు రోజులు ఉపవాసాలు చేస్తోంది. పగలస్తమానం ఆ దేవుడి గదిలో కూర్చుని ఏవేవో స్తోత్రాలు పారాయణ చేస్తూనే ఉంది. ఏ సాధువు ఏం చెపితే అది చేస్తోంది. ఏ బాబా కనపడితే వాళ్ళకి మొక్కుతోంది. ఇవన్నీ చెస్తున్నా పతంజలి ఇంకా రాకపోతుంటే తన పూజల్లో ఏదైనా లోపముందేమో ననుకుంటూ ఇంకా నిష్ఠగా చెయ్యడం మొదలు పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే రాధ ఏమయిపోతుందోనని భయం వేసింది మీనాక్షికి.
అప్పటికే రాధ వచ్చి రెండు నెలలైంది. ఆ పతంజలి ఎక్కడున్నాడో పుఠం వేసినా దొరకలేదు. ఈ రెండు నెలల్నించీ ప్రభాకరానికి కూడా ఏ పనీ సవ్యంగా జరగడంలేదు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే అటు క్లినిక్‌లో వచ్చిన సమస్యలు అతనికి ఒక పట్టాన అర్థమవడం లేదు. ఎప్పట్లాగే మీన్స్‌ని అడుగుతుంటే రెండు నెలల్నించీ ఆ మీన్స్ ఏ జవాబూ ఇవ్వడంలేదు. ఆ కేసుల్నేం చెయ్యాలో తెలీటంలేదు. రేపు రండీ, ఎల్లుండి రండీ.. అంటూ వాళ్లకి వాయిదాల మీద వాయిదాలు వేసి తిప్పుతున్నాడు. అన్నింటికన్నముఖ్యంగా ప్రభాకరం మీన్స్‌ని అడిగే సమస్య తన చెల్లెలు రాధ సమస్య. అసలు పతంజలి సమస్య ఏమై ఉంటుందీ! దానిని ఎలా పరిష్కరించి, తన చెల్లెలి జీవితాన్ని నిలబెట్టాలీ అని రోజూ మీన్స్‌ని అడుగుతూనే ఉన్నాడు ప్రభాకరం.
(సశేషం)