తెలుగుజాతికి ‘భూషణాలు’-33

0
4

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

క్రీడారంగ తేజం పుల్లెల గోపీచంద్ (16 నవంబరు 1973):

[dropcap]బ్యా[/dropcap]డ్మింటన్ క్రీడాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పుల్లెల గోపీచంద్ ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించారు. 1980లో ప్రకాష్ పడుకొనె సాధించిన ఘనతను 2001లో చైనాకు చెందిన చెన్ హాంగ్‌ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మియున్ చాంపియన్ గెలిచిన రెండవ భారతీయుడాయన.

2008లో హైదరాబాదులో పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించారు. ఈయన శిష్యురాలు సైనా నెహ్వల్ బ్యాడ్‌మింటన్ రంగంలో ప్రతిభావంతురాలు. గోపీచంద్ కుమార్తె 2015లో అండర్-13 జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్. కుమారుడు విష్ణు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుకున్నాడు.

2019లో ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ వారు ‘Honourable Mention’ గౌరవం ప్రకటించిన ఏకైక భారతీయ కోచ్. 2020 నుండి క్రీడలలో ధ్యానం అనే ప్రక్రియ ప్రారంభించారు. హైదరాబాదులోని ఏ.వి. కాలేజిలో డిగ్రీ చేసిన గోపీచంద్ కొంత క్రికెట్ పట్ల మొగ్గు చూసినా సోదరుని ప్రోత్సాహంలో బ్యాడ్మింటన్ ఆటలో మెరుపులా మెరిసి 1990, 1991లో అఖిల భారత విశ్వవిద్యాలయ క్రీడా పోటీలలో బ్యాడ్మింటన్ టీమ్‌కు కెప్టన్‌గా ఆడారు. ప్రకాష్ పడుకొనె వద్ద శిక్షణ పొంది 1996 నుండి 2000 వరకు వరుసగా నాలుగు సార్లు ఛాంపియన్‌షిప్ సాధించారు. గోపీచంద్ అకాడమీలో సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కాశ్యప్, కిడాంబి శ్రీకాంత్ తదితరలు శిక్షణ పొందిన ప్రతిభామూర్తులు. 2016 లో బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారతీయ టీమ్‌కు అధికారిక కోచ్. తెలుగువారు గర్వించదగిన క్రీడాకారుడు గోపీచంద్.

అవార్డులు:

  • అర్జున పురస్కారం 1999
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2000-2001
  • పద్మ శ్రీ 2005
  • పద్మ భూషణ్ – 2014
  • ద్రోణాచార్య అవార్డు 2009
  • ఐ.ఐ.టి. కాన్పూర్ – గౌరవ డాక్టరేట్

బ్యాడ్మింటన్ క్రీడా దిగ్గజం సైనా నెహ్వాల్ (17 మార్చి 1990):

హర్యానాలోని హిస్సార్‍లో వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రాంశు నెహ్వాల్ కుమార్తె సైనా. ఆయన తొలుత హర్యానా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో పనిచేసి ఆ తర్వాత హైదరాబాదు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రమోషన్‍పై ప్రొఫెసర్‌గా వచ్చారు. అప్పుడు 8 ఎనిమిదేళ్ల సైనా సెయింట్ ఆన్స్‌లో చేరి 12వ తరగతి పూర్తి చేసింది. చిన్నతనంలో తెలుగు రాకపోవడంతో తల్లిదండ్రులతోనే బ్యాడ్మింటన్ ఆడేది. తల్లి ఉషారాణి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. తల్లి ఆశయం కుమార్తెను జాతీయస్థాయి క్రీడాకారిణి చేయాలని. తండ్రి కూడా యూనివర్శిట్ స్థాయి క్రీడాకారుడు. ఆయన తన ప్రావిడెంట్ ఫండ్‌ను డ్రా చేసి కుమార్తెకు బ్యాడ్మింటన్ శిక్షణ ఇప్పించారు. తొలుత కరాటే శిక్షణ పొంది, సంవత్సరంలో బ్రౌన్ బెల్ట్ సాధించింది.

ఆమె పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందింది. 2014లో  బెంగుళూరులోని ప్రకాష్ పడుకొనె బ్యాడ్మింటన్ అకాడమీలోకి మారింది. విమల్ కుమార్ శిక్షణలో ఆమె ప్రపంచ నెంబర్ వన్ స్థాయి సాగించింది. 2017లో తిరిగి గోపీచంద్ వద్దకు వచ్చింది. ఆమె బెంగుళూరుకు వెళ్లడం తనక మనస్తాపం కలిగించిందని గోపీచంద్ తన గ్రంథంలో వివరించారు.

2005 లో సైనా ఢిల్లీలో జరిగిన ఆసియా శాటిలైట్ టోర్నమెంట్‌లో 15వ ఏట విజయం సాధించింది. ఆ విజయ పరంపర అలానే కొనసాగింది. 2008లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ లభించింది. 2009 జూన్ లో బి. డబ్ల్యూ. ఎఫ్. సూపర్ సీరీస్‌లో విజయం సాధించి తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

2014లో ప్రపంచ ఛాంపియన్ పి.వి.సింధును ఓడించి ఇండియా గ్రాండ్‌ప్రిక్స్ గోల్డ్ సాధించింది. 2016లో గాయాలైనాయి. అయినా త్వరగా కోలుకొంది. 2018లో ఆమె ముగ్గురు సీడెడ్ ఆటగాళ్లపై గెలిచి 2019 నాటికి 4th నేషనల్ టైటిల్ స్థాయి కెదిగింది. స్వరాష్ట్రంలో బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించాలనేది ఆమె ఆశయం.

పురస్కారాలు:

  • అర్జున అవార్డు 2009
  • మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న – 2009
  • పద్మ శ్రీ 2010
  • పద్మ భూషణ్ 2016
  • బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య అవార్డు 2008

ఆమె ఆత్మకథ – PLAYING TO WIN: My Life on and off to Court – 2012లో ప్రచురితమైంది.

టెన్నిస్ క్రీడా కిరీటధారిణి సానియా మీర్జా (15 నవంబరు 1986):

మహిళల టెన్నిస్ డబుల్స్ లో నెం.1. ర్యాంకు సాధించిన క్రీడా కిరీటధారిణి సానియా మీర్జా బొంబాయిలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సానియా పుట్టిన తర్వాత కొంత కాలానికి హైదరాబాదు వచ్చేశారు. ఆరవ ఏటనే సానియా టెన్నిస్ ఆడసాగింది. తొలి గురువు తండ్రి ఇమ్రాన్ మీర్జా. తర్వాత రాగర్ ఆండర్సన్ వద్ద శిక్షణ పొందింది. హైదరాబాదులో సెయింట్ మేరీ కాలేజీలో డిగ్రీ పొందారు.

2003 నుండి 2013 వరకు భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో సానియా ప్రథమస్థానంలో నిలిచిందని విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకటించింది. 2013లో సింగిల్స్ నుండి వించుకుంది. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ సాధించిన క్రీడాకారిణి ఆమె. మణికట్టుకు తీవ్రమైన దెబ్బ తగలడంతో సింగిల్స్‌కు దూరమైనా డబుల్స్ నెం.1 ర్యాంకు సాధించింది. ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె ఆరు బంగారు పతకాలతో బాటు మొత్తం 14 పతాకాలను సాధించింది. టెమ్స్ ఆఫ్ ఇండియా 2005లో ఆమెను ‘50 హీరోస్ ఆఫ్ ఆసియా’లో ఒకరిగా వర్ణించింది. ఎకనామిక్ టైమ్స్ పత్రిక – ‘33 విమెన్ హు మేడ్ ఇండియా ప్రౌడ్’ జాబితాలో సానియాను పేర్కొంది.

అక్టోబరు 2012 లో అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు సానియా చేసిన విజ్ఞప్తి కారణంగా – ‘ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్‌షిప్’లో పురుషులతో సమానంగా మహిళలకు కూడా బహుమతి సొమ్మును సమానంగా పెంచారు. అప్పటినుండి మహిళా విజేతలకు సమాన బహుమతి లభిస్తోంది.

భారత ప్రభుత్వం 2006లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ ప్రకటించింది. 2008లో చెన్నై లోని యం.జి.ఆర్. ఎడ్యుకేషన్ సంస్థ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. లాన్ టెన్నిస్‍లో అర్జున అవార్డు ప్రకటించారు. 2005 లోనే WTA NEWCOMER OF THE YEAR అవార్డు దక్కింది. 2015లో ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు లభించింది. 2014లో తెలంగాణా ప్రభుత్వం సానియాను రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది. ఆమె హైదరాబాదులో టెన్నిస్ అకాడమీ స్థాపించింది. తెలంగాణా ప్రభుత్వం కోటి రూపాయలు బహుకరించింది.

బ్యాడ్మింటన్ తార పి.వి. సింధు (5 జులై 1995):

హైదరాబాదులో జన్మించిన పూసర్ల వెంకట సింధు 2016లో రియోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో రజతపతకం సాధించి ఒలింపిక్ రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 2020లో ఒలంపిక్స్‌లో కాంస్యపతకం గెలుచుకుంది. తల్లిదండ్రులిద్దరూ జాతీయస్థాయి వాలీబాల్ ఆటగాళ్లు. పుల్లెల గోపీచంద్ ఆటను చూసి సింధు బ్యాడ్మింటన్ పట్ల 8వ ఏటనే ఆకర్షితురాలైంది. 2019లో 55 లక్షల అమెరికన్ డాలర్ల ఆదాయంతో ఫోర్బ్స్ పత్రిక అంచనాలో అత్యధిక పారితోషికం తీసుకొనే క్రీడాకారిణి.

2022లో ప్రతిష్ఠాత్మక స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకొంది. నైనా సెహ్వాల్ తర్వాత రెండో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. తండ్రి రమణ రైల్వే ఉద్యోగరీత్యా గుంటూరు నుండి హైదరాబాదుకు మకాం మార్చారు. ఆయనకు 2000లో అర్జున అవార్డు లభించింది. సింధు గోపీచంద్ వద్ద శిక్షణ పొందింది.

2013లో తొలిసారిగా ప్రపంచ సీనియర్ చాంపియన్స్‌లో ఆడిన ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు సంచలనం సృష్టించింది. 2019లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో మొదలుపెట్టింది. 2022లో తొలిసారి సింగపూరు ఓపెన్ టైటిల్ సొంతం చేసుకొంది. ఆమెకిది మూడో టైటిల్. 14 సంవత్సరాల వయసులోనే సింధు అంతర్జాతీయ సర్క్యూట్ లోకి ప్రవేశించింది. ఆమె ఒంటరిగా 270 ఆటలలో ఆడగా 184 మ్యాచ్‌లలో గెలుపు లభించింది. డబుల్స్‌లో 2015 వరకు 17 ఆటలో 9 గెలిచింది. 2011 లో కామన్‌‍వెల్త్ యువ క్రీడలలో స్వర్ణ పతకం, 2011లో కామన్ వెల్త్ క్రీడలలో కాంస్య పతకం, 2016 ఒలింపిక్స్‌లో రజతం లభించాయి.

అతి చిన్న వయస్సులో అత్యున్నత గౌరవము పొందిన సింధు ఆంధ్ర తేజం.

పురస్కారాలు:

  • అర్జున అవార్డు 2014
  • పద్మ శ్రీ 2015
  • పద్మ భూషణ్ 2020
  • రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు 2016
  • బి.బి.సి. భారతీయ క్రీడాకారిణి 2020

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here