[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 7” వ్యాసంలో పొన్నూరు లోని భావన్నారాయణ స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]మొ[/dropcap]త్తానికి ఇక్కడ ఒక పురాతనమైన ఆలయం దర్శించటమేగాక, ఈ ఆలయం గురించి స్ధల పురాణం ప్రకారం, అక్కడి వారందించిన విశేషాల ప్రకారం కొన్ని కథలు కూడా తెలుసుకున్నాను. అవేమిటంటే…
బ్రహ్మ దేవుడు శ్రీ మహావిష్ణువు నాభి కమలంనుండి ఉద్భవించాడు కదా. సృష్టికి ముందు ఆయనకి ఏమి చేయాలో తోచక విష్ణుమూర్తిని ధ్యానించగా ఆయన తపస్సు చెయ్యమని చెప్పాడుట. అప్పుడు బ్రహ్మ తన తపస్సుకి అనువైన ప్రదేశంకోసం వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి రాగా ఇక్కడ ఆయన మనస్సుకి ఒక దివ్య తేజస్సు తోచిందిట. దానితో ఆ ప్రదేశము పవిత్రమైనదిగా భావించి బ్రహ్మ దేవుడు ఇక్కడ… అంటే పొన్నూరులో తపస్సు చేశాడుట. కథ, నిజమో మనకి తెలియదుగానీ, విన్న వెంటనే ఈ ప్రదేశం ఎంత మహద్భాగ్యం చేసుకుందో కదా అనిపిస్తుంది కదూ. ఇలాంటి ప్రదేశాలు మన భారత దేశంలోనే వున్నాయి మరి.
శ్రీ మహా విష్ణువు బ్రహ్మ దేవునికి ప్రత్యక్షమై ఆయన తపస్సుకి మెచ్చి వరమిస్తున్నానని, తన నిశ్వాసములనుండి పుట్టిన వేదాలని ఆధారంగా చేసుకుని చరాచర సృష్టిని ప్రారంభించమనీ చెప్పాడు. అక్కడ వారిరువురికీ గోష్టి జరిగింది కనుక ఆ ప్రదేశం గోష్టీవనము అనే పేరుతో ప్రసిధ్ధి చెందుతుందని కూడా చెప్పాడు. ఇక్కడ బ్రహ్మ తను తపస్సు చేసే సమయంలో స్నానపానాదుల కోసం ఒక సరస్సుని సృష్టించుకున్నాడు. ఆ సరస్సు పేరు బ్రహ్మ సరోవరము. ఇది క్షేత్ర మహిమ గురించి కథ.
భావనారాయణ స్వామి ఆవిర్భావము
పూర్వం అత్రి మహాముని కాశీలో నారాయణుని గురించి తీవ్రమైన తపస్సు చెయ్యగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయి వరం కోరుకోమన్నాడు. పూర్వ కాలంలో మహర్షులందరూ లోక కళ్యాణంకోసం తపస్సు చేసేవాళ్ళు, వరాలు కోరేవారు. అలాగే అత్రి మహర్షి స్వామిని అక్కడ కొలువు తీరమన్నాడు. అత్రి మహర్షి సదా నారాయణుణ్ణి మనసులో భావించినందుకు భావనారాయణుడు అనే పేరుతో విలసిల్లమని కూడా కోరాడు. వరమిచ్చిన స్వామి తర్వాత చాలా కాలం కాశీలో భావనారాయణుడి పేరుతో పూజలందుకున్నాడు.
కాశీనుంచి పొన్నూరుకు
పూర్వం గోష్టీవనము (పొన్నూరు) కి మూడు మైళ్ళు దూరంలో వున్న నండూరు గ్రామంలో కేశవయ్య అనే బ్రాహ్మణుడు వుండేవాడు. ఆయనకి సంతానం లేకపోవటంతో అనేక పూజలు వ్రతాలు చేస్తూ వుండేవాడు. ఆయనకి అన్నింటిలోనూ ఆయన మేనల్లుడు గోవిందయ్య అనే అతను సహాయం చేసేవాడు. గోవిందయ్యకి గూని వుండేది. కేశవయ్య ఒకసారి సంతానం కోసం కాశీ యాత్రకి వెళ్తూ గోవిందయ్యని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ గంగా స్నానం చేసి భావనారాయణుణ్ణి, విశ్వనాధుడిని సేవిస్తూ ఒక నెల రోజులు గడిపారు.
ఒక రోజు భావనారాయణ స్వామి సన్నిధిలో వుండగా గోవిందయ్య తన మేనమామతో… “మామా, భగవదనుగ్రహం వల్ల నీకు ఆడపిల్ల పుడితే నాకిచ్చి పెళ్ళి చెయ్యాలి. ఈ మాటకి ఈ భావనారాయణే సాక్షి” అన్నాడు. కేశవయ్య కూడా తప్పకుండా అలాగే చేస్తానని మాట ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఇంటికి చేరారు. తర్వాత కొంత కాలానికి కేశవయ్యకు ఆడపిల్ల కలిగింది. ఆమెకు అక్కలక్ష్మి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు.
అక్కలక్ష్మికి వివాహ వయస్సు వచ్చాక కేశవయ్య అందాల రాశి అయిన తన కూతురుని గూనివాడయిన గోవిందయ్యకి ఇచ్చి వివాహం చెయ్యటం ఇష్టంలేక వేరే సంబంధాలు చూడసాగాడు. ఆ ప్రయత్నాలు తెలుసుకున్న గోవిందయ్య తన మామకి కాశీలో ఆయన ఇచ్చిన మాట గుర్తు చేశాడు. కేశవయ్య ఆ ఇబ్బందినుంచి తప్పించుకోవటానికి, “ఆ దేవుడు వచ్చి సాక్ష్యం ఇస్తే అలాగే చేస్తానులే” అన్నాడు. గోవిందయ్యకు ఏమి చెయ్యాలో తెలియక, ఆ దేవ దేవుణ్ణి సాక్షిగా తెస్తానని, అప్పటిదాకా అక్కలక్ష్మికి వివాహ ప్రయత్నం చెయ్యవద్దని తన మేనమామకి గట్టిగా చెప్పి తాను భావనారాయణుణ్ణి తలచుకుంటూ కాశీ వెళ్ళాడు. గోవిందయ్య ప్రార్ధనలకు ప్రసన్నుడైన భావన్నారాయణుడు ప్రత్యక్షమై గోవిందయ్యకోసం సాక్ష్యం చెప్పటానికి వస్తానని చెప్తాడు. అది విని అత్రి మహర్షి గోవిందయ్య కథ అంతా తెలుసుకుని, భావన్నారాయణునితో, స్వామీ, నన్ను వదలి ఈ భక్తుడి వెంట వెళ్తావా, నా గతి ఏమిటి అని అడిగాడు. దానికి స్వామి, నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళగలనా కాశీ విశ్వనాధుడు, విశాలాక్షితో నువ్వుకూడా నా వెంట రమ్మని పలికి అందరితో కలిసి బయల్దేరాడు. అయితే బయల్దేరేముందు గోవిందయ్యని హెచ్చరించాడు… “నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, నేను నీ వెనకనే వస్తాను” అని.
గోష్టీవనము (పొన్నూరు) చేరుకునేసరికి గోవిందయ్యకి స్వామి నిజంగానే తన వెనక వస్తున్నాడా లేదా అనే అనుమానంతో వెనక్కి తిరిగి చూశాడు. అంతే స్వామి అక్కడే సుస్ధిరుడై అర్చా రూపంలో వెలిశాడు. కేశవయ్యకి ఈ వార్త తెలిసి, కుటుంబంతో సహా వచ్చి, తన తప్పు క్షమించమని స్వామిని ప్రాధేయపడ్డాడు. అప్పుడు స్వామి “కేశవా, నీ అల్లుడు నా అనుగ్రహంతో మంచి రూపసి అవుతాడు. నువ్వు నీ కుమార్తెను అతనికిచ్చి వివాహం చెయ్యి. వారిరువురు ఆదర్శ దంపతులై నీ వంశాన్ని తరింప చేస్తారు” అని ఆజ్ఞాపిస్తాడు.
ఆ సమయంలో ఆంధ్ర దేశాన్ని పరిపాలిస్తున్న సత్యవ్రత మహారాజు ఈ విషయం తెలుసుకుని తన పరివారంతో వచ్చి స్వామిని దర్శించి, స్వామి ఆజ్ఞతో అక్కలక్ష్మీ, గోవిందయ్యల వివాహం జరిపించాడు. అప్పటినుంచీ, తన భక్తునికోసం సాక్ష్యం చెప్పటానికి వచ్చిన ఈ భావనారాయణుడు సాక్షి భావనారాయణుడుగా పేరు పొందాడు.
ఆ విధంగా ఈ స్వర్ణపురి బ్రహ్మ తపస్సు చేసిన పుణ్యస్ధలంగా, హరిహరులు (భావనారాయణుడు, కాశీ విశ్వేశ్వరుడు) నెలకొన్న పుణ్య క్షేత్రంగా ప్రసిధ్ధి పొందింది. పూర్వం ఈ భావనారాయణుడు ప్రమాణాల దేవుడుగా కూడా ప్రసిధ్ధి చెందాడు. ఇక్కడ లగ్న పత్రికలు వ్రాయించుటం, వివాహాది శుభ కార్యాలు జరిపించుటం సాధారణం. దుర్వ్యసనాలు మానటానికి స్వామికి పూజచేసి ఇక్కడ ప్రమాణం చేసి, ఆ ప్రమాణాన్ని పాటించేవారు. మాట తప్పినవారిని స్వామే శిక్షిస్తాడనే నమ్మకం వుండేది. ఈ మధ్య ఈ ప్రమాణాలు తగ్గాయి.
అమ్మవారు
ఇక్కడ వెలసిన అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మి. ఇదివరకు నిడుబ్రోలు గ్రామంలో పద్మశాలీలలో చింతక్రింది వారుండేవారు. వారి ధాన్యపు పాతరలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు వెలసింది. వారికి స్వప్నంలో కనిపించి తనని వారి ఇంటి ఆడబిడ్డగా భావించి, పొన్నూరులో వున్న భావనారాయణుని సన్నిధిలో ప్రతిష్ఠ చేయించి, లోక కళ్యాణార్ధం ఆ స్వామికిచ్చి వివాహం జరిపించమని ఆదేశించింది. వారు సంతోషంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటినుంచీ ఇప్పటిదాకా ఆ వంశీయులు శ్రీవారి కళ్యాణోత్సవ సమయంలో కట్న కానుకలు, తలంబ్రాలు, పసుపు కుంకుమలు తెచ్చి కళ్యాణం సమయంలో అమ్మవారికి సమర్పిస్తున్నారు.
ఉపాలయాలు
ఈ ఆలయంలో ఇంకా శ్రీ చెన్నకేశవస్వామి, లక్ష్మీనరసింహస్వామి, దాసాంజనేయస్వామి, విఖనసాచార్యస్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి అమ్మవార్ల ఉపాలయాలను కూడా దర్శించవచ్చు.
ఆలయ నిర్మాణం
అవుతు సీమని పరిపాలించిన అందెల నారపరాజు తన వీపు మీద వచ్చిన రాచపుండు ఎంతకాలానికీ తగ్గక పోయేసరికి తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయానికి కాల మహిమవల్ల స్వామి పై పుట్టలు లేచాయి. స్వామి నారపరాజుకి స్వప్న దర్శనమిచ్చి తన విగ్రహాన్ని బయటకి తీసి, అక్కడ వున్న నిర్మాల్యంతో రాచపుండుకి చికిత్స చేయించమని చెప్పాడు. ఆ విధంగా చెయ్యగా రాజు వ్రణం తగ్గింది. ఆ సంతోషంతో ఆలయ గోపురాలను నిర్మించాడు. తర్వాత అనేక రాజులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామికి అనేక కానుకలు సమర్పించారు.
1804వ సం.లో అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈ ఆలయాన్ని సర్వ హక్కులతో కొన్నారు. అప్పటినుంచీ ఆ వంశీకులే ఆలయ నిర్వహణ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. 1970నుంచీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో వున్నది.
ఈ ఆలయం సుమారు రెండు ఎకరాల స్ధలంలో నిర్మించబడ్డది. గోపురం ఎత్తు సుమారు 100 అడుగులు. దీనినే ఇంద్ర గోపురం అంటారు. కుళోత్తుంగ చోళ రాజుల శిలా శాసనాలు కూడా ఇక్కడ చూడవచ్చు.
ఉత్సవాలు
స్వామి అలంకార ప్రియుడు. భక్త సులభుడు. ఇక్కడ ఉత్సవాలన్నీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. వైశాఖ పౌర్ణమి స్వామి ఆవిర్భవించిన రోజుగా తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దసరా సందర్భంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి.
ఎంత అద్భుతమైన ఆలయమైనా అక్కడే వుండలేముకదా. అందుకే అక్కడనుంచి బయల్దేరి జిల్లెళ్ళమూడి బాట పట్టాము.