సత్సంగం!

1
4

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘సత్సంగం!’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap] రోజు అమావాస్య. పైగా ఆదివారం. కలవచెర్ల రోడ్‌లో వున్న ధ్యాన జగతిలో పెద్ద పిరమిడ్‌లో సత్సంగం ప్రారంభమైంది. సత్సంగం అనంతరం శ్రీమతి ఇందుకూరి లీలా సరస్వతి అమ్మగారి కుటీరం వద్ద భిక్ష ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అది ఇక్కడి సాంప్రదాయం.

ఆ రోజు సత్సంగానికి రంగంపేట దగ్గరున్న ప్రశాంతినిలాయాశ్రమం నుండి శ్రీ అద్దేపల్లి రామ్మోహన్ రావుగారి ఆధ్వర్యంలో ఒక పాతిక మంది ఆశ్రమవాసులు రావడం ఆనాటి ప్రత్యేకత! వచ్చిన వారిలో శ్రీమాన్ కరుటూరి ప్రకాశరావు, బంగార్రాజు, రొంగల సూర్యనారాయణ – భారతమ్మ దంపతులు, ధనరాజుగారు, తోలేటి అప్పారావు, గంగరాజు మాస్టారు, నూలు నారాయణ, గునివాడ అప్పలరాజు లాంటి అనుభవజ్ఞులు వున్నారు, ఎక్కు మూర్తి, పచ్చగడ్డి లక్ష్మి, బొల్లిముంతల దివ్య, మాయాకుమారి లాంటి అనుభవ శూన్యులూ వున్నారు.

నేనూ మా సువర్ణా ప్రార్థన తర్వాత ప్రశ్నలు – జవాబులు కార్యక్రమం చేపట్టాము. ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా జవాబు చెప్పవచ్చు. ఆ తర్వాత చర్చా కార్యాక్రమం ఉంటుంది.

“వాట్ ఈస్ ఫ్రీడం?” అడిగారు గోపాలపురం సూర్యనారాయణ.

“ఇన్నర్ సైలెన్స్ ఈస్ ది ఫ్రీడమ్” కరుటూరి ప్రకాశరావు.

“పరా బ్రాహ్మకూ అపరా బ్రహ్మకూ తేడా ఏమిటి?” రొంగల భారతమ్మ ప్రశ్న.

 ”పరా బ్రహ్మ అంటే ప్యూర్ గోల్డ్ (కల్తీ లేని బంగారం)! అపరా బ్రహ్మ అంటే ఇంప్యూర్ గోల్డ్ (ఆభరణాల తయారీకి వేరే మెటల్‌తో కలిపిన బంగారం). ఇందులో తేడా గ్రహిస్తే మీ ప్రశ్నలో తేడా మీకు తెలుస్తుంది” చెప్పారు సువర్ణలక్ష్మి.

“కైండ్లీ డిస్క్రైబ్ ది వేకింగ్ & డ్రీమ్ స్టేట్” నిత్యానందరావు ప్రశ్న

“ది వేకింగ్ అండ్ డ్రీమ్ స్టేట్స్ ఆర్ ది మోడిఫికేషన్స్ అఫ్ ది మైండ్. దేర్ విల్ బి కౌంట్లెస్ ఇంప్రెషన్స్ ఆన్ ది మైండ్ గేదర్డ్ ఇన్ జగత్. దోజ్ విల్ అప్పీయర్ అండ్ లుక్స్ ట్రూ ఇన్ డ్రీమ్స్” కరుటూరి ప్రకాశరావు గారి జవాబు.

“యోగం – వేదాంతం – సంసారం. సమన్వయం చేయండి బాబూ!” నూలు నారాయణ గారి అభ్యర్ధన.

“ఈ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి రెడ్డిగారూ! ఋషికేశ్ వెళ్లి వేదాంతం చదువుకొని వచ్చారు కదా?” అద్దేపల్లి వారి వ్యంగ్యం.

“ఒక విషయాన్ని తెలియకపోయినా విడిచి పెట్టడం యోగం. క్షుణ్ణంగా తెలుసుకొని విడిచిపెట్టడం వేదాంతం. విడిచిపెట్టడం అనే విషయాన్ని వాయిదా వేయడం సంసారం!” చెప్పాను.

“మనిషి దుఃఖాలు ఎన్ని రకాలు బాబూ?” అప్పలరాజు.

“ప్రతీ మనిషికీ రెండు దుఃఖాలు ఉంటాయి. ఒకటి తాను పొందిన వాటి గురించి, రెండు తాను పొందలేనివాటి గురించి” గంగరాజు మాష్టారు చెప్పారు.

“అది ఎలా వివరించండి?” ఎదురు ప్రశ్న.

గంగరాజు మాస్టారు నన్ను చెప్పమని సైగచేశారు

“ఒక బ్రహ్మచారి వివాహం అవ్వడం లేదని బాధ పడతాడు. తీరా అయ్యాక భార్య గయ్యాళి అని తల పట్టుకుంటాడు. అర్థమైందా?” తల వూపాడు అప్పలరాజు

“ఒక కేజీ నెయ్యి హోమానికి సరిపోతుందా?” ఎక్కుమూర్తి ప్రశ్న.

“విధి విధానాలను అనుసరించి చేసే హోమానికి చెంచాడు నెయ్యి సరిపోతుంది. నువ్వు చేసే విధంగా గిన్నెలో వున్న నెయ్యి నిప్పుల్లో ఒలక పోయడం హోమం కాదు” చెప్పారు బంగారరాజు.

“మృత్యు స్వరూపాలకు పర బ్రహ్మ స్వరూపాలకు భేదం చెప్పండి?” రొంగల భారతమ్మ ప్రశ్న.

“మమ (నాది) అన్న రెండక్షరాలే మృత్యు స్వరూపాలు. నమమ (నాది కాదు) అన్న మూడు అక్షరాలు అమృతం. అవే పరబ్రహ్మ స్వరూపాలు” సువర్ణలక్ష్మి.

“కళ్ళకు కనిపించే జగత్తును సత్యం కాదు, అది నీ భ్రమ అంటారు మా వారు. ఆ మాటను నేను ఎలా అన్వయించుకోవాలి బాబూ!” అడిగింది భారతమ్మ.

“మీవారు చెప్పింది సత్యం అమ్మా! ఎలా అంటే.. మసక వెలుతురులో మీరొక తాడును చూస్తారు. మీకది పాములా అనిపిస్తుంది. అలాగే భ్రమ వల్ల పరమాత్మ ప్రపంచంగా భాసిస్తాడు. మీలోని అజ్ఞానం నశిస్తే తాడు తాడు లా కనిపిస్తుంది. బ్రాంతి తొలగి పోయి జగత్తు పోయి ఆ స్థానంలో పరమాత్మ అనుభవం కలుగుతుంది. అదే ఆత్మ” వివరించాను.

“కాశీ వెళదాం, తిరుపతి వెళదాం అని నేనంటే నువ్వు అజ్ఞానివి ఎక్కడికీ వెళ్ళక్కరలేదు. భగవంతుడు అంతటా వున్నాడు. అది తెలుసుకో అంటారు మావారు” మళ్ళీ ఆరోపణ చేసింది రొంగల సూర్యనారాయణ గారిమీద భారతమ్మ.

“అవునమ్మా! పరమాత్మ స్వరూపం తెలుసుకోకుండా దేవుడిని ఒక గుడికీ, ఒక విగ్రహానికీ పరిమితం చేసే ప్రతీ వారూ అజ్ఞానులే! ‘నేను’ ఎక్కడ వున్నానో అదియే పుణ్యక్షేత్రం. ‘నేను’ ఎప్పుడు వున్నానో అదియే సుముహూర్తం. ‘నేను’ ఏది అయి వున్నానో అదియే దైవము” చెప్పాను వివరంగా.

“రాముడూ, ఈశ్వరుడూ ఒక్కటే అంటారేమిటి ఈయన?” మళ్ళీ అడిగింది భారతమ్మ

“రామశ్చ ‘అసౌ’ ఈశ్వరశ్చ రామేశ్వరః! ఏది రాముడో అదియే ఈశ్వరుడు లేదా రాముడు ఏదియో ఈశ్వరుడు అదియే! ఇది శాస్త్ర వాక్యం” చెప్పాను.

“వాట్ ఈస్ బ్రహ్మన్?” తోలేటి అప్పారావు ప్రశ్న

“బ్రహ్మన్ ఈస్ రియాలిటీ ఇన్ ది ఫారం ఆఫ్ చైతన్యం” సువర్ణలక్ష్మి జవాబు.

“ఈ జగత్తు లోని సంపద అంతా భగవంతుడిదేనా?” ధనరాజు గారి ప్రశ్న.

“ది టోటల్ వెల్త్ ఆన్ ది యూనివర్స్ బిలాంగ్స్ టు ది గాడ్. ఎయిర్, ఎర్త్, ఫైర్, వాటర్ అండ్ స్కై, ది ప్రెజెంట్ పొజిషన్ ఆఫ్ వెల్త్ ఈస్ నాట్ ఇంపార్టెంట్” చెప్పారు ప్రకాశరావు.

“మేలు ఎలా ప్రాప్తిస్తుంది? కీడు ఎలా తొలగుతుంది?” బ్రహ్మచారిణి శ్రీ లక్ష్మీ చైతన్య ప్రశ్న.

“మేలు ఆశించక పోయినా ప్రాప్తిస్తుంది. కీడు తొలగించుకోవాలని ఆత్రపడినా ఎదురు పడుతుంది” సువర్ణలక్ష్మి.

“వేదాంత శాస్త్రం దృష్టిలో ‘రాజు – పేద’ ఎవరు?” కోలా సత్యనారాయణ ప్రశ్న.

“తనకంటూ ఏ కోరికలూ లేని వాడే రాజు. తన దగ్గరున్న దానికంటే ఎక్కువ కోరికలు వున్నవాడు ఎప్పుడూ పేదవాడే!” చెప్పారు ప్రకాశరావు.

“మానవ జన్మ ఎత్తినది భోగాలు అనుభవించడానికి కాదా?” పచ్చగడ్డి లక్ష్మి పిచ్చి ప్రశ్న.

“భోగాలలో మునిగి తేలేవారు చేరుకొనేది రోగాల తీరానికి. ‘భోగే రోగ భయం’ అన్న భతృహరి సుభాషితాలు చిన్నప్పుడు చదువుకోలేదా? అయినా నీ భోగాలకు ఏమి కొరత వచ్చింది. నీకు కావాల్సిన భోగాలు కావాలంటే పెళ్లి చేసుకొని వుండాల్సింది. ఆశ్రమానికి డబ్బులు కట్టవు! పైగా ‘ఒంటరి’ మహిళ పెన్షన్ కూడా పొందుతున్నావు. భోజనశాలలో భోజనం చేస్తు కూడా ఇంటి దగ్గర దీపం పథకంలో ఉచిత స్టవ్, ఉచిత గాస్ పొందుతున్నావు. స్వీట్లు తయారు చేసి బ్రహ్మచారుల కుటీరాలకు తీసుకెళ్లి వారి నోటికి అందిస్తావట. ఇంక నీ భోగాలకు లోటు ఏమివచ్చింది?” భారతమ్మ మాటలతో నోరు మూసేసింది పచ్చగడ్డి లక్ష్మి.

“తపస్సు అంటే ఏమిటి? నాలా మౌనం పాటిస్తే అది తపస్సేకదా?” అడిగింది బొల్లిముంతల రమ్య చైతన్య.

“నీ భాగోతం తెలియని వారివద్ద వల్లించు, నీలా స్మార్ట్ ఫోన్‍లో చాటింగ్ చేయడం. కుటీరాల బాత్‌రూముల వెనుక నక్కి పిచ్చి పిచ్చి ఫోటోలు తీసి షేర్ చేయడం. వాట్సాప్‌తో, ఫేస్‌బుక్‌తో కాలక్షేపం చేయడం తపస్సనుకుంటున్నావా? ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు తినబోయే ఆహారం గురించి ఆలోచించే నీలాంటి దొంగ మౌనుల మౌనం తపస్సు కాదు. అది పక్కా సంసారి లక్షణం” అంటూ ఉతికేసింది రొంగల భారతమ్మ.

“రెడ్డి గారూ! వేదాంతం ఋషికేశ్‌లో చదువుకొని వచ్చారు కదా? మీరు చెప్పండి ఈమె పాటించేది మౌనమేనా?” అడిగింది భారతమ్మ

“కాదు ఈమె పాటిస్తున్నానని చెప్పేది ‘మాన మౌనం’!” చెప్పాను.

“అంటే..” కళ్లెర్రచేసి అడిగింది రమ్యా చైతన్య.

“అంటే కొలతలు వేసుకొని చేసుకొనే ఒక అభినయం. మౌనమనేది దైవ భాష. లిపి లేని విశ్వభాష! ధార్మిక దివ్యత్వానికి ద్వారం! సనాతన భాషాస్రవంతి! మూగగా నటిస్తూ సంజ్ఞల ద్వారా భావాలు వ్యక్తపరచడం అసలేకాదు. ఆవేదనలు, ఆక్రోశములు, భ్రాంతులు, వాంచలు లేకుండా ఆత్మ యందు ఏకాగ్రత కలిగి యుండటం. ‘మౌనం వాజ్నిరోధః’ అన్నారు శంకరులు. పాపాల పరిహారార్థం చేసే పంచ శాంతులలో మౌనం ముఖ్యమైనది. మౌనం నుండి జ్ఞానం ఉదయిస్తుంది. అంతర్యామిని దర్శించుకొనే సాధనం మౌనం! మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం మౌనం.” ఇంతకంటే ఎక్కువ చెప్పాలనిపించలేదు.

“కామానికి, రాగానికి వున్న తేడా ఏమిటి?” మాయాకుమారి ప్రశ్న.

“మన దగ్గర లేని దానిని కోరుకోవడం కామం. అప్పటికే మన దగ్గర ఉన్నదాని పై ప్రేమ లేక మమకారం పేరే రాగం, నువ్వు కంప్యూటర్‌లో చూసే బ్లూ ఫిల్మ్‌ల కంటే, మిలిట్రి కాంటీన్ నుండి తెచ్చిన మందు బాటిల్స్ ఆశ చూపి బ్రహ్మాచారుల్ని నీ కుటీరానికి ఆకర్షించుకోవడం, ఏదైనా సమస్య వస్తే నీ కులాన్ని అడ్డుపెట్టుకొని బయటపడటం అందరికీ తెలిసిన భాగోతమే కదా?” భారతమ్మ దురుసుతనానికి భయపడి నోరు మూసుకొని తల దించుకొంది మాయాకుమారి.

“మనస్సు – ఎరుక లలో జీవికి ఏది ముఖ్యం?” నూలు నారాయణ.

“మనస్సు లేకపోతే మనిషి లేనే లేడు! మనసు లేకుండా చేసుకోవడం అంటే.. ఆలోచనా స్రవంతిని తగ్గించుకొని ఖాళీ గా పెట్టుకోవడం. అప్పుడు జీవుడు ఎరుకలో ఉంటాడు. మనసు నీవు కాదు కానీ ఆ ఎరుక నీవే! అదే దేవుడు కూడా! ఆ తెలివిడి మనుషుల్లో, ఆవుల్లో, దోమల్లో, చీమల్లో సకల ప్రాణుల్లో వాటి వాటి అవసరం మేరకు ఉంటుంది” చెప్పాను.

“ఈ ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు ప్రారంభమై జరుగుతాయి?” అడిగారు కోలా సత్యనారాయణ.

“ఎలా అయితే ఒక రోగం మనిషి మనసులో జన్మించి శరీర అవయవాల మీద ప్రకటితమౌతుందో అలా ఏ యుద్ధమైనా మనిషి అంతరంగం లోనే చెలరేగి తర్వాత భూమి మీద ప్రారంభ మౌతుంది. హిట్లర్ మనసులో ప్రారంభమైన ఒక యుద్ధం ప్రపంచ యుద్ధమైంది. సద్దాం హుస్సేన్ మనసులో ప్రారంభమైన ఒక యుద్ధం ఇరాన్ ఇరాక్ వార్ అయ్యింది!” చెప్పాను.

“ఇక ప్రశ్న – జవాబుల కార్యక్రమం ఆపేసి చర్చా కార్యక్రమం మొదలు పెడదాం!”అన్నారు అద్దేపల్లి వారు.

“అలాగే! ఒకే ప్రదేశంలో, ఒకే కాలంలో కృతయుగం నుండి కలియుగం వరకూ నాలుగు యుగ ధర్మాలూ నడుస్తూ ఉంటాయి. అలాగే ఒకే చోట ఒకే సమయంలో ధైవీ సంపద – అసురీ సంపదా కూడా పరిఢవిల్లుతుంటాయి.”చర్చ కు నాందీ ప్రస్తావన చేసాను.

“వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్? ఆర్ యూ క్రేజీ? ఆర్ యూ థింక్ ఉయ్ ఆర్ ఫూల్స్!” విరుచుకు పడ్డాడు ఇoగ్లీషు అప్పారావు అని పిలవబడే తోలేటి అప్పారావు.

“రెడ్డిగారూ! ఎలా కనిపిస్తున్నారు ఈ ధ్యానజగతి సభ్యులు మీ కంటికి? మీరేం చెబితే అది నమ్మేసే వెర్రి పప్పల్లాగ కనిపిస్తున్నామా?” అంటూ కాటమ రెడ్డి ఇంగ్లీషు అప్పారావుకు వంత పాడాడు.

“అమావాస్య నాడు ఈ అపభ్రంశపు చర్చ ఏమిటండీ?” అన్నారు ఆచారి గారు.

“నోటికొచ్చిన మాట అనెయ్యడం కాదు మీరన్నది నిరూపించాలి మరి!” సవాలు విసిరాడు కాటమరెడ్డి.

“అలాగే! మీ పూర్తి పేరు?” అడిగాను.

“ఏం? మీకు తెలియదా? కాటమరెడ్ది సత్యనారాయణ!” చెప్పాడు

“తెలుసు మీ చేత చెప్పించాలని, వాట్ ఆర్ యూ?” అడిగాను

 “ఐ యామ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్!” చెప్పాడు.

“వాట్ ఈస్ యువర్ డి ఓ బి అండ్ ఏజ్?” అడిగాను

“15th. జూలై 1949. సెవెంటి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్” చెప్పాడు.

“గుడ్! ఇప్పుడు మీరు చెప్పిన వివరాలు మీ దేహానివా? మీవా?” అడిగాను

“పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి అన్నాడట వెనుకటికొకడు అలా వుంది మీ ధోరణి! నేనూ నా దేహం వేరు వేరు ఎలా అవుతామండి? అయినా మీరన్న యుగాలు అన్నీ ఒకే చోట, ఒకే కాలంలో ఉంటాయి. అలాగే ఆసురీసంపద దైవీ సంపద పక్క పక్క నే ఉంటాయన్న విషయం మాట్లాడకుండా వేరే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారేమిటండి?” అడిగాడు చాలా చిరాగ్గా.

“మాట్లాడటం కాదు నిరూపిస్తాను. వచ్చే ఆదివారం మనమంతా ఉదయం 8 గంటల బస్సుకు బయలుదేరి రంగంపేట ప్రశాంతి నిలయాశ్రమానికి వెళదాం. అక్కడ మీ అనుమానాలన్నీ తీరుస్తాను. బ్రేక్‌పాస్ట్ చేసేసి వెళదాం. లంచ్ టైంకు తిరిగి వచ్చేద్దాం!” అన్నాను

అక్కడి నుండి వచ్చిన వారు ఒకరి మొహాలు ఒకరు చూసుకొన్నారు. భారతమ్మ గారైతే కోపంగా చూసారు.

భర్త వైపు చూసి “మీరు చెప్పండి!” అన్నారు

“అయ్యా రెడ్డిగారూ! మేము వచ్చినప్పుడల్లా ఎంతో ప్రేమగా మాకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. రాక రాక మీరంతా మా ఆశ్రమానికి వస్తుంటే మిమ్మల్ని ఆకలి కడుపులతో పంపిస్తామా? మీ అందరి భోజనాలు అక్కడే!” అన్నారు రొంగలి సూర్యనారాయణ గారు.

“మరి.. అక్కడి భిక్షకు ఇంతని చెల్లించాలట కదా? మీకు ఎందుకు ఈ వృథా ఖర్చు!”అన్నాను

“మీరన్నది నిజమే. ఆశ్రమాలలో నెపోటిజం పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అనుభవశూన్యురాలైన వారసురాలు నిర్ణయాల వల్ల వచ్చిన ఈ సమస్యకు మేమంతా సిగ్గుపడ్తున్నాము. కానీ వచ్చే ఆదివారం ఏర్పాటు చేసే విందుతో ఆశ్రమానికి ఏ విధంగానూ సంబంధం లేదు. ఆరోజు మా మనవరాలు అనామిక జన్మనిచ్చిన కవల పిల్లల నామకరణ ఉత్సవం చేసుకోడానికి వాళ్ళు రాజమండ్రి నుండి ఆశ్రమానికి వస్తున్నారు. మా కుటీరం వద్ద ఈ గంగరాజు మాస్టారే కార్యక్రమం జరిపిస్తారు. మా ఆశ్రమవాసులకు ఊరి నుండి వచ్చే బంధువులకు, మీకు విందుకు కాకినాడ సుబ్బయ్య హోటలకు కేటరింగ్ ఇస్తున్నాము. దయచేసి కాదనకండి రెడ్డిగారూ!” అన్నారు రొంగల సూర్యనారాయణ గారు.

“మీ అనామికకు కవలలా? ఏమి పేర్లు పెడుతున్నారు?”

“బాబుకు అకాల్, పాపకు అకాయ్” చెప్పారు.

“నామాలు బావున్నాయ్” అన్నాను ప్రశంసిస్తూ!

“తల్లి పేరు అనామిక. కొడుకు పేరు అకాల్. కూతురు పేరు అకాయ్! ఎక్కడినుండి దిగుమతి చేసుకున్నారు పేర్లు జపాన్ నుండా? చైనా నుండా?” కాటమరెడ్డి చాలా వ్యంగ్యంగా.

“నీవు నోరు ముయ్యి కాటమా! నీకు వాటి అర్థాలు తెలియదు. ఉద్దేశ్యాలు తెలియదు. అవి ఎంత భావయుక్తమైన పేర్లు.. తల్లి నామ రూపాలకు అతీతురాలు.. కొడుకు కాలాతీతుడు.. కూతురు దేహాతీతురాలు. వారందరూ ఆత్మ స్వరూపులు! చాలా బావున్నాయి పేర్లు” అంటూ తెగ పొగిడారు అద్దేపల్లి రామ్మోహనరావు గారు.

అంతటితో సత్సంగం ముగిసింది. అందరూ శ్రీమతి ఇందుకూరి లీలా సరస్వతీ గారి కుటీరానికి భిక్షకు బయలు దేరారు.

***

అనుకున్న ప్రకారం ఆ ఆదివారం ధ్యాన జగతి నుండి ప్రశాంతినిలాయాశ్రమానికి చేరుకున్నారు. గేటు లోపలికి ప్రవేశించిగానే చెప్పడం మొదలుపెట్టాను “యుగాలు నాలుగు. మొదటిటది కృతయుగం లేదా సత్యయుగం. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా అవతరించి భూమిని పాలించిన కాలం. సత్యము, ధర్మమే ఆ యుగ లక్షణాలు. ఏది సత్యమో అదే ధర్మము. రెండోది లేదు!

ఆ తర్వాతది త్రేతాయుగం. భగవాన్ శ్రీరామచంద్రుడుగా అవతరించి రావణుని సంహరించి గతి తప్పిన నీతి నియమాలను పునః ప్రతిష్ఠించిన కాలం. ప్రేమ ఆనందం ఆ యుగధర్మాలు. ధర్మానికి ఒక పాదం లుప్తమైన యుగం.

మూడవది ద్వాపరయుగం. భగవాన్ శ్రీకృష్ణునిగా అవతరించి ఎన్ని లొసుగుల్ని సరిచేసాడో మనం చదివాము. ధర్మం రెండు పాదాల మీద నడిచిన యుగం. అంటే ధర్మం అధర్మం ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట!

ఇక మిగిలింది కలియుగం. శ్రీకృష్ణుడు శరీర త్యాగం చేసిన మరు క్షణంలో ప్రారంభమైంది. యుగాంతంలో భగవంతుడు కల్కి రూపంలో అవతరించి లుప్తమైన మూడు పాదముల ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడనేది నమ్మకం!” అని చెప్పి, “ఇప్పుడు సరిగా గమనించండి, వినండి! మన కుడి వైపు కుటీరం గంగరాజు మాస్టారిది. మీకు ఏమి వినిపిస్తుంది?” అడిగాను.

“వేదమంత్రాలు!” చెప్పాడు కాటమరెడ్డి.

“ఈ ఎడమ వైపు కుటియా అద్దేపల్లి వారిది. వినండి సరిగా” అన్నాను.

“మాండూఖ్య కారికలు అద్వైత ప్రకరణం!” చెప్పారు నిత్యానందరావు. ముందుకు నడిచారంతా. అందరిలోనూ ఉత్సాహం పెరిగింది. గమనిస్తున్నారంతా!

ఏ కుటీరం వైపు చూసినా శ్రీ సూక్తం, ఆదిత్య హృదయం, శాంతి మంత్రాలు ఉపనిషత్తుల పారాయణలు వినిపిస్తున్నాయి. ఒక కుటీరం దగ్గర షామియానా వేసివుంది. ఏదో పూజా కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు.

“ఇది రొంగల సూర్యనారాయణ భారతమ్మల కుటీరం. ఈ మధ్యాన్నం మన భిక్ష ఇక్కడే! ఇక్కడివరకూ మీరు గమనించిన దాన్ని బట్టి ఇదే కృతయుగం యొక్క వాతావరణం అని అర్థమై ఉంటుంది. ఇక్కడినుండి త్రేతాయుగ వాతావరణం ప్రారంభమౌతుంది” చెప్పాను.

ప్రతీ కుటీరం ముందు చూడ ముచ్చటైన రంగవల్లులు! ఒక ప్రక్క చిన్న రామాలయం. మూర్తుల అలంకరణ చాలా బావుంది. ఏ కుటీరం నుండి విన్నా రామ నామ సంకీర్తనలు, రామదాసు కీర్తనలు వినిపిస్తున్నాయి.

“ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ముందు త్రేతాయుగ వాతావరణం కూడా చిన్నబుచ్చుకుంటుంది” అన్నాను. అవునవును అంటూ అందరూ తల లూపారు

“ఇక్కడి నుండి ద్వాపర యుగ వాతావరణం మొదలవుతుంది. అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ సగం ఆధ్యాత్మికం సగం లౌకికం. గమనించండి!” చెప్పాను.

అక్కడ ఇద్దరు నూతి చపటా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు – “బావా! ఊరి కెళ్ళి వచ్చావు. వెళ్లిన పని కాయా? పండా?” అడిగాడు వెంకటగుప్త.

“నేనెళ్ళానంటే ఏ పనైనా పండే బావా! మనవడికి కాకినాడ బాదం వారి సంబంధం ఖాయం అయ్యింది. ఒక్కతే కూతురు, కోట్ల ఆస్తి, ఇక మనదే!” ఆనందంగా చెప్పాడు నాగ శ్రేష్ఠి.

“బావా! నిన్న రాత్రి మాతాజీ చెప్పిన ప్రవచనంలో లౌకిక విషయాలు ఏమీ లేవు. అంతా ఆధ్యాత్మికమే! ఉప్పు- కారం లేని కూరలా చప్పగా వుంది” వెంకటగుప్త.

అలాంటి పోసుకోలు కబుర్లే వినిపిస్తున్నాయి అక్కడంతా!

“ఇక ముందు కెళదాం! కలియుగ వాతావరణంలో ప్రవేశిద్దాం” అన్నాను.

“ఈ కుడి వైపు కుటీరం పచ్చగడ్డి లక్ష్మిది” చెప్పాను. అందరూ అటు చూసారు. లోపలినుంచి మిక్సీ సౌండ్ వస్తుంది. కమ్మటి వాసన కూడా! ఆ రోజు బ్రహ్మచారుల నోళ్లు అదృష్టం చేసుకున్నాయన్నమాట!

“ఈ ఎడమవైపు కుటీరం బొల్లిముంతల రమ్యది” చెప్పాను

గేటుకి నోటీసు బోర్డు అంటించి వుంది – ‘ఇందులోని సాధకురాలు మౌన దీక్షలో వున్నారు. శబ్దం చేయవద్దు’. కుటీరం వెనకాల లాప్టాప్, స్మార్ట్ ఫోన్ లతో చాటింగ్ చేస్తూ చాలా బిజీగా వుంది రమ్య. మమ్మల్ని గమనించనే లేదు!

తర్వాత కుటీరం మిస్ మాయా కుమారిది. “అమ్మనీ కమ్మనీ దెబ్బ” అన్న సినిమా పాట శ్రావ్యంగా వినిపిస్తుంది. లోపలినుంచి శేఖర్ బ్రహ్మచారి అటూ ఇటూ చూసుకొంటూ బయటికి వస్తున్నాడు.

“ఆ ఎదురుగా వున్న కుటీరం హిమాలయాల నుండి వచ్చానని ప్రచారం చేసుకొనే జాతకాలు – పరిష్కారాలు చెప్పే సురేశ్వరునిది. ఆ సమయంలో జ్యోతిష్యం చెప్పించుకుంటున్నది 85 సంవత్సరాల శేషుమాంబ!

“మీ గ్రహాల సంచారం ప్రకారం మీకు మృత్యువు పొంచి వుంది. దానికి పరిష్కారంగా మీరు చేయాల్సింది..” అంటూ ఏదో చెబుతున్నాడు. ఇలాంటి వారిని ఆశ్రమాలు కూడా ఎందుకు ప్రోత్సహించి పోషిస్తాయో అర్థం కాదు. అవునులే దాతల లోని భయమే గదా ఆశ్రమాల బలం!

“ఇదీ సంగతి నాలుగు యుగ ధర్మాలూ ఒకే చోట మీకు చూపించాను” అన్నాను.

“అవును చాలా బాగా వివరించారు. మరి.. దైవీ సంపద – ఆసురీ సంపదలను ఎప్పుడు చూపిస్తారు?” కాటమరెడ్డి.

“ఎప్పుడో కాదు ఇప్పుడే! కనిపిస్తున్న ఆ చిన్న వంతెన దాటి ముందు కెళదాం!” అన్నాను

అక్కడ బాటకు ఎడమవైపున ఏసీ, జనరేటర్‌తో సహా సకల సౌకర్యాలతో ఒక కుటీరం వుంది. అందులో ఉండేది నెపోటిజం వల్ల ఆశ్రమ వారసురాలైన స్వామిని మంగళానంద గిరి. ఆమెదే సర్వాధికారం అక్కడ. కుడివైపున వున్న రెల్లుగడ్డి పర్ణ కుటీరంలో ఉండేది స్వామిని సద్విద్యానంద సరస్వతీ. రెండు చోట్లా జాగ్రత్త గా గమనిస్తే దైవీ -ఆసురీ సంస్కృతుల తేడా తెలుస్తుంది” చెప్పాను.

మంగళానంద బిల్డింగ్ వైపుకు వెళ్ళాము. అక్కడ స్వామి కేశవానంద గిరి, స్వామిని మంగళానందగిరి సీరియస్‌గా చర్చల్లో వున్నారు. దగ్గరలోనే వున్న మమ్మల్ని గమనించనే లేదు.

“భోజనశాలలో కూరల్లో కారం – ఉప్పు ఎక్కువ అవుతున్నాయని కొంతమంది గొడవ చేస్తున్నారు. ఒకవేళ వాటిని తగ్గించాలంటే ఇప్పుడు కొంటున్న వాటికి రెట్టింపు కూరగాయలు కొనాల్సి ఉంటుంది” కేశవానంద గిరి.

“వద్దు. అలా చేస్తే ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఎవరు ప్రశ్నిస్తున్నారో గమనించండి. ఒక ఇద్దర్ని ఆశ్రమం నుండి పంపించేస్తే, మిగిలిన వారు చచ్చినట్టు నోరు మూసుకొని పడి వుంటారు” మంగళానంద గిరి.

“ఇదే ఆసురీ సంపద అంటే! పదండి ఆ పర్ణశాల వైపు వెళదాం!” అన్నాను

అక్కడ స్వామిని సద్విద్యానంద సరస్వతీ ఫోన్‌లో మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

“అవును. మనది ఆశ్రమం. మనం సాత్విక ఆహారం మాత్రమే తయారు చేసి ఆశ్రమవాసులకు అతిథులకు వడ్డించాలి. ఉప్పు – కారం పెంచేసి తామస, రాజసిక భోజనం పెట్టడం చాలా పాప కార్యం అవుతుంది” అంటూ మెస్ ఇంచార్జ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. మమ్మల్ని గమనించలేదు. మేము కూడా దూరం నుండే ప్రణామాలు అర్పించి వెనుదిరిగాము, రొంగలి సూర్యనారాయణ భారతమ్మ దంపతుల విందులో పాల్గొనేటందుకు!!!

– స్వస్తి –

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here