తెలుగులో కైఫియతులపై తొలి పరిశోధనా గ్రంథం

4
4

[‘కైఫియతులు-చారిత్రక, పౌరాణికాంశాలు’ అనే తన పరిశోధనా గ్రంథాన్ని పరిచయం చేస్తున్నారు డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు.]

[dropcap]ర[/dropcap]చయిత్రిగా నా పేరు వాణీచలపతిరావు అయితే నా అధికారిక నామం శివరాజు వాణీకుమారి. ముందు ఈ విషయం చెప్పి ఆ తర్వాత నా పరిశోధనాంశం పరిచయం లోకి వెళ్ళటం ఉచితంగా ఉంటుందని అనిపించి ప్రారంభం ఇలా చేస్తున్నాను. ఎమ్.ఏ. తెలుగు, అయ్యాక ఎమ్.ఫిల్ కోసం టాపిక్ సెలక్షన్ విషయంలో మా ప్రొఫెసర్స్‌ని సలహా అడిగితే ఆచార్య కె. గోపాలకృష్ణారావు గారు “కైఫియతుల మీద చెయ్యమ్మా – ఇంతవరకూ దాని మీద ఎవ్వరూ చేయలేదు. నువ్వే మొట్టమొదటి పరిశోధకురాలివి అవుతావు” అన్నారు. అప్పుడు అసలు నాకు కైపియతులు అంటే ఏమిటో తెలియక పోయినా, చాలా బ్రీఫ్‌ గానే ఎమ్.ఏ. లో దాని గురించి తెలుసుకున్నా, గురువుగారి మీది గౌరవంతో సరేనన్నాను. ఎమ్.ఫిల్.లో అదే రిజిస్టర్ అయింది. గైడ్ కూడా వారే. ఎమ్.ఫిల్.లో చాలా చాలా కష్టపడి రిసెర్చి చేసినా – మళ్లీ పిహెచ్‍డిలో కూడా ఆ ప్రొఫెసర్ గారి ఆదేశంతో మళ్లీ అదే టాపిక్ తీసుకున్నాను. ఈసారి నా గైడ్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారు. ‘కైఫియతులు – పరిచయం’, ‘కైఫియతులు-చారిత్రక పౌరాణికాంశాలు’ – ఇవి నా పరిశోధనాంశాలు. ఈ పరిచయ వాక్యాల తర్వాత ఇప్పుడు నేను అసలు విషయంలోకి ప్రవేశిస్తాను.

కైఫియత్ అనే పదం ఉర్దూభాషకు సంబంధించింది. ఇద్దరు వ్యక్తులు కలిస్తే “క్యా కైఫియత్ హై” అని పలకరించుకుంటారు. అంటే ‘ఏంటి సమాచారం?’ అని అడగటం అన్నమాట. కానీ బ్రిటిష్ వాళ్ళ మన దేశంలోకి ప్రవేశించి ఈస్టిండియా కంపెనీ నుంచి అధికారులు వచ్చి పరిపాలన ప్రారంభించాక ఈ కైఫియత్ అనే పదం గ్రామచరిత్రలు, స్థలచరిత్రలు, village local records అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. అంటే అర్థం – ఒక గ్రామం లేక ఒక స్థలం లేక ఒక పుణ్యక్షేత్రం ఉన్నప్పుడు ఆ స్థలానికి ఆ పేరు ఎందుకు వచ్చింది – ఆ ఊరికి ఆ పేరు పెట్టడం వెనుక ఉన్న మతలబ్ ఏంటి – ఆ గ్రామంలో ఉన్న గుళ్లు గోపురాలు, చెరువులు, చారిత్రక సంబంధి కోటలు, బురుజులు, కట్టడాలు ఉంటే వాటి విశేషాలు, పౌరాణిక కథలు ఏమయినా ఉంటే అవేంటి! ఇలాంటివన్నీ – గ్రామ కైఫియతులు అని పిలవబడ్డాయి.

ఈ విషయం అలా ఉంచితే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి సర్వేయర్ ఇంజనీర్‌గా వచ్చిన కల్నల్ కాలన్ మెకంజీ అనే సాట్లండ్ వాసి ఉద్యోగరీత్యా తెలుగు గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి స్థల చరిత్రలకు ఆకర్షితుడై ఎన్నో గ్రామచరిత్రలను సేకరించి భద్రపరిచాడు. కనుక ఇవి మెకంజీ కైఫీయతులు పేర ప్రసిద్ధి చెందాయి. బ్రౌన్ తర్వాత మళ్లీ అంతగా తెలుగు భాషాసాహిత్య పునరుద్దరణ చేసిన విదేశీయుడు మెకంజీనే. ముఖ్యంగా కైఫీయతుల సేకరణ విషయంలో, గ్రామకరణాలకు జీతాలిచ్చి ఆ గ్రామ వివరాలను విడతలు విడతలుగా పంపేలా ఏర్పాటు చేసాడు. తాటాకుకు కవిలె అని పేరు. కరణాలు తాటాకుల మీద రాసి ఆ ఊరి సమాచారాన్ని పంపేవారు. కనుక వీటిని ‘కవిలెలు’ అని పిలిచేవారు. కవిలెలే కైఫీయతులు అయ్యాయి. అలా 40 వేల చదరపు మైళ్ళు సర్వే చేసి 2 వేల 70 గ్రామ, స్థల చరిత్రల్ని రాయించాడు మెకంజీ. ఇందులో 1050 తెలుగు రాతప్రతులు. దీని కోసం కావలి సోదరులుగా పిలవబడే కావలి బొర్రయ్య, కావలి లక్ష్మయ్యలు తెలుగు భాష రాని మెకంజీకి తెలుగు నేర్పి చాలా సహాయపడ్డారు. మద్రాసు రాష్ట్రం, నిజాం సరిహద్దు ప్రాంతాలు నుంచి బండ్ల కొద్ది వ్రాతప్రతులు మెకంజీ దగ్గరకు వచ్చేవి. వీటిని దినవహి, రిపోర్టు, స్థానిక సమాచారం అని కూడా అన్నారు. వీటి కోసం మెకంజీ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెలుగు పరిశోధనకు ఆ విధంగా పునాది వేసాడు. ఇతర పరిశోధనా గ్రంథాలకు ఈ కైఫియతులేమీ తీసిపోవు – ఎన్నో పరిశోధనలు చేయటానికి సరిపడినంత ముడిసరుకు, విషయవిస్తృతి ఈ కైఫీయతులలో ఉన్నాయి అని ప్రశంసించారు విశ్లేషకులు, పండితులు. అన్నట్టుగానే నా తర్వాత ఇంకా చాలా మంది కైఫియతులలోని భాష, సామాజిక, పౌరాణికాంశాలు, చరిత్ర వంటి వివిధ కోణాలలో పరిశోధించి థీసిస్ సబ్మిట్ చేసారు. మిగతా పరిశోధనల కన్నా కైఫియతుల మీద చేసే పరిశోధన చాలా కష్టతరమైంది అని నేను ప్రారంభంలో ఎందుకు అన్నానంటే ఒక కావ్యం మీద లేక ఒక కవి మీద చేసే పరిశోధన ఆ కావ్యానికి, ఆ కవికి మాత్రమే పరిమితమై తేలికగా ఉండటమే గాక సమయం కూడా ఎక్కువ పట్టదు, కనుక పరిశోధకుని దృష్టి కూడా సబ్జక్ట్ మీద కేంద్రీకృతమై ఉంటే సరిపోతుంది. కానీ కైఫీయతుల పరిశోధన అంటే అలా కాదు. అవన్నీ వ్రాతప్రతులు, కొన్ని వ్రాతలు గొలుసుకట్టుతో, గజిబిజి చేతివ్రాతలో వుండి అర్థం చేసుకోవటం మాట అటుంచి, అసలు చదవటమే కష్టతరంగా ఉంటుంది. అప్పుడు సాహిత్య అకాడమీ వారు 60 సంపుటాలుగా వాటిని బైండింగ్ చేయించి రవీంద్ర భారతి పక్కన వున్న కళాభవన్‌లో భద్రపరిచారు. నేను పి.హెచ్‌డి చేసే నాటికి అవి యూనివర్శిటీ కాంపస్ దగ్గర వున్న తెలుగు అకాడమీ భవంతికి తరలింపబడ్డాయి. స్టేట్ ఆర్చీవ్స్‌లో మైక్రోఫిల్మ్ రోల్స్ 60 వున్నాయని అన్నారు గానీ అక్కడికి వెళ్ళి వాటిని చూసిన నాకు ‘వీటిని చూస్తూ పరిశోధన చేయటం అసాధ్యం’ అని అనిపించి నేను వ్రాతప్రతుల మీదే ఆధారపడ్డాను.

కైఫియతులు అదొక మహా సముద్రం. అందులో పడితే మునగటమేగానీ తేలటం అంటూ వుండదు. అంతేకాదు – కైఫియతులు విజ్ఞాన సర్వస్వాలు. అందులో లేని అంశం లేదు – స్పృశించని విషయం లేదు. గ్రామనామాలు, గ్రామంలోని చెరువులు, గుళ్ళు గోపురాలు, ప్రజల ఆచారాలు, అలవాట్లు, మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, జీవనవిధానం; వీటితో పాటు స్థల చరిత్రలు, ఆ క్షేత్రపురాణం, అక్కడి తీర్థ మాహాత్మ్యం, ఆ స్థలమహత్యం ఇలా ఎన్నో ఎన్నెన్నో కథలు, జరిగిన సంఘటనలు, ఘటనలు గురించి విస్తారంగా తెలియచేయబడింది – కైఫియతులలో. కథలు గాథలూ కాక రాజుల వంశ చరిత్రకు సంబంధించిన విషయాలు కూడా ఎన్నో చెప్పబడ్డాయి. రాజకీయ, సాంఘిక చరిత్ర రాయదలుచుకున్న వాళ్ళకు కైఫియతులు మంచి ఆధారంగా పనికి వస్తాయి.

కైఫియతులలో కనిపించే ఊరి పేర్లకు సంబంధించిన విశేషాంశాలు ఎంత తమాషాగా ఉంటాయో తెలుసుకోవటానికి మీకు నేను రెండు మూడు ఉదాహరణలను ఇస్తాను.

ఒక ఊళ్లో దొండపాదులు ఎక్కువగా ఉండేవి గనుక ఆ ఊరికి దొండపాడు అని పేరు వచ్చింది. సుంకయ అనే గొల్ల కులస్థుడు, ఒక పల్లె చుట్టూ బురుజు కట్టించి, బావి తవ్వించాడు గనుక ఆ ఊరిపేరు సుంకయపల్లి అయింది. ఒక వ్యక్తి శ్లేష్మ రోగంతో బాధపడుతూ ఎప్పుడూ దగ్గుతూ ఉండేవాడు గనుక ఆ ఊరు దగ్గుబాడు అయింది. ఒక పల్లెలోని ప్రజలు ఎప్పుడో మద్యం మత్తులో తూగుతూ వుండేవాళ్ళు గనుక ఆ ఊరికి తూళ్లూరు అని పేరు వచ్చింది. ఒక క్షురకునికి ఇనాంగా ఇచ్చిన ఊరు గొరిగపూడి అయింది. సీతాదేవి ముట్టు అయిన స్థలం ముట్నూరు. గుంటూరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈ స్థలంలో ఇంతకు ముందు పెద్దరాయి వుంటే దాన్ని తొలగించి ఆ ఊరు కట్టారు గనుక గుండుటూరు, గుంటూరు అయింది. గ్రామ కైఫియతులలో వచ్చే కథలలో ఒకటి రెండు ఉదాహరణకి – కంకణాలపల్లె కైఫియత్‌లో పాము పగబట్టడం అనే కథ, బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడం అనే కథ ఉన్నాయి. పేరంటాలపాడు కథలో స్త్రీలు చనిపోయి పేరంటాలు అయిన కథ ఉంది. ఇంకా కొన్ని స్థానిక కథలలో సతీసహగమనం, గ్రామదేవతలు, బోనాలు, వేశ్యావృత్తి, అంటరానితనం, దేవుళ్లు కలలో కనిపించి గుళ్లు కట్టించమని అడగటం, పూనకాలు రావడం, దయ్యాలు పట్టడం, దేవదాసి వ్యవస్థ, నరబలి, ఆత్మబలి, నిధినిక్షేపాలు కనుగొనడం వంటి కథలు వున్నాయి.

ఇలా కథల పుట్టలు కైఫియతులు. ఇలా మూఢనమ్మకాలు, మూఢాచారాల గురించే కాక ఎన్నో వైజ్ఞానిక విషయాలు కూడా కైఫియతులలో ఉన్నాయి. వేమవరం కైఫీయతులో దేశవాళి కాగితం తయారీ విషయాలు ఉన్నాయి.

బందరు రేవులో జరిగే ఎగుమతి దిగుమతుల గురించి ఈ కైఫియతులో విస్తారంగా వుంది. ట్రాన్స్‌జెండర్ పేరుతో ఇప్పుడు జరుగుతున్న శస్త్రచికిత్సలు ఆ రోజుల్లోనే ఋషుల తపశ్శక్తితో సాధ్యమైనట్టు కైఫియత్‌లో వుంది. గుళ్ళపల్లి కైఫియత్‌లో ఒక ధన్వంతరి ఉపాసకులు పాము కంఠంలో ఇరుక్కున కప్ప శల్యమును శస్త్రముల చేత ఛేదించి బయటికి తీసివేసినట్టుగా చెప్పబడింది. పరకాయ విద్య గురించి విద్యారణ్యుల కైఫియత్‌లో చెప్పబడింది. శిలల గురించి, గనుల గురించి కొన్ని కైఫియతులలో విశేష సమాచారం ఇవ్వబడింది. అంటే భూగర్భ, అంతరిక్ష, వైద్య, నిర్మాణ శాస్త్రాలనన్నింటినీ కైఫియతులు స్పృశించాయి అని అర్థం. అంతేకాదు – రాజుల చరిత్రలో చోళ, పల్లవ, చాళుక్య, కాకతీయ, మొగలాయిల వంశం గురించి, వారి పోరాటాల గురించి, పరిపాలనా పద్ధతుల గురించిన ఎన్నో వివరాలు కైఫియతులలో వున్నాయి. చరిత్ర పరిశోధకులకు శాసనాలు, కావ్యావతారికలూ ఎంతగా ఉపయోగపడతాయో కైఫియతులు కూడా అంతగా ఉపయోగపడతాయి అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీ లేదు. కాకుంటే శాసనాలు చదవటానికి ఎంత కష్టపడాలో ఇవి చదవటానికి అంత కష్టపడాలన్నది నా స్వానుభవంతో చెబుతున్న మాటలు. రాజుల చరిత్రలాగ కవుల చరిత్రలు, వారి రచనల వివరాలు కైఫియతులలో ఇవ్వబడ్డాయి.

ఇక కైఫీయతులలో రాయబడిన భాష ఆయా ప్రాంతాలకు సంబంధించినది. కొన్ని పరవాలేదని అనిపించేలా వున్నా కొన్నింటిలో పదప్రయోగాలలో కానీ వాక్యనిర్మాణంలో గానీ శిధిల భాషే కనిపిస్తుంది. పెద్దగా అక్షరజ్ఞానం లేని వాళ్ళచే కవిలెలు రాయించబడటం, విషయానికి తప్ప భాషకు వ్యాకరణానికి అంత ప్రాముఖ్యం ఇవ్వకపోవటం దీనికి కారణం. గుమస్తాలు, గ్రామ కరణాలు, అగ్రహారికులు వంటివారు ఎవరు బడితే వారు కైఫియతులను రాసి మెకంజీకి పంపించారు. నిడివి విషయంలోనూ, అంతే. ఒక గ్రామ కైపియతు పేజీలకు పేజీలు రాయబడితే మరికొన్ని సగం పేజీ, ఒక పేజీలో రాయబడ్డాయి. నిడివి ఎంతయినా విషయ విస్తరణ మాత్రం అపారం. భూమి కొలతలు, పన్నులు, ఖనిజ సంపద, గ్రామవృత్తులు, కులాలు, నాణాల లెక్క, శిక్షలు, ప్రాయశ్చిత్తాలు, దేవుళ్లు వెలవటం, గుళ్ళు గోపురాలు కట్టించడం, వ్యాపార సంబంధి విషయాలలు, ఉప్పు దిగుమతి గురించి, బట్టలు నేసే సాలెకులం వారు బట్టలకు రంగులు సహజపద్దతిలో ఎలా అద్దేది.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు విషయాలు వున్నాయి, ఇందులో కొన్ని మూఢ నమ్మకాలు, కల్పితాలు అంటూ కొందరు విమర్శకులు కొట్టి పడేసినా దాని వెనుక వున్న కారణాలనూ పరిశోధించటం ఆసక్తిని కలిగించే విషయం. ఏది ఏమైనా అదొక సంస్కృతి, గ్రామ సంస్కృతి. భారతదేశ సంస్కృతి మూలాలు ఆది నుంచి వచ్చినవే గనుక కైఫీయతులకు గుర్తింపు, గౌరవం లభించి తీరాల్సిందే. నేను మాత్రం ఇంత ప్రాముఖ్యం గలిగిన, కఠినమైన అంశాన్ని తీసుకొని ‘కైఫియతుల మీద వచ్చిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథం’ అని ఆచార్యుల చేత, వివిధ యూనివర్సిటీల తెలుగు పండితుల చేత ప్రశంసలు పొందినందుకు గర్విస్తూ వుంటాను. కష్టపడినా మంచి ఫలితం లభించింది అన్న తృప్తి నాకు ఇప్పటికీ వుంది. ఈ పరిశోధనను పుస్తకరూపంలో నా స్వంత ఖర్చులతో నేను ముద్రించుకుంటే దానికి చక్కటి బొమ్మ వేసి ముఖచిత్రాలంకరణ చేసినవారు ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు.

ఆవిష్కరణ రవీంద్రభారతిలో అప్పటి విద్యాశాఖామంత్రి శ్రీ పి.వి. రంగారావుగారి చేతుల మీదుగా జరిగింది. ఇంతటి మహా యజ్ఞాన్ని ఈ రోజు సంచిక వెబ్ పత్రికలో share చేసుకోవటం అనందంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here