[నంద శ్రీ గారు రచించిన ‘దోపిడీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]శి[/dropcap]శువు శిరసు
పుడమిని మోపినప్పటి నుంచి
శరీరం శ్మశానానికి
సాగే వరకు
దోపిడీ అవిచ్ఛిన్న వ్యాపారమవుతుంది
సముద్ర యానము
చేసేవారు
తెడ్డులతో దుఃఖాన్నీ
తోడేయాలి
అనుకుంటారు గానీ
సముద్రానికీ ఆనకట్ట
వేయాలనుకోవడం
పిచ్చి తిరుగుబాటు
దోపిడీ చిరునామైన చోట
పర్వతమంత భ్రమ జీవితం
హృదయ పరిభ్రమణం
అపస్తవ్యములో వున్నప్పుడు
దోపిడీ
అవిచ్ఛిన్న వ్యాపారమవుతుంది
అలోచించి చూస్తే
తెలుస్తుంది
బాకీ తీర్చాల్సిన
అనుబంధములో
మనమెంత
దోపిడీదారులమయ్యమో
అడుసుతో
కాలు మలినమైనప్పుడు
దోసిట్లలోని
నీళ్లు సరిపోవు
ఆకాశపు గంగాభిషేకమే
చివరి
స్థానమవుతుంది