[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘శ్మశాన నిశ్శబ్దం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్ర[/dropcap]శాంత సాగరంలో అలలు అందమే
అందమైన జీవితాలను
అల్లకల్లోలం చేస్తున్నది యుద్ధం
బలవంతుడు బలహీనుడిని ఆక్రమించడం జంతునీతి
ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని
అధికార దాహం కోసం జరిగే విధ్వంసమే యుద్ధం
ఒకప్పుడు చతురంగ బలాలతో సాగేది
విజ్ఞానం పెరిగిన తరువాత
తుపాకీలు సాధనాలైనాయి
సాంకేతికత పెరిగి
విమానాలు క్షిపణులు మరఫిరంగులు
అణబాంబులు యుధ్ధ ఆయుధాలయినాయి
జడపదార్థమైన భవనాలనే కాదు
వేలకొలది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి
బతుకులను అంధకారమయం చేసింది యుద్ధం
బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం
అనాథలైన పసిపిల్లల రోదనలు
విరామం దొరికితే చాలు తలదాచుకునేందుకు
ప్రాణాలు నిలుపుకునేందుకు
పరుగులు పెడుతున్నారు సామాన్య జనం
ఆవులు ఆవులు తన్నుకుంటే
లేగల కాళ్ళు విరిగాయి అన్నది సామెత
కానీ ఇది తథ్యం పునః పునఃసత్యం
ఒక్కసారి తల వెనక్కి తిప్పి చూస్తే
శవాలగుట్టలతో రక్తసిక్తమైన నేలలు కనిపిస్తాయి
యుధ్ధం ఎవరికి ఏమి మిగిల్చింది
అశాంతి, రోదన, అంతంకాని ఆవేదన తప్ప
ఆధిపత్యం దక్కినా అక్కడ మిగిలేది శూన్యం
శ్మశాన నిశ్శబ్దమే రాజ్య మేలుతుంది
యుద్ధాలను సమర్థించకండి
శాంతిని ఆకాంక్షించండి.