[శ్రీమతి వి. నాగజ్యోతి రచించిన ‘తోలుబొమ్మలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]త[/dropcap]ల్లి తండ్రుల కొట్టుమిట్టాట
ప్రతీ నెల మొదటి వారంతో
మొదలవుతుంది
అన్నిటికీ ఆచి తూచి
బేరసారాలతో నెల గడుస్తుంది
తమ పిల్లలకి తెలియకూడదని
గుట్టుగా దాచినా
వారి చిన్న చిన్న కోర్కెలే
గొంతెమ్మ కోర్కెలనిపిస్తూ
మనసుని బాధిస్తాయి
అడపా దడపా వాటిని తీరుస్తూ
అప్పుల భారంతో కృంగిపోతూ
సంతానం అందించిన ఉద్యోగ వార్తతో
తెరిపిన పడ్డామని తలపిస్తారు
ఆనందంతో ఉప్పొంగిపోతారు
బిడ్డల జలసాలను ఆపలేని
పిచ్చి తల్లి తండ్రులు
ప్రేమ పాశంలో బంధీలై
పింఛన్లను సైతం అర్పిస్తూ
మళ్ళీ పాత లెక్కల జీవిత నావలో
పయనిస్తూనే వుంటారు
మధ్యతరగతి జాఢ్యం
నరనరాల్లో ఇముడ్చుకుని
బిడ్డల వ్యర్థ ఖర్చులని చూసి
వారి భవిష్యత్తు తలుచుని
వ్యథతో హితోపదేశం చేసి
యువరక్త దుడుకు స్వభావంతో
వారి చివాట్లకు నోటికి తాళం వేస్తారు
బతికున్నంత కాలం మానసిక క్షోభ
అనుభవిస్తూనే వుంటారు
కాలం చెందిన తల్లి తండ్రుల మాటలు
చేతులు కాలిన తరువాత
తలుచుకుంటారు పిల్లలు
యుగాలు మారినా తరాలు మారినా
ఎన్ని కథలు సినిమాలు చూసినా
కాలం చేతిలో తోలుబొమ్మలే వీరంతా.