రచయిత్రి శ్రీమతి మాలా కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ

11
3

[‘నీ జతగా నేనుండాలి’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీమతి మాలా కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం మాలా కుమార్ గారూ.

మాలా కుమార్: నమస్కారమండీ.

~

ప్రశ్న 1. మీరు ప్రచురించిన 53 కథల సంపుటికి శీర్షికగా మొదటి కథ నీ జతగా నేనుండాలిపేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: నేను బ్లాగ్ రాస్తున్న రోజులలో ఒక చర్చ జరిగింది. ఒక అమ్మాయికి చిన్నప్పుడే వాళ్ళ బావతో పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ బావ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. దాని గురించి అంతా అప్పుడు చర్చించుకున్నారు. అంటే చిన్నప్పటి నుంచి అలా పేరు పెట్టి, ఆ అమ్మాయి మనసులో ఆశలు రేపి, ఇప్పుడు ఇలా అవుతే తన పరిస్థితి ఏమిటీ? అని. అదే నాకు ఆసక్తిగా అనిపించి ఆ పాయింట్స్ రాసి పెట్టుకున్నాను. దాన్ని పాజిటివ్‌గా బ్లాగ్ పోస్ట్ రాద్దామనుకున్నాను. నేను బ్లాగ్‌లో పోస్ట్‌లు రాస్తున్నప్పుడు, చాలామంది రచయితలు స్నేహితులు అయ్యారు. వాళ్ళు అప్పుడు నువ్వు చాలా బాగా రాస్తున్నావు కదా! కథలు రాయొచ్చు కదా! అని అంటుండేవారు. అప్పుడు దీని గురించే కథ ఎందుకు రాయకూడదు అనుకొని కథ రాశాను. నాకు విషాదంగా ముగించటము ఇష్టం ఉండదు. ఏదైనా కథ రాసి ఒక సమస్యను తీసుకొని దానికి పరిష్కారం చూపించాలి. అది అంతర్లీనంగా ఉండాలి. కానీ వ్యాసం లాగా ఉండకూడదు అన్నది మొదటి నుంచి కూడా నాకున్న అభిప్రాయం.

అందుకనే బావ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక, ప్రకాశంకు ఇచ్చి పెళ్ళి చేసినట్లుగా రాసాను. అతను ఆమెని అమెరికా తీసుకెళ్లి ఆమె మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని ‘నీ జతగా నేనుంటాను’ అని, ఆమెకు ధైర్యం ఇస్తున్నట్లుగా అతనితో అనిపించాలని భావన వచ్చింది. ఆ వాక్యం నాకు చాలా నచ్చి, అదే శీర్షికగా పెట్టాను.

‘రచన’ మాసపత్రికకు అది పంపించినప్పుడు, మరి నేను స్పెల్లింగ్ తప్పు రాశానో, మరి వాళ్ళు మార్చారో ఆ కథకు అనుగుణంగా అలా ఉంటుందని తెలియదు. మొత్తానికి అదే ‘నీ జతగా నేనుండాలి’గా మారిపోయింది. అది కూడా బాగానే ఉంది అని అనుకున్నాను. దానికి ‘కథాపీఠం’ అవార్డ్ కూడా వచ్చింది. నాకు అది నచ్చింది, నేను మొదటిగా రాసిన కథ కాబట్టి దాన్నే నా మొదటి కథగా పెట్టి, అదే శీర్షికగా నా పుస్తకానికి పెట్టుకున్నాను.

అయినా ఆ శీర్షిక మీద ప్రేమతో ఈ మధ్య ఈ కథ, నీ జతగా నేనుండాలికి సీక్వెల్‌గా ‘నీ జతగా నేనుంటాను’ అని ఒక కథ వ్రాసాను. అది వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది.

ప్రశ్న 2. ఇది మీ తొలి ప్రయత్నమని మీ మాటలో అన్నారు. మొదటి కథా సంపుటిని వెలువరించిన సందర్భంగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?

జ: నా సాహితీ ప్రస్థానం అంటే నా బాల్యం నుంచి చెప్పాలండి. మా అమ్మగారు మాడపాటి సీతాదేవికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. చాలా పుస్తకాలు చదివేది. అలాగే నాతో కూడా చిన్నప్పటినుంచి పుస్తకాలు చదివించింది. నా కోసమని ప్రత్యేకంగా పుస్తకాలు కొనేది. నాకు మా అమ్మ కథలు చెప్పటము, పుస్తకాలు చదివించటము ఎప్పటినుంచో గుర్తులేదు కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నాకు అది అలవాటుగా మారింది. చందమామ, బాలమిత్ర, బుడుగు, ఇంగ్లీష్ నవలలు పిల్లలవి తెలుగులోకి అనువాదం చేసినవి తెప్పించేది. నేను టెన్త్ క్లాస్ లోకి వచ్చాక సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఆరుద్ర గారు రాసింది తెప్పించింది. ఏదైనా పుస్తకాన్ని చదివినప్పుడు అమ్మా ఈ పుస్తకం బావుంది అంటే ఎందుకు బావుంది? అందులో నీకేం నచ్చింది? చెప్పు అని అడిగేది. బాగా లేదంటే ఎందుకు బాగాలేదు? అని అడిగేది. అది నాతో పలక మీద రాయించేది. అలా ఒక పుస్తకం చదవడం, దాని గురించి మా అమ్మతో చర్చించటము నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. నా టెన్త్ క్లాస్ సెలవుల్లో నా పుట్టినరోజున ఒక నోట్ బుక్ ఇచ్చి, ఇది డైరీ దీంట్లో నువ్వు చదివిన పుస్తకాల గురించి, నువ్వు రోజంతా ఏమి చేసావు? మొదలైన నీ రోజువారి కార్యక్రమము గురించి వ్రాయి అని చెప్పింది. మరి అప్పట్లో డైరీలు అన్ని ఎక్కువ బయట దొరికేవి కావు. అందుకని ఒక నోట్ బుక్ ఇచ్చింది. ఆ డైరీ దాంట్లో నేను నా రోజువారి కార్యక్రమం, ఆరోజు ఏమైంది? ఏ పుస్తకం చదివాను? స్కూల్లో ఏమైంది? ఇలా అన్ని వివరాలు రాసేదాన్ని. నా టెన్త్ క్లాసులో స్కూల్ మాగ్జిన్ కోసమని ‘డిటెక్టివ్ బాబు’ అని కథ రాశాను. అదే నా మొదటి కథ. స్కూల్ మ్యాగ్జిన్‌లో పబ్లిష్ అయింది. ఆ తర్వాత 2008 వరకు నేనేమీ రాయలేదు. కానీ డైరీ లాగా మటుకు రాసుకుంటూ ఉండేదానిని. నాకు నచ్చినవన్ని అట్లా రాసుకుంటూ ఉండటము అలవాటైంది. కానీ అవన్నీ జాగ్రత్త చేయలేదు. అలా ప్రతిరోజు ఏదో ఒకటి ఒక వాక్యం అయినా రాయటం అలవాటైపోయింది. పుస్తకాలు చదివించటమే కాదు, ఎండాకాలం సెలవుల్లో, అప్పట్లో ఆంధ్రభలో వచ్చే ‘మాలతీచందూర్’ గారి, ‘ప్రమదావనం’లో ఆవిడ సెలవుల్లో పిల్లలతో చేయించండి అని వ్రాసినవన్నీ నాతో చేయించేది. అంటే బొమ్మలు చేయటము, కుట్లు, అల్లికలు, టేలరింగ్, ఇలా ఒక్కో సెలవు రోజులో ఒక్కోటి చేయించేది. అలా కొత్తకొత్తవి నేర్చుకోవాలనే ఆసక్తి కూడా నాకు కలిగింది.

ఇంకా.. మా అమ్మ నాన్నగారు, మా తాతగారైన చింతలపాటి హనుమంతరావుగారు, మేము మా అమ్మమ్మగారి ఊరికి వెళ్ళినప్పుడల్లా రోజు మధ్యాహ్నం భోజనాలు కాగానే నన్ను కూర్చోబెట్టుకొని నాకు శ్లోకాలు నేర్పించేవారు. తర్వాత రామాయణ కథలు, పురాణ కథలు చెప్తుండేవారు. మా పుట్టింటి వైపు దాదాపు అందరూ మా అమ్మ, మామయ్యలు, పిన్ని, మా చెల్లెలు కూడా కవితలు రాస్తారు.

మా నాన్నగారు మాడపాటి కృష్ణమూర్తిగారు కూడా రేడియోలో వచ్చే సమస్యా పూరణాలు రాసేవారు. ఆయన చదువు అంతా కూడా ఉర్దూ మీడియంలో జరిగింది. సాయంత్రం పూట నాన్నగారి స్నేహితులందరూ వరండాలో కూర్చొని, వాళ్ళు వ్రాసిన షహరీలు, గజల్స్ చదువుతుండేవారు. అప్పట్లో నాకు దాని గురించి అంతగా తెలియదు కానీ వింటుంటే బాగుండేది. అందుకని అప్పుడప్పుడు అక్కడ కూర్చొని వినేదానిని. నా ఆసక్తి గమనించి మా నాన్నగారు నాకు ఉర్దూ వ్రాయటము నేర్పారు.

అమ్మ అన్నయ్య చింతలపాటి కృష్ణారావుగారు ఇంకా కొంతమంది రచయతలు కలిసి వరంగల్‌లో ‘నెలనెలా వెన్నెల’ అని ఒక సాహితీ సమూహమును స్థాపించారు. అప్పుడు ప్రతినెల అందులో రచయితలు, వారి కవితలు చదువుకుంటుండేవారు. కాళోజీగారు, వాసా ప్రభావతిగారు, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు, చిన్న వీరభద్రుడుగారు, విహారిగారు మొదలైన చాలామంది సీనియర్ రచయితలు అందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉండేవారు.

ఆ రకంగా నాకు మా కుటుంబసభ్యుల వలన సాహిత్యంతో అనుబంధం ఏర్పడింది.

2008లో నేను బ్లాగ్ ‘సాహితి’ మొదలు పెట్టాను. అందులో చిన్నచిన్న సరదా పోస్ట్‌లు వ్రాసేదానిని. బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు, మా ఏమండీగారు (మావారు) నాకు వివాదాస్పదమైనవి వ్రాయవద్దు, ఏదైనా గొడవ వస్తే నువ్వు తట్టుకోలేవు అని హెచ్చరించారు. అందువలన ఏవో చిన్నచిన్న సరదా పోస్ట్‌లు వ్రాసుకుంటుండేదానిని. నా బ్లాగ్‌లో ఏముందీ అంటే, ఓసారి పొత్తూరి విజయలక్ష్మిగారు, “బీనాదేవిగారు, ఓసారి అన్నారు.., ఎవరి గురించి రాస్తే ఎవరూరుకుంటారు? అందుకే మన గురించే రాసుకోవాలి అని. అలాగే మీరూ.. నేనూ.. సోమరాజు సుశీలగారు.. మన గురించే రాస్తాము” అన్నారు. అది ఒక పెద్ద అవార్డ్ నాకు.

బ్లాగ్‌లో నేను చదువుకున్న పుస్తకాల సమీక్షలు రాసుకుంటుండే దాన్ని. అవి చూసి హేమలత పుట్లగారు ‘విహంగ’ అంతర్జాలపత్రిక మొదలు పెట్టినప్పుడు 2012లో నన్ను విహంగలో పుస్తకసమీక్షలు వ్రాయమని ఆహ్వానించారు. అలా నేను చదివిన పుస్తకాలకు సమీక్షలు వ్రాసాను కొన్నిటికి. తర్వాత ఆవిడే కొన్ని పుస్తకాలు చెప్పేవారు. అవి నేను తెచ్చుకొని చదివి వాటికి కూడా సమీక్షలు రాసేదానిని. మొదట్లో సమీక్షలాగా రాసేదానిని. తర్వాత నాకు ఇలా అంతా ఒకటే రకంగా రాయటం నచ్చటం లేదండి అని చెప్పి కొంచెం కథలోని ఒక పాత్ర గురించి రాయటం మొదలు పెట్టాను.

ఆ తర్వాత దాని నుంచి ఇలా కాదండి, రచయితలతో కూడా నేను చిన్న ముఖాముఖిలాగా చేసి, ఆ పుస్తకం గురించి నేను వాళ్ళని అడుగుతానంటే అది కూడా ఒప్పుకున్నారు. ఆ రకంగా విహంగలో నేను సమీక్షలు, రచయితలతో ముఖాముఖిలు, నవలలతో వచ్చిన సినిమాల గురించి 2012 నుంచి దాదాపు ఒక అయిదు, ఆరేళ్ల వరకు రాసాను. అప్పుడు హేమలత పుట్ల గారు, మీరు రాస్తున్న సమీక్షలు చాలా వివరంగా ఉంటున్నాయండి. మా కాలేజీలో పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒక పుస్తకముగా ముద్రించి ఇవ్వండి అని అడిగారావిడ. కానీ అప్పుడు పుస్తకం గురించి ఆలోచించలేదు.

అట్లా చిన్నప్పటినుంచి రాస్తూ ఉన్నప్పటికీ, అఫీషియల్‌గా రాసింది నా బ్లాగులో. చిన్న చిన్న పోస్టులతోటి, సరదా కబుర్లతోటి ఒకటి అని కాదు నోములనీ, వ్రతాలని, నేను చూసిన ప్రదేశాల గురించి ఇలా నాకు ఏది మనసులో వస్తే అది వ్రాస్తూ ఉన్నాను.

నేను మొదటగా రాసిన కథ ‘నీ జతగా నేనుండాలి’ రచనకు పంపించాను. అది వాళ్ళు ఏ సంగతి చెప్పటానికి పత్రికలకు చాలా టైం పడుతుంది అని అంటే ‘మట్టిలో మాణిక్యం’, ‘దయచేసి సారికరాజ్‌తో మాట్లాడవచ్చా?’ అని రెండు కథలు రాసి విహంగకి, ఆంధ్రభూమికి పంపించాను.

మొదటగా ప్రింటులో ఆంధ్రభూమిలో వచ్చిన కథ ‘దయచేసి సారికరాజ్‌తో మాట్లాడవచ్చా?’. అంతర్జాలపత్రికలో వచ్చింది ‘మట్టిలో మాణిక్యం’. కాని అసలు ముందుగా రాసిన ‘నీ జతగా నేనుండాలి’ కథ 2014లో రచనలో వచ్చింది.

ఆ తరువాత చాలా కథలు ప్రింటెడ్, అంతర్జాల పత్రికలలో వచ్చాయి. కొన్ని కథా సంపుటిలలో కూడా చోటు చేసుకున్నాయి.

ప్రశ్న 3. ఈ సంపుటిలో విభిన్నమైన ఇతివృత్తాల కథలున్నప్పటికీ హాస్యం ప్రధానంగా ద్యోతకమవుతుంది. కథలలో నవ్వించడం అనేది అంత సులువు కాదు. ఈ నైపుణ్యం సాధన ద్వారా పొందారా లేక స్వతఃసిద్ధంగా అబ్బిందా?

జ: అవునండి. వివిధ అంశాల మీద రాశాను. హాస్యము అంటే ప్రత్యేకంగా హాస్యకథ రాయాలి అని వ్రాసినవి కొన్నే. మా నాన్నగారు హాస్య ప్రియులు. సీరియస్‌గా మాట్లాడుతూ మాట్లాడుతూనే గబుక్కున ఒక జోక్ వేసేవారు. ఆయన నవ్వకుండా నవ్విస్తూ ఉండేవారు. అలాగే మా వారు మేజర్. పరచ ప్రభాత్ కుమార్ గారు కూడా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఆయన నాలుగు మాటలు మాట్లాడితే మూడు మాటలు సరదాగా ఉంటాయి. నాకు వారిద్దరితో ఉన్న అనుబంధం వలన అలా మాట్లాడటము, వ్రాయటము అలావాటు అయ్యిందనుకుంటాను.

నాకు హాస్యకథలు, ప్రేమ కథలు, కుటుంబకథలు అంటే ఇష్ఠం. ముఖ్యంగా బాల్యం నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉండటము వలననో ఏమో తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు, పిన్నులు, బాబాయిలు ఇలా అందరూ కథల్లో సందడి చేస్తుంటే మరీ ఇష్టం. సహజంగా అలాంటి కథల్లో హాస్యం చోటు చేసుకుంటుంది కదా! అవే ఎక్కువగా చదువుతుంటాను, రాస్తుంటాను. నేను సీరియస్ పుస్తకాలు కానీ, కథలు కానీ, విషాదాంతంవి కానీ, చదవలేను, వ్రాయలేను. హాస్య కథలు అంటే చాలా ఇష్టం. హాస్యం అంటే చాలా ఇష్టము. నేను ఎక్కువగా హాస్య కథలు చదువుతాను. హాస్య సినిమాలే చూస్తాను. బహుశా అందువలన కూడా అప్రయత్నంగా హాస్యం వచ్చేస్తుందనుకుంటాను. అంతేకానీ కావాలి అని సాధన చేయలేదు.

ప్రశ్న 4. కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

జ: నేను ఎక్కువగా కథలోని వస్తువుని, శైలినే చూస్తానండి. దాంట్లో ఏం సబ్జెక్టు ఉంది.. దేని గురించి రాశారో అన్నదే నాకు ఎక్కువ ఆసక్తి. కొన్ని సార్లు కథావస్తువు బాగున్నా శైలి నచ్చకపోతే చదవలేను. శైలి బాగుండి కథావస్తువు నచ్చకపోయినా చదవలేను. పెద్దపెద్ద గంభీరమైన పదాలు, వర్ణనలు అవీ ఉన్నా నాకు నచ్చవు. సామాన్యంగా, ఆహ్లాదంగా ఉండేవే చదవగలను. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒకరకంగా కథావస్తువు, శైలి రెండిటికీ ప్రాధాన్యత ఇస్తాను.

ప్రశ్న 5. మీ రచనలను పాఠకులకు చేర్చేందుకు మీరు ఎక్కువగా ఫేస్‍బుక్, యూట్యూబ్‍ మాధ్యమాలని ఎంచుకున్నారు. వీటి సాంకేతికాంశాలను ఎలా అందిపుచ్చుకున్నారు? ఈ విషయంలో మీకు ఎవరి నుంచి, ఏ రకంగా సాయం/మద్దతు లభించింది?

జ: మా మనవళ్లతో ఆడుకోవటము కోసం అమీర్‌పెటలో ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో చేరి, కంప్యూటర్ మూడు నెలలు నేర్చుకున్నానండి. తర్వాత, “నువ్వు కంప్యూటర్ నేర్చుకున్నావు కదా ఏం చేస్తున్నావు?” అని మా మేనల్లుడు అడిగాడు. “ఏముంది చేయటానికి” అన్నాను. “బ్లాగ్ రాయి” అన్నాడు. అప్పటి వరకు నాకు బ్లాగ్ అంటే అమితాబచ్చన్ ఒక్కడే రాస్తాడు అనుకునేదానిని. అసలు బ్లాగ్ అంటే కూడా ఏమో తెలియదు. అప్పుడు మా అబ్బాయిని అసలు బ్లాగ్ అంటే ఏంటి, ఏం చేయాలి? నేనూ వ్రాయవచ్చా? అని అడిగాను. మా అబ్బాయి నాకు బ్లాగ్ గురించి వివరించి, ‘సాహితి’ అనే పేరుతో బ్లాగ్ క్రియేట్ చేసి ఇచ్చాడు.

అదే రోజులలో మా కోడలు కూడా ఫేస్‌బుక్ అని ఉంది ఆంటీ, అందులో కూడా మీరు వ్రాయవచ్చు అని చెప్పి నాకు ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఆ రోజులలో అందులో నాకు తెలిసిన బ్లాగ్ ఫ్రెండ్స్ ఎక్కువమంది లేరు. అందుకని మా కుటుంబ సభ్యులే నాకు ఫ్రెండ్స్‌గా ఉండేవారు. తర్వాత తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది చేరటము, చాలా సాహితీ సమూహాలు రావటము, వాటిలో కథలు వ్రాయటము అలవాటు అయ్యింది.

కరోనా సమయములో యూట్యూబ్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేను కంప్యూటర్ కోర్స్ చేసినప్పుడు నాకు మా సర్ ఛానల్ చేసి ఇచ్చినా, నేను దాని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. అందులో ‘ఎల్.బి. శ్రీరాంగారి’ హాస్య నాటికలు నేనూ మా మావారు చూసేవాళ్ళము. కానీ అందులో నేనూ ఏదైనా పోస్ట్ చేయవచ్చు అని అనుకోలేదు. ఆ సమయములో మా అమ్మాయి, నువ్వు కూడా ఒక ఛానల్ చేసుకొని, అందులో నీ కథలు చదువుకో అని సలహా ఇచ్చింది. అప్పటికే నా కథలు వివిధ అంతర్జాల, ప్రింటెడ్ పత్రికలలో వచ్చి, పాఠకుల అభిమానము పొందాయి. మా మేనల్లుడు ఒక వెబ్ సైట్‌లో వీడియో సెక్షన్‌లో పని చేస్తున్నాడు. అతను అప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండటముతో, నాకు ‘ప్రభాతకమలం’ అని యూట్యూబ్ ఛానల్ తయారు చేసి ఇచ్చాడు. మా అమ్మాయి నా ఏమండీ కథలకు బొమ్మలు వేయించింది. మా మనవరాలు లోగో డిజైన్ చేసి, చేయించింది. మా అమ్మాయి పర్యవేక్షణలో అలా నా ఛానల్ రూపుదిద్దుకుంది. కరోనా తరువాత మా మేనల్లుడు పని ఒత్తిడి వలన నా ఛానల్‌కి ఎక్కువ సమయం కేటాయించలేక పోయాడు. ఆ సమయంలో నాకు ఛానల్ ద్వారా స్నేహితులు అయిన, ‘మీ కథల సమయం’ ఛానల్ అమ్మాయి రమ్య, ‘సుమకుసుమాలు’ ఛానల్ అమ్మాయి సుమచంద్ర, స్కైప్, వీడియో కాల్‌లో వచ్చి వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ నేర్పించారు. నాకూ కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉండటము వలన వారి వద్ద సులభంగానే నేర్చుకున్నాను. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ ట్యుటోరియల్స్ చూసి కూడా నేర్చుకొని, నా ఛానల్‌కు సంబంధించినవి అన్నీ నేనే చేసుకుంటున్నాను.

నా కంప్యూటర్‌కు సంబంధించిన టెక్నికల్ విషయాలు అన్నీ మా అబ్బాయి చూస్తుంటాడు. ప్రతి మూడు సంవత్సరాలకు కొత్తది కొనిస్తుంటాడు. ఏ సమస్య వచ్చినా తనే చూస్తాడు, నాకు నేర్పిస్తుంటాడు. నా టెక్నికల్ ఎడ్వైజర్ అన్నమాట. నా గూగుల్ ఎకౌంట్ మా అబ్బాయితో కలిసి ఉంది. ఇక మైక్రోసాఫ్ట్ అకౌంట్ మా మనవరాలు, అమ్మాయి కూతురుతో కలిసి ఉంది. కాన్వా ఎకౌంట్ ఇంకో మనవరాలు మా అబ్బాయి కూతురుతో కలిసి ఉంది. వాటన్నిటికీ subscription వాళ్ళే కడతారు.

నా కథలకు అయిడియాలు, చర్చలు మా అమ్మాయి, అబ్బాయి, కోడలుతో జరుపుతాను. ముందు నుంచీ ఈ లైన్‌లో నన్ను మా వారు సపోర్ట్ చేస్తున్నారు. కావలసిన సహాయ-సహకారాలు అందిస్తారు.

అంతర్జాలం నుంచి చిత్రాలు తీసుకుంటే కాపీరైట్ ఉంటుందని, మా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు వారికి ఎక్కడ మంచి దృశ్యం కనిపించినా ఫొటోలు, వీడియోలు తీసి నాకు పంపుతారు. అవి నేను నా ఛానల్‌కు, బ్లాగ్ కథలకు వాడుకుంటాను. ఈ విధంగా నాకు మా పిల్లలంతా టెక్నికల్ సహకారం అందిస్తున్నారు.

ప్రశ్న 6. నీ జతగా నేనుండాలిపుస్తకం విభిన్నంగా ఉంది. సాధారణంగా తెలుగు పుస్తకాలు ఉండే సైజ్, లే-అవుట్‌ కాకుండా, ఆంగ్ల నవలల సైజ్‍లో ఉంది. పుస్తకం రూపకల్పన కూడా యూనికోడ్ ఫాంట్‍లో చేసినట్టున్నారు. ఈ ఆలోచన ఎలా తట్టింది? ఈ సైజ్‍లో ప్రచురించడం వల్ల పేజీల సంఖ్య ఎక్కువై, ముద్రణావ్యయం అధికమై ఉంటుంది. ఈ పుస్తకం ప్రచురణ నేపథ్యం వివరిస్తారా?

జ: ఈ పుస్తకం ప్రచురించిన తరువాత పుస్తకం సైజ్ గురించి నన్ను చాలామంది ప్రశ్నించారు. నేను పుస్తకాలు చదవటము ‘ఎమెస్కో’ వారి ఇంటింటా గ్రంధాలయం నుంచి మా అమ్మ తెప్పించిన పుస్తకాలతో మొదలు అయ్యింది. ఆ పుస్తకాలు ఇదే సైజ్‌లో ఉండేవి. ఇంకా నేను కొనటము మొదలు పెట్టినప్పుడు సాహితీ ప్రచురణలు మొదలయిన చాలా సంస్థల పుస్తకాలు ఇదే సైజ్‌లో ఉండేవి. కాలక్రమేణా సైజ్ పెరిగింది. కానీ నా మనసులో మాత్రం ఈ సైజ్ పుస్తకాలే ఉన్నాయి. ఇవే నచ్చుతున్నాయి. సన్నగా పొడవుగా ఉండే ఈనాటి పుస్తకాల సైజ్ నాకు నచ్చటం లేదు. అందుకని ప్రచురణకర్తలను ప్రత్యేకంగా అడిగి, నా దగ్గర ఉన్న పాత పుస్తకాల సైజ్ కొలిచి ఇచ్చి చేయించాను. పుస్తకం ప్రచురించిన తరువాత నా పుస్తకం సైజ్ గురించి, నేను విన్న కొన్ని వాఖ్యానాలతో చాలా మంది పాఠకులను “ఈ సైజ్ మీకు ఎట్లా ఉంది? అక్షరాలు కనిపిస్తున్నాయా?” అని అడిగాను. అందరు కూడా.. “పుస్తకం చేతిలో ఇమిడిపోయి చదివేందుకు వీలుగా ఉంది, అక్షరాలు కనిపిస్తున్నాయి” అని సంతోషం వ్యక్తపరిచారు. మరి అది ఆంగ్ల నవలల సైజ్ కు ఉందని ఇప్పుడు మీరు అడిగేవరకు నేను గమనించలేదు. నాకు ఆ సైజ్ నచ్చి, ఇష్టము అయ్యి, కావాలని చేయించుకున్నానండి. అంతకు మించి ఇంకేమీ లేదు.

పుస్తకాలు మళ్ళీమళ్ళీ వేయించము. నీ ఇష్టముతో వేయించుకుంటున్నావు, నీకు వేరే షాపింగ్, చీరలు, నగలులాంటివి ఆసక్తి లేదు. పుస్తకాలే నీకు ఇష్టం. పరవాలేదు వేయిద్దాము అని భరోసా ఇచ్చారు మావారు. ఇక వ్యయం ఎక్కువ అవుతుందని ఆలోచించలేదు.

నేను వర్డ్‌లో గౌతమి ఫాంట్‌లో వ్రాస్తాను. అదే పిడియఫ్ చేస్తాను. వర్డ్ డాక్యుమెంట్ సెట్టింగ్స్ ఎలా చేయాలో మా కోడలు నేర్పించడంతో, నా డాక్యుమెంట్స్ నేనే చేసుకుంటున్నాను.

ప్రశ్న 7. మీ కొన్ని కథలకు శీర్షికలు చిత్రంగా ఉండి, కథ చదవాలనే కుతూహలాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకి, మనసు తెలిసిన చందురూడా, చూపులు కలవని శుభవేళ, అమ్మమ్మకు విడాకులు తప్పాయ్!!!, మంచు తుఫాన్‍లో బామ్మా, మనవరాలు!, అత్తగారి బ్లాక్ మనీ, గుండెల్లో గుండె దడ – ఇలాంటివి. ఇతివృత్తాలకు తగిన పేర్లు పెట్టారా? లేక ముందుగా చక్కని శీర్షిక స్ఫురించాకా, కథ అల్లారా?

జ: నాకు ముందుగా శీర్షిక రాసుకుంటే కానీ కథ ముందుకు సాగదు. మనసులో ఉన్న కథకు అనుగుణముగా అప్పటికప్పుడు ఏదో రాసేస్తాను. ఆ తరువాత కథ వ్రాస్తున్నా కొద్దీ ఆ శీర్షిక మారిపోతూ ఉంటుంది. చివరకు కథలోని ఏదో ఒకటి స్ఫురించి రాస్తాను. కొన్నిసార్లు ముందుదే ఉంచుతాను. కొన్ని సార్లు పత్రిక లో ప్రచురించిన తరువాత కూడా నా ఛానల్‌లో చదివేటప్పుడు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకంతట శీర్షికతో నేను రాజీ పడను. నా కథా శీర్షిక అయినా, ఛానల్ థంబ్ నేయిల్ అయినా చివరికి డైనింగ్ టేబుల్ మీది వంటకాలు అయినా ప్రజెంటేషన్ కూడా బాగుండాలి అనే మావారి సూచనను పాటిస్తాను.

ప్రశ్న 8. ఈ సంపుటి లోని మనసు తెలిసిన చందురూడాఅనే కథ చాలా చక్కని కథ. వివాహ బంధం ప్రాముఖ్యతని చాటిన ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?

జ: మీకు ఈ కథ నచ్చినందుకు ధన్యవాదాలండి. మాలిక అంతర్జాల పత్రిక ఎడిటర్ జ్యోతి వలబోజుగారు, వివాహ బంధం గురించి కథ వ్రాయమని వారి పత్రికలో అనౌన్స్ చేస్తే ఈ కథ వ్రాసాను.

ఈమధ్య వివాహాలను అయితే అతిగా ఏవేవో చేస్తున్నారు లేదా అన్నీ ట్రాష్ అని కొట్టేస్తున్నారు కొందరు. కాని అసలయిన వివాహ క్రతువులలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. వాటిని చెప్పాలని కొంత ప్రయత్నం చేసాను. అంతే కాదు.. కొత్త కాపురం ఈ విధమైన ఆహ్లాదకర వాతవరణములో ప్రారంభం అవుతే దంపతుల మధ్య సఖ్యత, అవగాహన ఉంటుందనిపించింది. అందుకనే మన పూర్వీకులు ఇలాంటి సాంప్రదాయాలు పెట్టారని అనిపిస్తుంది.

“మనసు తెలిసిన చందురుడా మసక వెలుతురే చాలులేరా” అని చాలా సంవత్సరాల క్రితం పాట. అది అప్పట్లో నాకు చాలా నచ్చేది. అది ఈ కథకు సరిపోతుందనిపించి ఆ శీర్షిక పెట్టాను.

ప్రశ్న 9. ‘గుండెకీ గుబులెందుకు!’ కథలో మిడిల్ ఏజ్ క్రైసిస్‍తో బాధపడే స్త్రీలకు ఉపయుక్తమైన సూచనలిచ్చారు. సుజాత, అఖిల పాత్రలు మీకు తారసపడిన వ్యక్తులా లేక ఈ కథ కేవలం కల్పితమా?

జ: ‘మాలిక’లో స్నేహబంధం మీద కథ వ్రాయమంటే ఈ కథ వ్రాసాను. స్నేహం అంటే సహోద్యోగులో, పక్కింటివారో అలా ఎవరో బయట వాళ్ళే కానవసరము లేదు. తల్లీకూతుళ్ళు కూడా మంచి స్నేహితులే! ఒక వయసు వరకు తల్లి కూతురికి స్నేహితురాలవుతే, ఇంకో వయసు నుంచి కూతురు తల్లికి స్నేహితురాలుగా మారుతుంది. తల్లికి కూతురు స్నేహితురాలవుతే, ఆ కూతురుకి తన కూతురు స్నేహితురాలు. అది అలా నడుస్తూనే ఉంటుంది. తల్లీకూతుళ్ళు పోట్లాడుకుంటారు, కలిసి తిరుగుతారు, ఒకరి భావాలను ఒకరు పంచుకుంటారు, సలహాలు సంప్రదింపులు చేసుకుంటారు. మనసులో మాట చెప్పుకునేందుకు ఒక్క కూతురుంటే బాగుండు అనుకునేవారు ఎందరో! “కుంచమంత కూతురుంటే కంచం మంచం దగ్గరకే వస్తుంది” అని సామెత.

వారిద్దరి మధ్య ఉండేది పేగుబంధమే కాకుండా, స్నేహబంధము కూడా..

ఇందులోని సుజాత, అఖిల పాత్రలు నేనో, మరొకరో కాదు మనచుట్టూ ఉన్న వారే! ప్రతి స్త్రీ మిడిల్ ఏజ్ క్రైసిస్ అనుభవిస్తుంది. అప్పుడు అఖిల లాంటి కూతురే ఆమెను అర్థం చేసుకొని సహాయం చేయగలదు. అనే ఉద్దేశంతో ఈ కథ వ్రాసాను.

“చిన్న కథ అయినా మంచి కథా వస్తువు తీసుకున్నారు. కంగ్రాట్స్” అని ఈ కథను ప్రముఖ రచయిత్రి శ్రీమతి. డి. కామేశ్వరిగారు ప్రశంసించారు.

ప్రశ్న 10. అమ్మమ్మకు విడాకులు తప్పాయ్!!!కథలో కరోనా కాలపు కష్టనష్టాలను ప్రస్తావించినా, నిరాశాపూరితంగా కాకుండా, హాయిగా నవ్వించేలా రాశారు. ఈ కథ వెనుక నేపథ్యం వివరిస్తారా?

జ: ఫేస్‌బుక్ లోని ‘మనకథలు- మనభావాలు,’ సాహితీ సమూహములో పల్లెటూరి చిత్రం ఇచ్చి, కథ వ్రాయమంటే.. ఈ కథ వ్రాసాను. ‘శతమానంభవతి’ అనే సినిమాలో జయసుధ పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటే, ప్రకాశ్ రాజ్ నువ్వు మీ పిల్లల దగ్గరకు వెళ్ళిపో విడాకులు ఇస్తాను అంటాడు. ఆ సినిమా చూసాకా మావారు కూడా నేనెప్పుడైనా పిల్లల గురించి మాట్లాడుతే అలాగే అని ఏడిపించేవారు. అది తీసుకున్నాను.

అప్పుడే మావారి స్నేహితుడు మేము రిటైర్ అయ్యాక పల్లెటూరు వెళ్ళి ఉంటాము అని తరుచుగా అంటుండేవారు. అదే సమయంలో కరోనా వచ్చింది. వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాస్‌లు మొదలయ్యాయి. పేపర్‌లో చాలా మంది పల్లెటూళ్ళకు, వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళిపోయారని చదివాను. ఒకరోజు పేపర్‌లో పల్లెటూళ్ళల్లో పిల్లలు, నెట్ సరిగ్గా రాక, చెట్లెక్కి కూర్చొని, ఆరుబయట దూరందూరంగా అరుగుల మీద కూర్చొని లాప్‌టాప్‌ల మీద పని చేసుకుంటున్నారని, ఫొటోలతో వేసింది చూసాను. ఇవన్నీ కలిపి ఇలా కథగా వచ్చేసింది.

ప్రశ్న11. చిన్న కథైనా, చక్కని ఇతివృత్తంతో అల్లిన వరించి వచ్చిన సిరికథలో – ఫేస్‍బుక్ సమూహాం వారిచ్చిన “నాన్న కోపం తట్టుకోగలిగినవారు ఇంకెవరుంటారు” అన్న వాక్యానికి రాసిన ఈ కథ క్విజ్‍లో కోటి రూపాయలు గెల్చుకున్న వ్యక్తిని నాయకుడిగా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ మినీ కథ వెనుక ఉన్న నేపథ్యం వివరిస్తారా?

జ: ముందు ఈ వాక్యానికి ఏమి వ్రాయాలో ఊహ రాలేదు. అప్పుడే పేపర్‌లో ఒక అబ్బాయికి కౌన్ బనేగా కరోడ్‌పతిలో కోటి రూపాయలు వచ్చాయని, అతను వాటిని వివిధ వ్యాపారాలల్లో పెట్టి నష్టపోయాడని వార్త వచ్చింది. వెంటనే ఆ సంఘటననే ఇలా కథగా మారుస్తే ఎట్లా ఉంటుందీన్న అలోచన నుంచి వచ్చిందే ఈ కథ!

ప్రశ్న12. ఇష్టసఖికథలో కాలం గురించి చాలా గొప్ప వాక్యాలు వ్రాశారు. ఈ కథ కల్పితమా లేక అలోక్, అవని వంటి వ్యక్తులు నిజజీవితంలో ఎదురైతే, వారి నుంచి ప్రేరణ పొంది రాసినదా?

జ. నేను జిమ్‌కు ఎక్సర్సైజ్ కోసం వెళ్ళేదానిని. అక్కడ ఒకరోజు నా మాస్టర్ చాలా దిగులుగా ఉంటే, ఏమయ్యింది అలా ఉన్నావు? అని అడిగాను. “మేడం, మీరు కథలు వ్రాస్తారు కదా? నా కథ చెపుతాను వ్రాస్తారా?” అని అడిగాడు. అలాగే అన్నాను. “నేను ఇంటర్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. అసలు ముందు తనే నువ్వు చాలా హాండ్సంగా ఉన్నావు అని పరిచయం చేసుకుంది. ప్రేమ అనీ తనే ప్రపోజ్ చేసింది. ఇంటర్ తరువాత తనకేమో వాళ్ళ నాన్న డొనేషన్ కట్టి మెడిసన్‌లో చేర్చాడు. నేనేమో ఈ ఫిజియోథెరఫీలో చేరాను. చదువు అయిపోయాక పెళ్ళి చేసుకుందామనేది. చదువు అయిపోయింది, నాకు ఇక్కడ మంచి ఉద్యోగం వచ్చింది, ఇంక పెళ్ళి చేసుకుందాము అంటే ఇంటికి వచ్చి డాడీతో మాట్లాడు అంది. వెళితే ఇల్లు తాళం వేసి ఉంది. గూర్ఖా వాళ్ళు అమెరికా వెళ్ళారు అని చెప్పాడు” అని అతను చెపుతుండగానే అతనికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ మరునాటి నుంచి అతను సెంటర్‌లో కనిపించలేదు. రిజైన్ చేసి ఊరెళ్ళిపోయాడు అన్నారు. రెండుమూడు సంవత్సరాల తరువాత అతను ఫోన్ చేసి, వాళ్ళ ఊరి దగ్గరి పట్నంలో ఫిజియోథెరఫీ క్లినిక్ పెట్టుకున్నానని, మరదలిని పెళ్ళి చేసుకున్నానని చెప్పాడు.

‘పొన్నాడవారి పున్నాగవనం’ ఫేస్‌బుక్ సాహితీ సమూహంలో ఒక చిన్న కథ ఇచ్చి, ఆ కథ నుంచి ఏదైనా పదం తీసుకొని కథ రాయాలి అని ఇచ్చారు. ఆ కథలో కాలం అన్న పదం చూడగానే నాకు ఆ అబ్బాయి చెప్పిన అతని ప్రేమకథ గుర్తు వచ్చింది. అతను కాలంతో అడ్జెస్ట్ అయిపోయి, మరదలిని పెళ్ళి చేసుకొని, క్లినిక్ పెట్టుకొని బాగున్నాడు కదాని అదే కొన్ని పాత్రలను ప్రవేశపెట్టి, ఒక ప్రేమ కథగా వ్రాసాను.

ప్రశ్న13. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: నిజమే మీరన్నది. అన్ని కథలూ నా బిడ్డలే కదా? అందులో నీకేది ఇష్టం అంటే చెప్పటం కష్టమే! నేను పేపర్‌లలో వచ్చిన వార్తలు, కౌన్సిలర్స్ ఇచ్చే జవాబులూ, నేను చూసిన సంఘటనలు, నాకు బాగా తెలిసిన విషయాల నుంచే కథలను వ్రాసాను. నాకు 17వ సంవత్సరము నిండగానే, పీయూసీ చదువుతుండగా పెళ్ళి అయ్యి, మా వారితో మిలిట్రీ ప్రపంచంలోకి వెళ్ళాను. అప్పటి వరకూ స్కూల్, కాలేజ్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఒక్కసారిగా ఒక కొత్త తెలియని ప్రపంచంలోకి వచ్చాను. అక్కడి పద్ధతులు, యుద్ధ సమయాలల్లో వారి డ్యూటీలూ, త్యాగాలూ, వారి జీవన శైలీ అవన్నీ గమనిస్తూ పదిహేను సంవత్సరాలు ఆ వాతావరణంలో ఉండటముతో డిఫెన్స్ వారంటే ఒక ఆరాధనా భావం కలిగింది. నేను కథలు వ్రాస్తున్నప్పుడు ఆర్మీవారి గురించి కూడా కథలు వ్రాసాను. అయితే మామూలుగా మిలిట్రీ కథలు అంటే ఒక ఆఫీసర్ లేదా జవాన్ వీరోచితంగా ఎన్నో వ్యూహాలతో శత్రువుల శిబిరంలోకి ప్రవేశించి, వారిని హతమార్చి, వారు ప్రాణత్యాగం చేయటము అనే ఎక్కువగా ఉంటాయి కానీ వారి జీవన విధానము, వారి కుటుంబాల గురించిన కథలతో వచ్చిన సినిమాలు కానీ, కథలు కానీ నేను ఎక్కువగా చూడలేదు. నేను నా అనుభవాలతో ఆర్మీవారి కుటుంబ నేపథ్యంతో కథలు వ్రాస్తే బాగుంటుందనిపించి వ్రాసాను. అలా నేను వ్రాసిన మొదటి కథ ‘ధీర.’ ఇది ‘స్వప్న’ మాసపత్రికలో వచ్చింది. దీనిలో కొన్ని నా అనుభవాలు, మా వారి స్నేహితుని కుటుంబం గురించి వ్రాసాను. దీని గురించి, నేనూ మావారు చాలా చర్చలు చేసాము. నేను ఆర్మీ నేపథ్యంతో మొదటగా వ్రాసిన ఈ కథ అంటే కొంచం ఎక్కువ ఇష్టం.

ప్రశ్న14. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: రెండు కథలు అనిపించాయి. అవి ఒకటి ‘విధివిన్యాసాలు’, రెండోది ‘రాధామాధవీయం’ వ్రాయటం కొద్దిగా కష్టంగానే అనిపించింది. ‘విధివిన్యాసాలు’, ఒక ఆర్మీ ఆఫీసర్ యుద్దంలో చనిపోతే, అతని భార్యను, అతని స్నేహితుడు పెళ్ళి చేసుకోవటము, అతని ఇద్దరు పిల్లలను ప్రేమగా చూసుకోవటము అన్నది కథ. ఇది మావారి స్నేహితుల కథనే. 1965 యుద్దం అప్పుడు జరిగినది. ఈ కథ నాకు మావారే చెప్పి వ్రాయమన్నారు. అయితే నేను ఈ కథ వ్రాసిన కాలం నాటికి ఇలాంటి పెళ్ళిళ్ళు జరిగినట్టుగా ఎక్కడా నేను వినలేదు. మరి ఈ నేపథ్యంతో వ్రాస్తే ఆ కథను పాఠకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని భయంతో వ్రాసాను. ఇది ‘గోతెలుగు.కాం’ లో పబ్లిష్ అయ్యింది.

ఇక రెండో కథ.. ‘రాధామాధవీయం’. ఇది మేనరికాల మీద వ్రాసింది. నేను మేనరికాలు కాని వారి పిల్లలు కూడా వికలాంగులుగా పుట్టటము చూసాను. మేనరికం వారి పిల్లలు ఆరోగ్యంగా పుట్టటమూ చూసాను. అంతెందుకు మా కుటుంబం లోనే మా తరం నుంచే మేనరికాలు లేవు. మరి ఎక్కడా అవకరం పిల్లలను చూడలేదు. బావా-మరదళ్ళ బంధం మధురమయినది. ఆ బంధంతో ఒక ప్రేమ కథ వ్రాయాలని చాలా అనిపించి, మా వారిని అడిగాను. ఆయన పరవాలేదు వ్రాయి. ఒకవేళ ఆ ప్రాబ్లమే ఉంటే.. ప్రభుత్వమే సతి, కన్యాశుల్కం, వరకట్నంలా దీనినీ బాన్ చేసేది. కొన్ని కేస్ లలో జరుగుతుంది. కొన్నిటిలో జరగదు. అలా ఎవరికైనా జరగవచ్చు, వ్రాయి అని ధైర్యం ఇచ్చారు. ఇది ‘యామిని.కాం’ అంతర్జాల పత్రికలో పబ్లిష్ అయ్యింది.

ఈ రెండు కథలు రాసేందుకు కష్టం అంటే కొంత విషయ సేకరణ చేయవలసి వచ్చింది. ఇంతకన్నా మెరుగ్గా వ్రాయలసింది అని అనిపించలేదు. పాఠకులు ఎలా స్పందిస్తారో అనే భయపడ్డాను. కాకపోతే నేను భయపడ్డట్లు కాక.. పత్రికలో, నా ఛానల్ లో బాగానే స్పందించారు.

ప్రశ్న15. నీ జతగా నేనుండాలిపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: మా స్నేహితులు వారి పుస్తకాలు ముద్రించినప్పుడు నన్నూ నా కథాసంపుటిలను తెమ్మని అనేవారు. కానీ నాకు ధైర్యం చాలేది కాదు. ఎంత మావారు ప్రోత్సహించినా.. వాటి మీద అంత డబ్బు పెట్టటం ఇష్టం ఉండేది కాదు. ఇదే ఒకసారి మాటల్లో వచ్చినప్పుడు మా కోడలు, “మీకు డబ్బు ఖర్చుపెట్టటం ఇష్టం లేకపోతే ‘e-బుక్స్’ చేద్దాము. నేను చేసి ఇస్తాను” అని కవర్ పేజ్ డిజైన్, ప్రూఫ్ రీడింగ్ అన్నీ తనే చేసి, ‘నీ జతగా నేనుండాలి’ కథాసంపుటి, పుస్తక సమీక్షలతో ‘అనగనగా ఒక కథ’, ‘e బుక్స్’ చేసింది. అవి తనే ‘కినిగె’లో, మరి కొన్ని పుస్తక సైట్స్ లలో పెట్టింది. ఆన్‌లైన్‌లో ఉంటే, మా అమ్మకు ఇవ్వాలంటే ఎట్లాగాని నేను కాస్త మధనపడుతుంటే, “మేము కాలేజ్ రికార్డ్స్‌ను స్పైరల్ బైండింగ్ చేస్తాము. మీరు అలా చేసి, ఆన్‌లైన్‌లో చదవలేని వారికి ఇవ్వవచ్చు.” అని సలహా ఇచ్చింది. మావారు ఆ రెండు eబుక్స్ ను స్పైరల్ బైండింగ్ చేసి తేవటమే కాకుండా వాటి ఆవిష్కరణ కూడా చేయించారు. ఉగాది కొత్త సంవత్సరంలో చేద్దామని మా స్నేహితులను ఆహ్వానించాను. కానీ పండగ మూలంగా రాలేకపోయారు. ప్రముఖ రచయిత్రి డి.కామేశ్వరిగారు, జి.యస్.లక్ష్మిగారు, సుందరి నాగమణిగారు, మా కుటుంబ సభ్యులు వచ్చారు. జి.యస్.లక్ష్మిగారు సభను నిర్వహించారు. మా అమ్మతో, మా పెద్దాడపడుచుగారితో రెండు పుస్తకాలూ అవిష్కరింప చేసాము. ఆవిధంగా అనుకోకుండా ‘e బుక్స్’ కాస్తా ‘డిజిటల్ బుక్స్’ గా మారి అవిష్కరణ కూడా జరుపుకున్నాయి.

వీటి తరువాత నా ‘సాహితి’ బ్లాగ్ కబుర్లతో ఒక పుస్తకము, ‘నేను నోచిన నోములు’ అని ఇంకో పుస్తకము చక్కని కవర్ పేజెస్ తో ‘e బుక్స్’ చేసి ఇచ్చింది మా కోడలు. ‘సాహితి’, మినియాపోలీస్ లో పిల్లలతో అవిష్కరణ చేసాను.

ఇక్కడ మీకు ఒక సంగతి చెప్పాలి. నేనూ, మావారు కలిసి మా ఆర్మీ, సివిల్ అనుభవాలతో ‘ఏమండీ కథలు’ అని వ్రాసుకున్నాము. అవి ఎక్కువగా ‘సంచిక’ పత్రికలోనే ప్రచురించబడ్డాయి. ఒక పుస్తక అవిష్కరణ సభలో కస్తూరి మురళీకృష్ణగారు, “మీ ‘ఏమండీ కథలు’ ఎన్ని అయ్యాయి?” అని అడిగారు. “పదిహేను అయ్యాయండి” అని చెప్పాను. “అయితే ఇంకో అయిదు వ్రాసేయండి, పుస్తకం అచ్చువేయించి, అవిష్కరణ చేసేద్దాము” అన్నారు. మావారితో చెప్పాను.

మా అబ్బాయి స్నేహితుడు ‘బాల్ రెడ్డి’ వాళ్ళ నాన్నగారు చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. బాలు మా ఇంటికి వచ్చినప్పుడు, మావారు “బాలూ మీ ఆంటీకి ఏమండీ కథలు బుక్ రెండువందల కాపీలు ప్రింట్ చేయించి పెట్టు. అందరికీ ఇచ్చుకుంటుంది” అని చెప్పారు. అదో అలా కస్తూరి మురళీకృష్ణగారి వాక్కుతో నా ఏమండీ కథల పుస్తకం వచ్చింది. దానికి సమీక్ష జి.యస్. లక్ష్మిగారు వ్రాసారు. సంచికలోనే వచ్చింది. ఆ తరువాత నా కథలు అన్నీ కూడా ప్రింట్ చేయిస్తే బాగుంటుంది అనిపించి బాలూకే ఇచ్చాను. కాకపోతే వాళ్ళ నాన్నగారి ప్రింటింగ్ ప్రెస్ లేదు, వారికి తెలిసిన ప్రెస్‌లో ప్రింట్ చేయించాడు ఏమండీ కథలు. ఇదీ అక్కడే ఇచ్చాము. మేము ఇచ్చాక ఆ ప్రెస్ వారికి ప్రభుత్వము నుంచి స్కూల్ బుక్స్ ప్రింటింగ్‌కు పెద్ద ఆర్డర్ రావటముతో నీ జతగా నేనుండాలి ప్రింట్ అవటము ఆలశ్యం అయ్యింది. పుస్తక ప్రదర్శనకు ముందురోజు పుస్తకాలు వచ్చాయి. అప్పటికి నేను ఇక్కడ లేను. అమెరికా వెళ్ళిపోయాను. అందుకని దానికి అవిష్కరణ ఏమీ చేయలేదు. అయినా eబుక్ ఘనంగా అవిష్కరించాము కదా! అని కూడా అనుకున్నాను.

ఈ కథలను పాఠకులు బాగానే ఆదరించారు. నాకు రోజూ ఆంటీ మీ బుక్ కొన్నాము అని మెసేజెస్ పెట్టేవారు. పుస్తక ప్రదర్శనలో మరియు నవోదయ – కాచిగూడలో కూడా బాగా అమ్ముడు అయ్యాయి. యూత్ ఎక్కువగా నా పుస్తకాలు కొనడం అనేది సంతోషదాయకం. ఇంకా విచిత్రమేమిటంటే మా మనవరాలి స్నేహితులు మీ అమ్మమ్మ బుక్ చదవుతాము మాకు ఈసారి తెచ్చి ఇవ్వు అని అడిగారట.

ప్రశ్న 16: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: ప్రస్తుతము ‘తరుణి’ అంతర్జాల పత్రికలో ‘నులి వెచ్చని గ్రీష్మం’ అని నవల సీరియల్‌గా వ్రాస్తున్నాను. ఇంకో అయిదు వారాల్లో ముగుస్తుంది. ఈ మధ్య కొన్ని కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘గ్రీన్ వీరుడు’ అని ఒక కథ ‘కౌముది’ అంతర్జాల పత్రికలో, ఇంకా రెండు కథలు వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురణకు తీసుకున్నారు. రెండు కథలు పరిశీలనలో ఉన్నాయి. ఈ కథలూ, కొన్ని సాహితి సరదా కబుర్లు కలిపి ‘సాహితి (కమ్మని కథలు-కబుర్లు)’ అనీ, ‘నులివెచ్చని గ్రీష్మం’ ఈ పుస్తక ప్రదర్శనలోపు పుస్తకాలుగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. కాకపోతే ఈసారి డిజిటల్ ప్రింటింగ్ రెండువందల కాపీలు వరకే చేద్దామనుకుంటున్నాను.

మా పిల్లలకూ, మనవళ్ళకు, మనవరాళ్ళకు చెప్పిన రకరకాల కథలు, విశేషాలు, ఆడించిన ఆటలతో పిల్లల సీరియల్ వ్రాయమని మా అమ్మాయి అడిగింది. ‘నులివెచ్చని గ్రీష్మం’ అయ్యాక, ‘మిశ్రీ.కాం’ అనే పేరుతో ఆ సీరియల్ వ్రాద్దామనే ఆలోచన ఉంది. ఇంకా నా ఛానల్ లో మా తాతగారు నాకు చిన్నప్పుడు చెప్పిన కథలను ‘తాతయ్య చెప్పిన కథలు’ అని వ్రాసి, వినిపిస్తున్నాను. అవి ఇంక రెగ్యులర్‌గా వ్రాసి, వినిపించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇవే నా కార్యక్రమాలు.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మాలా కుమార్ గారూ.

మాలా కుమార్: ఇంత మంచి ప్రశ్నలతో నా ముఖాముఖిని నిర్వహించి, నా ‘నీ జతగా నేనుండాలి’ సమీక్షను ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశము ఇచ్చిన సంచిక నిర్వాహకులకు ధన్యవాదములు. నమస్కారములు.

***

నీ జతగా నేనుండాలి (కథా సంపుటి)
రచన: మాలా కుమార్ (కమల పరచ)
పేజీలు: 375
వెల: ₹ 175
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు
~
రచయిత్రి: 9989051913

 

 

 

 

 

~

‘నీ జతగా నేనుండాలి’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/nee-jathagaa-nenundaali-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here