పుస్తకంతో పుస్తకాలకు జీవం – పరభాషా రచయితల వ్యూహం!

17
3

[‘పుస్తకంతో పుస్తకాలకు జీవం – పరభాషా రచయితల వ్యూహం!’ అనే రచనని అందిస్తున్నారు కృష్ణచైతన్య.]

“The decline of literature indicates the decline of a nation.” Johann Wolfgang von Goethe

[dropcap]సా[/dropcap]హిత్యం సమాజ హితం కోరుతుంది. సాహిత్య సృజన సమాజ హితాన్ని దృష్టిలో వుంచుకుంటుంది. గతాన్ని అర్థం చేసుకుని, గతం ఆధారంగా వర్తమానాన్ని అవగాహన చేసుకుని భవిష్యత్తును ఊహిస్తూ, భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సమస్యలకోసం సమాజాన్ని సిధ్ధం చేస్తూ, ఆలోచన కలిగిస్తుంది సాహిత్యం. ఏ సమాజంలో అయితే సాహిత్య సృజన మార్గనిర్దేశనం చేసే స్థాయిలో వుంటుందో, ఆ సమాజం సరయిన దిశలో ప్రయాణిస్తుంది. ఏ సమాజంలో సాహిత్యానికి విలువ వుండదో, ఏ సమాజంలో సాహిత్య సృజనకారులు, సమాజానికి దిశానిర్దేశనం చేసే బదులు, సమాజాన్ని దూషిస్తూ, సమాజాన్ని నిరసిస్తూ, భవిష్యత్తు వైపు దృష్టి సారించక, గతంలోనే పడిపొర్లుతూ, వర్తమానంలో కూరుకుపోయి, బావుల్లో కప్పల్లా, గ్రుడ్డివాళ్ళలా వ్యవహరిస్తే, ఆ సమాజం గ్రుడ్డివాళ్ళకు గ్రుడ్డివాళ్ళు దారి చూపిస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది.  అందుకే, గెథె, సాహిత్యం దిగజారితే, సమాజం దిగజారుతుందని నిర్ద్వంద్వంగా చెప్పాడు.

ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యంతో సంబంధం ఉన్న వారందరికీ తెలుగు సాహిత్యం అనుభవిస్తున్న దుస్థితి గురించి తెలిసే వుంటుంది. రచయితలు బోలెడంతమంది వున్నారు. పాఠకులను వెతుక్కుంటున్నారు. తమ రచనలను చదివి వాటి గురించి ఒక మంచిమాట చెప్పేవారి కోసం మొహం వాచిపోయి వున్నారు. ఒక వంద ప్రతులు ప్రచురించుకుని, అవి పంచటం అయిపోగానే, మొదటి ముద్రణ అయిపోయింది, రెండో ముద్రణకెళ్తున్నాం, అని ప్రకటించుకుని తమ గుంపుల్లో గల్లీ స్థాయిలో ఇంటర్నేషనల్లీ ఫేమస్ పర్సనాలిటీలవుతున్నారు. రచయితలు పలు వర్గాలుగా చీలిపోతూ, మాఫియా ముఠాలుగా ఏర్పడుతూ, సమాజాన్ని, సాహిత్యాన్ని చీల్చాలని, తద్వారా ఒక గుర్తింపు, అస్తిత్వం సాధించాలని ఆరాటపడుతున్నారు.  ఇవేమీ పట్టని తెలుగు పాఠకుడు, అక్షరాల కన్నా, తెరపై బొమ్మలు చూడటం, వినటం వైపు మళ్ళుతున్నాడు. పుస్తకాలు చదివేవారు తక్కువైపోయారని వాపోవటం తప్ప, సాహిత్యాభిమానులందరూ కలసికట్టుగా పుస్తకాల పట్ల ప్రజల ఆదరణ పెంచే ప్రయత్నాలు చేయటం లేదు. ఈ ప్రయత్నాలలో కూడా ఎవరికివారు మేమే అని నిరూపించుకోవాలని తపనపడుతూ, పాఠకులను సాహిత్యానికి మరింతదూరం చేస్తున్నారు. నిజాయితీగా చదివిన చక్కని రచన గురించి పదిమందితో పంచుకునే బదులు, సాహిత్యంలో అస్పృశ్యత పాటిస్తూ, తమ గుంపే తెలుగు సాహిత్యానికి ఆద్యంతాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

ఇలా, తెలుగు సాహిత్య ప్రపంచం, కులాలు, మతాలు, ప్రాంతాలు, భావాలు, ఆదర్శాలు, గుంపులు, ముఠాలుగా చీలిపోయి, గడ్డివాములో సూదిని వెతికేట్టు పాఠకులను వెతుక్కుంటూన్న సమయంలో, ఇలాంటి సమస్యలనే అంటే, టీవీ, కేబుల్, మొబైల్ ఫోన్, ఓటీటీ, పీడీఎఫ్ వంటి సమస్యలను ఎదుర్కుంటున్న ఇతర భాషల రచయితలు తాము ఎదుర్కుంటున్న సమస్యలను తెలుగు రచయితల్లా కాకుండా సృజనాత్మకంగా అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు చక్కని నిదర్శనాలు జపాన్ రచయితల రచనలు, ‘డేస్ అట్ ది మోరిసాకి బుక్ షాప్’, ‘మోర్ డేస్ అట్ ద మోరిసాకి బుక్ షాప్’, జర్మన్ రచన ‘డోర్ టు డోర్ బుక్ షాప్’, ‘పామెలా కెల్లీ రచన ‘ది బుక్ షాప్ బై ది బే’, ఏమీ మెయర్  సన్ నవల ‘ది బుక్ షాప్ ఆఫ్ యెస్టెర్ డేస్’, ‘ది స్టోరీడ్ లైఫ్ ఆఫ్ ఏజె ఫిక్రే’, కాథెరిన్ రే రచన ‘ది ప్రింటెడ్ బుక్ షాప్’ వంటి పుస్తకాలు. ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే ప్రచురితమయ్యాయి.

ఇవన్నీ నవలలు. పాఠకులను మొదటి పేజీనుంచి చివరి పేజీ వరకూ, వదలకుండా, కదలకుండా పట్టి బంధించి చదివిస్తాయి. అన్ని నవలలకూ, కేంద్ర బిందువు పుస్తకాలు అమ్మే దుకాణం. పుస్తకాల అమ్మకాలు తగ్గిపోతాయి. చదవటం కన్నా, మొబైల్ ఫోన్లు చూడటం వైపే యువత దృష్టి. దాంతో పుస్తకాల దుకాణాలు మూసేసే పరిస్థితులు నెలకోంటాయి. ఆ స్థితినుంచి పుస్తకాల దుకాణాలను నిలబెట్టటం ఒక పాయ. ఈ పాయతో కలుస్తూ, ప్రధాన కథ వుంటుంది. ఒక ప్రేమ కథ, మానవ మనోభావాలు, సంవేదనలకు సంబంధించిన కథ ఈ పుస్తకాల దుకాణంతో ముడిపడి వుంటుంది. ఈ రెండు పాయలు కలసి ఒక ప్రవాహమయిపోతాయి. విడదీయరానివవుతాయి. దాంతో రచన చదివే పాఠకుడు రచనలో మునిగిపోతాడు. నాయికానాయకుల వ్యక్తిగత సమస్యలు ఎంత ప్రాధాన్యం వహిస్తాయో, పుస్తకాల దుకాణాన్ని నిలపటం అంతే ప్రాధాన్యం వహిస్తుంది. ఇంతే అయితే, ఇవి మామూలు పుస్తకాలవుతాయి. రచనలో ఇతర పుస్తకాల ప్రస్తావన, వాటి గురించిన చర్చలు కథాగమనంలో అంతర్భాగమవుతాయి. అవి చదువుతున్న పాఠకుడికి ఈ పుస్తకం చదువుతూనే, పుస్తకంలో ప్రస్తావించిన ఇతర పుస్తకాలను చదవాలనిపిస్తుంది. అంటే, ఈ పుస్తకాల ద్వారా, రచయిత ఇతర పుస్తకాలను పాఠకుడికి పరిచయం చేస్తున్నాడన్నమాట. అలా, పుస్తకాల ప్రపంచంలోకి పాఠకుడిని రచయిత లాగుతున్నట్టవుతుంది. నెమ్మదిగా ఉత్తమ సాహిత్య ప్రపంచంలోకి పాఠకుడు అడుగుపెట్టటమే కాదు, స్థిరపడిపోతాడు. దీనికి తోడుగా, పుస్తకాల దుకాణాలు, వాటితో అనుబంధం, పుస్తకాలతో అమ్మేవారికి వుండే ఆప్యాయత, ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక ఒక ఆత్మీయమైన జీవన విధానం అన్న భావన కలుగుతుంది. పుస్తకాలను కొనటం ప్రతి వ్యక్తి భావన అన్న ఆలోచన స్థిరపడుతుంది.

మిస్టర్ పెనంబ్రాస్ 24 హవర్స్ బుక్ స్టోర్స్ లో ప్రధాన పాత్రకు పుస్తకాల దుకాణంలో ఉద్యోగం దొరుకుతుంది. అయితే ఆ దుకాణంలో పుస్తకాలు కొనేందుకు వచ్చేవారి ప్రవర్తన విచిత్రంగా వుంటుంది. అక్కడినుంచి కథ అనేక మలుపులు తిరిగి ఉత్కంఠను కలిగిస్తుంది. ప్రింటెడ్ లెటర్ బుక్ షాప్ లో నాయిక అయిష్టంగా పుస్తకాల దుకాణ బాధ్యతలను చేపడుతుంది. కానీ, అక్కడ పనిచేస్తున్నకొద్దీ, పుస్తకాలు కొనే వాళ్ళ గురించి తెలుసుకుంటూ, పుస్తకాలను చదువుతూ ఆమెకు తానేమిటో అర్థమవుతుంది. తనను తాను తెలుసుకుంటుంది. ఈ అంతరంగ అన్వేషణ ప్రయాణ వర్ణన అద్భుతంగా వుంటుంది. వ్యక్తి తనను తాను తెలుసుకోవటంలో పుస్తకాలు ఎంతగా తోడ్పడతాయో అర్ధమవుతుంది.

బుకిష్ పీపుల్ నవలలో ప్రధానపాత్ర భర్త చనిపోతాడు. పుస్తకాల దుకాణం దయనీయమైన స్థితిలో వుంటుంది. ఎలాగయినా షాపును బ్రతికించాలని ప్రయతిస్తూంటుంది. ఇంతలో ఒక ఫేమస్ రచయిత పుస్తకం విడుదల, అతని మీద వచ్చిన ఆరోపణల వల్ల ఆగిపోతుంది. దాన్ని తన దుకాణంలో విడుదల చేసేందుకు ఆమె సిద్ధమవుతుంది. ఇక్కడినుంచి నవ్వింపచేస్తూ, ఆలోచింపచేస్తూ, ఆహ్లాదకరంగా సాగుతుంది రచన. పుస్తక ప్రేమికుల మనస్త్వత్వాలను చక్కగా ప్రదర్శిస్తుందీ రచన. బుక్ షాప్ బై ద బే పై రచనలకు భిన్నమైన రచన. ఒక మూతపడిన పుస్తకాల దుకాణాన్ని తిరిగి తెరుస్తారు. ఆ షాపు నడపటంలో వాళ్ళ అనుభవాల ద్వారా, ఒకరినొకరు అర్థం చేసుకోవటమే కాదు, అంతవరకూ సరయిన అవగాహన లేని కూతుళ్ళతో వారికి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇదంతా సాహిత్యంతో సాంగత్యం వల్ల సాధ్యమవుతుంది.

ది బుక్ షాప్ ఆఫ్ యెస్టెర్డేస్, పాత క్లాసిక్ రచనలను అత్యంత సృజనాత్మకమైన పద్ధతిలో చేరువచేస్తుంది. ఒక అమ్మాయికి పాత పుస్తకాల దుకాణం ఒక బంధువు నుంచి వారసత్వంగా వస్తుంది. ఆ బంధువుకూ, వాళ్ళమ్మకూ ఎందుకు గొడవ జరిగిందో తెలుసుకునే ఆధారాలు పలు క్లాసిక్ పుస్తకాలలో వుంటాయి. వాటిని వెతుకుతూ వెళ్తూ సత్యాన్ని గ్రహించటంతో పాటూ మానవ సంబంధాల స్వరూపం కూడా అర్థం చేసుకుంటుంది నాయిక. ఈ పుస్తకంలో ప్రస్తావించిన పలు క్లాసిక్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ పుస్తకం గతంలో మైకెల్ కానలీ రాసిన డిటెక్టివ్ రచన ది పోయెట్ ను గుర్తుకు తెస్తుంది. అందులో ఒక హంతకుడు తనను పట్టుకునే ఆధారాలు ఎడ్గార్ అల్లెన్ పో కవితా పంక్తుల ఆధారంగా ఏర్పాటుచేస్తాడు. ఆ పుస్తకం ప్రచురణ తరువాత  ప్రపంచవ్యాప్తంగా ఎడ్గార్ అల్లెన్ పో పట్ల ఆసక్తి ద్విగుణీకృతమయింది.

ది స్టోరీడ్ లైఫ్ ఆఫ్ ఏ జే ఫిర్కే నవలలో కథా నాయకుడి ఫిర్కే భార్య చనిపోతుంది. పుస్తకాల అమ్మకాలు తగ్గిపోతాయి. అతనికి అతి ఇష్టమయిన ఎడ్గార్ అల్లెన్ పో కవితల పుస్తకం చోరీ అవుతుంది. ఇలా ఒకటొకటిగా తగిలే దెబ్బలకు ఫిర్కేకు విరక్తి కలుగుతుంది. అన్నిటి పట్ల అనాసక్తి కలుగుతుంది. ఒకప్పుడు అతడు ప్రేమించిన పుస్తకాలే మారుతున్న కాలంతో మారలేని శిలాజాల్లా అనిపిస్తాయి. ఇంతలో ఒకరోజు అతనికి ఒక పార్సెల్ వస్తుంది. అది అతని జీవితాన్ని మార్చేస్తుంది. మళ్ళీ అతడు నూతనోత్సాహంతో జీవితం ఆరంభిస్తాడు. పుస్తక పఠనం ఎలా వ్యక్తివ వికాసానికి దారి తీస్తుందో, జీవితంలోని సందేహాలు, సందిగ్ధాలు, సంఘర్షణలకు సమాధానాలిచ్చి మార్గదర్శనం చేస్తుందో అత్యంత ఆసక్తికరంగా మనసుకు హత్తుకునే రీతిలో ప్రదర్శిస్తుందీ నవల. ఈ నవలను  సినిమాగా మలచటంతో పుస్తకాలపై యువతలో ఆసక్తి పెరిగింది.

కార్స్టెన్ హెన్ జర్మనీ రచన డోర్ టు డోర్ బుక్ స్టోర్ ఒక గమ్మత్తయిన రచన. ఇందులో ప్రధాన పాత్రల వయస్సులు 76 ఏళ్ళు , 9 ఏళ్ళు. పుస్తకాల దుకాణంలో పుస్తకాలు అమ్మటంతో పాటూ, దుకాణానికి రాలేని వారిళ్ళకు వారికి నచ్చిన పుస్తకాలను తీసుకువెళ్ళి ఇస్తూంటాడు కార్ల్ కోల్ హాఫ్. ఈ ముసలాయన పాఠకులు కోరిన పుస్తకాలు కాక, తనకు నచ్చిన పుస్తకాలు వాళ్ళతో చదివిస్తున్నాడని నిరూపించాలని ప్రయత్నిస్తూంటుంది ఒక తొమ్మిదేళ్ళ పాప. మరో వైపు , దుకాణం యజమాని కూతురు ఆధీనంలోకి వస్తుంది. ఆమె ఈ ముసలాయనకి ఉద్వాసన చెప్పాలనుకుంటుంది. ఇలా, అనేక ఘర్షణలు ఆసక్తికరమైన సంఘటనలు, క్లాసిక్ రచనల గురించిన చర్చలనడుమ సాగుతుంది నవల. ఈ నవలలో వ్యక్తులకు పుస్తకాల పేర్లు పెట్టటం, చదువరులను వారు పుస్తకాలు చదివే విధానన్ని బట్టి కుందేళ్ళు, చేపలు, తాబేళ్ళు.. అంటూ వర్గీకరించటం ఒక ఎత్తయితే, పుస్తకాలు అందిస్తూ వారి జీవితాల గురించి, వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవటం నవల స్థాయిని పెంచుతుంది.

సతోషి యగిశావా రచించిన డేస్ అట్ మోరిసాకి బుక్ షాప్, మోర్ డేస్ అట్ మోరిసాకి బుక్ షాప్ నవలలు  అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ప్రేమ వైఫల్యంతో డిప్రెషన్ లోకి దిగజారిన నాయిక, తన బంధువు నడిపే సెకండ్ హాండ్ బుక్ షాప్‌లో ఆశ్రయం పొంది, పుస్తక పఠనం వైపు మళ్ళుతుంది. పుస్తక పఠనం ఆమె ఆలోచనలను జీవితాన్ని మార్చేస్తుంది. నవలలో అనేక జపాన్ ప్రాచీన సాహిత్య పుస్తకాల ప్రస్తావన వుంటుంది. వాటి గురించిన చర్చ, అవి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన విధానాలను నాయిక పలు పాత్రలతో చర్చిస్తుంది. రెండవ భాగంలో నాయిక ప్రేమ కథ, ఆమె బంధువు ప్రేమ కథ పుస్తాకల దుకాణం నేపథ్యంలో సాగుతుంది. ఈ రెండు రచనలు చదివిన తరువాత జపాన్ సాహిత్యం గురించి ఒక ఆలోచన ఏర్పడుతుంది. జపాన్ సాహిత్యాన్ని చదవాలన్న జిజ్ఞాస కలుగుతుంది.

ఇలా, విదేశీ సృజనాత్మ రచయితలు ఒక దీపం పలు దీపాలను వెలిగించినట్టు, ఒక పుస్తకంతో పలు ఇతర పుస్తకాలను పరిచయం చేస్తూ, పాఠకులను మళ్ళీ పుస్తక పఠనం వైపు మళ్ళిస్తున్నారు. ఈ రచనల ఆధారంగా చలన చిత్రాలు నిర్మితమవటంతో పుస్తకాల అమ్మకాలు పెరగటమే కాదు, సమాజం దృష్టి సాహిత్యం వైపు మళ్ళుతోంది.

విదేశీ రచనల పట్ల ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ ఆయా భాషల రచయితల సృజనాత్మక రచనలలో కనిపిస్తుంది. ఒక రెండుమూడేళ్ళలో పలు భాషలలో పుస్తక విక్రయ కేంద్రాల ఆధారంగా నవలలు రావటం ఆయా భాషల రచయితలు తమముందున్న సమస్యను అవగాహన చేసుకుని, ఆ సమస్యను అధిగమిచేందుకు సృజనాత్మక శక్తిని నిర్మాణాత్మకంగా వాడుతున్నారు. ఇది వాళ్ళు ఒక పథకం ప్రకారం చేస్తున్నారా? ఒక ఉద్యమంలా చేస్తున్నారా? ఒకరిని చూసి మరొకరు ఇలా రాస్తున్నారా? లేక స్వచ్ఛందంగా , యాదృచ్ఛికంగా ఇలా రాస్తున్నారా? అంటే చెప్పటం కష్టం. కానీ, ఆయా భాషల రచయితలలో తమ ముందున్న రచయితల రచనల పట్ల గౌరవం కనిపిస్తుంది. ప్రాచీన సాహిత్యం పట్ల అవగాహన కనిపిస్తుంది. రచనలను కమర్షియల్ అనీ, క్లాసిక్ అనీ, గ్రాంథికం, వాడుక భాషలనీ  వేరు చేసి చూడటం కనబడదు. మంచి రచనను ప్రస్తావిస్తూ, పాత్రలపై ఆయా రచనల ప్రభావాన్ని వివరించటం ద్వారా, ఆ రచనపై ఆసక్తి కలిగించటమే కాదు, రచనను చదివే విధానం, అర్థం చేసుకునే దృష్టిని ఇస్తున్నట్టవుతుంది. ఈ పని విదేశీ రచయితలు ఎప్పటినుంచో చేస్తున్నారు. సృజనాత్మక రచయితలు తమను ప్రభావితం చేసిన తమకన్నా ముందున్న రచయితల రచనలను విశ్లేషిస్తూ వివరిస్తారు. తమ సమకాలీనుల్లో తమకు నచ్చిన రచనలు ప్రస్తావిస్తారు. ఇలా ప్రస్తావించటం నిష్పాక్షికంగా, నిజాయితీగా చేస్తారు. ఇందుకు భిన్నంగా, తెలుగులో రచయితలు తమకన్నా ముందు తెలుగు సాహిత్యమే లేదన్నట్టు ప్రవర్తిస్తారు. ఒకవేళ వుందని ఎవరయినా గుర్తు చేస్తే, అదంతా చెత్త అని కొట్టి పారేస్తారు. తమ చుట్టూ చేరిన భజన బృందలోని వారు చేసినవే రచనలని వేదికలపైనుంచి ప్రకటిస్తారు. ఇతరులెవరూ రచయితలు కారన్నట్టు ప్రవర్తిస్తారు. అసలు తాము రాసేది తప్పించి, తమ చుట్టూ తిరిగేవారు తప్పించి ఇంకా ఎవరన్నా రచనలు చేస్తున్నట్టు  కూడా తెలియదన్నట్టు ప్రవర్తిస్తారు. మాఫియా ముఠాలు వ్యాపారాలన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుని ఏరియాలు పంచుకున్నట్టు సాహిత్యాన్ని గుప్పిట్లో  పెట్టుకుని, అంతా తమ స్నేహితుల పరిథిలోనే పంచుకుంటారు. అలా, సాహిత్యాన్ని సంకుచితం చేసి మంచి రచనలు లేవని, మంచి రచయితలు లేరనీ ప్రకటిస్తూంటారు. ఇతర సాహిత్యాలకు భిన్నంగా తెలుగులో విమర్శకులు సృజనాత్మక రచయితకు రచనలు చేయటంలో  పాఠాలు చెప్తారు. ఉత్తమ రచనలను వారు నిర్ణయిస్తారు. ఈ విమర్శకులను కూడా మాఫియా ముఠాలే తయరు చేసి, ప్రోత్సహించి ఆస్థాన విమర్శకుల్లా పెట్టుకుని వారికి పేరు సంపాదించి పెడతాయి. దాంతో నిష్పాక్షిక విమర్శ అన్నది అర్థం లేని పదమై, విమర్శ అన్నది మాచ్ ఫిక్స్డ్ విమర్శగా తయారవుతుంది. ఇది కొందరికి తాత్కాలికంగా పబ్బం గడుస్తున్నా, తెలుగు సాహిత్యాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తోంది.  విదేశీ రచయితల పుస్తకాలలో ప్రాచీన సాహిత్యం నుంచి కొటేషన్లుంటాయి. కానీ, తెలుగు రచయితలు ప్రాచీన సాహిత్యం చదవరు. ప్రస్తావించరు. అసలది సాహిత్యమే కాదంటారు. దాంతో, ఘన చరిత్ర కల సాహిత్య వారసత్వం ఉన్నాలేనిదయి తెలుగు సాహిత్యం  నిన్న మొన్న కలం పట్టిన వారితోనే మొదలయినట్టు మొదలవుతోంది. విదేశీ సాహిత్యంలోనూ పలు విభేదాలున్నా, అస్తిత్వ వాదనల సాహిత్యం వున్నా, వారు, తమ ప్రాచీన సాహిత్యాన్ని తృణీకరించలేదు. ఆ సాహిత్యం భుజంపైన నిలచి తమదైన సాహిత్య సృజనతో సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలుగు సాహిత్య సృజనకారులు ఇందుకు భిన్నం. ఎక్కడికక్కడ, గీతలు గీసేస్తున్నారు. గోడలు కట్టేస్తున్నారు. గతం త్యజించి, ఒక్కరోజులోనే తయారయిపోయే పుట్టు సీతాకోకచిలుకలయిపోవాలనుకుంటున్నారు. అంతకు ముందరి దశలను విస్మరిస్తున్నారు.

పాఠకులు లేరు. టీవీ, మోబైల్ ఓటీటీలు, యూట్యూబ్ పాఠకులను వీక్షకులుగా మారుస్తోంది అని వాపోతూ, తమలో తాము కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, భాష (తెలుగులోనే ఈ తెగులు), ఆదర్శ, ఇజాల  భేదాలను పెంచుకుంటూ,  గుంపులేర్పాటు చేసుకుంటూ, ఇతరుల రచనలు చదవక, తమ పూర్వీకుల సాహిత్యాన్ని తృణీకరించి, సమకాలీనుల సాహిత్యాన్ని ఈసడించి, తాము రాసిందే సాహిత్యం, తమదే సాహిత్యం, మిగతా అంతా చెత్త, శూన్యం అన్నట్టు ఇసుకలో తలదూర్చిన ఉష్ట్ర పక్షులలా ప్రవర్తిస్తున్న తెలుగు సాహిత్య ప్రపంచం, చీకటిని తిడుతూ కూర్చునే బదులు, విదేశీ సృజనాత్మక రచయితలను గమనించి, తాము వ్యర్థం చేస్తున్న శక్తినీ, సమయాన్ని నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఉపయోగిస్తే కానీ, భవిష్యత్తు తరాలకు తెలుగు సాహిత్య ఔన్నత్యం, ఉత్తమత్వం సజీవంగా అందదు. అది జరగకపోతే, తెలుగు సాహిత్యం ఇతర భాషల పుస్తకాలలో ప్రస్తావనగానే మిగులుతుంది. తమకు నచ్చని వారివయినా, వ్యతిరేక భావజాలం వారివయినా నిష్పాక్షికంగా చక్కని రచనల గురించి ప్రస్తావించాలి. రచనను రచనగానే చూడాలి తప్ప రంగుటద్దాల్లోంచి చూడవద్దు. ప్రజలు గుర్తించి, స్పందించగలిగే సాహిత్య సృజన వైపు దృష్టి పెట్టాలి. అన్ని రకాల రచనలకూ, ప్రక్రియలకూ ఆదరణనివ్వాలి. సృజించాలి. అందుకే, తెలుగు సాహిత్య ప్రేమికులంతా ఏకం అయి,  విభేదాలు, విద్వేషాలు, విషపూరిత ఉద్వేగాలు విడిచి చక్కని, చిక్కని సాహిత్య సృజనకు నడుం కట్టాల్సిన తరుణం ఇదే. సప్తవర్ణాలు కలిస్తేనే ఇంద్ర ధనుస్సు ఏర్పడుతుంది. అలాగే అన్ని రకాల రచనలు కలిస్తేనే సాహిత్యం అవుతుంది. నిలుస్తుంది.

(ఈ వ్యాసం ఇటీవలి కాలంలో ప్రచురితమయిన పుస్తకాల దుకాణాలు కేంద్ర బిందువుగా వున్న రచనల విహంగ వీక్షణమే తప్ప, సమగ్రమూ, సంపూర్ణమూ కాదు. ఇంకా అనేక చక్కని రచనల ప్రస్తావన ఈ వ్యాసంలో వీలు పడలేదు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here