[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘నిగూఢమైనది ఆత్మతత్వం’ అనే రచనని అందిస్తున్నాము.]
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః।
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత॥
(భగవద్గీత, 2వ అధ్యాయం, సాంఖ్య యోగం, 18వ శ్లోకం)
[dropcap]ఈ[/dropcap] భౌతిక శరీరము మాత్రమే నశించునది, అందు నివసించే జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యము కానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరత వంశీయుడా, అశాశ్వతమైన ఈ భౌతిక శరీరం కోసం లవలేశమైనా ఆలోచించక సన్నద్ధుడై యుద్ధం చేయుము అని పై శ్లోకం అర్థం.
మారణాయుధాలతో శరీరం యుద్ధంలో గాయపడినప్పుడు స్థూలంగా ఈ శరీరం మాత్రమే గాయపడుతుంది కాని అందులో వున్న జీవాత్మకు ఎలాంటి హాని జరగదు. అత్యంత సూక్షమైనట్టి ఈ జీవాత్మను వధించడం ఎవరి శక్యం కూడా కాదు. అంతే చంపబడేది, చంపించవలసింది కూడా శరీరం మాత్రమే అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు.
సత్యం నిత్యం అయిన ఈ ఆత్మ మరణించునది కాదు మరియు నాశనం అయ్యేది కాదు. అందువల్ల ఓ అర్జునా నీవు యుద్ధం చేయుము. ఇక్కడ చంపు వారెవరు, చచ్చువారు ఎవరు? కాబట్టి మోహం వదలి వేయుము అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఆత్మ తత్వం తెలియజేయడంతో పాటు మోహం వదులుకొమ్మని పరోక్షంగా అర్జునుడికి హెచ్హరిక కూడా చేసాడు.
ఈ జగత్తు నిత్యము మారిపోతూ ఉంటుంది. అందుకే జగం మిథ్య అనే నానుడి కూడా ఏర్పడింది. అట్లే ఎవ్వరికీ కనపడని ఆ ఈశ్వరుడు మారకుండా నిత్యము అలాగే ఉంటాడు. ఆయన నిత్యుడు, నిత్య సత్యుడు, శాస్వతుడు. ఒక ప్రసిద్ధమైన ఆంగ్ల సామెత ప్రకారం మృత్యువు అంటే పేరు, ఆహార్యం మరియు చిరునామా మారటమే. పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఈ శరీరం అనుక్షణం మారుతూనే ఉంటుంది. కాబట్టి ఇది అసత్తు. మన శరీరం లోని లక్షలాది కణాలు అనుక్షణం పుట్టుతూ, మరణిస్తూ ఉంటాయి. ఒకానొక క్షణంలో అన్ని కణాలు మరణిస్తాయి. కాబట్టి ఈ మరణాన్ని తత్త్వ దృష్టితో చూడమని భగవంతుడు మనకు బోధిస్తున్నాడు.
సమస్త వేదాలు ఏ వస్తువును లక్ష్యముగా చెబుతున్నాయో, సకల తపస్సులు ఏ వస్తువునైతే పొందడానికి ఆచరింపబడుతున్నాయో, ఏ సద్వస్తువు కోరి అశేష సాధకులు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తున్నారో అట్టి పరమపదము ఆత్మ జ్ఞానము. ఇది అత్యంత నిగూఢమైనది, అత్యంత సూక్ష్మమైనది.
వేదాలు చదివినంత మాత్రాన ఆత్మను పొందడం సాధ్యంకాదు అని సాక్షాత్తు పతంజలి మహర్షి తమ యోగ శాస్త్ర గ్రంథంలో స్పష్టం చేసారు. గ్రంథార్థ శ్రవణము చేత కూడా ఆత్మప్రాప్తి సాధ్యం కాదు. మరి ఇంక దేని చేత ఆత్మప్రాప్తి లభ్యమవుతుందంటే ఏ సాధకుడు ఆత్మను పొందాలని నిరంతరం కోరుతాడో అట్టి వాని చేతనే ఆత్మ లభ్యమవుతుందని తెలుసుకోవాలి. దానికి విశేష భగవత్ అనుగ్రహం, సద్గురు సన్నిధిలో కఠోర సాధన అవసరం.