మహిషాసుర మర్దిని

1
3

[12 అక్టోబర్ 2024 న విజయదశమి సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న సినీ వ్యాసం.]

సినిమాలు, నాటకాలు అభివృద్ధి కాకముందు పూర్వం పల్లెల్లో వినోదం కోసం బుర్రకథలు, యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, కోలాటాలు, గొల్ల సుద్దులు, తప్పెటగుళ్ళు వంటి అనేక కళారూపాలు ప్రదర్శించేవారు. వీటిలో ఎక్కువ ప్రజాదరణ పొందినది హరికథ (హరికథకు ఆద్యుడు ఆదిభట్ల నారాయణదాసు). మొదట్లో పురాణ సంబధమైన కథలే హరికథలుగా చెప్పేవారు. రానురాను అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. హరికథను చెప్పే కళాకారుడిని హరిదాసు అంటారు. ఇది సంగీతం, సాహిత్యం కలబోసిన కళారూపం. ఇందులో కథకుడు మధురమైన గానంతో కథ చెబుతూ, చేత్తో చిడతలు వాయిస్తూ, కాళ్ళతో నాట్యం చేస్తూ, మెడలో పూలమాల వేసుకుని, పట్టుబట్టలు కట్టుకుని, చక్కటి అభినయంతో ప్రదర్శిస్తాడు.

మన సినిమాల్లో సందర్భానుసారంగా ఈ కళారూపాలను అంతర్నాటకాలుగా, ప్రదర్శనలుగా చేర్చేవారు. అలాంటి వాటిలో ‘భద్రకాళి’ (1977) చిత్రంలో ‘మహిషాసుర మర్దిని’ హరికథ ఒకటి. ఒక ఊరిలో దేవీనవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆరోజు నవరాత్రులలో ఆఖరి రాత్రి. దేవీ ఆలయంలో మహిషాసురుడి వధ ఘట్టం హరికథగా చెబుతున్నారు. ఈ పాట దాశరధి రచించగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పి.సుశీల గానం చేశారు. కథకురాలిగా తాతినేని రాజేశ్వరి నటించింది. కథకురాలు కథ ఇలా మొదలు పెడుతూ ఉన్నది.

మహిషాసురుడను మహారాక్షసుడు మహిలో చెలరేగే

అహంకారమున అవనీ జనులను అణగార్చగ సాగే

అమరావతిపై దండు వెడలి దేవాదుల హింసించే

యజ్ఞయాగముల భంగమొనర్చి అరాచకము గావించే

కరవాలముతో నరుల శిరములను కరకర ఖండించే

అన్నెము పున్నెము ఎరుగని వారిని అయ్యో! దండించే”

రంభుడు అనేవాడు మహిషిని చూసి మోహించాడు. వారిద్దరికీ మహిషుడు, రక్తబీజుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు చావు లేకుండా వరం ఇవ్వమని కోరాడు మహిషుడు. “అది అసాధ్యం. పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు. మరేదైనా వరం కోరుకో!” అన్నాడు బ్రహ్మ. “అయితే దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులలో ఏ పురుషుడి వల్లా చావులేకుండా వరం ఇవ్వు” అన్నాడు మహిషుడు. “తథాస్తు!” అని అదృశ్యమైపోయాడు సృస్తికర్త.

వరగర్వంతో చెలరేగి పోయి స్వర్గం మీదకు దండెత్తాడు మహిషుడు. ఏ దానవుడైనా మొదట దండెత్తేది అమరావతి పైనే! ఎందుకంటే దేవతలకు, రాక్షసులకు బద్ధ విరోధం! అమరావతి తర్వాత భూలోకం పైకి వస్తారు రాక్షసులు. భూమి మీద ఋషులు యజ్ఞాలు, యాగాలు చేసి హవిస్సు (యజ్ఞంలో ఉపయోగించిన పవిత్రమైన అన్నం) లను ఇంద్రుడికి అర్పిస్తారు. ఋషుల తపోశక్తి వలన, మంత్రశక్తి వలన సమర్పించిన ఆ హవిర్భాగాలను భుజించగానే ఇంద్రుడు మరింత శక్తిమంతుడవుతాడు. ప్రత్యుపకారంగా మానవులకు పంటలు పండించటానికి అవసరమైన వర్షాన్ని, త్రాగునీటిని ఇచ్చి, రక్షణను కల్పిస్తాడు. ఈ విధంగా దేవతలు, మానవులు పరస్పర సహకారంతో జీవిస్తూ ఉంటారు. అందుకే రాక్షసులు ముందు ఇంద్రుడి మీద, తర్వాత మానవుల మీద దండెత్తి వస్తూ ఉంటారు. యజ్ఞ యాగాలు సాగకుండా ధ్వంసం చేయటం, ఋష్యాశ్రమాలను తగల బెట్టటం, మునులను, ఋషులను చంపటం చేస్తూ ఉంటారు. తర్వాత కథను ఇలా కొనసాగిస్తూ ఉంది కథకురాలు.

వచనం:- “నీతి నియమాలు, శాంతి సౌఖ్యాలు, యజ్ఞ యాగాలు లేని కారణమున ఖిన్నులైన సుర, నర, ఖేచర, కిన్నెర, మునిగణములు కళ్యాణ సంహరణ కారణులైన హరిహరులను ఆశ్రయించి మొరపెట్టుకొను విధం బెట్టిదనిన —

రూపకం :- దేవదేవ కావరావా! సురనరనుత దేవదేవ కావరావా!

దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై

అవని పైన అవతరించి ఆశ్రితులను బ్రోవలేవా!”

యజ్ఞయాగాలు లేకపోతే ప్రజలకు ఆహారం, నీరు ఉండదు. ఆకలి బాధ ఎక్కువవుతుంది. ఆ బాధలో నీతినియమాలు ఉండవు, స్వార్థం పెరిగిపోతుది. ఈ పరిణామాలతో దుఃఖిస్తూ దేవతలు, నరులు, ఖేచరులు (ఆకాశమార్గాన ప్రయాణించే వారు), కిన్నెరలు, మునులు అందరూ విష్ణువును, పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నారు. ఏమని? సురలు, నరుల చేత నుతించ (ప్రార్థించ) బడే దేవా! మమ్మల్ని కాపాడు. దుర్మార్గులను శిక్షించి, భక్తులను, సన్మార్గులను రక్షించటానికి భూలోకంలో అవతరించి, మిమ్మల్ని ఆశ్రయించిన వారిని కాపాడు అని అడుగుతున్నారు. క్షీరసాగరమథనంలో సుర (మద్యం) పుట్టింది. దాన్ని రాక్షసులు తిరస్కరించారు, దేవతలు స్వీకరించారు. కనుక దేవతలకు సురలు, రాక్షసులకు అసురులు అని పేరు వచ్చింది.

వేదాలను హరించిన సోమకాసురుడిని సంహరించటానికి మత్స్యరూపుడిగా, హిరణ్యాక్షుడిని వధించటానికి వరాహమూర్తిగా అవతరించాడు విష్ణువు. కానీ ఇక్కడ మహిషుడు ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేకుండా వరం కోరాడు కదా! కనుక స్త్రీ చేతిలోనే మరణించాలి.

హరిహరులలోని తేజము ఆదిశక్తి

మోమునందు విరాజిల్ల మునులు పొగడ

భర్గయై దుర్గయై తల్లి పరిఢవిల్లె

భద్రకాళి రూపమ్మున ప్రభవమందే!

శ్రీమద్రామాయణ గోవిందో హరి!

ఆ జగన్మాత దయా సముపేత చంద్రమౌళి భద్రకాళి రౌద్రాకారముతో ఎలా ఆవిర్భవించిందయ్యా అంటే —“మహిషాసురుడు మరణించాలంటే ఒకటే మార్గం. శివకేశవుల మహాతేజాంశాల నుంచీ స్త్రీ జన్మించాలి. అలా జన్మించిన స్త్రీ వందమంది మహిషులనైనా వధించ గలదు. విష్ణువు నుంచీ వైష్ణవ తేజస్సు వచ్చింది. పరమేశ్వరుడి నుంచీ భయకరమైన రుద్రతేజస్సు బైటకి వచ్చింది. ఆ తేజస్సుల నుంచీ ఒక అంగన ఉద్భవించింది. ఆమెకు వారి శక్తిని ఇచ్చారు. సకల ఆయుధాలను ప్రసాదించారు. ఇక్కడ భర్గ, దుర్గ, భద్రకాళి మొదలైనవి ఆమె యొక్క శక్తి రూపాలు. మహిషాసురుడిని మర్దించటానికి బయలుదేరింది భద్రకాళి. ఆ సమయంలో —

ఫెళఫెళ ఫెళఫెళ భయంకరముగా పిడుగులు కురిసినవి

తళతళ తళతళ దిక్కులనిండా వెలుగులు విరిసినవి

ఘణంఘణం ఘణ లోకమంతటా ఘంటలు మ్రోగినవి

ఝణంఝణం ఝణ దేవి పాదముల గజ్జెలు పలికినవి”

బ్రహ్మాండం బద్దలై పోతుందా అన్నట్లు ఫెళఫెళా పిడుగులు పడ్డాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు తళతళ మని మెరుపులు మెరిశాయి. భూమి కంపించింది. పర్వతాలు అదిరాయి. సముద్రం ఎగసిపడింది. ఘణఘణమని ఘంటలు లోకమంతటా వినిపించాయి. రాక్షసుల గుండెలు అదిరేలా, దేవతలు ఆనందించేలా దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ అడుగులు ముందుకు వేసింది. ఆమె అడుగులు వేస్తూంటే పాదాల గజ్జెల శబ్దానికి దశదిశలు మారుమ్రోగాయి. ఆమె అష్టాదశ భుజాలతో వివిధ ఆయుధాలను ధరించింది.

త్రిశూల శాలిని, కుఠార ధారిణి దేవి అవతరించే

శంఖము, చక్రము, దండము, ఖడ్గము జనని ధరియించె

ఘలంఘలం ఘల కంకణములతో కదిలిందా తల్లి

ఢమఢమ ఢమఢమ శబ్దము తోటి ఢమరము వినిపించే

మహిషాసురుని మర్దించుటకై మాత బయలుదేరే

రుద్రరూపిణి భద్రకాళియై కాళి బయలుదేరే

భద్రకాళి బయలుదేరే, భద్రకాళి బయలుదేరే”

ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో కుఠారం (గొడ్డలి), ఇంకో చేతిలో ఖడ్గం, ఇంకా మిగిలిన చేతులలో పరశువు, బాణం, తూణీరం, శంఖం, గద ఇలా పద్దెనిమిది చేతులతో వివిధ ఆయుధాలను ధరించి కదిలింది. ఆమె నడుస్తూ ఉంటే చేతుల కంకణాలు ఘలఘల మని శబ్దాలు చేశాయి. “దేవతలారా! విచారించకండి. మీకు అభయం ఇస్తున్నాను. ఆ మహిషుడినీ, వాడి బలగాన్నీ సంహరించటం నాకు క్షణంలో పట్టే పని. ఇక మీకు మంచి రోజులు వచ్చాయి” అని చెప్పి అట్టహాసం చేసింది. “ఇక యుద్దానికి సన్నద్దమవు” అని మహిషుడితో చెప్పినట్లుగా ఢమరువు మ్రోగించింది. ఆ ధ్వనికి కులపర్వతాలు గిర్రున తిరిగాయి. సముద్రాలు ఘూర్ణిల్లాయి. ఎర్రటి పట్టు చీరతో, రత్నాలతో ప్రకాశించే కిరీటంతో, భుజాలకు దివ్య భుజకీర్తులతో, నవరత్న ఖచిత కంకణాలతో, ప్రకాశిస్తూ రౌద్రాకారంతో మహిషాసురుడిని మర్దించటానికి బయలుదేరింది భద్రకాళి.

చిత్రకారిణి శ్రీమతి గోనుగుంట సరళ

ఆ భీకర శబ్దాలు విని తెలుసుకుని రమ్మని మహిషుడు దూతలను పంపటం, శుంభనిశుంభులు, ధూమ్ర లోచనుడు, రక్త బీజుడు వంటి మహిషుడి బలగాన్ని వధించటం, అతడితో యుద్ధం అదంతా తర్వాత కథ. ఇవి హరికథలో చెప్పలేదు. భద్రకాళి ఆవిర్భావం వరకే ఈ పాటలో చెప్పారు.

ఈ పాటను మధురగాయని పి.సుశీల అత్యంత భావగర్భితంగా రోమాంచితం అయ్యేటట్లు గానం చేశారు. ఇది వింటుంటే భద్రకాళి రూపం మన కళ్ళముందు కనిపిస్తూ ఉంటుంది. ప్రణయ గీతమైనా, భక్తి గీతమైనా, లలిత గీతమైనా ఆమె ఏ పాట పాడినా ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఏకమై బృందగానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రుడు వీణ తీగలు పలికిస్తూ ఉన్నట్లు ఉంటుంది. “నా పాట సుశీల పాడితేనే ధన్యత చేకూరుతుంది” అని ప్రతి కవి భావించేవాడు. “నా పాత్రకు నేపథ్యగానం సుశీలే పాడాలి” అని కోరుకునే కథానాయికలు కోకొల్లలు. ఎందరో అభినేత్రులకి వచ్చిన పేరుప్రతిష్ఠలలో సుశీలకు కూడా భాగం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here