[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
షష్ఠ్యంతములు:
26.
కం.
హరికి నరణ్య విహారికి
సురవర సంసేతునకు శోభితునకు, ఖే
చరపతి వాహన చరునకు
సురుచిర తేజునకు శాంత సుందరునకునున్
27.
కం.
పాపపు సంద్రపు బడవకు
దీపితమగు శంఖ చక్ర దివ్య కరునకున్
ఆపద బాపెడు గురునకు
స్థాపిత సద్భక్తి హృదయ సామ్రాజ్యునకున్
28.
కం.
యోగీంద్ర శరణ చరణున
కాగామి భయాది దుఃఖ ఘాతక విధికిన్
ఆగమ నుతునకు శౌరికి
జగములు కాపాడు పతికి జ్వాలాద్యుతికిన్
29.
శ్రీమదహోబిల నిలయున
కు, మహిత సింహాద్రివాస కోమలునకు, శ్రీ
ధామము యాదగిరీశున
కమితానఘ వేదశైల కరిపాలునుకున్
30.
కం.
హుతవహ నయనునకును, కో
పిత నిర్జిత రాక్షసారి, భీకరునకు, శ్రీ
సతి ప్రాణవల్లభునకును
అతులిత నిజ భక్త పాలనా దక్షునకున్
31.
కం.
ఘన వజ్రదంష్ట్రునకు, భా
వనమాత్ర కృపా కటాక్ష వరదునకును, జీ
వన సఫలకారి ప్రభునకు
దానవపతి హేమ కశిపు దమనోజ్వలుకున్
వినయ నివేదనము
32.
చం.
కృతిపతి నారసింహుడు నకారణ స్వచ్ఛముదంబు నిచ్చు జీ
వితగతి, కావ్యమో? యతని విస్తృత దివ్యమహత్తు, నేనికన్
మతిదలపంగనేల? నిజమాంద్యము? యాతడె వ్రాయజేయునీ
సతత మహాప్రవాహయుత శాశ్వత భవ్య చరిత్ర తోడుగన్
33.
తే.గీ.
దిగువ మధ్యమ తరగతి, తెగువ లేదు.
మనగ సేద్యంబె వృత్తిగా మలచుకొనుచు
చదువుకొనుటకు వీలగు స్థాయి లేక
స్వీయ కృషి విద్య నేర్చితి స్వేదఫలము.
34.
చం.
ఆశలు తీరలేదపుడు అట్టి ననున్ వరనారసింహుడే
కౌశలమిచ్చి, పైచదువు గ్రక్కున జొప్పడ చేసి, నన్నిటుల్
రాశిని జేసెనున్నతికి రక్షిత సర్వవిధుండ నైతినా
దాశరథీ కృపాకలిత ధన్యసుజీవిత సార్థకుండనై.
35.
తే.గీ.
తండ్రి దయ తోడ చెప్పిన తగిన చదువు
గురువు లిచ్చిన జ్ఞానంబు తిరముగాగ
కొంచెమైనను జంకక కొలది యెఱిగి
నిత్య సాహిత్య సేవలో మేలుగంటి
36.
ఉ.
పలికిరి ఎర్రనార్యుడును బమ్మెర పోతన, నారసింహ – శ్రీ
విలసిత వైభవంబునటు, భీకర వ్యాఘ్రము మేని పైన స
త్కలితము లైన చారల విధానము చూసిన నక్క తాను, చా
పలమున వాతలన్ తనువు పట్టిన రీతి దురాశ చెందితిన్
37.
కం.
భక్తియె నాకది మూలము
భక్తియె నా భాష, వివిధ భావ ద్యుతులున్
భక్తియె నా ఛందోనిధి
భక్తియె నాకైత తావి, భక్తియె యగుగాన్
38.
మ.
హితుడా! నీవిటులెన్నియో రచనలన్ ఇంపారజేయంగ, నా
మతిలో నొక్క విశేష భావమది సంభావ్యమ్ముగా తోచెడున్
కృతి సేయందగు నారసింహునకు సత్కావ్యంబు పూజ్యంబుగా
అతి ధన్యంబగు నీదు జీవిత పథంబా రీతి జేయన్, సఖా!
39.
కం.
అని నాకు ఆప్తమిత్రుడు
తన ప్రేరణ యల్లమంద దద్దయునిచ్చెన్
మనమున యాతని మాటలు
వినినంతనె హత్తుకునియె వికసిత మయ్యెన్
40.
తే.గీ.
నారసింహుడు వెలసిన అన్ని చోట్ల
ప్రభుని దర్శించి నంతనే వశము తప్పి
పావనానందమును బొంది బాష్ప ధార
కనులు కలిమిని బొందుదు ఘనుని కనుచు
41.
చం.
తిరముగ నిశ్చయంబు గొని, దేవర రూపము లోన నిల్పి, భా
సురమగు స్వామి తత్త్వమును, సుస్థిరమౌ యవతార సారమున్
నరహరి దైత్యు జంపుటది జ్ఞానము చేతను తామసంబు, తా
మరణము బొందుటే యనెడు మర్మము దెల్పగ బూని, వ్రాసెదన్
42.
శా.
స్వామీ, జ్ఞానమనంత మందు నొకటే శాతంబు నాకబ్బె, నీ
వామోదింపు మదీయమైన లఘువౌ పాండిత్యమున్ శ్రీహరీ!
సామాన్యంబగు నా కవిత్వమున నిన్ సాధించగా జాల, నో
రామానంద నృసింహ దేవ! దయతో రక్షింపు నా దోషముల్
~
లఘు వ్యాఖ్య:
ప్రబంధ లక్షణాలలో ముఖ్యమైనది ‘షష్ఠ్యంతములు’. అంటే షష్ఠీవిభక్తి (కిన్, కున్ అను ప్రత్యయములతో అంతమవుతాయి. ఇవి కందపద్యాలుగా ఉంటాయి. కృతిభర్త ఐన నారసింహ దేవుని స్తుతిస్తూ ‘ఆయనకు’ ఈ పద్య కుసుమాలు సమర్పించారు కవి. “హరికి నరణ్య విహారికి”, “యోగీంద్ర శరణ చరణునకు”, “హుతవహ నయననుకును”, “భావన మాత్ర కృపా కటాక్షవరదునకును” అన్న ప్రయోగాలు స్వామికి అన్వర్థాలు.
ఇక, ‘వినయ నివేదనము’ అన్న శీర్షికన 11 పద్యాలు రాసుకున్నారు కవి. “విద్యా దదాతి వినయమ్” అన్న ఆర్యోక్తి ప్రకారం; పాండిత్యానికి ముఖ్యలక్షణం వినయం అయి ఉండాలి. 32వ పద్యంలో “కృతిపతి నరసింహుడు. కావ్యమేమో ఆయన దివ్యమహత్తు. ఇక తాను తన అల్పజ్ఞానాన్ని గురించి బాధపడనవసరంలేదు” అంటారు కవి. ఎన్నో కష్టాలు పడి, చదువుకున్నాననీ, తనను అట్టడుగు స్థాయి నుండి, అత్యున్నత స్థాయికి తెచ్చినవాడు నరసింహ పరబ్రహ్మయేననీ చెప్పుకోన్నారు (ప.34). చదువు నేర్పిన తండ్రిని, గురువులను తలుచుకున్నారు (ప 36). ఇక 37వ పద్యంలో తనది కేవలం భక్తి తప్ప మరొకటి కాదని విన్నవించుకున్నారు. 38వ పద్యంలో తనను ఈ కావ్య రచన చేయమని ప్రేరణ యిచ్చిన తన ప్రాణమిత్రుడు డా. జెట్టి యల్లమందను తలుచుకొన్నారు. 42వ పద్యములో, అనంతమైన జ్ఞానంలో తనకు ఒక శాతం మాత్రమే అబ్బిందనీ, తనది సామాన్యమైన కవిత్వమనీ, లఘు పాండిత్యమనీ, తన తప్పులు సహించమనీ ఆ నృసింహ దేవుని పార్థిస్తున్నారు కవి. “పలికెడిది భాగవతమట, పలికించెడు విభుడు రామభద్రుండట” అన్న పోతన్న గారి, “నాహం కర్తా హరిః కర్తా” అన్న అన్నమాచార్యులవారి స్ఫూర్తి కవి ‘వినయ నివేదనము’లో ద్యోతకం అవుతుంది.
(సశేషం)