అలనాటి అపురూపాలు – 242

0
5

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

రిషీ కపూర్ ఆత్మకథ నుంచి జంట రచయితల ఓ ఉదంతం:

తన కెరీర్ ప్రారంభంలో జంట రచయితలు సలీం ఖాన్ – జావేద్ అక్తర్ తనని ఎలా బెదిరించారో దివంగత నటుడు రిషీ కపూర్ తెలిపారు.

“అమితాబ్ బచ్చన్‌ని సృష్టించి రాజేష్ ఖన్నా కెరీర్‌ను నాశనం చేశాం; నీకూ అదే గతి పట్టించగలం” అని సలీం ఖాన్ అన్నారట!

జంట రచయితలు సలీం ఖాన్ – జావేద్ అక్తర్ తమ కెరీర్‍లో కుదురుకుంటున్న సమయంలోనే, రిషీ కపూర్ హీరోగా రంగప్రవేశం చేశారు. వీరి మధ్య ఒకసారి కంటే ఎక్కువగా ఘర్షణలు జరిగినట్టు తెలుస్తుంది. వారు కథ రాసిన ఓ సినిమాలో నటించడానికి రిషీ కపూర్ తిరస్కరించడం సలీం ఖాన్‌కి ఆగ్రహం తెప్పించిందట. పైగా కథానాయకుడిగా రిషీ తొలి సినిమా ‘బాబీ’ సూపర్ హిట్ కావడం వారికి మరింత చిరాకు తెప్పించింది.

తన ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో, రిషి కపూర్ – సలీం ఖాన్ చేసిన బెదిరింపును ప్రస్తావించారు. సలీం ఖాన్ – జావేద్ అక్తర్ కథ అందించిన ‘త్రిశూల్’ సినిమా చేయడానికి రిషీ నిరాకరించారు. తన తిరస్కరణకు సలీం-జావేద్ ‘చిరాకు’ పడ్డారట. ముంబై లోని ఓ హోటల్‌లో సలీమ్‌ ఖాన్ ఎదురైననప్పుడు విభేదాలు బయటపడ్డాయని రిషీ పేర్కొన్నారు. ఆయన ఇలా వ్రాశారు, “నేను స్నూకర్ గేమ్ ఆడుతున్నప్పుడు సలీం సాబ్ నా దగ్గరకు వచ్చి, ‘సలీం-జావేద్‌ను తిరస్కరించే ధైర్యం నీకు ఎలా వచ్చింది?’ అని గట్టిగా అడిగారు. నేను బెదిరిపోయే వ్యక్తిని కాదు, ‘నాకు ఆ పాత్ర నచ్చలేదు’ అని గట్టిగా చెప్పాను.”

అమితాబ్ బచ్చన్‌ను తామే సృష్టించామని సలీం ఖాన్ ప్రగల్భాలు పలికారని, ఒకసారి రాజేష్ ఖన్నా తమ కథని తిరస్కరించినందుకు, అతనికో గుణపాఠం నేర్పి, తమ వద్దకు తిరిగి వచ్చేలా చేసేందుకు, ప్రేక్షకులకు ఓ మాస్ హీరోని అందించేందుకు తాము అమితాబ్‍ని తయారు చేశామని ఆయన అన్నట్టు రిషీ గుర్తు చేసుకున్నారు. అమితాబ్ రాకతో రాజేష్ ఖన్నా కెరీర్ దెబ్బతింది. రిషి కొనసాగించారు, “సలీం సాబ్ నాతో ప్రగల్భాలు పలికారు, ‘ఈ రోజు వరకు ఎవరూ మాకు నో చెప్పలేదని నీకు తెలుసా? మేము నీ కెరీర్‌ను నాశనం చేయగలం అన్నారు.”

అసలు మీ మనసులో ఏముందో చెప్పండి అని సలీం ఖాన్‌ను రిషీ అడిగితే, ఆయన “అయినా నీతో ఎవరు పని చేస్తారు? నీకు తెలుసా, మేం రాజేష్ ఖన్నాకు ‘జంజీర్’ ఆఫర్ ఇచ్చాం. అతను తిరస్కరించాడు. మేము అతనిని ఏమీ చేయలేదు. కానీ, ప్రత్యామ్నాయంగా, రాజేష్ ఖన్నాను నాశనం చేసిన అమితాబ్ బచ్చన్ అనే హీరోని మేము సృష్టించాము” అని అన్నారట.

అయితే అమితాబ్ బచ్చన్‌ కెరీర్‌కి తామేదో ఊపునిచ్చినట్టు, తాను – సలీం క్రెడిట్ పొందాలనే సూచనను జావేద్ అక్తర్ తోసిపుచ్చారు. “అమితాబ్ బచ్చన్ గొప్ప నటుడు, అతను ఎన్నుకున్న చిత్రాలే ఆయనను విఫలం చేశాయని గ్రహించేంత తెలివి మాకుంది. మేం చేసిందల్లా అతని ప్రతిభకు మద్దతుగా నిలవటమే. అతను తన గొప్ప ప్రదర్శనతో మా నమ్మకం నిలబెట్టాడు” అని చెప్పారు.

ఈ జంట రచయితలు 1970లలో రికార్డ్-బ్రేకింగ్ హిట్‌లను అందించారు, కానీ 1980లలో అకస్మాత్తుగా విడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here