మహతి-73

13
4

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[కుసుమ బామ్మ కొంత కోలుకుంటుంది. 12 రోజులయ్యాకా, ఓ పాతికమంది వచ్చి వారసులం తామేననీ, కుసుమ ఆస్తి తమదేననీ అంటారు. గ్రామపెద్దలు వాళ్ళ ఆటలు సాగనీయరు. ఓ కమిటీని వేసి, పెద్దావిడ ఎలా చేయమంటే, ఆ అస్తిని అలా నిర్వహిస్తామని చెప్తారు. వాళ్ళు గొడవ చేయాలని ప్రయత్నిస్తే, ఊరివారంతా వచ్చేసరికి తోకముడిచి వెళ్ళిపోతారు. ఇందిర అన్ని విషయాలూ తెలుసుకుంటోంది. ఆవిడ హెల్త్ చాలా సెన్సిటివ్‍గా ఉందనీ, మానసిక స్థైర్యం చాలా ముఖ్యమని చెప్తారు డా. శ్రీధర్, డా. శారద. ఓ రోజు ఆసుపత్రికి రమ్మని మహతికి కబురొస్తుంది. మహతి వెళ్ళేసరికి బామ్మ పూర్తి మెలకువతో, స్పష్టమైన మనసుతో కనబడుతుంది. ఆస్తికి మహతిని గార్డియన్‍గా నియమించినట్లు, సర్వాధికారాలు మహతికే అప్పగించినట్లు వ్రాయించిన కాయితాలు మహతికి ఇస్తుంది. ఊరు ఉన్నంత కాలమూ కుసుమ సేవాకేంద్రం ఉంటుందనీ, బామ్మ కూడా సేవాకేంద్రంలో పాలుపంచుకోవాలని చెప్తుంది మహతి. బామ్మకి తోడుగా వాళ్ళింటో ఉండడానికి త్రిపుర సిద్ధమవుతుంది. ఒకరోజు ఇందిరని సేవాకేంద్రానికి తీసుకువెళ్తుంది మహతి. కొన్ని రోజుల తర్వాత తాను హైదరాబాద్ బయల్దేరుతాననీ, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనీ, అవసరమైనప్పుడు పిలిస్తే వస్తావా అని మహతిని అడుగుతుంది ఇందిర. తప్పకుండా వస్తానంటుంది మహి. డిగ్రీ పూర్తి చేయమని చెప్తుంది ఇందిర. చేస్తానంటుంది మహి. శారదకి కొడుకు పుడతాడు. వాడికి సూర్యనేత్ర అని పేరు పెడుతుంది మహతి. అహల్య తమ ఇంటికి దగ్గరగా ఉన్న ఓ కాన్వెంటులో టీచర్‍గా చేరుతుంది. బామ్మ, శారద, పిల్లాడి సంరక్షణలో త్రిపురకి కాలం గడిచిపోతోంది. జీవితం పరిపూర్ణమయిందన్న ఫీలింగ్ కలుగుతుందామెకు. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-20

ఇందిర:

నది ప్రవహిస్తుంది.. కాలం లాగా.. కాలం ప్రవహిస్తుంది జీవితం లాగా. జీవితానికి ముగింపు ఉంది.. కాలానికి లేదు. నదికి గమ్యం ఉంది. కాలానికి లేదు. అందుకే కాలమా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

మనుషుల/జీవుల జీవితాలు బుడగల్లాంటివి. కాలంలో పుట్టి కాలంతో పెరిగి, కాలంలోనే కలిసి పోతాయి; బుడగ నీటిలో పుట్టి, నీటిలో పెరిగి నీటిలో కలిసిపోయేట్టు.

సన్నగా నిట్టూర్చింది ఇందిర. కారు హైదరాబాద్ వైపు పయనిస్తోంది. ‘ఇంతకీ నేను సాధించింది ఏమిటీ?’ తనలో తానే ప్రశ్న వేసుకుంది. ‘నథింగ్’ జవాబు చెప్పింది మనసు. అవును.. కొన్ని జీవితాలు ‘సంథింగ్’తో సంతృప్తి పడితే కొన్ని జీవితాలు ‘నథింగ్’తో ముగుస్తాయి. మరో నిట్టూర్పు.

“వద్దు. ఆలోచించకు.. మనస్సుని గతంవైపు మళ్ళించకు. అలా మళ్ళించి నన్ను నీవు పోగొట్టుకోకు” అన్నది మనసే!

ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన ‘మహి’ నిద్రపోతోంది. ఇందిరకి జాలివేసింది. పిచ్చి పిల్ల, ఓ పక్క కుసుమ చుట్టాలు కాని వాళ్ళతో యుద్ధాలు, మరో పక్క అందరికీ వంటలు.. ఇంకో పక్క ఊరు బాగు కోసం సంప్రదింపులూ.. అన్నిటితో గత వారంగా అలిసిపోయింది.. నలిగి పోయింది.

అయినా కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిలా అన్నీ చక్కబెట్టింది. కుసుమ ఆస్తికి సంరక్షకురాలిగానే గ్రామ పెద్దలతో ఓ కమిటీ ఏర్పరిచి, జరగాల్సిన కార్యక్రమాలు పకడ్బందీగా జరిగేట్టు ఏర్పాటు చేసింది. త్రిపుర, కుసుమ బామ్మగారు ఆ ఇంట్లోనే ఉండేట్టు ఒప్పించింది. ఓ వంటామెని రప్పించి తన ఇంటినే ‘సెంట్రల్’ కిచెన్’గా మార్చి డా. శ్రీధర్, డా. శారద, తాతయ్య, త్రిపుర, బామ్మ – అందరికీ భోజనాల ఏర్పాట్లు చేసింది. అవన్నీ చూసాక అనిపించింది.. ఈ చిన్న పిల్ల నించి నేర్చుకోవల్సింది చాలా ఉందని.

అందుకే పట్టుపట్టి మరీ హైదరాబాద్ బయలుదేరాను. నా ఏకైక లక్ష్యం ఒకటి – మహతిని నేనే చదివించాలి. అహల్యతో, గౌతమ్‌తో అందరితో మాట్లాడి అయినా, ఎందుకంటే, మహి ‘వ్యక్తి’ కాదు.. రేపటి ‘వ్యవస్థ’.

సన్నగా నిట్టూర్చింది ఇందిర. పయనం సాగుతూ ఉంది. మహి నిద్రపోతోంది.. అందంగా.. అమాయకంగా!

***

అల:

షూటింగ్ అయిపోయింది. వీడ్కోలు చాలా బాధాకరం. చివర్లో ప్రెస్ మీట్ జరిగింది. అందరూ నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చాలా మంది అమ్మయిలు సౌత్ నుంచి నార్త్‌కి వచ్చి బాలీవుడ్‍లో స్థిరపడి గొప్ప పేరు తెచ్చుకున్నా,  నేను అందరి కంటే విభిన్నమైన నటిననీ; నాలో ఓ మధుబాల, ఓ మీనాకుమారి, ఓ నర్గీస్ – ముగ్గురి ప్రతిభా ఉందని ప్రశంసించారు.

వినోద్ ఓ పక్క సంతోషిస్తూ (నాపై కురుస్తున్న పొగడ్తలకి), మరో పక్క బాధ పడుతున్నాడు (మరో సినిమా వరకూ మేం విడిపోవాలిగా). కమల్‍జీత్ మౌనంగా ఉన్నారు. నిజం చెబితే ఎక్కువగా ఇల్లు కదలని అమ్మ (డల్జీత్) నా కోసం ఢిల్లీ వచ్చింది.. సెండాఫ్ చెయ్యడానికి. ఎన్ని బహుమతులో తాను తెచ్చినవి; ఎన్ని కన్నీళ్ళో తాను కార్చినవి, ఎన్ని కౌగిళ్ళో – నన్ను వీడలేనని చెప్పేవి.

అందరికీ ప్రేమగా టాటా చెప్పా. చిన్న నటులు, టెక్నీషియన్స్‌కి బాగానే ‘టిప్స్’ ఇచ్చా.

వినోద్, అమిత్ కూడా ఏర్‌పోర్ట్‌కి వచ్చారు. ఎన్నో మాటలు మాట్లాడాలని. కానీ మాట్లాడలేకపోయా.

కమల్, డల్జీత్ కూడా భారంగా నా వంక చూస్తున్నారు. నిజంగానే నన్ను సొంత కూతురిలా చూసుకుంటున్నారు. నాకూ అదే అనిపించింది. ఒక్కటి నిర్ణయించుకున్నాను. డల్జీత్ ‘మా’ని, కమల్ పప్పాజీని ఎన్నటికి వదలకూడదని.

“నాకు ధైర్యంగానే ఉంది అలా. అతి త్వరలో నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు, బాలీవుడ్ నిన్ను వదిలి పెట్టదు. నీ టాలెంట్‌కి సరయిన స్థలం ఇదే” నా చేయి నొక్కి అన్నాడు వినోద్ కపూర్ .

“ఓ చిన్న గిప్ట్ లాంటి రెమ్యునరేషన్” అని ఓ కవర్ నా చేతిలో పెట్టాడు అమిత్.

“తక్కువైతే నాతో చెప్పు, అమిత్‍ని సౌత్‌కి తోసేస్తా”, నవ్వి అన్నాడు వినోద్. కన్నీళ్ళతో ఫ్లైట్ ఎక్కా.

కవర్ విప్పి చూస్తే 95 లక్షలకి సరిపడే చెక్కులు (నగదు తరువాత) అని చిన్న చీటీ! మై గాడ్.. మైండ్ బ్లాంక్ అయింది. ఈ విషయం అర్జంటుగా మహీకి చెప్పాలి.

నగదుతో కలిపి దాదాపు కోటి వస్తుంది. ఈ క్రెడిట్ అంతా మహీదే. నన్ను మనిషిగా మార్చినందుకు.. ‘ధీర’ షూటింగ్‍లో కష్ట సమయంలో నాతో ఉన్నందుకూ.

మా అమ్మ గుర్తొచ్చింది. మొదట నేను చెయ్యాల్సింది ఇల్లు కట్టడం. అందులో అమ్మకే కాదు, డల్జీత్ మా కీ, కమల్‍జీత్‍కి కూడా చక్కటి సౌకర్యాలు ఉండే విధంగా కట్టాలి.

సడన్‍గా ఫాలాక్ష, కళ్యాణి, ఇందిర గుర్తొచ్చారు. వారినీ కలవాలి.

ఏర్‍హోస్టెస్ ఓ పూలగుత్తి ఇచ్చింది. ఎందుకూ అన్నట్టు చూశా. “ఇది ది గ్రేట్ ఎంటర్‍టైనింగ్ హీరో వినోద్ కపూర్ మీకు ఇమ్మన్నారు. మేమంతా మీ సేవకి సిధ్ధం మిస్ అలాజీ” అంది.

ఎందుకో ఏనుగెక్కినంత సంబరం. సడన్‍గా ‘తిమ్ము’ కూడా గుర్తొచ్చాడు. నా నాశిక నుంచి ఓ నిట్టూర్పు వెలువడింది.

***

తాతయ్య:

ఒకప్పుడు బాధపడ్డాను. ‘తను’ లోకం విడిచిపోయాకా ఎందుకు బ్రతికి ఉండాలని. కానీ బ్రతికి ఉండడమే సరైనదని ఇప్పుడు అనిపిస్తోంది. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళ పోయినోళ్ళ తీపి గురుతులు’ అన్న పాటలో – వాక్యం గుర్తుకొచ్చింది. ఎంతైనా ‘మహి’ది వాళ్ళ ‘అమ్మమ్మ’ పోలిక. ఆవిడకి చదువు లేదు. అద్భుతమైన సంస్కారం ఉంది. మహతికి చదువూ, సంస్కారం రెండూ ఉన్నాయి, లేకపోతే ‘ఇందిర’ సమస్యని ఎలా ఎగరగొట్టిందీ. డ్రైవరు చెప్పాడు, చాలా చోట్ల ఆగుతూ వచ్చామని. అంటే, ‘ఏకాంతం’ కల్పించడం ద్వారా ఒక రకమయిన మౌనపు ఆనకట్టని పడగొట్టింది.

ఎందరో నాతో తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. ఇవ్వాళ నేను ఆరోగ్యంగా తిరుగుతున్నానంటే కారణం మహతే. కాలేజీ మానేసి మరీ నా కోసంయీ ఊరికి వచ్చింది.

ఇప్పుడు నా కాలక్షేపం ‘సూర్యమిత్ర’తో. వాడు అచ్చం మహాతి లాగానే నవ్వుతాడు. త్రిపుర, శారద కూడా నా స్వంత కూతురు అహల్య ఉన్నట్లే నాతో ఉంటున్నారు. ఇంకేం కావాలీ! మహతి ఇందిరతో హైదరాబాదు వెళ్ళింది.

అది అక్కడే చదువు కంటిన్యూ చేస్తే అంతకంటే నాక్కావల్సింది లేదు. ఒంటరితనం నన్ను ఎంతగా కాటేసిందో నాకు బాగా తెలుసు. దాని నోట పూర్తిగా పడకుండా మహతి అడ్డుపడింది. ఇందిర ఇప్పుడు ఉన్న స్థితీ ఒకప్పటి నా స్థితే! లోకంలో అసలు కావల్సింది ఏమిటి? అన్నీ అశాశ్వతాలే. అన్నీ వచ్చిపోయే మేఘలే.

నిజంగా మనిషికి కావాల్సింది కొంచెం ప్రేమ, కొంచెం ఆదరణ, కొంచెం తోడు, కొంచెం ‘వీరు నాకు, నా కోసం’ అన్న భావన. ఆ భావనని మహతి పుష్కలంగా అందించగలదు. ‘నేనున్నా’ననే ధైర్యం ఇచ్చి ఎంత ఒంటరి మనసునైనా మరపించగలదు. అందుకే.. మహతి అక్కడ చదువుకుంటే మంచిదని అనిపిస్తొంది. ఇక నా సంగతా.. బోలెడన్ని పనులు. ఇప్పుడు మా వ్యవసాయాన్ని నేనే దగ్గరుండి చేయిస్తున్నా. పొలంలోకి అడుగుపెడితే చాలు.. కన్నతల్లి ఒడిలో ఉన్నంత హాయిగా ఉంటోంది. పచ్చని చేల – పలకరింపుల కంటే గొప్పది మరేముంటుంది. జీవితం నిశ్చింతగా ఉంది. ఇంకేం కావాలి.

***

డా. శ్రీధర్ – డా. శారద:

ఈ పల్లెటూరు మాకు చాలా ఇచ్చింది. ముఖ్యంగా మహాతి. ఆ పిల్ల లేకపోతే ఈ హాస్పటల్ రూపురేఖలు వేరేగా ఉండేవి. మా ఒంటరి జీవితాలు జంటగా మారినై. ఒక బిడ్డ పుట్టి అనంతమైన ఆనందాన్ని మాకు ఇస్తున్నాడు.

మహతి చాలా తెలివిగల అమ్మాయి. అద్భుతమైన సంస్కారం, ఆలోచన. ఇందిర గారి విషయంలో ఆమె చొరవ నిజంగా ప్రశంసనీయం. ఇందిర గారి ఆరోగ్యం బాగుపడడమే కాదు, కుసుమ ఆస్తిని కూడా మహతి చక్కగా స్థిరపరిచింది.

తను డిగ్రీ చేసి ఆ తరువాత భవిష్యత్తు నిర్ణయించుకుంటే మంచిదని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. కానీ, తను చదువు మానడ౦ వెనుక కారణం తాతయ్య కూడా అని అర్థం చేసుకున్నాను.

మహతి రేపటి మనిషి. ఈనాటి తన ఆలోచనలు అన్ని రేపటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. బహుశా ఇందిర గారిని కూడా ఓ తీరం చేర్చగలదు. అందుకేనేమో డిగ్రీ చదవమని ఇందిర చెప్పినప్పుడు ఓకే అన్నది. ఒక ప్లగ్గు నించి మరో ప్లగ్‌కి మారడం లాంటిది అలా చెయ్యడం. తాతయ్య మా ఇద్దరి పేరా అరెకరం భూమి దగ్గరుండి కొనిపించారు. చోటు లేని మాకు, చోటు అంటూ ఏర్పడింది. ఊరు ఊరంతా మమ్మల్ని అభిమానిస్తున్నది. ఇంతకంటే ఇంకేం కావాలీ?

***

కల్యాణి:

ఫాలాక్ష పెళ్ళి చెయ్యాలి. నా దృష్టిలో మొదటగా అనిపించింది ‘అల’ అని. కానీ అల ప్రస్తుతం ‘పీక్’ లో ఉంది. ఫాలాక్ష ఆర్మీ. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తే హాలిడే మేరేజ్‌గా ఉంటుంది. అల ఆర్మీ జీవితంలో ఇమడలేదు. ప్రస్తుత జీవితాన్ని మధ్యలో వదలమనడం కూడా భావ్యం కాదు.

‘మహతి’ని చూశాక మహతి అయితే ఫాలాక్షకి 100% రైట్ అనిపించింది. ఇందిరతో మహీ మాట్లాడి ఒప్పించిన తీరు నన్ను అబ్బురపరిచింది. ఫాలాక్షకి పర్‍ఫెక్ట్ మేచ్ మహతి. కానీ, తను ఏమి చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఇవాళే రెండు మెసేజ్‌లు, ఫోన్లు వచ్చాయి. మెసేజ్  అల నుంచి. రేపటి ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తున్నాననీ.. కలుస్తాననీ.

మహతి ఫోన్ చేసింది. ఇందిరతో పాటు హైదరాబాద్ వస్తున్నాననీ. ఇందిర ఆరోగ్యం బాగానే ఉందనీ.

చిత్రమేమంటే, వీళ్ళ మనసు తెలుసుకోకుండా ఫాలాక్షతో మాట్లాడడం ఎంత తప్పో, ఫాలాక్ష ఆలోచన తెలుసుకోకుండా వీరితో మాట్లాడడం కూడా అంతే తప్పు.

అందుకే ఆలోచనలో పడ్డాను. వాళ్ళిద్దరిలో ఎవరు నాకు మరదలైనా అద్భుతంగా ఉంటుంది. ఇంకేం కావాలీ!

***

గౌతమ్ – అహల్య:

ఓ భయంకరమైన తుఫాను ఒడ్డు దాకా వచ్చి, ఒడ్డు మీదే నిలిచి వెనక్కు మళ్ళింది. మేం ప్రేక్షకుల పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ పరిణామాలకు బాధ్యత ఎవరిదీ? జవాబు నిజంగా దొరకలేదు. కానీ, మహతి ఆ తుఫానుని వెనక్కి తిప్పి పంపడానికి చాలా శ్రమపడింది. అటువంటి బిడ్డని కన్నందుకు గర్వంగా ఉంది!

***

అభిమన్యు:

హిమాలయాల పాదాల దగ్గర నేనున్నాను. ఓ తల్లి బిడ్డని ఎత్తుకుని పాట పాడుతోంది.

పల్లవి:
‘నిదురపో కన్నా నిదురపో
నిదురపో బాబూ నిదురపో
చరణం:
కలలు కరుగు కాలంలో
నిధిలా నువ్వొచ్చావూ
నడి రేయి వేధిస్తే
వెన్నెలలా చేరావు
అలమటించు నా మనసుని
ఆలకించరా..
నీ చిరునవ్వులతో నన్ను
అలరించరా..’ ॥ నిదురపో॥

“ఎవరకు యీ పాట వ్రాసిందీ?” తెలుగులోనే అడిగాను.

“తెలీదయ్యా..” చిన్నగా అన్నది ఆమె.

తల పంకించి ఆశ్రమంలోకి నడిచాను.

“పాట బాగుంది కదూ!” చిన్నగా నవ్వి అన్నారు స్వామీజీ.

“అవును స్వామీజీ.. హాయిగా ఉంది” అన్నాను నేను.

“పాటలో చాలా అర్థం ఉంది. అదిప్పుడు చెప్పనక్కర లేదు. కానీ అభిమన్యూ, మీ అమ్మగారి ‘వయసు’ కరిగే కాలంలో ‘నిధి’లా అంటే జీవితం మీద ఆశలా నువ్వెందుకు లేవూ?

నెలల తరబడి చిమ్మ చీకటి ఆవిణ్ని వేధిస్తుంటే వెన్నెల కెరటంలా నువ్వెందుకు ఆవిడ్ని చేరలేదూ? పిచ్చివాడా, ఈ సృష్టి అంతా పంచభూతాత్మకమైనదే. ఆకాశం, గాలీ, నిప్పు, నీరు, భూమి. అంతేగా అన్నీ ఇక్కడే వదిలిపోవాలి.

దేవుడు నీకు ఆస్తినిచ్చాడు, అందాన్నిచ్చాడు. ‘ఏదో’, ఇంకా తెలుసుకోవాలన్న భ్రమతో నీ జన్మ వృథా చెయ్యకు. బాల్యం నీకు తెలీకుండానే నిన్ను వదిలి పెట్టిపోయింది. యవ్వనమూ అంతే. బాబూ, హాయిగా ఇంటికి వెళ్ళు. నువ్వు తింటూ వెయ్యిమందికి తినిపించు. నువ్వు నవ్వుతూ వెయ్యిమందిని నవ్వించు. నువ్వు బతుకుతూ వెయ్యిమందిని బ్రతికించు. నిజమైన మోక్షం అంటే అదే.” అన్నారు స్వామీజీ.

తల ఊపాను. అమ్మ విపరీతంగా జ్ఞాపకం వస్తోంది. ఆయనో కాయితం వెతికి నా చేతిలో పెట్టారు. అదో కవిత. చదవడం మొదలుపెట్టాను.

నక్షత్రం:
ఎన్నో యుగాల చరిత్రని ఒక్కసారి
చెప్పమని బ్రతిమలాడాను ఓ నక్షత్రాన్ని
నోరు విప్పకుండానే సమాధానంగా
ఓ చిరునవ్వుని తళుక్కుమనిపించింది.

రాతియుగం నాటి మనుషుల చరిత్రనీ
ఊహకందని క్రూర మృగాల చరిత్రనీ
రంగుల కందని ప్రకృతి వర్ణాలనీ
ఒక్క చిరునవ్వుతో తెలియజేసింది.

ఎందుకీ సృష్టి? దేనికీ తాపత్రాయం
ఎన్నో ప్రశ్నలు మళ్ళీ పుట్టాయి
అన్నింటికీ అదే సమాధానం
చిరునవ్వు –

‘ఎందుకే నక్షత్రమా ఆ నవ్వు
అన్నిటికీ అదే జవాబా?’
కోపంగా అడిగాను.

‘ఓ పిచ్చి మనిషి – అనాదిగా కాలం
ప్రవహిస్తూనే ఉంది. ఆ ప్రవాహానికి
నిన్ను – నేడు – రేపు భేదాల్లేవు
చావుపుట్టుకల చక్రాల్లేవు
ఆద్యాంతాల మిథ్య లేదు
ఆలోచనల జలపాతాల్లేవు
స్థిర చర భావాల్లేవు
సృష్టి అంతా నీటిలో పుట్టి నీటిలో పెరిగి
నీటిలోనే కలిసే బుడగ లాంటిది
నువ్వు వున్నావు – వుంటావు – లేవు
జన్మించావు – బ్రతికున్నావు – మరణిస్తావు
మరి నేనూ?
నేను కేవలం సాక్షిని.. అంతే.
మీ జీవులకి నేనెట్లా సాక్షినో
మీ జీవులకి మీరే సాక్షులైతే?
అద్భుతం కదూ!
నువ్వీ లోకం లోకి వచ్చింది
ఏ లోకం గురించీ వెతకటానికి కాదు
పలవరించడానికి కాదు
ఈ లోకాన్ని హాయిగా చూడడానికి
నీ మనసుతో నువ్వే అనుభవించడానికి
నీ ప్రేమని లోకానికి అందించడానికి
ప్రేమని ప్రేమించు.. ద్వేషాన్నీ ప్రేమించు
ఉండే నాలుగు నాళ్ళు హాయిగా జీవించు
ఓ ప్రియ మిత్రమా –
నేను నింగిలో ఉన్నా శాశ్వతాన్ని కాదు
ఏదో ఓ కృష్ణ బిలం నన్ను తనలోకి
తీసుకుంటుంది
అందుకే నేస్తమా –
అన్నిట్నీ చూడు సాక్షిగా ప్రేమగా
అందర్నూ చూడు సేవతో ప్రేమతో’
అన్నదా నక్షత్రం.
నవ్వుకోవడం నావంతైంది.
– పాదచారి.

స్వామీజీ వంక చూశాను.

“నిజం అభిమన్యూ. మనమంతా ఈ లోకానికి అతిథులం. వచ్చేటప్పుడు ఏ బ్యాగులూ లగేజీలూ తేలేదు. కానీ సౌకర్యంగా బ్రతకాలనే భ్రమలో బోలెడన్నీ అవసర, అనవసర సంపదల్ని కూడబెట్టుకున్నాం.

కానీ బాబూ, వెళ్ళిపోయేదీ, పోవాల్సిందీ ఖాళీ చేతులతోటే. అందుకే హాయిగా జీవించు. ప్రేమగా జీవించు – ఒక సాక్షిలా జీవించు.

వెళ్ళు నాయనా వెళ్ళు.. పసిబిడ్డలా తిరిగి వెళ్ళి మీ మాతృమూర్తికి ఆనందం కలిగించు” అన్నారు.

నేను తల వూపాను. ఆ సాయంత్రమే ఇంటికి వెళ్ళాలన్న నిర్ణయం స్వామీజీతో చెప్పా.

ఆకాశం నిండా నక్షత్రాలు. నవ్వుతూ. మా అమ్మ రూపమే కాదు, ఆ నక్షత్రాలలో మహతి రూపం కూడా కనిపించింది.

హాయిగా ఓ నవ్వు నా పెదవుల మీద వాలింది.. అలలా.. కొంటె కలలా.

~~~

అయ్యా, ‘మహతి’ అనే నవల ప్రథమ భాగం ఇక్కడ ముగుస్తున్నది. మరో భాగం మీ ముందుకి త్వరలో వస్తుంది. కానీ ప్రియ మిత్రులారా, మీ స్పందనని నిష్పక్షపాతంగా తెలిపితే మరింత శ్రద్ధాభక్తులతో వ్రాస్తానని తెలియజేసుకుంటూ..

ఇన్ని వారాలుగా నన్ను ఆదరించిన మీకు నా కృతజ్ఞతలు, నమస్సులూ తెలియజేస్తూ –

ఈ నవల మీ ముందుకి రావడానికి ముఖ్య కారణమైన ‘సంచిక’ పత్రికకీ, ప్రియాతిప్రియ మిత్రులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికీ, ఎంతో ప్రేమగా వారం వారం పలకరించిన శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారికీ, వారం వారం తమ విలువైన స్పందన అందించిన పాఠక దేవుళ్ళకీ మరోసారి కృతజ్ఞతలతో.. నమస్సులతో.

మీ

భువనచంద్ర

(మొదటి భాగం సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here