[box type=’note’ fontsize=’16’] “సకల జీవులకు ప్రాణాధారం నీరు. నీళ్ళు దప్పిక తీర్చి మనిషిని చల్లబరచడమే కాదు, ప్రచండాగ్నిని సైతం నియంత్రించగలవు” అంటున్నారు జె. శ్యామల “మానస సంచరరే-4: తరంగమై… జల తరంగిణై…!” అనే కాలమ్‍లో. [/box]
ఎదురుచూపులు… గోదావరి దర్శనం కోసం… మనసు తలపుల మునకలు… నదులు… నీ, నా… తేడా లేకుండా నీరందించే ప్రాణదాతలు. నీటిని అవలోకించాలే కానీ నీరు చెప్పే నిజాలెన్నో. ‘నవ్వు వచ్చిందటే కిలకిల… ఏడుపొచ్చిందటే వలవల… గోదారి పాడింది గలగల… దానిమీద నీరెండ మిలమిల…’, ‘నదినిండా నీళ్లు ఉన్నా, మనకెంత ప్రాప్తమన్నా… గరిటైతే గరిటెడు నీళ్లే. కడవైతే కడివెడు నీళ్లే… ఎవరెంత చేసుకుంటే, అంతేకాదా దక్కేదీ…’ ఎంత గొప్పతత్వం… సత్యమే కదా. ఆ క్షణం రానే వచ్చింది. గోదావరి బ్రిడ్జి పై రైలు… ధన్… ధన్… ధన్… నా గుండె వేగం కూడా దాంతో పోటీపడింది. కళ్లనిండా రాత్రి వెలుగుల్లో గోదావరి అందాలు. ‘వేదంలా ఘోషించే గోదావరి… అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి…’ నీటి హెూరును వేదఘోషగా అభివర్ణించిన ఆరుద్రకు ‘జోహార్!’ అంది నా మనసు. నీళ్లకు ఉండే ఆకర్షణ శక్తి అంతా, ఇంతా కాదు… మనసంతా సంతోష తరంగాలు… ‘ఉప్పొంగెలే గోదావరి… ఊగిందిలే చేలో వరి… భూదారిలో నీలాంబరి… మా సీమకే చీనాంబరి… వెతలు తీర్చు మా దేవేరి… వేదమంటి మా గోదారి…’ వేటూరి పాట నా నోట అప్రయత్నంగా… కాలం కరిగిపోయింది. బ్రిడ్జి దాటింది రైలు… గోదావరికి అతుక్కున్న నా చూపును బలవంతంగా వెనక్కు మళ్లించి, నా బెర్త్ దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ అందుకుని, కాసిని నీళ్లు తాగి పడుకున్నాను. కానీ మనసు మాత్రం నీళ్ల దగ్గరే ఆగింది. ఆలోచనల అలలు ఎగసి పడుతున్నాయ్.
ఒకప్పుడు రైలు ప్రయాణమంటే మంచినీళ్ల మరచెంబు ఉండాల్సిందే. బామ్మగారు మరచెంబు రైల్లో మరిచిపోవటం, మరచెంబు నింపుకు రావటానికి రైలు దిగి, రైలు కూత విని హడావిడిగా పరుగులు తీసి, ఆయాసపడుతూ రైలు ఎక్కటం, మరచెంబు నీటి సాకుతో ప్రేమాయణం సాగించడం… ఇలా ఎన్నో ‘సమ్’ ఘటనలతో కథలొచ్చాయి. మరచెంబు కనుమరుగై చాలాకాలమే అయింది.
పంచభూతాల్లో నీరొకటి. ఈ ఇలా తలంపై మూడొంతుల నీళ్లు, ఒక వంతు భూమి ఉన్నాయట. అంత నీరున్నా తాగగల నీరు, ఉపయోగపడే నీరు కొంతే. సకల జీవులకు ప్రాణాధారం నీరు. నీళ్ళు దప్పిక తీర్చి మనిషిని చల్లబరచడమే కాదు, ప్రచండాగ్నిని సైతం నియంత్రించగలవు. బావులు, కాలువలు, ఏర్లు, సెలయేర్లు, నదులు, జలపాతాలు… ఇలా నీటి వనరులెన్నో. సముద్రాలు కూడా ఉన్నాయ్. వీటి నీరు ఉప్పగా ఉండి తాగేందుకు పనికిరాకపోయినా ఎన్నో జలచరాలకు నివాసాలుగా ఉన్నాయి. అయినా ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో ఉప్పునీటిని కూడా మంచినీటిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు కడవలతోనో, కావడి తోనో ఏ బావికో, ఏరుకో, నదికో వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లు. వీధి కొళాయిలు రావడంతో సీన్ మారింది. అయితే ఆ కొళాయిల దగ్గర నీటికోసం కొట్లాటలు, సిగపట్లు నిత్యకృత్యాలుగా ఉండేవి. ఆ తర్వాత చాలావరకు ఇంటింటికి నల్లాలు రావడంతో ఆ దృశ్యాలు అంతగా లేవనే చెప్పాలి. అయినా దేశంలో ఇంకా అనేక మారుమూల ప్రాంతాల్లో బిందెడు నీటికోసం మైళ్లకొద్దీ వెళ్లే ప్రజ లెందరో ఉన్నారు. అంతేనా… వేసవి వచ్చిందంటే చాలు పల్లె, పట్టణం తేడా లేకుండా నీటి కటకట మామూలే. బోర్లు తవ్వితవ్వి అవి కూడా అడుగంటి, ఎండే పరిస్థితులు దాపురించాయి. రాష్ట్రాల మధ్య జల జగడాలు మామూలే. ప్రాణం పోసే నీరే ప్రాణాలు తీస్తుందనటానికి తాజా ఉదాహరణ కేరళ వరద బీభత్సం. ‘నారు పోసిన వాడు నీరు పోయడా…’ అని ఓ సామెత. ఆ నమ్మకం చాలా సార్లు వమ్మవటం తెలిసిందే.
అంతలో ‘అమ్మా, మంచినీళ్లు’ పై బెర్త్‌లో కుర్రాడు అడగటం వినిపించింది. ‘నీ పక్కనే వాటర్ బాటిల్ ఉంది. చూడు’ అందావిడ నిద్రలో జోగుతూ. కుర్రాడు నీళ్లు తాగడంలో రైలు ఊపుకి బాటిల్ కాస్తా చేయి జారి, కిందపడింది. వాళ్లమ్మకు నిద్రమత్తు వదిలి “వెధవా! బాటిల్ జాగ్రత్తగా పట్టుకోవాలని తెలీదు. ఇంకా నయం అందులో కొన్నే నీళ్లున్నాయి” అంటూ బాటిల్ తీసి పక్కన పెట్టి మళ్లీ నిద్రకుపక్రమించింది. మళ్లీ నా ఆలోచన నీళ్లలో మునిగింది… నీళ్లు అమ్మటం అనేది తాను తొలిసారిగా ఢిల్లీలో చూసింది. అక్కడ బండిపై నీళ్లు అమ్మటం చూసి, ‘నీళ్లు కూడా అమ్ముతారా’ అని ఆశ్చర్యపోయింది. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే దేశమంతటా వాటర్ బాటిల్స్ అమ్మకాలు మొదలయ్యాయి. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్లు కడుక్కోవటానికి నీళ్లు, తాగడానికి మంచినీళ్లు అందించటం కనీస మర్యాదగా ఉండేది. ఇప్పుడు కాళ్లు కడిగే పనే లేదు. మంచినీళ్లు అడిగే వాళ్లు కూడా అరుదే. ‘ఏం తాగుతారు… కాఫీయా, టీయా… పోనీ కూల్‌డ్రింక్’ అని అడుగుతుంటారు. ‘మంచి తీర్థం’ పుచ్చుకోవటం అనేది పాతకాలం మాట. ఇప్పుడు తీర్థమంటే మద్యమనే అర్థమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. పైగా రాజకీయ నాయకులు పార్టీలు మారినప్పుడు ఫలాని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు’ అంటున్నారు. అన్నట్లు నా బాల్యంలో రేడియోలో ఓపాట వచ్చేది… ‘తరలి రారమ్మా… గౌతమి, మంజీర ఓ నాగావళి ఓ వంశధార… తుంగభద్ర పినాకినీ… ఉత్తుంగభంగ కృష్ణవేణీ…’ ఉత్సాహంగా పాడుకునేవాళ్లం. నదుల మీద ఎన్ని పాటలో! ‘కృష్ణా తరంగాల సారంగ రాగాలు… కృష్ణలీలా తరంగిణీ భక్తి గీతాలు’ అని ఓ కవి కృష్ణమ్మను కీర్తిస్తే, అంటే ‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, విశ్వనాథ కవితై, అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై, అది కూచిపూడి నడకై’ అంటూ మరో కవి కిన్నెరసానిని అభివర్ణిస్తాడు.
‘గంగ’ అతి పవిత్రమైందన్న విశ్వాసం ఎందరికో. అందుకే కాశీకెళ్లినవారు గంగాజలాన్ని తీసుకువచ్చి పదుగురికీ పంచుతుంటారు. పుష్కరాల సమయంలోను డిటో డిటో. ఆ గంగను దివినుంచి భువికి దింపటానికి భగీరథుడు చేసిన యత్నం… నేటికీ అత్యంత క్లిష్టమైన పనుల సాధన ‘భగీరథ ప్రయత్నం’గా వాడుకలో నిలిచిపోయింది. ఆ ‘గంగ’ను జటాజూటంలో బంధించిన శివుడు గంగాధరుడయ్యాడు. అందుకే ఓ సినీ కవి ‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకూ…’ అన్నాడు. అసలు ‘గంగ’ అంటేనే నీళ్లు అనే అర్థం వాడుకలో బలపడి పోయింది. అందుకే ఫలాని పని అయ్యేవరకు ‘పచ్చి’గంగ’ ముట్టను’ అనడం పరిపాటి అయింది…
ఇంక యమునో.. వసుదేవుడు పసికందైన కన్నయ్యను చెరసాలనుంచి తీసుకెళ్లి, నందుని ఇంటికి చేర్చే క్రమంలో రెండుగా చీలి దారి ఇచ్చిన ఘనత యమునది. యమునా నదీ తీరాన రాధాకృష్ణుల ప్రణయం రసరమ్యం కదా. జయదేవుడు ‘ధీర సమీరే, యమునా తీరే… వసతివనే వనమాలి’ అంటాడు. నవ్వినా, ఏడ్చినా వచ్చేవి కన్నీళ్లు. అతి విషాదంలో ఉన్న నాయకుడు “ఒక కంట గంగ, ఒక కంట యమున ఒక్కసారే పొంగి ప్రవహించెను’ అంటాడు. ‘కన్నీరు మున్నీరైంది’ అనే పదప్రయోగం వాడుకలో వినిపించేదే. మనసు ద్రవించిందిందనే సందర్భంలో ‘కరిగి నీరయింది’ అనటం మామూలే. ‘ఏటీలోని కెరటాలు ఏరు విడిచిపోవు… ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు’ అంటాడు మరో కవి.
అన్నట్లు చిన్నప్పుడు కాకికథ ఉండేది. దాహమేసిన కాకికి ఎక్కడా నీరు కనపడదు. చివరకు ఓ చోట కుండ అడుగున కాసిని నీళ్లు… కాకి తెలివిగా గులక రాళ్లు వేసి నీళ్లు పైకొచ్చేలా చేసి, దప్పిక తీర్చుకుని హాయిగా ఎగిరిపోతుంది. ఎంత ఇంగ్లీషు మీడియం చదువులైనా ఇప్పుడు కూడా ‘వన్స్ దేర్ వాజ్ ఎ క్రో’ అంటూ ఆ కథనే నేర్చుకుంటున్నారు. కట్టెలు కొట్టేవాడి గొడ్డలి నీళ్లల్లో పడితే నదీమ తల్లి అనుగ్రహించి… బంగారు, వెండి గొడ్డళ ఇవ్వబోయినా నిజాయితీపరుడైన అతడు తనది మామూలు గొడ్డలేనని వాటిని తిరస్కరిస్తాడు. నదీమ తల్లి అతడి నిజాయితీకి మెచ్చి అసలు గొడ్డలితో పాటు, బంగారు గొడ్డలి కూడా ఇస్తుంది. మరో కట్టెలు కొట్టేవాడు ఈ సంగతి తెలుసుకుని కావాలని గొడ్డలిని నదిలో పడేయటం, నదీమ తల్లి అతడి దురాశను గుర్తించి, కీలెరిగి వాత పెట్టటం మరో కథ.
అది అటుంచితే మన జాతీయ గీతం ‘జనగణమన’లో వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్చల జలధి తరంగ’ అని… వందేమాతర గీతంలో “సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం’ అని నీటి ప్రస్తావన ఉండనే ఉంది.
ఇక దేవుడికి పూజలో మన చిరునామా చెబుతూ ‘కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే’ అంటూ వివరం చెబుతాం. ఆ పైన కలశ పూజ చేస్తూ ‘గంగేచ యమునేచైవ, గోదావరి, సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు’ అని పఠిస్తాం. దేవుడికి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అని నీటిని సమర్పించటం తెలిసిందే. జలం, తోయం, పాద్యం, ఉదకం, సలిలం ఇలా నీటికి ఎన్నో నామాంతరాలు. శ్రీహరి, శ్రీలక్ష్మి నీటినివాసులే.
నీటి అందాలు ఎంతో వైవిధ్యంతో ఉంటాయి. కలువలు విరిసిన కోనేరు అందాలు ఒక తీరైతే, పడవలు సాగే నదుల అందం మరో తీరు. తెప్పోత్సవాల సందర్భాల్లో ఆ నీటి తళతళలే వేరు. ఒడ్డున ఉండే చెట్ల నీడలతో, పైన ఎగిరే పక్షులతో, చేపల కదలికలతో నదుల సౌందర్యం భిన్నాతిభిన్నం. ఇక పుష్కర శోభలైతే వర్ణనాతీతం. నీటిమీది రాతలు ఇట్టే చెరిగిపోతాయని శుష్క వాగ్దానాలను నీటిమీది రాతలంటుంటాం. అన్నట్లు నీటి చిత్రాలు కూడా విచిత్రాలే. నేల పైన, గోడలపైన నీరు పడి క్రమేపీ ఆరుతుంటే రకరకాల చిత్రాలు దర్శనమిస్తాయి. మన ఊహల్ని బట్టి ఎన్నిటినైనా దర్శించవచ్చు. నీటి అద్దంలో నీడలు భలేగా ఉంటాయి. అందుకే ఓ సినీకవి.. ‘నీటిలో నేను నీ నీడనే సూడాల, నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల, పరవళ్ల, నురుగుళ్ల గోదారి ఉరకాల’ అన్నాడు. అలనాడు అర్జునుడు నీటిలో చేప నీడను చూసే కదా మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. విలువిద్యలో నైపుణ్యానికి అదొక పరీక్ష. జలకాలాటలు, ఈతలు మనిషికి ఎంత ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని ఇస్తాయి!
జీవుల మనుగడకు ఏడుగడైన నీటిని మనమెంత నిర్లక్ష్యం చేస్తున్నామో… వాటిని మలినాలతో, రసాయనాలతో కలుషితం చేయడం, వృథా చేయడం, చివరకు స్వయంకృతాపరాధాలుగా మారి, నీటి సమస్య ముప్పుతిప్పలు పెడ్తుంది. నీరు పారదర్శకమైంది. రంగులేనిది. నీరంత పారదర్శకంగా మనగలగటం ఎంత గొప్ప… కళ్లు మండుతున్నాయి. ఆలోచనల్లో పచార్లు చేస్తుంటే కాలగమనం తెలియటం లేదు. అబ్బో తెల్లారవస్తోంది. కొద్దిసేపట్లో నా గమ్యం కూడా వస్తుంది. ఇక నిద్ర మాట లేదు. మెల్లిగా లేచి ఓసారి కిటికీ తెరిచాను. వాన కురిసిందల్లే ఉంది. చెట్లన్నీ తలారా స్నానించి, నీటి బిందువులను జారవిడుస్తూ కొత్త సొగసులీనుతున్నాయి. అందమైన ప్రకృతి… ఆ క్షణాన మనసంతా ‘జల తరంగిణి’!