అలనాటి అపురూపాలు – 241

1
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

డ్రీమ్ గర్ల్ హేమ మాలిని:

డ్రీమ్ గర్ల్ అనే బిరుదు గల హేమ మాలిని నటి మాత్రమే కాదు, నిర్మాత, దర్శకురాలు కూడా. పార్లమెంటు సభ్యులు.

హేమ 1948లో శ్రీరంగంలోని ఓ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. జయలక్ష్మి,  వి.ఎస్. ఆర్. చక్రవర్తి అయ్యంగార్‌ ఆమె తల్లిదండ్రులు. హేమ మద్రాసులోని ఆంధ్ర మహిళా సభ నిర్వహించే పాఠశాలలో చదివారు. అప్పుడు ఆమెకు ‘చరిత్ర’ ఇష్టమైన సబ్జెక్ట్. తరువాత మందిర్ మార్గ్‌లోని DTEA లో 11వ తరగతి వరకు చదివారు. నటనపై ఆసక్తితో సినీరంగంలో ప్రవేశించారు. ‘ఇదు సత్యం’ (1963) సినిమాలో – ‘సింగారి’ పాటలో నర్తించడం ద్వారా (ప్రత్యేక పాత్ర) తమిళ సినీపరిశ్రమలో అడుగుపెట్టారు. నిర్మాత, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ‘తేనె మనసులు’ అనే తెలుగు సినిమా తీస్తూ, నటీమణుల పాత్రల కోసం ప్రకటన ఇవ్వగా హేమ మాలిని, జయలలిత స్క్రీన్ టెస్ట్‌కు వచ్చారు కానీ వారిద్దరు ఎంపిక కాలేదు.

మరో దర్శకుడు శ్రీధర్ కూడా హేమ మాలినిని తిరస్కరించారు. అయితే ఈ తిరస్కరణల ప్రభావం తన కూతురిపై పడకుండా ఉండేందుకు గాను జయలక్ష్మిగారు తెలివిగా హేమను నృత్య ప్రదర్శనలు ఇవ్వమని ప్రోత్సహించారు. నాట్యంపై మళ్లీ దృష్టి కేంద్రీకరిస్తూనే, సినీ అవకాశాల కోసమూ ప్రయత్నించారు [మధ్యలో ఆమె పాండవ వనవాసం (1965), శ్రీకృష్ణ విజయం (1971) అనే రెండు తెలుగు సినిమాలలో ఒక్కో పాటలో నర్తించారు. ఆ రెండు పాటలు పెద్ద హిట్ అయ్యాయి.].

ఈ యువ, అందాల నర్తకి ప్రతిభ కొందరిని ఆకట్టుకుంది. రాజ్ కపూర్‌తో హిందీ సినిమా తీస్తున్న తమిళ నిర్మాత బి. అనంతస్వామి వారిలో ఒకరు. వారి సినిమా షెడ్యూల్ సిద్ధంగా ఉంది, కానీ షోమ్యాన్ సరసన నటించడానికి కొత్త నటి కోసం వారు చూస్తున్నారు. హేమకు గాడ్ ఫాదర్ అవసరం ఉంది, ఆయనేమో లైఫ్‌టైమ్ ఆఫర్‌తో వచ్చారు. “సినిమాకు సంబంధించిన అన్ని నిర్ణయాలను రాజ్ కపూర్ తీసుకుంటారని అనంతస్వామి మాకు మొదటి నుంచీ చాలా స్పష్టంగా చెప్పారు. సంగం తర్వాత రాజ్ కపూర్‌తో అనంతస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారు అప్పుడు వైజయంతిమాల స్థాయికి తగ్గట్టుగా నాట్యం చేయగల ఒక తాజా దక్షిణాది అమ్మాయిని నటింపజేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు” అని హేమ గుర్తుచేసుకున్నారు. అనంతస్వామి హేమను ప్రధాన పాత్రలో నటింపజేయడానికి ప్రతిపాదించినప్పుడు, ఆ పదహారేళ్ల యువతి వెంటనే లేచి ‘సరే, నేను సిద్ధం’ అన్నారు. మద్రాసులో సివి శ్రీధర్ తిరస్కరణ నుండి కోలుకోని హేమ తల్లి జయగారికి ఇది కొంత సందేహాంగానే తోచింది.

హేమ కథానాయికగా ఒక చిత్రానికి సంతకం చేస్తోందని విన్న ఆమె తండ్రి కోపగించుకున్నారు. భోజనం మానేశారు, భార్య జయతో తీవ్రంగా వాదించారు. “పెద్దలకి ఎదురు ప్రశ్నలు వేయకూడదని మాకు నేర్పించడం వల్ల, నేను, నా సోదరులు ఏమీ మాట్లాడలేకపోయాం” గుర్తుచేసుకున్నారు హేమ. “మాకు, భయంగా, అసౌకర్యంగా ఉండేది. చివరికి, నాల్గవ రోజున, మా నాన్న పంతం వదులుకున్నారు. భోజనం చేయడానికి అంగీకరించారు. తాత్కాలిక సంధి కుదిరింది! సమస్యను ఎలా పరిష్కరమయ్యిందో నాకు తెలియదు కానీ, నాన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఒక విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు, సభలు, పండుగ కార్యక్రమాలలో నా శాస్త్రీయ నృత్యాలకు మా నాన్న వ్యతిరేకం కాదు.. కానీ సినిమాల్లో నేను నటించడం ఆయనకి ఇబ్బంది కలిగించింది. తన ఆఫీస్ లోని సహోద్యోగులు ఏమంటారో అని ఆయన భయపడినట్లున్నారు” చెప్పారు హేమ.

రాజ్ కపూర్ సరసన ఆమె తొలిసారిగా సినిమాలో నటించేందుకు అవకాశం రావడం – అదృష్టంగా భావించారు. హేమ పాత్రను మొదట వైజయంతిమాలకే ఆఫర్ చేశారని, ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదని చాలామంది అనుకున్నారు. కానీ రాజ్ కపూర్ స్వయంగా ఒక నూతన నటితో నటించడానికి ఆసక్తి చూపారన్నది కూడా వాస్తవం. ఏమైతేనేం, హేమ మాలినికి ఒక గొప్ప ఆరంభం. ఆమె జీవితంలో రెండవ సారి, సినిమాల కోసం గ్రూమింగ్ జరిగింది. కాస్ట్యూమ్ ట్రయల్స్ నుండి డిక్షన్ క్లాస్‌ల వరకు, దేనినీ విడిచిపెట్టలేదు. హేమ తమిళ యాస బలంగా ఉందని గ్రహించిన దర్శకుడు మహేష్ కౌల్, దానిని సవరించడంలో సహాయపడటానికి ఒక ప్రొఫెషనల్‌ని నియమించుకున్నారు. ఆకాశవాణి బొంబాయి కేంద్రంలో అనౌన్సర్, న్యూస్ రీడర్ అయిన లక్ష్మీ శర్మ చక్కటి హిందీ నైపుణ్యానికీ, పరిపూర్ణ ఉచ్చారణకి ప్రసిద్ధి చెందారు. ఆమె చేత హేమకు భాషలోనూ, డైలాగ్ డెలివరీలో శిక్షణ ఇప్పించారు.

‘సప్నో కా సౌదాగర్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు, బొంబాయిలో మొదటి ఎనిమిది నెలలు – హేమ, ఆమె తల్లి జయ నిర్మాత బి. అనంతస్వామి ఇంట్లోనే ఉన్నారు. యువ నటికి దాదాపు మెంటర్‌గా, ఆయన వారిని సౌకర్యంగా ఉండేలా చేశారు. ఆ సినిమా విడుదలైన తర్వాత, ఇతర సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించిన తర్వాతే, హేమ, జయ వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నారు. “చాలా తక్కువ కాలం అమ్మతో కలిసి మాతుంగలోని షణ్ముఖానంద గెస్ట్ హౌస్‍లో ఉన్నాను. అదొక చిన్న గది. రోజంతా స్టూడియోలో షూటింగ్ చేసొచ్చాకా, ఆ గదిలో ఉండాలంటే స్థలభీతి (క్లాస్ట్రోఫోబియా) కలిగేది. మేం ఉండడానికి సరైన స్థలం లేదని తెలియగానే ఖార్‌లో ఓ అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకోవాలని నాన్న నిర్ణయించారు” చెప్పారు హేమ.

స్వప్ననాయిక:

ఆమెకి గురువుగా ఉండటమే కాకుండా, హేమ మాలినిని అందాలరాశిగా, అతిలోక సౌందర్యవతిగా, దైవత్వం, దయల స్వరూపిణిగా ప్రతిపాదించే ప్రసిద్ధ ట్యాగ్‌లైన్‌‌ను సృష్టించారు అనంతస్వామి.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను డిజైన్ చేస్తున్నప్పుడు, నిర్మాత అనంతస్వామి హేమ ముఖం కింద ‘రాజ్ కపూర్స్ డ్రీమ్ గర్ల్’ అనే పదాన్ని జోడించారు. విడుదలకు నెలరోజుల ముందు, పెద్ద నగరాల్లో హేమ లైఫ్-సైజ్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు, ఇది ఆమెకు మునుపెన్నడూ ఎదురవని గొప్ప అనుభవం.

“ఆ ఆలోచన అనంతస్వామిగారిదే” అని హేమ గుర్తుచేసుకున్నారు. “ఇది పబ్లిసిటీ స్టంట్ అని, సినిమా విడుదలయ్యాక జనాలు మర్చిపోతారని అనుకున్నాం. కొన్ని పోస్టర్లు చాలా తమాషాగా ఉండేవి. వాటిపై ‘నలభై నాలుగేళ్ల రాజ్ కపూర్ పదహారేళ్ల హేమ మాలినితో ప్రేమలో ఉన్నాడు’ లాంటి స్లోగన్స్ రాసి ఉండేవి! నేను ఈ పబ్లిసిటీ జిమ్మిక్‍ను ఆస్వాదించాను. ‘సప్నో కా సౌదాగర్’ విడుదలైన తర్వాత, పత్రికలు, ప్రజలు నన్ను ‘డ్రీమ్ గర్ల్’ అని పిలవడం ప్రారంభించారు. ఆ పేరు ఎలా పుట్టిందో నాకు తెలుసు. అయితే ఆ పేరుకు తగ్గట్టు నా ప్రయత్నం ఉందా అని జనాలు తరచుగా అడిగేవారు. అంత లేదేమో! ఆ ట్యాగ్ నన్ను ఆశ్చర్యపరిచింది. బహుశా, భారతీయ మహిళల సాధారణ ఇమేజ్‌కి నా ముఖం, నా వ్యక్తిత్వం బాగా నప్పాయని నేను భావించాను. ఎవరైనా నన్ను వారితో పోల్చుకోవచ్చు.. ఎందుకంటే నాది ఒక సాధారణ భారతీయ రూపం. అవును, నేను చేసిన ఏకైక పని – నా కుటుంబాన్ని లేదా నా అభిమానులను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే లేదా బాధించే పాత్రలను ఎప్పుడూ అంగీకరించలేదు. కాబట్టి, ఆ పేరు నిలిచిపోయింది. పంపిణీదారులు, నిర్మాతలు దానిని ఉపయోగించడం కొనసాగించారు.” చెప్పారు హేమ.

‘సప్నో కా సౌదాగర్’ – అహరణకి గురై ఒక జిప్సీ అమ్మాయిగా పెరిగిన యువరాణి కథ. ఈ చిత్రంలో హేమ పోషించిన పాత్ర, ప్రపంచాన్ని శుద్ధం చేయాలని తపించే రాజ్ కపూర్‌ పాత్రతో ప్రేమలో పడుతుంది. పాటలు హిట్ అయి, సినిమాకు గొప్ప స్పందన వచ్చింది. నటిగా హేమ నైపుణ్యం గురించి వివరించడానికి ఏమీ లేదు, అలా అనీ పూర్తిగా కొట్టిపారేయలేము కూడా. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్కిల్స్ ప్రేక్షకులను, నిర్మాతలను ఆకట్టుకున్నాయి. నటిగా ఆమె ప్రస్థానం కొనసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here