[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘పుష్పాలం మనమందరం’ అనే కవితని అందిస్తున్నాము.]
[dropcap]ఒ[/dropcap]క క్షణంలో ఆశించావు
ఆనందించాను నేను.
మెచ్చావు.
ధరించావు శిరస్సుపై
నా ఈ జీవన కుసుమం
అంకితం అవుతోంది
ప్రభు సేవకా అని
సంతోషించాను.
నీ సాహచర్యంలో
లోకం తీరును చూచాను
లోకం లోని లోతులను
తెలిసికొన్నాను.
ఆనందంతో కూడిన
అహాంకారంతో గర్వించాను.
కొన్ని క్షణాల్లో ఏమౌతున్నానో
అర్థం కాలేదు.
ఏదో లోకాలకు జారిపోతున్నాను
ఒక చోట..
ఆగింది నా గమనం
ఏదో అగాధంలో ఉన్నాను.
కంటికి కానరాని కటిక చీకటిలో
నిలచిపోయాను.
నా ఆనందం శాశ్వతం కాలేదని
అర్థం లేని ఆవేదనతో
విలవిలలాడేను.
వెచ్చగా నిట్టూర్చాను.
నాలాంటి నిర్భాగ్యులను
నా చుట్టూ చూశాను.
కొంతకాలానికి ఆగింది నా గమనం
గగనం లోకి ఎగసిపోయాయి
ఈ కుసుమం రేకలు.
మిగిలినదల్లా
విలువ లేని తావి.
ఇంతలో వచ్చావు నీవు.
నీలో ఐక్యం చేసికోవాలని
నాలో అన్నీ నశించాయని
చెబుదామనుకొన్నాను.
మూసుకున్న నా నోటి వెంట
నాలోని భావాలు వెలికి రాలేదు.
నీవూ కదలలేదు.
అర్థం చేసుకొన్నాను
నీవూ నాలాగే ఉన్నానని.
నీ హృదయం మూగపోయింది.
కొంత కాలానికి,
ఎగసిపోయాయి నీలోని జీవాలు.
నీవూ నేనే కాదు
మన చుట్టూ అల్లాంటి వాళ్ళు
ఏమీ లేని వాళ్ళు
ఎందరో ఉన్నారు.
అప్పుడు అర్థం అయ్యింది నాకు
ఈ విశ్వాంబుధిలో
ప్రతి జీవీ ఒక నీటి బుడగ.
దాని అంతం తెలియదు మనకు
విశాల వృక్షానికి పుష్పాలం
ఏ క్షణంలోనో రాలిపోతాయి
ఈ జీవన కుసుమాలు.
ఫలాలు కేవలం
మన స్మృతులు మాత్రమే
ఇవి మన జీవన పరిమాణాలు